తెగ బలిసిన ముల్లు
ఎగబడి ఎగబడి మరీపసిమొగ్గను గుచ్చుతోంది.
రాలిపోతున్న పసరుగాయకోసమే కాదు జనులారా
మనుగడే మిగలక కుదుళ్ళతో సహా మశానం అవ్వబోయే చెట్టుకోసం కూడా ఏడవండి.
ఏడవండి రక్తం కన్నీరై వచ్చేంత వరకు ఏడవండి.
అణుబాంబులు క్రిమి బాంబులు ప్రమాదమని అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకుంటున్న పెద్దలారా!!
ప్రపంచాన్ని ముంచేసే ఉపద్రవమై ప్రవహిస్తున్న టెస్టోస్టిరోన్ నియంత్రణ చర్యలేం చేశారురా?
కంచెలు కూడా చేలపై ఎగబడి గునపాలను దింపుతున్నాయి.
సమాజమే పాముగా మారి కళ్ళు మూసుకుపోయి స్వంత పిల్లల్ని గుటుక్కున మింగేస్తోంది.
ప్రళయం ఎక్కడినుంచి వస్తుందో అని పెద్ద పెద్ద దుర్భిణీలలో చూసే గుడ్డి నాయాల్లారా!
బయటికి కాదు ఒక్కసారి లోపటికి చూడండి.
గిరగిరా తిరుగుతున్న భూమి దారం పుటుక్కున తెగిపోయినట్లు
ఇన్నాళ్లు భద్రమని నిలబడ్డ కళ్ళక్రింద భూమి పూసుక్కున జరిపోయినట్లు తెల్లారాక కూడా ఒకటే పీడకలలు.
ఉరే సచ్చిపోయిన సిగ్మాన్డు ఫ్రాయిడు దీనికసలు అర్ధం చెప్పి బతికించరా సామీ.
వాడు నూరుకున్న కత్తి వాడి గొంతులోని దింపుకుంటున్నాడు శాడిజం అంటారే అది మసోకిజం. ఎక్కడో రెడ్ చిప్ ఆక్టివేట్ అయ్యింది సమాజం సెల్ఫ్ డిస్ట్రోయ్ దిశగా పిచ్చిపట్టి పూనకం రేగినట్లు ఊగుతూ పరిగెడుతోంది.
ముగిస్తున్న వాక్యం చివర ముగింపులేని ఆలోచనలు ఊట చలమలై అలమటిస్తున్నాయి.
మిత్రమా బ్రేక్ లు రెగ్యులేటర్లు ఎక్కడున్నాయో చూడు అసలు తయారు చేసారో లేదో తెలుసుకో.
ఆ కనబడే అంచునుండి మొత్తం పడిపోకముందే ఆపగలమేమో ప్రయత్నం చేద్దాం.
తేది : 14-04-2018
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి