*కాలా’ అనే ‘కరి కాలుడి’కి ఒక ఉత్తరం


కాలా ఈ ఉత్తరం నీకే...!
బాగున్నావా కాలా ? ఎందుకు బాగుండవులే ఎంతమంది నాలాంటి ప్రజలునిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు కదా, ఏదో చేస్తావని నిజంగా నమ్మి నీకోసం నిలబడుతున్నారు కదా అది చాలు నీ నవ్వుని అలాగే బ్రతికించడానికి. నాయకుడిగా నువ్వు వాళ్ళకి ఏం చేసావ్ గుండెలమీద చెయ్యేసుకుని మళ్ళీ ఒకసారి సీసాలో ద్రవం ఏదో తాగనప్పుడు ఆలోచించు సమాధానం దొరుకుతుందేమో చూద్దాం. అసలే ఎన్నికల సమయం అణగారిన వెలివాడలను కేవలం ఓట్లుగా మాత్రమైనా చూడడం వల్లనే బ్రతికున్నాయి అనుకునే రోజుల్లో వాడకట్టు నాయకుడొకడు వెండితరమీద కనిపిస్తాడట అనగానే ఎంత ఆశపడ్డమో తెలుసా? నిజంగానే తరాలు తరాలుగా ఏళ్ళూ పూళ్ళుగా గూడుకట్టుకు పోయిన పెద్ద పెద్ద సమస్యల భారం దించుకునే పరిష్కారం ఏదన్నా చెపుతావనుకున్నాం. కానీ నువ్వు చేసించేదేమిటి? పా రంజితో  తో కటీఫ్ నేను మాట్లాడను కోపం వచ్చింది అందుకే ఈ ఉత్తరం నీకంటే నీకే. కుదిరితే కొన్ని ప్రశ్నలకైనా సమాధానం ఇవ్వు కాలా ఎందుకంటే ఇదన్నా చేస్తావని ఆశపడుతున్నా. సరే కానీ కాలా అంటే ఒక రంగు కాదు. ఏం రంగూ లేని తనం కావాలంటే కాషాయ నిర్వచనం కాదు సివి రామన్ ని అడుగు.

ఒకటి......) నిన్ను వెన్నంటి వచ్చే వాడిని కాపాడాల్సిన అవసరం నీకు లేదనుకున్నావా?
చిన్న పిల్లోడు కాలా నువ్వు నీ మాజీ ప్రేయసి జరీనా()కు చిన్న దెబ్బతగిలింది చూడాలంటే ఇల్లు వెతుక్కుని నిన్ను తన బండిపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు. ఎంత భవిష్యత్తు వుంది కాలా వాడికి అంత ప్రమాదకరంగా ప్రత్యర్ధులుంటారని తెలిసీ ఒంటరిగా వెళ్ళావు. అమెకు కూడా నువు చేసిన మేలేముందిలే పాత పద్దతిలో డైలాగులు కొట్టి వచ్చావు. తిరుగు ప్రయాణంలో శత్రువులు చుట్టుముట్టారని ఆ పిల్లోడికి తెలిసింది నిన్ను రక్షించడానికి దారి ఎటెటో మార్చి పూర్తిగా చిక్కుకు పోయాం అని చెప్పేంత వరకూ నీకు మాత్రం అర్ధం కాలేదు. మళ్ళీ మూడు తరాల నుంచీ ఇదే దందా చేస్తున్నావని చెప్తావు. ఏ  ఆలోచనల మత్తులో వున్నావు కరికాలా? పోనీ అదే బైకు నువ్వు డ్రైవ్ చేసి చాకచక్యంగా తప్పించుకుంటావేమో అనుకున్నా, అదేం లేదు సరే ఒక్కడివే దిగి అక్కడేదో దొరికిన ఒక కర్రముక్క చేత్తో పట్టుకుని ఎంతమంది శత్రువులున్నరోకూడా అంచనా లేకుండా ఇరగదీసేస్తానన్నావు. ఏందీ తలైవా పనులు నువ్వు మామూలు వాడకట్టు నాయకుడివని మర్చిపోతే ఎలా? పోనీ అదన్నా చేసావా? కారులో వచ్చి నిన్ను రక్షిస్తామంటే పద పదా పోదాం అని అందులో ఎక్కి కూర్చున్నావు. నీకోసం వచ్చిన పిలకాయ నీవెనకే వస్తున్నాడా లేదా అని చూడాల్సిన భాద్యత లేదా? సరే ప్రాణభయం హడావిడిగా వెళ్లావు. ఇంటిదాకా వెళ్లాకయినా వాడు వచ్చాడా లేదా అని చూసుకోవడం చేతరాదా? బారెడు పొద్దెకిన దాకా పడుకున్న నీకు వాళ్లమ్మ వచ్చి ఏడుస్తూ చెప్పేంత వరకూ వాడిని అక్కడే కరెంటు స్థంభానికి ఉరేసారు వాడు పోస్టరుకు వేసిన రాయుతో సహా వేలాడగట్టారు. వాడి మరణానికి నీ భాద్యతలేదా కాలా? చిన్న పిల్లోడు కాలా అన్యాయంగా చచ్చిపోయాడు. నీకేం నాలుగు హీరోయిజం డైలాగులు చెప్పేస్తావు వాడు ఇక తిరిగిరాడుగా?

సరే తప్పు జరిగింది పో ఇప్పుడు నాయకుడు న్యాయం ఏం చెయ్యాలి? పాత సినిమాల పద్దతిలో నిగనిగ లాడే నల్లటి జీపులో వెళ్ళి నడిరోడ్డుమీద విలన్ గ్యాంగ్ ని ఆపేసి నలుపు నలుపు మ్యాచింగ్ డ్రస్సు నలగకుండా రాజమౌళి ఆయుధంలా ఒక నల్లగొడుగు తీసుకుని బిష బిష బిష డిష్యుం డిష్యం డిష్యం కత్తులని కూడా కాలా గొడుగుతోనే గిరా గిరా తిప్పేసి అత్యంత దారుణంగా ఒక విలన్ ని చంపేస్తావ్ ఈ మషాలా ఫార్ములాని మాకు ఎదగబోయే నాయకత్వలకు నేర్పాలనుకున్నావా లేక సినిమా ఆడాలంటే ఈ మాత్రం హీరోయిజం వుండాలా ఏమో ఇక్కడికి సమస్యం అంతం కాలేదు అక్కడినుంచే ధారావీ మీదకు మరింత నల్లటి విషపు చీకటి కమ్ముకోవడం ప్రారంభం అయ్యింది. అయినా పర్లేదు కాలా ఇంకా ప్రజలంతా నీవెనకే వున్నారాయే నిన్నే నమ్ముకున్నారాయె. నువ్వు తెలివిగా ఏదో చేస్తావని టికెట్ కొనుక్కున ప్రేక్షకులతో పాటు అమాయక ధారావీ ప్రజలు కూడా నమ్ముతూనే వున్నారు. మరి నువ్వేం చేసావు. సర్లే మ్యాచింగ్ వేసుకెళ్లేందుకు నలుపంటే రంగు కాదు కాలా ఏం రంగూ లేని తనం అది అంటించుకుంటే వచ్చేది కాదు ఏదీ అంటపప్పుడు సహజంగా వుండేది.

Anjali Patil (born 26 September 1987)
is an international film and theater actress. 
