Monday, 1 September 2014

కోట గుళ్ళు : కాకతీయ నిర్మాణ శైలికి మచ్చుతునకలు

వరంగల్ జిల్లాలోని గణపురం(ము) మండల కేంద్రంలోని కాకతీయ చక్రవర్తుల అపూర్వ శిల్పకళా వైభవ శాల గణపేశ్వరాలయ సముదాయం(కోటగుళ్లు). అబ్బురపర్చే శిల్ప సౌందర్యంతో శతాబ్దాలుగా అలరిస్తోంది. ఈ ఆలయ సముదాయం ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట శిల్ప సంపదకు ఏ మాత్రం తీసిపోదు. గతవైభవం 

ఈ ఆలయ సముదాయం ఆ కాలంలో ఎంతో వైభవంగా తులతూగింది. ఆలయాలకు అప్పుడు 60ఎకరాల మాగాణి భూమిని సామంత రాజు గణపతిరెడ్డి దానంగా ఇచ్చి, అందులో వచ్చే పంటల ఆదాయాన్ని ధూపదీప నైవేద్యాలతో పాటు అంగరంగ భోగాలుగా వినియోగించినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దేవాలయంలో 72మంది సేవలు చేసే వాళ్లు. ప్రతీరోజు ఆలయ మంటపంలో ఒక నర్తకి, 16మంది వాయిద్యకారులతో నాట్య ప్రదర్శనలు, సంకీర్తనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే వారని, అవి శివునికి ఆనందం కలిగించడానికి నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది. అలాగే ఆలయానికి దక్షిణం వైపు ఆలయం(60 స్తంభాలు కలది) అప్పుడు రంగ మంటపంగా పిలిచేవాళ్లు. ఈ రంగ మంటపంలో వివిధ సాంస్కతిక కార్యక్రమాలు, విజ్ఞాన, సంగీత, సాహిత్య, కవి సమ్మేళనాలు నిర్వహించేవాళ్లు.

టౌన్ టెంపు ట్యాంక్ విధానంతో గణపురం నిర్మాణం

కాకతీయ చక్రవర్తులు తమ సామ్రాజ్య పాలనను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఇప్పటి మండలాల మాదిరిగా సామంత రాజ్యాలను ఏర్పర్చారు. ఆ క్రమంలో ట్రిపుల్ టీ విధానంలో సామంత రాజ్య కేంద్రాన్ని నిర్మించారు. ట్రిపుల్ టీ విధానం అనగా టీ (టౌన్) నగరం, టీ (టెంపుల్)ఆలయం, టీ(ట్యాంక్) చెరువు ఈ విధంగా సామంత రాజ్య కేంద్ర నిర్మాణ క్రమంలో నగరాన్ని నిర్మించారు. ఆ నగరంలో ఒక దేవాలయాన్ని, ఒక చెరువును నిర్మించే వారు. ట్రిపుల్ టీ విధానం అంటే ఇదే. ఈ ట్రిపుల్ టీ విధానంలోనే అప్పుడు గణపురం సామంత రాజ్య కేంద్రంగా ఏర్పాటు చేసి, గణపవరం పేరుతో నగరం, గణపేశ్వరాలయం పేరున ఆలయం, గణపసముద్రం పేరున పెద్ద చెరువును నిర్మించారు. ఈ నేపథ్యంలో గణపురం గణపేశ్వరాలయం చరిత్ర ఈ విధంగా ఉంది....

దక్షిణ భారతదేశాన్ని ఓరుగల్లును రాజధానిగా చేసుకొని ఘనంగా పాలించిన కాకతీయ చక్రవర్తుల్లో అగ్రగణ్యుడైన గణపతిదేవ చక్రవర్తి పేరున క్రీ.శ. 1234లో జయ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి బహస్పతి వారం రోజున గణపురం(గణపవరం), గణపేశ్వరాలయం(కోటగుళ్లు), గణపసముద్రం(చెరువు) నిర్మితమయ్యాయి. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన కాకతీయ సర్వ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రారెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడు గణపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆ నిర్మాణాలు జరిగాయి. కాగా, గణపేశ్వరాలయంతో పాటు చుట్టూ 21ఉప ఆలయాలను గొప్పగా నిర్మింపజేశారు.

దేవగిరి రాజును ఓడించినందుకు....

ఓరుగల్లుపై దాడి చేసిన దేవగిరి మహారాజును 15రోజులు యుద్ధం చేసి ఓడిచినందుకు గుర్తుగా గణపేశ్వరాలయంలో కాకతీయ అష్టమ చక్రవర్తి రాణి రుద్రమదేవి మత్తగజం(ఏనుగు) కుంభ స్థలంపై లంఘించి, సింహం దాన్ని నిర్జిస్తున్నట్లుగా ఉన్న గజకేసరి శిల్పాన్ని తన యుద్ధ విజయ చిహ్నాలుగా ప్రతిష్ఠింపజేసింది. అనగా ఏనుగులాంటి మహాదేవులను, సింహంలాంటి తాను(రుద్రమదేవి) అణచివేసినట్లుగా ఉన్నవి విగ్రహాలు.

