Sunday, 14 January 2018

చింతపల్లివి సైబీరియన్ కొంగలు కాదు ఎర్రబోలు కొంగలు

చింతపల్లి కొంగలు సైబీరియన్ కొంగల రకం కాదు ఎర్రబోలు కొంగలు (పెయింటెడ్ స్టార్క్స్ ) వీటి ప్రత్యేకతలు మరిన్ని వున్నాయి.

సంక్రాంతికి కోడి పందేలకు కాదు కానీ కొంగల విన్యాసాలు చూద్దామని చింతపల్లి గ్రామానికి 7వ తారీఖు ఒకసారి ఒంటరిగా, నిన్న(13 జనవరి 2018న) రెండోసారి వెళ్లొచ్చాను. అయితే ఈసారి మిత్రులతోనూ పిల్లలతోనూ కలిసి ఒక పూటంతా గడిపాము. పక్షులగురించి ప్రత్యేకంగా చదువుకున్న బాల్యమిత్రుడు ప్రస్తుతం నేలకొండపల్లి డిగ్రీకాలేజి లెక్చరర్ శ్రీ రవిశంకర్ వారి కొడుకు కార్తీక్ తన విడియో కెమెరాతో మంచి విడియోలు తీసాడు. వాటిలో చేపను తింటున్న కొంగ ఆ సమయానికి మాకు కెమెరాలో దొరకటం ప్యూర్ లక్ తను చాలా బాగా షూట్ చేసాడు. న్యూవిజన్ కళాశాల లెక్చరర్ శ్రీ SN శర్మగారు వీరు తన జూమింగ్ కెమెరాతో వీటి జీవన స్థితిగతులు అర్ధం అయ్యేలా వాటి ఆవాసాలను, వేర్వేరు ప్రొఫైళ్లను వాటి విన్యాసాలను ఫోటోగా తీసారు. కాకతీయ యూనివర్సిటీలో టూరిజం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న నా బావమరిది శ్రీ కృష్ణసుమంత్ చిన్ని మేరకోడలు ఋత్విక, గంగారం హైస్కూల్ లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు మిత్రులు శ్రీ మోరంపూడి నిర్మల్ కుమార్, నా బిడ్డ రక్షిక సుమ, కొడుకు సుప్రజిత్ లతో కలిసి ఈ ట్రిప్ రెండు కార్లతో ఒక విజ్ఞాన యాత్రలా జరిగింది.

అయితే పత్రికలలో చదివినట్లు, పోయినసారి మీతో విశేషాలు పంచుకున్నట్లు ఇవి సైబీరియన్ కొంగల రకం(Grus leucogeranus) కాదు. కొంగలలో ఈ రకాన్ని పెయింటెట్ స్టార్క్స(ఎర్రబోలు కొంగలు) (Mycteria leucocephala) అంటారు. ఈ విశేషాలను ఖమ్మంజిల్లా అటవీ అధికారి శ్రీ సునీల్ హీరేమత్ (SUNIL S.HIREMATH,IFS) తన దగ్గరున్న రిపరెన్సులు చూపిస్తూ మరీ వీటి జీవిత విశేషాలను మాయందరికీ వివరించారు. అవి మీతో చెప్పేముందు ఆయనగురించి కొన్ని విశేషాలు చెప్పాలి. మేము వెళ్లే సమయానికి ఆయన తన స్టాఫ్ తో పాటు తన శ్రీమతి మరియు చిన్న బాబుతో సహా అక్కడున్నారు. పెద్దసైజులో మూడు ఆయిల్ పెయింటింగ్ తో హోర్డింగులు తయారుచేయించే పనిని పురమాయిస్తున్నారు ఆయన. మహారాష్ట్రకు చెందిన హీరేమత్ గారు తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. కేవలం అధికారిలా కాకుండా మనసు పెట్టి పనిచేసే వీరి గుణం ఆ కొద్ది సమయం గడిపిన మాకు ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అనిపించింది.

ఇవి సైబీరియన్ కొంగలు అని సైబీరియన్ కొంగల వివరాలతోనే చాలా పత్రికలు ప్రముఖంగా ఆర్టికల్స్ రాసాయి. వీటి అయితే సైబీరియన్ కొంగకు ఈ ఎర్రబోలు కొంగకు ఆకారంలోనూ, రంగుల్లోనూ, అలవాట్లలోనూ తేడాలున్నాయి. ఇవి అచ్చంగా మన దేశపు కొంగలు, హిమాలయాల దక్షిణ భాగంలో కొంతకాలం వుండి అత్యంత శీతాకాలం ఏర్పడినప్పుడు అనుకూల వాతావరణానికోసం ఇలా మన ప్రాంతానికి చేరుకోవడం గూడుకట్టుకుని సంతానోత్పత్తి చేసుకుని మళ్లీ వర్షం రాగానే కొన్నాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళివస్తాయి. అంటే వీటికి చింతపల్లి పుట్టిల్లు, హిమాలయాలు మెట్టినిల్లు లాంటిదన్నమాట. ఎనిమిది వందలకు పైగా కిలోమీటర్లు ప్రయాణించి ఇలా పురిటికొచ్చే ఆడబిడ్డలన్నమాట ఇవి. ఎర్రబోలు కొంగల గురించి మరికొన్ని విశేషాలు కూడా సేకరించాను అవి మీతో పంచుకుంటాను.

రెండు నుంచి మూడున్నర కేజీల వరకూ బరువుండే ఈ పెద్ద శరీరం వున్న బోలుకొంగలు 93 నుంచి 102 సెంటీమీటర్ల ఎత్తు ఎదుగుతాయి. ఇండియన్ ఉడ్ స్టార్క్ అని రోజీ వుడ్ ఇబిస్ అనే వేర్వేరుపేర్లతో కూడా దీన్ని పిలుస్తారు. పొడవాటి పసుపు గోధుమరంగు కలగలసిన గట్టిముక్కు అందంగా నాట్యం చేస్తునట్లు తిరిగే పొడవాటి మెడ, మెడకంటే దేహంకంటే పొడవుగా కనిపించే సన్నటి పుల్లల్లాంటి గులాబీ రంగు కాళ్ళు దీనిలో ప్రముఖంగా కనిపిస్తూ వుంటుంది. నాసికా రంధ్రాలుదీని మధ్యలో వుంటాయి. నల్లటి అంచులతో విశాలంగా విచ్చుకునే రెక్కలు కొన్ని పక్షుల్లో మెరిసే ముదురు ఆకుపచ్చ వర్ణంలో వుంటాయి. ఆడ మగ పక్షుల్లో రంగుల్లో పెద్దతేడా వుండదు కానీ పరిమాణంలో మాత్రం మగకొంగ ఆడకొంగకంటే పెద్దగా వుంటుంది. కానీ పిల్ల పక్షులు పెద్ద పక్షులకు మాత్రం రంగుల్లో కూడా తేడా కనిపిస్తుంది. పిల్ల పక్షుల్లో లేత పసుపు రంగు తెలుపు మాత్రమే వుంటే ఎదిగిన పక్షుల్లో ఎరుపు నారింజ ముఖం గులాబి రంగు కాళ్ళు గులాబీ రంగు రెక్కల్లోని ఈకలు వుంటాయి. మామూలు కాలంలోకంటే పొదిగే కాలంలో దీని ముఖంకానీ, దేహంకానీ అందంగా ప్రకాశవంతంగాకనిపిస్తుంది.

చింతపల్లి కొంగల అత్యంత ప్రత్యేకత ఏమిటంటే జనావాసాలతో కలగలిసి వారికి దగ్గరగా నివసించటం పక్కింట్లో మిత్రులని చూసినంత సులభంగా వీటిని గమనించే అవకాశం ఇందువల్లే కలుగుతోంది. బహుశా ఒకప్పుడు ఈ చెరువు నిండా నీళ్ళు వుండి ఊరి ప్రాంతం అంతా చింత చెట్లు ఉండేవి కావచ్చు అందుకే ఊరికి చింతపల్లి అనే పేరు వచ్చివుంటుంది. ఇక్కడే పుట్టిన కొంగపిల్ల వాటి తల్లి ముందుతరం కొంగలతో కలిసి వాటి జీవిత కాలంలో అనేక సార్లు ప్రయాణించి ఒక అలవాటుగా కూడా ఈ ప్రాంతం ఎంపికజరిగి వుంటుంది. కానీ పూర్తిగా పూడిపోతున్న చెరువు, ఎండిపోతున్న చెరువు నీళ్ళు ఆహారం దొరకని పరిస్థితులు తగ్గిపోతున్న చింతచెట్లు విపరీతమైన కోతుల బెడద, పంటలకు వాడే అత్యంత విషపూరిత పురుగుమందులు, వేసవిలో తాగటానికి కూడా నీళ్ళు దొరకని పరిస్థితులు వీటివల్ల చింతపల్లికి కాన్పుకి రావడం తగ్గిపోవటం ఒక్కటే కాదు. అసలు ఈ కొంగరకం జాతులే అంతరించే ప్రమాదంలో వున్నాయట. అంతర్జాతీయ స్థాయిలో పక్షిశాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఇవి అంతరించిపోయే దశలో వున్న ( నియర్ థ్రెటెన్) జాబితాలో చేర్చబడ్డాయి. ఆసియా ఖండంలోని మైదాన ప్రాంతాలకు మాత్రమే చెందిన ఈ ఎర్రబోలు కొంగలు దక్షిణ హిమాలయ ప్రాంతంలో ఇండస్ నదికి తూర్పున కనిపిస్తాయి. మరీ పొడిగా వుండే ఎడారి ప్రాంతాలు దట్టమైన అడవులు, మరీ ఎత్తైన కొండప్రాంతాలలో ఇవి కనిపించవు. వాటికి మంచినీటి ఆవాసం, పొడిమైదాన ప్రాంతం అవసరం పంటకాలవలనూ పంట పొలాలనూ కూడా బాగా ఇష్టపడతాయి. కొలరాడో నేషనల్ పార్క్ కు చెందిన ఎర్రబోలు కొంగలను ట్రాక్ చేయటం ద్వారా అవి చిల్కా వరకూ చేసే 800 కిలోమీటర్ల పైగా ప్రయాణ మార్గాన్ని నమోదు చేసారు. పెరిగిన టెక్నాలజీ నేపద్యంలో చింతపల్లి ఎర్రబోలు కొంగల జీవన విధానం అధ్యయనం లోభాగంగా వాటి ప్రయాణాన్ని ట్రాక్ చేసి నమోదు చేయటం ఒక ముఖ్యమైన పని.

ఎర్రబోలు కొంగల రంగురంగుల అందమైన దేహం, చాలా పెద్ద పరిమాణం, ఆవాసాలకు దగ్గరగా వుండే వీటి గూళ్లు, ఆహార సేకరణలో వీటి విన్యాసాలు, అచ్చంగా విమానం ల్యాండింగును పోలిన రెక్కలు కదపని ల్యాండింగ్, మెరీసే అంచుల పెద్ద రెక్కలతో పిల్లలకు నీడపట్టడం, టూరిస్టులకు ఆకర్షణగా వుంటాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఇలా ప్రసిద్ధిపొందిన ఈ ఎర్రబోలు కొంగల స్థావరాలు మనదేశంలో ఇంకా అనేకం వున్నాయి. కొక్రెబెలూర్ వీరాపురం గ్రామాలలో స్పాట్ బిల్డ్ ఫెలికన్ లతో కలిసినివసించే వీటి గూళ్ళు చాలా ఆకర్షిస్తాయి. ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని ఉప్పలపాడు కొల్లేరు, రంగనాధిట్టు ఎదురుపట్టు, తెలినీలాపురం, కూడంకులం, తిరునల్వేలి లు ఎర్రబోలు కొంగలతో ప్రసిద్దం అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే నిధులకంటే గ్రామస్థుల ఆదరణే మనదేశంలో వీటిని బ్రతికిస్తోంది అనిచెప్పొచ్చు. చింతపల్లి ప్రజలు సైతం వీటిని దైవాంశాలుగా చూస్తారు. ఈ దేవదూతలు 2015-16 ప్రాంతంలో రెండు సంవత్సరాలు రాకపోతే వర్షాలు రాలేదని నమ్ముతారు. ఎవరన్నా వీటిని చంపితే అరిస్ఠం అని నమ్మడమే కాక అటువంటి వారిపై గ్రామప్రజలు చర్యలు తీసుకుంటారు. ఇటువంటి సున్నితమైన కోణం లేని పాకిస్థాన్, థాయిలాండ్ కంబోడియా, వియత్నాం ప్రాంతాలలో పక్షులను, వాటిపిల్లలనూ వేటగాళ్ళు చంపడం బర్డ్ ట్రేడర్సుకు అమ్ముకోవడం వల్ల వాటిజనాభా అత్యంత దారుణంగా అంతరించే దశలోకి వచ్చింది.

కొంగలలో డజన్ల కొద్ది రకాలున్నప్పటికీ జాతి లక్షణాల రీత్యా దగ్గరిపోలికలు వుండేవి మాత్రమే అంతరప్రజననం జరుపుకోగలుగుతాయి. పాలకొంగ రకం ఇలా ఎర్రబోలు కొంగతో ప్రజననం జరపగల లక్షణాలతో వుంది. కంబోడియా,కౌలాలంపూర్, సింగపూర్, బ్యాంకాక్ జూలలో ఇటువంటి నియమిత పరిధిలో వీటికి సంకరం చేసినట్లు నమోదు చేసారు. ప్రత్యేకవాతావరణాన్ని తట్టుకునే, టఫ్ పిల్లలను పుట్టించే అవకాశం వుందేమో పరిశీలించి చూసారు ఈ ప్రయత్నాలు జరుగుతూ వున్నాయి.

మేతకు కూడా గుంపులుగానే వెళ్ళే ఈ కొంగలు కొలెరాడో ఘనా నేషనల్ పార్క్ లో ఏడు సెంటీమీటర్ల లోతులో మేతను విజయవంతంగా పట్టుకున్నట్లు రికార్డ్ చేసారు. ఈ మధ్యకాలంలో జరిగిన మరిన్ని పరిశీలనల్లో 25 సెంటీమీటర్ల లోతులోని మేతను సైతం పట్టాయని నమోదు చేసారు. దానివల్ల అత్యంత లోతైన నీళ్ళనుంచి మేతను పట్టగల పక్షులుగా ఇవి నమోదు చేసిన రికార్డు పెద్దది. తరంగాలు సైతం ఏర్పడకుండా నడవగలగటం, కదలకుండా నీళ్ళలో నిశ్చలంగా నిలబడి చాలా నెమ్మది శారీరక కదలికలను మాత్రమే వుంచుకుంటూ పొడవైన ముక్కును కొంచెం తెరిచినీళ్ళలో పెట్టివుంచుతాయి. వీటి నాసికా రంద్రాలు కూడా నీటికంటే ఎగువలోకి వుండటంతో శ్వాసక్రియకు ఇబ్బంది కలగదు. చేపలు, కప్పలు, నీటిపాములు, జలచర పురుగులు మొదలైనవి వాటికి దగ్గరలోకి వచ్చినప్పుడు గట్టిగా పట్టి గింజుకుని తప్పించుకు పోకుండా ఆపుతూ దానిని తినేంత వరకూ ఒక ప్రత్యేకమైన విన్యాసమే చేస్తాయి. నీళ్ళలోంచే కాకుండా బురదనేలల్లోంచి, పొదలమధ్యలోంచి కూడా మేతను సంపాదించుకుంటాయి. దీన్ని ఎంత జాగ్రత్తగా గమనించారో మరి గ్రంధి సుబ్బారావు గారు తన వక్కపొడికి కి సైతం కొంగనే బ్రాండ్ గా పెట్టుకున్న ఆయన ఈనాటికీ క్రేన్ వక్కపొడిని అమ్మకాలలో ముందువరసలో వుంచగలిగారు.

