జెన్-జీ: డిజిటల్ యుగపు అసలైన వారసులు!

 జెన్-జీ: డిజిటల్ యుగపు అసలైన వారసులు!



నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు 'జెన్-జీ' (జెనరేషన్ Z). వీరు కేవలం ఒక తరం మాత్రమే కాదు, సాంకేతికతను ఒడిసిపట్టుకుని, పాత సామాజిక కట్టుబాట్లను ప్రశ్నిస్తున్న ఒక సరికొత్త విప్లవం. 1997 నుండి 2012 మధ్య జన్మించిన ఈ తరం వారు ప్రపంచాన్ని చూసే కోణమే వేరు. ఇటీవల ఒక బహిరంగ సభలో ప్రముఖ నటుడు, నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని "మీకు జెన్-జీ పదాలు తెలుసా?" అని అడిగినప్పుడు, ఆయన నవ్వుతూ ఆ తరం వేగాన్ని గురించి ప్రస్తావించడం మనం చూశాం. అలాగే నటుడు మహేష్ బాబు, ఆయన కుమార్తె సితార మధ్య జరిగే సంభాషణలు గమనిస్తే, ఈ తరం ఎంత చైతన్యవంతంగా ఉందో అర్థమవుతుంది. సితార వంటి నేటి తరం పిల్లలు వాడే భాష, చేసే పనులు చూస్తుంటే పాత తరాలకు అది ఒక వింత లోకంలా అనిపించడం సహజం.  వీరు కేవలం మారుతున్న కాలానికి సాక్షులు కాదు, మారుతున్న కాలానికి చోదక శక్తులు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది జనాభాతో, 2025 నాటికి ప్రపంచ శ్రామిక శక్తిలో 27% వాటాను ఆక్రమించబోతున్న ఈ తరంపై జరుగుతున్న పరిశోధనలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. 


డిజిటల్ యుగపు వారసులు: పేరు వెనుక కథ


సాధారణంగా సామాజిక శాస్త్రవేత్తలు తరాలను వర్గీకరించే క్రమంలో అక్షర మాలను వాడుతుంటారు. 1965-1980 మధ్య పుట్టిన వారిని 'జెన్-ఎక్స్' అని, ఆ తర్వాత వచ్చిన మిలీనియల్స్‌ను 'జెన్-వై' అని పిలిచారు. ఆ క్రమంలోనే సహజంగానే వీరిని 'జెన్-జీ' అని పిలవడం మొదలైంది. వీరిని 'డిజిటల్ నేటివ్స్' ‘ ఐ జెన్ “అని కూడా అంటారు. ఎందుకంటే 2007లో స్మార్ట్‌ఫోన్ విప్లవం మొదలైనప్పుడు ఈ తరంలో మెజారిటీ ప్రజలు తమ బాల్యంలో ఉన్నారు. అంటే, ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని వీరు ఎప్పుడూ చూడలేదు.


 ```ప్రశ్నించే తత్వం - సామాజిక స్పృహ``` 


జెన్-జీ యువతలో కనిపించే ప్రధాన లక్షణం నిష్కర్షత. వీరు సామాజిక సమస్యలపై చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. పర్యావరణ మార్పులు, లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం వంటి అంశాల గురించి వీరు బాహాటంగా చర్చిస్తారు. వీరు సమాచారాన్ని సేకరించడంలో అత్యంత వేగంగా ఉంటారు. ఒక సర్వే ప్రకారం, జెన్-జీ యువత సగటున రోజుకు 8 నుండి 10 గంటలు ఆన్‌లైన్‌లో గడుపుతారు.


 ```ఆర్థిక ప్రాధాన్యతలు: కలల కంటే వాస్తవానికే పీట``` 


2008 నాటి ఆర్థిక మాంద్యం సమయంలో తమ తల్లిదండ్రులు పడ్డ కష్టాలను వీరు కళ్లారా చూశారు. అందుకే వీరు మిలీనియల్స్ లాగా కేవలం కలల వెనుక పరుగులు తీయకుండా, ఆర్థిక స్థిరత్వం కోసం చిన్న వయస్సు నుండే స్వయం ఉపాధి లేదా ఫ్రీలాన్సింగ్ వంటి 'సైడ్ హసిల్స్' వైపు మొగ్గు చూపుతున్నారు. వీరు అత్యంత పొదుపుగా మరియు ప్రయోగాత్మకంగా ఆలోచించే తరం.


 ```భాషా విప్లవం: కొత్త తరం పదకోశం``` 


 *భాషకు కొత్త అర్థాలను అద్దే అక్షర యోధులు.. మౌనంలోనూ డిజిటల్ శబ్దాన్ని సృష్టించే మాయాజాలం వీరు.* 


జెన్-జీ వాడే భాష వింటే పాత తరాలకు అది మరో గ్రహం భాషలా అనిపించవచ్చు. వీరి పదజాలం ఎక్కువగా ఇంటర్నెట్ సంస్కృతి నుండి పుట్టింది. ఉదాహరణకు 'రిజ్' (Rizz) అంటే ఎవరినైనా ఆకర్షించే శక్తి అని, 'నో క్యాప్' (No Cap) అంటే అబద్ధం చెప్పడం లేదని అర్థం. ఎవరైనా తమ గొప్పతనాన్ని ప్రదర్శిస్తే 'ఫ్లెక్స్' (Flex) అంటారు. ఏదైనా రహస్య సమాచారం లేదా గాసిప్ గురించి అడిగేటప్పుడు 'టీ' (Tea) అనే పదాన్ని వాడుతుంటారు. ఒక వ్యక్తి రూపంలో వచ్చిన గొప్ప మార్పును 'క్లో అవుట్' (Glow up) అని, ఎవరికైనా సమాచారం ఇవ్వకుండా దూరం కావడాన్ని 'ఘోస్టింగ్' (Ghosting) అని పిలుస్తారు. అలాగే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే వ్యక్తిని 'గోట్' (గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం ) అని సంబోధిస్తారు.


 ```టెక్నాలజీ మాయాజాలం - మానసిక సవాళ్లు``` 


వీరి నాణేనికి మరో పార్శ్వం కూడా ఉంది. నిరంతరం సోషల్ మీడియాలో గడపడం వల్ల వీరు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఇతర తరాలతో పోలిస్తే జెన్-జీలో డిప్రెషన్ మరియు యాంగ్జైటీ రేట్లు 30% ఎక్కువ ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. నిరంతరం స్క్రోల్ చేయడం వల్ల వీరి ఏకాగ్రత కేవలం 8 సెకన్లకే పరిమితమవుతోందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. సుదీర్ఘమైన పుస్తకాలు చదవడం కంటే తక్కువ నిడివి గల 'రీల్స్' చూడటానికే వీరు ప్రాధాన్యత ఇస్తున్నారు.


 ```రేపటి ప్రపంచం: జెన్-జీ దిశానిర్దేశం``` 


 *అరచేతిలో అనంత విశ్వాన్ని బంధించి, వేలిముద్రలతో ప్రపంచ గమనాన్ని మార్చే ఆధునిక శిల్పులు వీరు.* 


జెన్-జీ అనేది కేవలం ఒక వయస్సు సమూహం కాదు, అది ఒక మారుతున్న కాలానికి ప్రతిరూపం. వారి పదజాలం వింతగా ఉన్నా, వారి ఆలోచనలు పాతబడిన సమాజానికి కొత్త వెలుగును ఇస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏ.ఐ) మరియు వెబ్ 3.0 యుగంలో ప్రపంచాన్ని నడిపించేది వీరే. వారిని విమర్శించేకంటే, వారి వేగాన్ని అర్థం చేసుకుని వారితో కలిసి ప్రయాణించడమే నేటి ప్రపంచానికి అవసరం.


 కట్టా శ్రీనివాసరావు

కవి రచయిత ఖమ్మం

కామెంట్‌లు