పూర్ణమేవావశిష్యతే

Hand Of GOD - Photo by NASA
1.
నువ్వు వెళ్లిపోయాక
లోకమెలా పయనిస్తునే వుంటుందో చూడాలని వుందా?
2.
అంతా వదిలేసాక
లేదా అన్నీ నిన్నే విడిచాక
అసలు ‘నువ్వు..’ అనుకునే ఆలోచనే ఆవిరైనాక
మిగిలిన ఈ ప్రపంచం ఎలా నడుస్తుంటుందో గమనించాలని వుందా?
3.
బంధుత్వాలనీ, స్నేహాలనీ,
భాద్యతలనీ, బరువులనీ,
ఆలోచనలనీ, సంవేదనలనీ
ఆఖరుకు తెలియబడేదాన్ని, తెలుసుకునే దాన్నీ
విడిచిపెట్టేశాక మిగిలినదెలా వుంటుందో
అనుభవంలోకి వస్తే బావుండుననుకుంటున్నావా?
4.
--ఒకసారి
వేరేవూర్లో ఖాళీ చేసిన అద్దెకొంపకు వెళ్ళిరా...
--మరోసారి
చిన్నప్పడి బడినోసారి చూసిరా...
---ఆఖరుగా
చితికెళ్ళిన వాళ్ళ చిగురుల్లోకి, వారు మిగిల్చిన నిధుల చిరుగుల్లోకి చూసిరా...
5.
కుండలకొద్ది బళ్ళున కుమ్మరిస్తున్న వెచ్చని వెలుతురుతో
లోపల దేన్నో కడుగుతున్నట్లవుతుంది.
...
దీర్ఘకాల సుప్తావస్తలో
మొద్దునిద్రపోతున్న మెదడు మూలలను తట్టినట్లవుతుంది.
6.
అయితే ఇప్పుడు
నువ్వసలేం మిగలకుండాపోయాక
నిలబడేదేమిటో వెతకాలనుందా?
7.
ఇనప్పెట్టె కలల్నీ, కుర్చీల ఎత్తుల్నీ,
యవ్వనపు సవ్వడుల ఎండమావుల్నీ,
చీకటి చు.క్క.ల.. మత్తునీ దాటుకుంటూ నడవాలనుందా?
8.
ఇదిగో ఈ చిన్న వెలుతురిని అంటించుకో
కనీసం అది తర్వాతవేసే అడుగుపై పరచుకున్నా చాలు
లోలోపల వేలమైళ్ళ ప్రయాణం ఏదోనాడు పూర్తవుతుంది.
9.
హుష్...
ఇలాకూడా వెతికాక --
దాచుకున్నజ్ఞాపకాలు సైతం దేహంతోపాటు కాలిపోయాక
ఈ వెతుకులాట ప్రయోజనాల్ని విశ్లేషించాలని వుందా?
...
అయితే
...
0.
మళ్ళీ మొదటిలైను దగ్గరనుంచే
చదువుకుంటూ రా...


కవిసంగమంలో ప్రచురితం

కామెంట్‌లు