నేలకొండపల్లి - డాక్టర్ వి.వి. కృష్ణశాస్త్రి గారి 1987 నాటి వ్యాసం

ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి,భద్రాచల రామాలయాన్ని నిర్మించిన కంచెర్ల గోపన్న అనే రామదాసు జన్మస్థలంగా మనకందరకూ తెలుసు.నేలకొండపల్లి ఖమ్మం నుండి కోదాడపోయే రహదారిలో కోదాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి తూర్పుభాగాన ఒక పెద్ద నల్లసేనపు రాతికొండ ఉండటంచేత ఇది ‘నల్లకొండపల్లి ’ అని పిలవబడి, రానురాను నేలకొండపల్లి అయ్యింది. నల్లకొండలో దొరికే రాయి చాలా శ్రేష్ఠమైనది,ధృఢమైనది కావడంచేత దేవతాశిల్పాలు,దేవాలయ నిర్మాణానికి కావలసిన రాళ్లు ఇక్కడి నుంచే తీసుకువెళ్ళేవారు.

నేలకొండపల్లి చరిత్ర రామదాసుతోనేకాదు అంతకు ముందు కొన్నివేల సంవత్సరాల క్రితమే ప్రారంభం అయింది.క్రీ.శ 2వ శతాబ్ధంనాటి టాలమీ వ్రాసిన భారతదేశ భూగోళ చరిత్రలో ‘నెల్ సిండా’ అనే పట్టణం ఉదహరించబడినది.ఈ నెల్ సిండా కోస్తాప్రాంతంలో ఉన్నదని , ఇది చాలా ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా ఉండేదని వ్రాయబడింది.టాలమీ భారతదేశం ఎప్పుడూ సందర్శించలేదు.ఆయన వ్రాసిన గ్రంధం ఆనోటా ...ఆనోటా విన్నకథలే,పోతే,ఆయన చెప్పిన నెల్ సండా నేలకొండపల్లి కావడానికి ఎటువంటి సందేహం లేదు.

నేలకొండపల్లెకు 3 కిలోమీటర్ల దూరంలో ‘ముగ్గి గూడెమని’మరొక గ్రామమున్నది. క్రీ.శ.2,3,శతాబ్ధాలలో ముగ్గి గూడెమునుండి నేలకొండపల్లిమధ్య 4,5,చదరపు కిలోమీటర్ల విస్తీర్ణముగల ఒక మహాపట్టణముండేది. ఆ కాలంలో ఇంత వైశాల్యంగల పట్టణాలు భారతదేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. బౌద్ద స్థూపాలలో వాడిన పాలరాతి శిల్పాలను ముక్కలు చేసి మంటలో తగులబెట్టి పొడి చేసి ముగ్గుగా వాడుకోవడం చాలా చోట్ల ఆచారముగా ఉంది.నేలకొండపల్లి ముగ్గిగూదెము ప్రాంతంలోని బౌద్ధశిల్పాలను ముగ్గుచేసి వాడుకునే అలవాటు ఉండటంచేత బహుశ ముగ్గిగూడెమునకు ఆపేరు వచ్చియుంటుంది.

గత దశాబ్ధములో నేలకొండపల్లి నుండి తూర్పువైపుగా ఒక రహదారి నిర్మాణానికి చేసిన తవ్వకాలలో 8 నిలువెత్తు బౌద్ధవిగ్రహాలు వెలికివచ్చాయి.అమరావతి శైలిలో చెక్కబడిన ఈ బౌద్ద విగ్రహాలు చాలా అపురూప నైపుణ్యంతో చెక్కబడ్డాయి.