పొదిగే సీజన్ ఉత్తర భారతదేశంలో అగష్టు మధ్యప్రాంతలో వుంటుంది కానీ దక్షిణ భారతదేశంలో వేర్వేరు ప్రాంతాలలో అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి మరికొన్నిచోట్ల ఏప్రిల్ వరకూ సాగుతుంది. కొక్రెబెలూర్, ఎదురుపట్టు లలో జనవరి ఫిబ్రవరి లలో, తెలినీలాపురం, కుడంకులం, తెరునెల్వేలి లలో అక్టోబర్ నవంబర్ నెలలలో జరుగుతుంది. ఇక్కడ చింతపల్లిలో ఇప్పుడు గూళ్ళు కడుతున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో గుడ్లు పెట్టి అదే గూళ్ళలో వాటిని పొదిగి పిల్లలుగా చేస్తాయి. ఈ పిల్లలు ఎదిగే దశలో కోడి తన పిల్లలను కాపాడుకున్నట్లే చాలా భద్రంగా కాపాడుకుంటాయి. గుడ్లు క్రిందపడిపోకుండా చూసుకోవడం, వాటికి తగిన వేడిని ఇవ్వడం, కోతులు, పాములు వంటివాటినుంచి గుడ్లకు చిన్నపిల్లలకూ హానికలగకుండా కాపాడుకోవడం చాలా శ్రద్ధగా చేస్తాయి. పరిశోధకుల అంచనా ప్రకారం ఎదిగే పిల్లలకు ఒక్కోరోజుకు అరకిలో నుంచి 600 గ్రాముల వరకూ మేత అవసరం అంటే దాదాపు సాధారణ సైజుల ప్రకారం 9 చేపల వరకూ రెండు విడతలుగా తెచ్చి పెడతాయి. ఎండలు బాగా ముదిరిన సమయంలో పిల్లలకు వేడివల్ల ఇబ్బంది కాకుండా రెక్కలను గొడుగులా విప్పుకుని బోలెడంత సమయం వాటికి రక్షణ నిస్తూ నిలబడటం వీటి మాత్రుత్వ భాద్యతకు మచ్చుతునక. ఎర్రతురాయి లాంటిది తలపై ఏర్పడటం అంటే పొదిగే దశకు చేరుకున్న పక్షిఅని అర్ధం. కొన్ని ఈకలను కోల్పోవటం చర్మక్రింద కొవ్వునిల్వలను పేర్చుకోవడం ద్వారా ఇవి పొదిగే దశకు సిద్దం అవుతాయి. వీటి సాధారణ జీవిత కాలం 28సంవత్సరాలు. పిల్లకొంగలు ఎగిరేందుకు 60 నుంచి 70 రోజులు పడుతుంది. 85 రోజులవకూ స్వతంత్ర పక్షులుగా బ్రతకలేవు. తాము పుట్టిన గూటికే 115 రోజుల వరకూ కూడా తిరిగి చేరుకునే అలవాటును మానుకోవు. ఇవి చాలా నెమ్మదిగా పరిపక్వ దశకు వచ్చే పక్షులు మూడేళ్ళ వరకూ ఇవి పరిపక్వం చెందవు మొదటి కాన్పు వీటికి నాలుగేళ్ళ వయసు వరకూ వుండదు. కోడిపిల్లలలాగానే వీటిని కూడా పెంపుడు పక్షులలగా అలవాటు చేసుకున్నవారు వున్నారు అటువంటి సందర్భాలలో ఇవి వాటికి పెట్టిన పేర్లకు ప్రతిస్పందిస్తాయట కూడా.
వీటిని కాపాడుకోవాలి

 నిజానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ అరుదైన ప్రత్యేక రకం కొంగలను కాపాడుకునేందుకు వేర్వేరు దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నాయి. కానీ సరైన అవగాహన లేక వీటిని నిర్లక్ష్యం చేయటంతో రాన్రానూ ఇవి అంతరించే దశలోకి పోతున్నాయి.
 ఇప్పటికే వీటి గురించి సమగ్రంగా ముఖ్యమైన వివరాలు తెలిసేలా పాలేరు చెరువు దగ్గర గ్రామం ఎంట్రన్స్ లోనూ వైరా చెరువు దగ్గర వుంచేలా బోర్డులను తయారు చేస్తున్నారు.
 చెరువును పూడిక తీసి అభివృద్ది చేయాలి. చేపపిల్లలను దానిలో వదలాలి. దానివల్ల కావలసిన ఆహారం వాటికి దొరకుతుంది.
 చెరువు కట్ట దారిని ఊళ్ళో వరకూ అభివృద్ధి చేస్తే వీటికోసం ఒక చక్కటి విజిటింగ్ సర్కిల్ ఏర్పడుతుంది.
 వీటి జీవనానికి ప్రధాన సమస్య కోతులు గూళ్ళను పడేయటం గుడ్లను పగలగొట్టడం చేస్తున్నాయి. గ్రామస్తులు అడగటం అయితే కొండముచ్చులు పెంచే భాద్యతను ఒక ఉద్యోగికి అప్పగించటం వల్ల కోతులు బెడద కొంత తగ్గుతుంది అని చెప్తున్నారు.
 మరో ఏర్పాటు కూడా చేయవచ్చు కరెంటు స్థంభాలవంటి నిర్మాణాల మీద సులభమైన చదును ప్రాంతం ఏర్పాటు చేస్తే ఎగిరే పక్షులు వాటిపై గూడు కట్టుకోవడం సులభంగానే వుంటుంది కానీ ఆ స్థంభాలమీదుగా కోతులు ఎక్కటం సాధ్యంకాదు. పైగా పక్షుల రెట్ట చెట్టు చుట్టుపక్కల మొత్త పడటం కాకుండా కేవలం స్థంభానికి చుట్టూతానే పడుతుంది. ఏదన్నా కృత్రిమ మేత అందజేసేందుకు కానీ పరిశీలన చేసేవారు ఫోటోలు విడియోలు తీసుకునేందుకు కానీ చాలా అనుకూలంగతా వుంటుంది. వీటిని గ్రామంలోనే అక్కడక్కడా చెట్లకు కొంచెం దగ్గర్లోనూ చెరువు ప్రాంతంలోనూ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందీ వుండదు.
 వ్యూ పాయింట్లుగా పనికొచ్చే ఇళ్ళకు పైన కేసింగ్ వంటిది నిర్మించేందుకు లోన్ ఇచ్చి చిన్న మొత్తంలో టికెట్ పెట్టుకునేందుకు అనుమతిస్తే గ్రామస్తులు సైతం వాటి రక్షణ విషయంలో శ్రద్ద తీసుకుంటారుకదా అనే సూచనను శ్రీ కృష్ణ సుమంత్ చేసారు.
 వేసవిలో గ్రామస్తులే స్వచ్ఛందంగా నీటి తొట్టెలను ఏర్పాటుచేస్తూ వాటిని కాపాడుకుంటున్నారు.
 తెలుగులో వీటిగురించి ఒక బ్రోచర్ లేదా బుక్ లెట్ రావలసి వుంది, వికీపిడియాలో కూడా తెలుగులో ఇంకా చింతపల్లి కొంగల గురించి వ్యాసం అభివృద్ది చేయవలసి వుంది. పిల్లల పాఠ్యాంశాలలో వారికి స్థానికంగా వుండే జీవజాలం, ప్రాచీన చరిత్ర కూడా వుంటే ఆ అవగాహన నిజంగా పనికొస్తుంది. ఈ చుట్టుపక్కల విద్యార్ధులకు ఎర్రబోలు కొంగల అధ్యయనం ఒక టాపిక్ గా ప్రాజెక్టుగా ఇవ్వటం, వాటి సందర్శనను ప్రొత్సహించడం లేదా ప్రత్యేక సెలవును లేదా ప్రత్యేక నిధులను కేటాయించడం చేయవచ్చు.
 పెలికన్ ఫెస్టివల్, ప్లెమింగో ఫెస్టివల్ లాగానే ఈ పెయింటెడ్ స్టార్క్ ఫెస్టివల్ నిర్వహించేందుకు చాలా చక్కటి అనుకూలతలు వున్నాయి. ఖమ్మం పట్టణానికి చాలా దగ్గరలో వరంగల్ రోడ్ లో రవాణా సౌకర్యాలు కలిగిన ప్రాంతం ఇది. వరంగల్ హైవే కి కేవలం రెండు కిలోమీటర్ల్ లోపులోనే వున్న ప్రాంతం ఇది.
 ఇక్కడ నగరీకరణ చెందకుండా చుట్టూ వ్యవసాయ భూములుండటం కూడా చాలా అనుకూలతను కలిగివుంది. కేవలం చెరువు నీళ్లమీదనే కాక అనేక బావులనుంచి మోటర్ల ద్వారా నీళ్ళు తోడుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు. అయితే విషతుల్యమైన పురుగుమందుల వాడకం జరగకుండా సరైన అవగాహన కల్పించడం అవసరం.
 ఈ ఆర్టికల్ సోషల్ మీడియాలో రాయడం వెనక నా ఉద్దేశ్యం కూడా సాధ్యమయినంత ఎక్కువమందికి సమాచారం తెలియాలని, వీటిని చూసేందుకు కొంత సమయం కేటాయించుకుని పిల్లలకు కూడా వీటిగురించి తెలియజేయాలని. మీ వాల్ పైన వున్న మిత్రులకు కూడా తెలిస్తే మంచిది అనుకుంటే సంతోషంగా షేర్ చేసుకోవచ్చు.
 సూచనలుంటే తెలియజేస్తే మరింత ఉపయోగకరంగా వుంటుంది.

https://www.facebook.com/media/set/?set=a.1787485197942657&type=1&l=b25352c43f

ఫేస్ బుక్

Tweets

లంకెలు