గణపేశ్వరాలయ ప్రాంగణంలో శత్రు రాజులతో జరిగే యుద్ధ సమయాల్లో రుద్రమదేవి, ప్రతాపరుద్ర చక్రవర్తులకు సహాయంగా యుద్ధంలో పాల్గొని విజయం చేకూర్చడానికి ఉపయోగపడే నయంకర సైన్యంతో పాటు 2000అశ్విక సైన్యం పోషించబడేది. ఈ క్రమంలో చక్రవర్తుల పతనానంతరం గణపేశ్వరాలయం తన వైభవాన్ని కోల్పోయింది. ఓరుగల్లుపై దండయాత్రలకు ఢిల్లీ మహ్మదీయ సైన్యం కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ప్రాంతంలోని గోదావరి నది దాటుతూ ఓరుగల్లుకు వెళ్లే మార్గంలో ఉన్న కాకతీయ సంపదలైన గుడులు, చెరువులు, కట్టడాలను ధ్వంసం చేసి ప్రజల అపార ఆస్తులను దోచుకున్న క్రమంలో ఓరుగల్లు దారిలో ఉన్న గణపేశ్వరాలయ సముదాయాన్ని ధ్వంసం చేసి, గణపసముద్రానికి గండి పెట్టి గణపురం ప్రజల ఆస్తులను దోచుకోవడం జరిగింది.

క్రీ.శ. 1504 నుంచి 1512వరకు ఓరుగల్లును పాలించిన షితాబుఖాన్ అనే సీతాపతి రాజు మహ్మదీయుల కంటపడి విధ్వంసం కాకుండా కాపాడి భూమిలో పూడ్పించిన 8అడుగుల శివ, విష్ణువు ద్వారపాలకుల విగ్రహాలు, రాజనర్తకి, సూర్య భగవాన్‌ల విగ్రహాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిని పురావస్తు శాఖ వారు గణపేశ్వరాలయ ప్రాంగణంలోని హరిత హోటల్ ముందు భద్రపర్చారు.

84ఏళ్ల కింద వెలుగులోకి వచ్చిన కోటగుళ్లు

కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి అనంతరం నిరాదరణకు గురై సుమారు 607ఏళ్లు చీకట్లో మగ్గాయి. ఈ నేపథ్యంలో నిజాం సర్కార్, పురావస్తు శాఖ డైరెక్టర్ గులాం మాజ్‌ధాని మహాశయుడు 1930లో రామప్ప దేవాలయంతో పాటు గణపేశ్వరాలయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇలాంటి ఘన చరిత్ర కలిగిన గణపేశ్వరాలయానికి 2014 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన జయనామ సంవత్పర క్రమంలో మే 12నాటికి 780ఏళ్లు నిండుతాయి. ఈ సందర్భంగా గణపేశ్వరాలయ చరిత్ర, ఖ్యాతిని ప్రపంచానికి చాటడానికి 780ఏళ్ల పండుగను ఆలయంలో వైభవోపేతంగా ప్రభుత్వం జరుపాల్సి ఉంది.

ఆలయ అభివద్ధిపై ఏళ్ల తరబడి సాగదీత...

సింటెక్ టెక్నాలజీతో గణపురం కోటగుళ్లను పునరుద్ధరిస్తామని చెప్పిన పురావస్తు అధికారులు అభివద్ధిని మరిచారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 13వ ఆర్థిక కమిషన్ నిధుల ద్వారా రూ.3కోట్లు మంజూరు చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం అధికారులు చెప్పారు. 13వ ఆర్థిక కమిషన్ నిధుల ద్వారా మొదటి విడతగా రూ.35లక్షలు మంజూరు చేయగా కొన్ని ఉప ఆలయాలను పునరుద్ధరించి మిగిలిన ఆలయాల శిథిల భాగాలను అలాగే వదిలేశారు. అప్పటి నుంచి ఆలయ పునరుద్ధరణ ఆగిపోయింది. ఇప్పటి వరకు మరిన్ని నిధులు మంజూరులో జాప్యం జరుగుతుందంటూ అధికారులు సాగదీస్తున్నారు. అయితే పర్యాటకుల కోసం ఈ మధ్యే అన్ని సౌకర్యాలతో హరిత హోటల్ నిర్మాణం జరిగింది. గణపేశ్వరాలయం(కోటగుళ్ల)లో 780ఏళ్ల ఉత్సవాలు నిర్వహించినట్లయితే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన కాకతీయుల ఉత్సవాలతో ఇప్పటికే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఈ 780ఏళ్ల ఉత్సవాలు నిర్వహిస్తే రామప్ప, వెయ్యి స్తంభాల ఆలయాల మాదిరిగానే పర్యాటకులు కోటగుళ్ల నిత్యం వస్తారని ప్రజలు అంటున్నారు.దేవాలయం కొన్ని ఫోటోలు
ఆధారవ్యాసం నమస్తే తెలంగాణా దినపత్రిక

ఫేస్ బుక్

Tweets

లంకెలు