దేశవాళీ విత్తనాలు

 ఈ గింజలు ఏమిటో గమనించారా? అన్నీ

సొరకాయ లేదా అనప కాయ లేదా అనగ కాయ గింజలే కాకపోతే ఒక్కొక్కటి ఒక్కోరకం. కోసావులే సొరకాయ కోతలు అంటాం కానీ అదేమీ చిన్నవిషయం కాదని
Gopi
గారి,
Satya Srinivas
గారి సొరకాయ కలెక్షన్లను చూసాక అనిపించింది.
పొరకాయ పులుసు, వేపుడు దప్పలం పచ్చడి హల్వాల కోసమే వాడే ఆహార పంట మాత్రమే కాదు.
నాగస్వరం, తాంబూరా బూరలుగా, సహజ నీళ్ల డబ్బాలుగా, గరిటెలుగా కూడా పనికొస్తాయి. బహుశా ఆంగ్లంలో Bottle gourd అనే పేరు క్రీస్తు పూర్వం నుంచే సాగుచేయబడుతున్న వీటి పనితనానికి అద్దం అడుతున్నట్లే ఉంటుంది.
జెనెటికల్లీ మాడిఫైడ్ (జన్యు ఉత్పరివర్తనం) చెందిన తూకం ఎక్కువ వచ్చే పంటలకు సమాజం వేగంగా అలవాటు పడుతున్న నేపథ్యంలో అనేక దేశవాళీ రకాలను కోల్పోతున్నాం.
సొరకాయ ముక్కకి, బీరకాయ, దోసకాయ ముక్కలకు తేడతెలియకుండా తొందరగా ఊరిపోయే రకలతో ఊరేగుతూ ఇటు రుచిని కూడా మర్చిపోతున్నాం. చీడను తట్టుకునే విత్తనాలంటూ రైతుని కూడా ఒక్కసారికి మాత్రమే మొలకెత్తే కృత్రిమ పేడి విత్తన పీడను బలవంతంగా అలవాటు చేసి తప్పనిసరి చట్రంలో నెట్టేస్తున్నారు.
కానీ మన దగ్గరి సమశీతోష్ణ మండల రకాలు కాపాడుకోవడం నోస్టాల్జియానో, రుచో త్యాగమో కాదు. ఖచ్చితంగా లాభదాయకమైన వాణిజ్యం అవుతుంది. పాపికొండలు దగ్గర వెదురు బొమ్మలు నేర్పి వారి స్వీయ సంపాదన పెంచినట్లు, చిత్రకూట్ జలపాతం దగ్గర సొరకాయ బుర్రల అలంకరణ సమగ్రితో ప్రత్యేక దుకాణ సముదాయాలు నడుపుతున్నట్లు, మన దగ్గర ఉద్యాన రైతులకే కాక డ్వాక్రా వంటి మహిళ స్వయం సంఘాలకు ఆఫ్ లైన్ లొనే కాక ఆన్లైన్ లో సైతం అమ్మగల ఆదాయమార్గం అవుతుంది. వరి, పత్తి,టమాటా వంటి రకాలపై దేశవాళీ మార్గంలో చేసిన ప్రయత్నాలలో అనేక వంగడాలు పునరుత్తేజం చెందటం వార్తలలో గమనిస్తూనే ఉన్నాం. మందులపై కాకుండా మంచి జీవన విధానాలతో ఆరోగ్యంగా ఉండాలి అనే సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో దేశవాళీ రకాలు మరిన్ని తమ ఉనికి నిలబెట్టుకోవాలని కోరుకుందాం.
-కట్టా శ్రీనివాస్

కామెంట్‌లు