రెండు ......) ఆ పిల్ల కబాలి సినిమాలో యోగి కారెక్టర్ లాగా చారుమతి గైక్వాడ్ పాత్ర చేసిన అంజలీ పాటిల్ ఎంత డైనమిక్ గా వుంది. ఇంత బెరుకు లేకుండా గుండెలోతుల్లోంచి వచ్చే మాటలను ఎంతబాగా పిడికిలి చేసి బిగిస్తోంది. నిన్నెంత నమ్మింది కాలా మరేం చేసావ్. పోలీసులు ఆ పిల్లను అంత దారుణంగా నీచంగా అవమానిస్తుంటే రక్తం మరిగిపోయింది. ఇలాంటి ఇలాంటి అవమానాలనేకదా మా వాడకట్టలన్నీ ఇన్నాళ్ళుగా భరిస్తోంది అని ధారావీలాంటి చిన్న చిన్న గల్లీలనుంచీ వచ్చి మాలాంటి వాళ్లం ఎందరమో రగిలిపోయాం. ఇప్పుడు మా తలైవా వచ్చాడు నాయకత్వం వహిస్తాడు. న్యాయం చేస్తాడు అని చూసాం మరి అదేంటి అసలా సన్నివేశం సినిమాకు షాకింగ్ ఎట్రాక్షన్ లా వాడుకంటాం కానీ పరిష్కారం మాకెందుకు అన్నట్లు వదిలేసారు. అంత అవమానాన్ని వివరంగా చూపించిన మీకు ఆ బాధను నిజంగా ఎంపథైజ్ అయితే పరిష్కారం చూపించరా? మా గంగాధర్ అద్వైత మంచినీళ్ళ బావి తీసాడు ఒకసారి చూడు. తనని అవమానించాలనుకున్నందుకు గడీ దొరతో సహా ఊరిమొత్తానికీ ఒక మహిళ ఎలా సమాధానం చెప్పిందొ గంటలోపు ఫీచర్ ఫిల్మ్ లో అందంగా చెప్పాడు. బడుగులు నాయకుడైనా సరే ప్రజలే తమ ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుకుంటూ వుండాలే కానీ రాజరికాల కాలం నించి కూడా సైనికుడిని కాపాడే రాజు వుండనే వుండడు అని మళ్ళీ చెపుదామనుకున్నావా మ్యాచింగ్ డ్రస్ వేసుకునే కాలా. మళ్లీ చెపుతున్నా విను కాలా అంటే రంగు కాదు అన్ని రంగులనూ శోషించుకున్న గుణం. తన మీద పడే ఏ రంగునైనా చాకచక్యంగా ఒడిసి భిగించి పట్టుకోగల కృష్ణబిలం(బ్లాక్ హోల్) నా మాటల్లో కాకపోతే అద్దంలో చూసుకో కాలా నీలో ఆ గుణం వుందో లేదో తెలుస్తుంది.

మూడు....) ఇవ్వన్నీ పానియ్యి అసలు ధారావీకి నువ్వు ముందు చూపుతో చేసిదేమిటి? నీకయితే లంకత ఇల్లు (అదేలే సినిమాలో కూడా రావణుడంత హీరోవి అన్నారుకదా పదితలలతో ఆలోచిస్తావని పొగిడించుకున్నావు కూడా కదా)  ఆ ఇంటి నిండా బోలెడంతమంది బంధుగణం ఇంటిముందు చక్కటి కారు. సరే సరే తప్పులేదు నీ వాళ్లు కూడా బాగా సెటిల్ అయ్యారు బాగా సంపాదిస్తున్నారు అని చెప్పించావు కడా సరే మంచిదే. మరి ధారావీ ప్రజలకు స్వంతంగా మంచి నీటి కుళాయి కనెక్షన్ ఎందుకు లేదు? వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఎందుకు సహకరించలేదు? పబ్లిక్ టాయిలెట్స్ ఏదో నిభందనలతో మూసేస్తే వాళ్ళు ఇబ్బందులకు గురయితేనయినా బలవంతంగా వాటి తాళలు పగలగొట్టటమే కానీ నీ ఇంటిలా కనీస అవసరాలు తీరేప్రణాళిక సాధంచవద్దా?మాకు నాయకులు కావాలనుకునే వాళ్ళు మా అవసరాలకు బిక్షవేయడం కాదు సమస్యలే ఏర్పడకుండా ముందస్తు సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఈ ఎన్నికల సందర్భంగా నైనా మీ సినిమా మా అవసరాలను ప్రతిబింబిస్తుంది అనుకున్నాం. హు ఇక్కడా నీ హీరోయిజమే ఎలివేట్ చేసి వదిలారు. మా వైపు అసలు చూసారా? కాలా ని జండాగా ఎత్తితే సవాలక్ష రంగుల్లో అదొకటి అవుతుంది కాలా అందరి అవసరాలనూ ఎజెండాగా ఎత్తు అప్పుడు నికాల్రే తుమ్హారా పాగల్ పాగా అంటూ పాతదనం మొత్తాన్నీ అచ్చంగా ఊడ్చేసే ప్రయత్నం చేసేవాళ్లం కాలా. ఎందుకంటే నలుపు కేవలం ఒకరంగు కాదు. ట్రెండు కూడా.

