కట్టా శ్రీనివాస్ || ‘‘స్త్రీలు అత్యవసర ద్వారం ’’||
1
టిక్కెట్ టికెట్
నిద్రకళ్ళతో పొద్దుటే బస్సెక్కితే
సలపరించిందో వాక్యం కాని ఒకానొక అవాక్యం.
కిటీకీ వారగా ఎర్రెర్రగా సంభందంలేని పదాలు రెండూ పక్కపక్కనే కూర్చుని
పలకరిస్తున్నట్లుగా నవ్వి నాకో సవాలు విసినప్పట్నుంచీ
2
టిక్కెట్ టిక్కెట్
అవునంతేనేమో
అనుకోకుండా ఎదురుదెబ్బ తగిలితే
అమ్మా అంటూ అనుకోకుండా పెల్లబికే ఆర్తనాదం
చెపుతుంది ఆదమరుపులో కూడా ‘స్రీలు అత్యవసరద్వారమే’నని
3
టికెట్ టికెట్
నూనూగు మీసాల నూత్న యవ్వనాన
అలజడుల తాపాగ్నిని ఉపశమింపజేసే
నునుపుబుగ్గల జవ్వని నవ్వుతూ చెపుతుందేమో
స్త్రీలు అత్యయిక ద్వారమని
4
టికెట్ టిక్కెట్
ఆత్రమో ఆవేశమో
బాసు కక్కిన బడభాగ్ని మంటని చల్లార్చుకోవలిన అవసరమో
వంటింటి మొగ్గ ఒడిసి పట్టుకున్నప్పుడనిపిస్తుంది
స్త్రీలు అత్యవసర ద్వారం
5
టికెట్టికెట్
వాదనలో గెలిచి జీవితంలో ఓడటం కంటే
ఓటమితోనే గెలిచే నేర్పరి లౌక్యం ఎరిగిన జ్ఞాతి ఎదుటనిలబడినపుడు
కడుపు నిండిన మనసు వెలితికంటే
మనసునింపుకుని కడుపుకి ఆకలి తినిపించే అమ్మతనం నీడపడినపుడు
ఎల్లవేళలా నీపై గొడుగున్నట్లు స్త్రీలు అత్యవసరద్వారమే
6
టిక్కెట్టెవరండీ......టికెట్
కుటుంబ సామ్రాజ్యంలో
మాటలదారులు కోపానికి బీటలువారిన వేళ
తానే ఒక వంతెనై నిలబడగల సామ్రాజ్ఞి గుండెనిబ్బరాన్నోసారి చూడగలిగితే
స్త్రీలు అత్యవసరద్వారమే
7
మోక్షగమన మార్గంలో కామం మజీలీకావాల్సినపుడు
చలివేంద్రపు స్థానంలో చిరకాలపు మరీచిక నవ్వుతుంటే
సంసారసాగర మునుగీతలో మొలతాడందుకుని
సుడిగండాలను దాటించే మిత్రురాలు గుర్తొస్తే
దశనుండి దశకు దూకే దిశలో
స్త్రీలు తప్పకుండా అత్యవసరద్వారమే
8
టిక్ టిక్కెట్
వింటానికి ఎబ్బెట్టుగా ఉంటుందేమో కానీ
పోరాటంటో ఓటమే తెలియని తను
ఒక్కసారి పిండేస్తే వాలిపోయే నీముందు
నిర్భయనే పేరుతోనే జింకపిల్లలా బెదిరుతూ
నీకు పులిమీసాలద్దుతున్నప్పుడు తెలియదు కానీ
బలుపో వాపో ఎరగని ఉత్తరకుమారప్రగల్భాల కెదురుగా
తానోరోజు నిటారుగా నిలబడితే, విలువల వలువలనోసారి తిరగేసి తొడిగితే
తప్పించుకునే దారే తెలియని నీకు తప్పకుండా తెలిసొస్తుంది
స్త్రీలు అత్యవసర ద్వారమే కదా అని
9
ముందు చెకింగ్ వుందండీ టికెట్లెవరన్నా ఉన్నారా? టిక్కే....ట్స్....
విశ్వానికి కాలబిలమైనపుడూ, విశ్వాసానికి సర్వాంగీణ కొలమానమైనపుడూ
ప్రాణబీజం నాటుకోవలసిన ప్రతిసారీ తనే క్షేత్రస్థానమై పవలిస్తున్నపుడు
తప్పకుండా అర్దమౌతుంది కదా స్త్రీలు అత్యవసరద్వారమే నని
ఉరిమే ఉత్సాహాలకూ, ఉప్పొంగే ఉద్వేగాలకూ
ఉరకలెత్తే ఆవేశాలకూ సుడులుతిరిగే ఆవేదనలకూ
అవును అవునవును
స్త్రీలు అత్యవసరద్వారం
మరణంలోనూ ఓటమిలోనూ, మరణంలాంటి ఓటమిలోనూ, ఓటమి మాటున మరణంలోనూ
మెలితిప్పే బాధ గడ్డకట్టి గొంతునినొక్కేస్తుంటే
బళ్లునపగిలే కన్నీరై ఉరకలెత్తి గుండెల్ని తేలికచేసే
ఆమెలే కదా మనసులను తెలికచేసే అత్యవసర ద్వారాలు.
10
వారిని గౌరవించడం మన సాంప్రదాయం
వారికి కేటాయించిన స్థానాల బరువుల్ని వాళ్ళనే మోయనిద్దాం
అందుకు సరిపడా చిల్లర తెచ్చుకోండి
ఇట్టాంటోళ్ళ ఆక్యుపెన్సీ రేష్యూ పెంచుదాం
ఈ కాన్సెప్టు లేని ప్రయాణం నేరం
అందుకు రూపాయిల ఫైను, జీవనకాలల శిక్ష లేదా రెండూ పడొచ్చు
డిపోమేనేజరు నంబరు గుర్తుంచుకోండి, పిర్యాదులపెట్టెవరకు వెళ్ళాల్సిన అవసరం రానీకండీ
అత్యవసర సమయంలో ఏ అద్దమునైనా పగలగొట్టవచ్చునన్నాసరే
మనసూ ఒక అద్దమే నని మర్చిపోకండి.
11
టిక్కెట్ టిక్కెట్
అవును కదా నేనీ కధనం నుంచి దిగిపోవాల్సిన సమయం వచ్చింది.
===>> 09-03-2016
నేనీమద్య ఎక్కువగా చేస్తున్న బస్సు ప్రయాణాల్లో ప్రతీసారీ పలకరించే వాక్యం ఇది. మహిళలకు కేటయించిన సీట్లు అని తెలిపేందుకు రాసిన స్త్రీలు అన్న పదం పక్కనే, అత్యవసర ద్వారం అన్న మాటలు కూడా చేరిపోయి ఒకే వాక్యంగా కనిపిస్తుంటాయి. కొంటెగా నవ్వుకోవడానికేమొచ్చెలే గానీ కొంచెం పరికించి చూస్తే ఈ మాటలో ఎంత లోతైన నిజం వుంది కదా అనిపించక మానదు. మహిళా దినోత్సవం కేలండరు ప్రకారం నిన్ననే గడచిపోయినా నాకీరోజిలా పలవరించాలనిపించింది.
https://www.facebook.com/share/p/mvzZLJggifyncyeX/
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి