Tuesday, 26 September 2017

పాలపుంత ( కథ) – కట్టా శ్రీనివాస రావుటిక్.. టిక్..
టిక్.... టిక్...
‘‘ ... అదెమిటో ప్రపంచంలో నాకు తప్ప ఇంకెవరికీ సమయం గురించి పట్టదనుకుంటా. ఎవరికైనా పెట్టుబడిగా వుండేది అవే గంటలు ఒక్కొక్కరూ ఒక్కోరకంగా వాడుకుంటారు. అందుకే ఒక్కోక్కరూ ఒక్కో చోటులో వుంటారు. చూడండి స్కూలుకి టైం అయినా ఇంకా ఆటలాడుకుంటూ ఆ పిల్లలు ఎలా నెమ్మదిగా టిఫిన్ చేస్తున్నారో...’’
***
‘‘ మమ్మీ ఈ రోజు పూరీ చెయ్యలేదా, ఫుడ్డులాగా పొద్దున్నే కిచిడీ ఏంటి?’’ చిన్నది వాళ్ళమ్మ మీద కేకలేస్తోంది.
‘‘ పొద్దున్నే సరిగ్గా తినాలమ్మా రోజంతా ఎనర్జీగా వుంటుంది. కిచిడీ అయితే మధ్యహ్నం వరకూ దండిగా వుంటుంది’’ రోజుట్లానే టిఫిన్ కి వాళ్ళమ్మ వివరణ.
‘‘ సరే అయితే రైతా అయినా చేసావా మమ్మీ మరీ డ్రైగా వుంది’’ తన వంతు డిమాండ్లతో పెద్దాడు.
‘‘ అలా అడుగు దాందేముంది ఇప్పుడే చేసేస్తాను’’ 
తను అలవాటుగా కుండలో తోడుపెట్టే పెరుగు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీదపెట్టి ఉల్లిపాయలూ, కొత్తమీర తరుగుతోందావిడ, అప్పటి దాకా వీళ్ళిద్దరూ చానల్ మీద పడ్డారు. ఈ రోజువారీ తమాషాని ఓరకంట గమనిస్తూ పేపరుచదివే పన్లోవున్నాడు ఇంటాయిన బాలకోటేశ్వర్రావు.
అయితే అసలు విషయం ఆ పెరుగుకుండలో మరోటి జరుగుతోంది. పాలను పెరుగుగా మార్చే ఈస్టు బాక్టీరియా కూడా జీవరాసే, వాటికీ ఆలోచనలూ, ఆందోళనలూ వుంటాయి. అవేం మాట్లాడుకుంటున్నాయో ఓసారి చూసొద్దాం రండి.
***
‘‘ ఏం మామా ఏంటి చాలా ఆందోళనగా వున్నావు, అస్సలు నీ ముఖంలో సంతోషమే కనబట్టంలేదే’’ ఈస్టుమామను గోముగా అడుగుతోంది ఈస్టమ్మ అతని లాగానే తమ తెల్లటి ద్రవప్రపంచంలో ఈదుకుంటూనే.
‘‘ఈస్టమ్మా నా ముద్దుగుమ్మ నీ పనే బాగుందే ఏమీ పట్టించుకోకుంటేనే జీవితం ప్రశాంతంగా వుంటుందనుకోవడానికి నీవే ఒక ఉదాహరణ, వివరాలన్నీ తెలుసుకుని ఆందోళన పడేకంటే ఏమీ తెలియకుండా నీలా నువ్వు సంతోషంగా వుండరాదు, నిన్ను చూస్తూ వుంటే నాకూ చాలా బరువు దిగుతున్నట్లుంటుంది.’’ ఈస్టయ్య మనసులోని ఆలోచనలను బయటపెట్టకుండానే ఆమెకు సర్ధిచెప్పేప్రయత్నం చేస్తున్నాడు.
‘‘ అదేం లేదు మామా, నీవ్వెందుకు అలా వున్నావో తెలియకపోతే నకస్సలు వుండబుద్దెయ్యదు. చెప్పుమామా’’ బ్రతిమిలాడుకుంటోంది.
‘‘ ఏంలేదే చిన్నారీ, ఓ ప్రమాదం మనజీవితాల్లోకి రాబోతోంది అదే నా ఆందోళనకు కారణం.’’