ఇవి దొరికిన ఆ ప్రాంతంలో త్రవ్వకాలు చేసినపుడు,ఈ విగ్రహాలు నునుపుచేయుగకు ఉపయోగించిన రాతి తొట్టెలు , చిన్నచిన్న పాలరాతి ముక్కలు ,ఇక్ష్వాకులు,విష్ణుకుండినుల కాలమునాటి నాణెములు ఇక్కడ అనేకము దొరికినాయి. ఈ మధ్యనే ఈ ప్రాంతములో అంటే నల్లకొండకు ఆనుకొని జరిపిన తవ్వకాలలో మరొక అపురూప సౌందర్యమైన పద్మాసన సీనుడైన బుద్దుని విగ్రహం దొరికింది. గతంలో లభ్యమైన నిలువెత్తు బుధ్దుని విగ్రహాలు ,ఇప్పటి తవ్వకాలలో దొరికిన బౌద్దవిగ్రహములు పరిశీలిస్తే వీటిలో అమరావతి శిల్పశైలి ప్రస్పుటంగా కనిపిస్తుంది.నొక్కుల నొక్కుల జుత్తు.నడినెత్తిన సిగవంటి బొప్పి,సాగిలాగిన చెవితమ్మెలు,ధనురాకారపు కనుబొమ్మలు ,ముకుళిత నయనాలు ,నిటారుగా కొనదేరిన ముక్కు,దరహాస చంద్రికలు వెదజల్లే లేపెదిమలు కలిగిన ఈ మూర్తులలో ధ్యాన నిష్టలో నిమగ్నుడైన భావాతీతమూర్తి బుద్దభగవానుని సజీవంగా నిలిపినట్లు గా తోస్తుంది. చేతన ప్రపంచాన్ని అచేతనం చేయగల్గిన ఈ నిర్వికార,నిశ్చలమూర్తి మనబోటి సామాన్యచూపరులను ఆకట్టుకుంటాడనడం ఆశ్చర్యంలేదు.

ముగ్గిగూడెమునకు ఆనుకుని పడమటి దిక్కుగా ఒక పెద్ద సరస్సు ఉన్నది.దీనికి దక్షిణపు ఒడ్డున 60 అడుగుల ఎత్తైన ఒక దిబ్బ కనిపించింది.ఈ దిబ్బను ఆ గ్రామీణులు విరాటరాజు గద్దె అని పిలుస్తారు.ఆ ప్రాంతంలో పూర్వకాలం ఒక పట్టణముండేదని అది విరాటరాజు పరిపాలించిన మత్స్యపురమని చెబుతారు. మహాభారత కాలమునాటి పేర్లు ఎలా వచ్చాయనే ప్రశ్నకు సమాదానము తరువాతి పరిశోధకులకు వదిలివేస్తూ ప్రస్తుతం అక్కడున్న విశేషాలను గురించి చెప్పుకుందాము.

ఈ విరాటరాజుగద్దెపైన త్రవ్వకాలద్వారా ఒక పెద్ద బౌద్ద స్థూపం వెలికి వచ్చింది. ఇక్కడ గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రపురాతత్వశాఖ వారు తవ్వకాలు జరుపుతున్నారు.ఈ మహా స్థూపం రమారమి 54 అడుగుల ఎత్తు ఉండి 106 అడుగుల వ్యాసము కలిగి ఉండటంచేత దక్షిణ భారతదేశంలోని ఎత్తైన స్థూపాలలో ఇది ఒకటని చెప్పవచ్చును .ఈ స్థూపాన్ని ఇటుకలతో ఐదు చక్రాలుగాను ఇరుసునుండి బయటికిపోయే పోచలుగాను నిర్మించారు.అంటే ఇంచుమించు సాలెగూడు ఆకారంగా ఉన్నదని చెప్పాలి.అండాగ్రమున నిర్మించిన హర్మిక దానిపైన ఛత్రము ఇప్పుడు లేవు. స్థూపానికి వెలుపలవేసిన గచ్చుకూడ పూర్తిగాపోయింది.

మేధికి పైభాగాన అండము చుట్టూ 2వ ప్రదక్షిణ పథమున్నది. మేథికి నాలుగు ముఖ్యదిక్కులా ఆయక వేదికలు నిర్మించారు. మేథిచుట్టూ ఉన్న క్రింది ప్రదక్షిణ పథంనుండి ఆయకవేదికల మీదకు ఎక్కడానికి మెట్లు నిర్మొంచారు.దీనికి 14 మెట్లున్నాయి. మేథి చుట్టూ ప్రదక్షిణ పథం రమారమి 10అడుగుల వెడల్పు,భూమి నుండి 6 ½ అడుగుల ఎత్లు ఉన్నడి. ఈ ప్రదక్షణ పథానికి బైట మరొక 10అడుగులవెడల్పు గల చుట్టుత్రోవ ఉన్నది.అంటే ఈ స్థూపానికి వేరు వేరు అంతస్థులలో మూడు ప్రదక్షిణపథాలు నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈ తవ్వకాలలో దొరికిన ఇక్ష్వాకుల,విష్ణుకుండినుల నాణాలను బట్టి ఈ స్థూపము రమారమి 3వ శతాబ్ధములో నిర్మించినట్లుగా తెలుస్తుంది. విష్ణుకుండినుల తరువాత అంటే ,6వ శతాబ్ధంలో దీనికి క్షీణదశ ప్రారంభమయినది. ఈ స్థూపానికి సంబందించిన విహారాలు,స్థూపచైత్యాలు పూర్తిగా నేలమట్టము అయిపోయినవి. ఈ ఆర్థిక సంవత్సరములో ఇక్కడ జరుపబోయే త్రవ్వకాలలో ఈ స్థూపానికి దక్షిణ భాగములో వాటి అవశేషాలు దొరకవచ్చు.ఈ స్థూపానికి నైరుతి దిక్కున ఒక కిలోమీటరు దూరంలో నల్లరాతితో చెక్కబడిన నూనెగానుగలు మూడింటిని చూడడం జరిగింది.ఇక్ష్వాకుల కాలంలో నేలకొండపల్లి లో నూనెవ్యాపారుల సహకార విక్రయస్థానం ఉండి ఉండేది. 

ఇక్కడ తవ్వకాలలో దొరికిన అపురూప వస్తువులలో ఒకటిన్నర అడుగుల ఎత్తుగల సున్నపురాతితో చెక్కిన స్థూపము,బుద్దుని విగ్రహాలతో పాటు దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి చెక్కినట్లుగా తోస్తుంది . మరొక ముఖ్యవిశేషము ఇక్కడ లభ్యమైన లాంచనప్రాయమైన బుద్ద సింహాసనం మంచి గంధము తీసే సానవంటి ఆకారము కలిగిన ఈ సింహాసనానికి పుష్సాకృతుల పైన అదిష్టింపబడిన త్రిరత్నములు నాలుగువైపుల చెక్కబడి ఉన్నాయి. ఈ మాదిరి సింహాసనాలు ఇతర బౌద్దక్షేత్రాలలో ఆయక పటాలమీద గుర్తుగా చెక్కటమేచూస్తాము గాని విడిగా మరే తవ్వకాలలో దొరకలేదు.

మౌర్యుల కాలమునుండి బౌద్దులు ఉత్తర భారతదేశము నుండి రెండు మార్గాల ద్వారా అమరావతి చేరేవారు. మొదటి మార్గము ఒరిస్సాలోని భువనేశ్వరము(ధావళి) నుండి శాలిహుండము,రామతీర్థము,కళింగపట్నము,తొట్లకొండ,బావికొండ,బోజ్జనకొండ,(శంకరం),కొత్తూరు,లింగరాజుపాలెం,పిఠాపురం(పిష్టపురం),కుడవల్లి,ఆదుర్రు,ఆరుగొలను,గుంటువ,గుడివాడ,ఘంటసాలల మీదుగా గోదావరి చేరి ఆ నది కుడిగట్టున ఉన్న కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల,ధూళికట్ట, తిరుమలగిరి,గాజులబండ, పణిగిరి మీదుగా నేలకొండపల్లి చేరి అక్కడినుండి జగ్గయ్యపేట గుమ్మడిదుర్రు మీదుగా అమరావతి(ధాన్యకటకము)చేరేవారు.

ఆంధ్రదేశములోని బౌద్దస్థూపాలు నాలుగు దశలకు చెందినవిగా తెలుస్తుంది. మొదటి దశ క్రీ.పూ. 3వ శతాబ్ధంలో మౌర్యుల కాలము,రెండవ దశ. క్రీ.పూ 1వ శతాబ్ధంనుండి క్రీ.శ.2వ శతాబ్ధం వరకూ పరిపాలించిన శాతవాహనకాలము,3వ దశ ఇక్ష్వాకుల కాలము,4వ దశ ఇక్ష్వాకుల తరువాతి కాలము. అంటే రమారమి క్రీ.శ. 3వ శతాబ్ధమునుండి 6వ శతాబ్ధము వరకూ,ఈ చర్చను బట్టి ఆంధ్రదేశంలోని బౌద్ద క్షేత్రాలన్నీ ఒకేకాలములో వెలసినవికావు.మౌర్యుల కాలమునాటి బౌద్దక్షేత్రాలను,స్థూపాలను శాతవాహనులకాలంలో పునర్నిర్మించిన గుర్తులున్నాయి.ఆ విధంగానే శాతవాహనుల కాలమునాటి స్థూపాలను ఇక్ష్వాకులకాలములో పునర్నిర్మించటమో,బాగుచేయటమో జరిగింది.



సౌజన్యం : శ్రీయుత సాధు రాధాకృష్ణ గారు విశ్రాంత ఉపన్యాసకులు నేలకొండపల్లి గారి సేకరణలనుండి
‘‘ తెలుగు సమాచారం’’ పత్రిక నవంబర్ రెండవ పక్షం 1987



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి