కట్టా శ్రీనివాస్ ౾౾ కెటలిష్ఠుడు ౾౾

థాంక్స్ రా బాబాయ్
టంగ్ స్లిప్ చలపాయ్.

మురికి తొట్టి మూత తీస్తే తీసావ్.
మరకలు తుడిచే పని షురూ అయ్యింది.
రోట్లో నోరు పెట్టావ్ రోకలి పోటు ఎలాగూ తప్పదు.
నువ్వుప్పుడు సారీ అన్నా
నీపక్కనున్న వాళ్ళకి  ఆ మాత్రం ఇంగితమే లేకున్నా.
ఎప్పటినుంచో మా మనసుల్లో   రగులుతున్న మంటలాగవు.

మంత్రి కొడుకువో, ముసలి హీరోవో అయితే.
మా నోళ్లు మొరాయించేవి.
పాత్రల్లేని విలన్ షేడ్ ఉన్న చిన్న కమెడియన్ వేగా,
సూసుకుందాం నీ పెతాపమో మా పెతాపమో.
నీ వెనక ఓ మంద నీడ ఉంటే
మా పరుగు మందగించేది.
మందబుద్ధిలా కనిపిస్తున్నావ్ మకింకేం భయ్యం.
దట్టించిన కోపమున్నా
ఎక్కుపెట్టే భుజం ఇన్నాళ్లుగా దొరకలేదు.

పర్లేదు బాబాయ్
నోటిదూల చపలపాయ్.
గట్టి సపోర్టు నిచ్చావ్.

చెదలు పట్టిన మూలలన్నీ దులపాలంటే
ఎక్కడో అక్కడ మొదలవ్వాల్సిందే.
నీ దెబ్బతో లక్షల చేతుల్లో కర్రలు బిగిసాయి.
వేల నాలుకలు జాగ్రత్తను పులుముకున్నాయి.
వందల నోళ్లు నినదిస్తున్నాయ్.
డజన్ల కొద్దీ సీరియళ్లు సెన్సార్ కత్తెరను వెతుక్కుంటున్నాయ్.
ప్రకటనల్లోని పైత్య ప్రకోపాల పసరు పిసరంతయినా పిండేయ్యాల్సిన ప్రయత్నాల సమయం ఆసన్నమైంది.

దేహానికే ఉండాల్సిన జెండర్
సంస్కృతికి నాటేస్తుంటే.
సృష్టికార్యపు తీపిని
వ్యాపార వస్తువుగా అంగట్లో పెడుతుంటే
ఆత్మగౌరవాన్ని మాత్రమే కాదు.
మొత్తం మనుగడనే కాపాడుకునే
అడుగులు పడాల్సిన సమయమొచ్చింది.
పోన్లే నీ వల్ల అది మొదలయ్యింది.

తేదీ ◆25౽05౽2017

కామెంట్‌లు