‘‘ఏంటి మావా అది’’
‘‘ మనం ఇప్పడు తెల్లటి ద్రవప్రపంచంలో వున్నాం కాదా దీన్ని పాలంటున్నాం. ఇదంతా ఒక ముంతలో వుంది దీన్ని పాలముంత అంటాం. అయితే ఇది సులభంగా ద్రవంలా వుండటం వల్లనే మనం ఒకపక్కనుంచి మరో పక్కకి ఈదుకుంటూ వెళ్ళగలుగుతున్నాం, రెండుగానో(ద్విధా), అనేకం(బహుధా) గానో శరీరాలను విడగొట్టుకుంటూ మన ప్రపంచాన్ని పెంచుకుంటూ వెళుతున్నాం. దొరికింది తింటూ సుఖంగా వుంటున్నాం. కానీ నా కంటే పెద్దవాళ్ళు ఈ పాలముంత అడుగు భాగంలో ఒక విషయాన్ని గమనించారు. ఈ ప్రపంచం అక్కడి నుండి గడ్డ కట్టుకుంటూ వస్తోందట. ’’
‘‘ అంటే ఇలా ద్రవంలా లేకపోతే మనం ఈదలేము కదల్లేమా మామా?’’ కొంచెం బెరుకు ఈస్టమ్మ గొంతులో తొంగి చూస్తోంది.
‘‘ గడ్డకట్టడం వరకైతే కొంత పర్లేదు ఈస్టమ్మా, ఇంతలా కాకున్నా మనం బ్రతికే వుండి కొంతమేరకు కదలొచ్చు కానీ అది బిగిసిపోవడం వెనుక ఏదో దైవిక కారణం వుంటుందని అది అలా ఏర్పడగానే ఈ ప్రపంచపు ప్రయోజనం పూర్తయ్యి ఇదంతా నాశనం అవుతుందని, పెద్దవాళ్ళు బయపడుతున్నారు. ఎంతవేగంగా గడ్డకడుతోంది, ఏ దిశనుంచి ఏ దిశకు గడ్డకడుతోంది అనే విషయాన్ని కొందరు లెక్కప్రకారం అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ అంచనాల మేధాశక్తి రాబోయే ప్రమాదాన్ని ఆపలేదనే అనిపిస్తోంది బుల్లమ్మా’’ నిస్సహాయతతో కూడిన నిర్వేదం ధ్వనిస్తోంది ఈస్టయ్య గొంతులో
‘‘మరి ఎంతో బలవంతులైన మన వీరసైనికులు, వాళ్ళ పదునైన పళ్ళు, గోళ్ళ లాంటి ఆయుధ సంపత్తితో ఆ ప్రమాదాన్ని ఎదుర్కోలేమా మామా, మన తరాలన్నీ నాశనం కావలసిందేనా? అయినా ప్రపంచం ఎప్పటికీ పూర్తిగా నాశనం కాదు, సృష్టించబడదు అని పెద్దవాళ్ళు చెపుతుంటారు కదా. నువ్వేమో ప్రపంచం నాశనం అవుతుంది అంటున్నావు అదెలా సాధ్యం?’’ ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగింది. ఆడుతూ పాడుతూ కనపడే ఈస్టమ్మకి చాలా విషయాల్లో ఇంతలోతైన అవగాహన వుంటుందనుకోని ఈస్టయ్య కళ్ళు తడికాగా ఆనందంతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
‘‘నిజమే నా బంగారం, మన ఆలోచనలకూ మన శక్తికీ మించింది ఏదో వుంది. అది మనకు తెలియకుండానే మనల్ని నియంత్రిస్తోంది . నువ్వేం కంగారు పడకు బతికున్న క్షణాలే మనవి. ఏంజరుగుతుందో అనేదానికోసమే మనం భయపడుతూ వుండొద్దు’’
***
మీకు బొద్దిగా భయం లేదు. స్కూలుకి టైం అవుతున్నా సర్దుకోరేం సుజాత పిల్లల్ని మందలిస్తూ,
గరిటెతో కుండలోంచి పెరుగు తీసుకుంది. ‘‘మీరు కూడా రండీ టిఫిన్లు పూర్తయితే, పిల్లలను దింపుకుంటూ ఆఫీసుకు వెళ్ళొచ్చు’’ తీరుబడిగా పేపరు చదువుకుంటున్న బాలూని కేకేసింది.
‘‘ డాడీ మాకు నిన్న విశాల విశ్వం అనే పాఠం చెప్పారు. మొత్తం ప్రపంచం ఎంత పెద్దది అనే విషయాన్ని ఇంకా శాస్త్రవేత్తలు కనుక్కోలేదట కదా’’ ఎప్పట్లానే తినుకుంటూ వాళ్ళడాడితో ముచ్చట్లను ప్రారంబించింది చిన్నది.
‘‘ అవునమ్మా మనం వున్న ఈ గ్రహాన్ని భూమి అంటున్నాం కదా, ఇది సూర్యుడిచుట్టూ తిరుగుతోంది. భూమిలాగానే మరికొన్ని గ్రహాలూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి.వీటన్నింటినీ కలిపి అమ్మా,నేను, అన్నయ్యా నువ్వూ కలిసి కుటుంబం అయినట్లు దీనిని సౌరకుటుంబం అంటున్నాం.అంటే సూర్యుడి కుటుంబం అన్నమాట. ఇలాంటి సౌరకుటుంబాలు విశ్వలో చాలా వున్నాయి. ఇవ్వన్నీ కలిసి ఒక గుంపుగా వున్న నక్షత్రమండలాన్ని ‘పాలపుంత’ లేదా ‘ఆకాశవీధి’ అంటారు అది సర్పిలాకారం లోవుంటుంది’’
‘‘భూమిలాంటి జీవం వున్న గ్రహాలు ఇంకా వున్నాయా డాడీ’’ పెద్దాడు సంభాషణ మధ్యలోకి వచ్చేశాడు.
‘‘చంద్రయాన్, మార్స్ మిషన్ లాంటి వాటితో జీవుల ఉనికిని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా అలాంటిదేం బయటపడలేదు, ఏమో భవిష్యత్తులో తెలుస్తుందేమో చూడాలి’’
‘‘ అయినా డాడీ జీవరాశి మనం అనుకున్నట్లే ఎందుకుండాలి. అవి మరేదైనా పద్దతిలో వుండొచ్చుకదా. జగదీష్ చంద్రబోస్ నిరూపించేంత వరకూ ఎక్కడికీ కదలని చెట్లను అస్సలు జీవులేనా అనుకున్నారు. తర్వాతే అవీ జీవులేనని తెలిసింది.’’ పెద్దాడి నాలెడ్జి బాగానే వున్నట్లుంది అనుకుంటూ ‘‘ అవున్నిజమే’’ తలూపాడు బాలూ
‘‘సరే కానివ్వండి ముచ్చట్లతోనే సరిపెడితే ఇవ్వాళ వాళ్ళ స్కూలూ, మీ ఆఫీసూ డుమ్మానే’’ హాడావిడీ పెడుతూ పిల్లల టై, ప్లాఫీలను వాళ్ళు తింటుండగానే అమర్చేసింది సుజాత.
బై చెప్పి బయట పడ్డారందరూ, పర్లేదు టైం కే అందుకుంటారు కావచ్చు. రిమోట్ చేతిలోకి తీసుకుని తను టిఫిన్ చేసేందుకు  కూర్చుంది.
మరికొంచెం వున్న పెరుగుని రైతాగా కలిపేందుకు తీసుకుని, మధ్యాహ్నం కోసం పాలు తోడుపెట్టడానికి మాత్రం కొంచెం అందులో మిగిల్చింది.
బహుశా ఈస్టమ్మా,ఈస్టయ్యా ఇందాకో ఇప్పుడో వచ్చేసి వుంటారు. ఆహార నాళంలో వాళ్ల ప్రయాణం సాగుతూనూ వుండొచ్చు.
***
టిక్ టిక్ టిక్ టిక్
మొక్కలకు జీవం వుందని తెలుసుకున్న వీళ్ళకి, నిర్జీవ కంపూటర్లలోనూ, సిడీల్లోనూ సమాచారాన్ని దాచుకునే వీళ్ళకి సౌరకుటుంబంలానే అణునిర్మాణం లోపటి ప్రపంచాలను గమనించరా? ఆలోచించే గుణం వుంటే దాన్ని పట్టుకోలేరా? గోడమీది గడియారం టిక్.. టిక్ మంటూ తనలోపల అనుకుంటోంది. అణువులతో నిర్మించిన ప్రపంచాన్ని వీళ్లు చూస్తున్నారు. అణువుల్లోపల వున్న సూక్ష్మ ప్రపంచం నాకు తెలుసు అనుకుంటోంది తను. దీన్నసలు ఊహించ గలరా అనేది తనకి సందేహమే.
అక్కడికే ఆశ్చర్య పోయిన గడియారానికి మరోవిషయం ఆలోచించడానికే మించినట్లవుతోంది. అపార పాలపుంతలనే అణువులుగా నిర్మించుకుని, పాలపుంత అణువులతో కలసిన అవయవాలు, ఆ అవయవాల క్రోఢీకరణలతో మరో మహాదేహం ఒకటి వుంటే అదెలా వుంటుంది? అది ఆలోచిస్తే, పనులు చేస్తే ఎంత బృహత్తరంగా వుంటాయి?  దాన్నప్పుడు స్థూల ప్రపంచం అనాలా? బృహత్ ప్రపంచం అనాలా? టంగు..టంగు మంటూ తలపగిలి పతున్నట్లవుతోంది. గడియారానికి.
***
టంగ్... ఠంగ్
గోడగడియారం మోగగానే అటుచూసిన సుజాతకు తన సీరియల్ గుర్తొచ్చింది.
వెంటనే ఛానల్ మార్చి ఆ ప్రపంచంలో మునిగి పోయింది. ఎక్కడ ప్రారంభం అయిన బొమ్మలు ఎలా వచ్చి ఆ తెరమీద చేరాయో కానీ అదీ ఒక ప్రపంచమేగా, ఖాళీ ఇంట్లో ఆమెకు చక్కటి కాలక్షేపం ఇస్తున్నాయి. 
టిక్.టిక్... టిక్... టిక్....


ఫేస్ బుక్

Tweets

లంకెలు