నాలుగు.....) నీ బలం మేమే అని ఎన్నిసార్లు చూపించుకున్నావు. జాతియస్థాయి నాయకుడు హరిదాదా(నానా పాటేకర్‌) నీ ఇంటి దాకా వస్తే నీ అనుమతిలేకుండా వెళ్ళనివ్వనని నువ్వేదో దూలకి ఫ్లోలో అంటే మా కోళ్ళ గంపలు, పూలబుట్టలు, నీళ్ళబిందెలు మా ఆస్తులు మా ప్రాణాలు అంత పెద్ద బలమైన అధికారానికి అడ్డేసి నీ మాటని నిలబెట్టాం అదే విలన్ నీ దాకా వచ్చి పర్మిషన్ తీసుకునేలా చేసాం. అయితే ఈ సీన్ లో నువ్వు సాధించిందేమిటి చెప్పొచ్చేదేమిటి? నీ విజయం మీద బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హీరోయిజం దఢ్ దఢలతో స్లోమోషన్ లో కదిలిన కెమెరా మా పోయిన వస్తువుల గురించి కనీసం ఓరచూపుకూడా చూడదు కదా. ఎందుకంటే ప్రజలు త్యాగాలు చెయ్యాలి నాయకులు పేరుమొయ్యాలి అనే పాత ఫార్ములానే నీకు నీ దర్శకుడికీ కూడా నరనరానా జీర్ణమయ్యే వుంది. సరే వాడకట్టు విషాదంలోనూ షష్టిపూర్తి సంబరంగా చేసావు. లైటింగు డెకరేషను డాన్సులు అన్నవున్నాయి సరే మందు కూడా నువ్వు కూడా తాగేసా ప్యాంటు కోటు వేసుకుని స్టెప్పులేసా ఎప్పట్లానే ప్రేక్షకులు డంగయిపోయి విజిల్ వెయ్యాలని ఎదురు చూసావు. మేమేమో ఉగ్గబట్టుకున్న మా సమస్యలకు ఏం పరిష్కారం చెయ్యబోతున్నడా అని ఎదురుచూసే పనిలో వున్నాం. తెలివైన హీరోవి కదా డాన్స్ వేస్తూ కూడా మమ్మల్ని కాచుకుంటావులే అనుకున్నాం. అబ్బే అదేం లేదా వచ్చిన పోలీసులు తినడానికా తన్నడానికా అన్న సోయి సొంపుకూడా లేకపాయిందా నీకు. పైగా స్లేషన్లో ప్లాన్ ఏమీ లేని నీ తలబిరుసు వాగుడుకి వాళ్ళు అక్కడే చంపేయకుండా మళ్ళీ మేమే చలిచీమల దండులాగా కుప్పలు కుప్పలుగా అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా మా పనులు ఇళ్ళు అన్నీ వదిలేసి ఆ స్టేషన్ చుట్టూ హడావిడీ చెయ్యబట్టి బయటికి వదిలారు. వస్తూ హరిదాదా సంగతి చూస్తాను అన్నావ్. మధ్యవర్తి మంత్రిని నువ్వెవడవురా మధ్యలో గొట్టంగాడివి అన్నట్లు ఎద్దేవా చేసేవ్ సినిమాటిక్ అతికి బాగానే వుండొచ్చు కానీ నీమీదకు ఎక్కుపెట్టించుకుంటున్న ప్రతి తుపాకీ గుండీ నీకు కవచంగా వున్న మా గూడెపు గుండెల మీదకే అని పంచ్ డైలాగులు వేసేప్పుడు గుర్తుకు రాదా? అయినా ప్లాన్ లేని పంచ్ డైలాగులు ఈలలు వేయిస్తాయేమో కానీ సమాధానాలు చెప్పవు. అంత ప్రమాదకరమైన ప్రదేశం నుంచి బయటికి వచ్చి నీకోసం వున్న జనాల మధ్యనుంచే రావలసింది బ్రతికిపొయ్యేవాడివి వాళ్ళని వదిలి కన్సీల్ కార్ లో ఏసీ వేసుకుని జరీనా వచ్చిందా అని పిలకాయ లాగా ఆశ్చర్యపోతూ మీ ఆవిడకు ఐ లవ్యూ చెపుతూ నువ్వు మగతలో వుంటే విలన్స్ దాడి చెయ్యరా దానిలో కొడుకునీ భార్యనీ నష్టపోయావు. ఇకనన్నా మరింత నష్టం జరగకుండా ప్రణాళిక వెయ్యాలిగా? అహింస అన్నగాంధీ బ్రిఠీష్ విధానాలకు వ్యతిరేఖంగా ప్రజల మద్దతును సంఘటిత పరచడానికి అనేక కార్యక్రమాలను రూపొందిస్తూ మళ్లీ ఏదన్నా వికటించి ప్రజలకు నష్టం కలుగుతుంది అనుకోగానే ప్లాన్ బి అమల్లోకి పెట్టిన ఉదాహరణలు నిన్నటి మొన్నటివేగా. ఇరవయ్యేళ్ల యువకుడు అల్లూరి సీతారామరాజు నీలా తలంతాకూడా నెరిసిన అనుభవం లేదు తనదీ ఉడుకు నెత్తురే  గంటం దొర మల్లుదొర పోయినప్పుడు తనని నమ్ముకున్న గిరిజన ప్రజలకు నష్టం జరుగుతుందేమో అని భయం వేసినప్పుడు తన ప్రాణాలను సమిధలుగా వేసి గూడెంవైపు వచ్చే అగ్నిని ఆపాడు. ఇలాంటి ఎన్నో ఉదాహరణల తర్వాత తలనెరిసిన తనంతో నీవు మరెంతో చేస్తావనుకుంటే ఏం చేసావు కాలా? పూరా ఖాళీ. గొడుగు అంటే నల్లటి రంగు వున్న గుడ్డముక్క కాదు పడే వర్షాన్ని తన దేహం అడ్డుపెట్టి ఆపగలసాధనం. తనుకూడా ఛిద్రం కాకుండా దూసుకొచ్చే చినుకుని నైపుణ్యంగా తోసేయగల పనితనం అవును కాలా నలుపు అంటే కేవలం రంగు కాదు.

ఐదు....) సరే ఎన్నికల్లో మేమంతా నీ మాట ప్రకారం ఓటువేస్తాం వేసాం. నువ్వు నిలబడలేదు(ప్యామిలీ ప్లానింగ్ గురించి కూడా పట్టించుకోలేదు కాబట్టి నిజానికి నిలబడే అర్హత కూడా లేదు) సరే ఎవడో భద్యతలేని గొట్టం గాడిని ఎలా ఎంపికచేసావు? మా అవసరాలకు సాయంగా లేకపోగా మాకే అడ్డంగా తిరిగేవాడిని ఎలా ఎంచుకున్నావు. అస్సలు ఎంపికలో బుర్రవాడావా? (అయినా నా పిచ్చికానీ సినిమా మొత్తం మీద ఎక్కడన్నా ఎందుకన్నా వాడావు కనకనా ఈ ప్రశ్న) జరీనాను పెళ్ళి చేసుకుందాం అనుకున్నావ్ మంటపానికి నిప్పు పెట్టారు అదే వాడకట్టులో ఎప్పటినుంచో వుండే నువ్వుబ్రతికున్నావో లేదో ఆమెకు తెలియలేదు అంది సరే. చేతిమీద పచ్చబొట్టు పొడిపించుకునేంత ఇష్టంవున్న నీక్కూడా ఆమెక్కడుందో తెలియదు, ప్రయత్నించవు, వెతకలేదు. అంతే అలా గడిపెయ్యడం ఇంకొక తల్లి తెలుగులో స్వర్ణ తమిళంలో సెల్వి (ఈశ్వరీ రావు) నిన్ను కాచుకుంటూ దొరికితే ఆమె నీడలో హయిగా వుండటం వరకూ తెలుసు. పైగా జరీనా ఇంటికి వస్తే మీ ఇద్దరికీ ప్రైవసీ ఇచ్చి ఉన్న కుటుంబం మొత్తం పక్కగదిలోకి వెళ్ళిపోవాలి. జరీనా కోసం కాఫీలో షుగర్ ఎక్కువ వెయ్యమంటూ తమరి హుకుం తడబాడు. ఏంది సామీ ఈ పెద్దరికం. ఏంది సామీ ఈ పాతచింతకాయ పచ్చడి పచ్చడి.ఈ సీన్లనుంచి ఏం ఆశించారో ఏం ఉపయోగమో ఎవరన్నా మేధావులు చెపితే కానీ అర్ధం అయ్యేలా లేదు. ఇంటి నాయకుడైనా దేశపు నాయకుడైనా తన ఇష్టాలకోసం, తన బలహీనతల కోసం తనవారు అందరినీ వాడుకునే వాడు మాత్రమే అయితే చాలాదు కాచుకునే వాడు కావాలి.  తప్పనిసరి పరిస్థితుల్లో తనవారి క్షేమం కోసం త్యాగానికి సైతం సిద్దపడేవాడు కావాలి. అదేంటి కాలా మరి నిబొమ్మ ఇలా గీసారు. అయినా కాలా ని గీయటం అంటే కేవలం నల్లరంగు వేయడం కాదు తెలుసుకో.
మంటల్లోకి సహజంగా వెళ్ళాల్సిన హడావిడీ రక్షించే వేగం లేకపోగా స్టైల్ గా స్లోగా వెళ్లడం, కోట్ల రూపాయిల స్లమ్ సెట్టింగ్,  ఇలా రాస్తూ పోతే మొత్తం జల్లెడ అయ్యేలా వుంది కాలా నర్మదా బచావో అంటూ బడుగుల కోసం నిలబడ్డ మేధా పాట్కర్ నో అరుంధతీ రాయ్ నో ఒకసారి చదివివుండల్సింది. నీ టేబుల్ మీద అసురుడు పుస్తకం వుండటంతోనే కాషాయపు మరక చెరిపెయ్యలేవు. శత్రువుని గెలవాలంటే వాడితప్పులని వెలివెయ్యాలి. ప్రజల మనసుల్లో అవి తప్పులే అనే విషయం స్పష్టంగా తెలిసేలా చెయ్యాలి. దానికి ప్రతిగా నువ్వు మంచి ఏం చెయ్యగలవో ఎలా చెయ్యగలవో నమ్మకం కలిగించాలి. ఇలా తూతూ మంత్రం వేస్తేనో, ఉడత ఊపితేనో ఓట్ల చింతకాయలు రాలడం మాట అటుంచి. మా సమస్యలంటే నువ్వేసిన రంగువెనక మరింత చిన్నచూపు ఏర్పడే ప్రమాదం కూడా వుంది. ఇంత పెద్ద హీరోతో మరింత పెద్ద కాన్వాసుగా ఈ సమస్యను తీయాలనుకున్నప్పుడు దానికి ఫండ్ కొన్ని పద్దతులో నీ దగ్గరికి చేరినప్పుడు ఎంత భాద్యతగా తీయాలి. టికెట్ కొనుక్కుని సినిమా చూసే ప్రేక్షకుడి మీదనే కాదు. ఆ ప్రేక్షకుడి గుండెలో వున్న ధారావీ కష్టాలపై ఎంత గౌరవం వుండాలి. కాలా, కరికాలా, కాల భైరవా, కాలుడా నిజంగా ఆ సత్తా నీలో వుందా? వుంటేనే రా ఎందుకంటే ఎత్తిపట్టుకోవడానికి జండాకి వుండాల్సింది కేవలం రంగు కాదు. గొంతు విప్పి చెప్పడానికి మాటల్లో వుండల్సింది కేవలం పంచ్ లు కాదు. అచ్చంగా కలిసిపోయే గుణంలో కాలా అంటే ఒక సహనుభూతి ఆ సత్తా నీలో వుందా? రజనీకంటే సినిమా పెద్దది, సినిమా కంటే జీవితం మరీ పెద్దది.
ఇట్లు
ధారావీని అభిమానించే ఒక ప్రేక్షకుడు

కామెంట్‌లు