హాల్లో టీవీ నిర్విరామంగా అరుస్తోంది. వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం, కోతుల గుంపు దాడితో వృద్ధులకు తీవ్ర గాయాలు కావడం లాంటి వార్తలు తెరపై వరుసగా స్క్రోల్ అవుతున్నాయి. నగరాల్లో మనుషుల రక్షణ కోసం, ఈ మూగజీవుల నివారణ కోసం స్థానిక సంస్థలు తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి యాంకర్ గొంతు చించుకుంటుంటే, పక్కనే కూర్చున్న ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అంతే గట్టిగా సమాధానమిస్తోంది. జీవించే హక్కు అన్నిటికీ ఉంటుందని, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాటికి ఆహారం పెట్టడం తమ మానవతా హక్కని, మనుషులే వాటితో సహజీవనం చేయడం నేర్చుకోవాలని ఆమె వాదిస్తున్న తీరు విచిత్రంగా ఉంది.
ఆ హడావిడినంతా చూస్తూ తన గదిలో అంతకంటే వంద రెట్లు హైరానా పడిపోతున్నాడు భూంభద్దల్ బ్రహ్మాండం. టేబుల్ నిండా రంగురంగుల స్కెచ్ పెన్నులు, పెద్ద పెద్ద కాగితాలు పరుచుకుని, ఏదో అంతర్జాతీయ స్థాయి వ్యూహరచనలో మునిగిపోయినట్టుగా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అప్పుడే లోపలికి వచ్చిన అతని ప్రాణమిత్రుడు ప్రసాద్ ఆ గందరగోళాన్ని, బ్రహ్మాండం ముఖంలో ఉన్న ఆవేశాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
"ఏమిటి బ్రెమ్మి! ఈ రేంజ్ లో కాగితాలతో కుస్తీ పడుతున్నావ్? ఏమైనా బ్రహ్మాండమైన ప్రపంచోద్ధరణ ప్లానా?" అని నవ్వుతూ అడిగాడు ప్రసాద్.
బ్రహ్మాండం గంభీరంగా ముఖం పెట్టి, "పరిహాసం కాదు ప్రసాదూ, ఇదొక సామాజిక విప్లవం! టీవీలో ఆ చర్చ చూశావుగా? జీవకారుణ్యం పేరుతో కొందరు చేస్తున్న అతి చూస్తుంటే నాలో ఉన్న కారుణ్య రసం పొంగిపొర్లింది. సమాజంలో మూగజీవుల పట్ల జరుగుతున్న వివక్షను ఎండగట్టడానికి నేను కూడా ఒక ప్రత్యేకమైన సంఘాన్ని స్థాపించాను. అందరూ నిర్లక్ష్యం చేసిన మరొక అతి అమాయక జీవిని రక్షించడానికి నేను నడుం బిగించాను" అన్నాడు.
ప్రసాద్ ఆసక్తిగా, "ఇంతకీ ఏంటా జీవి? ఏం సంఘం అది?" అనడిగాడు.
బ్రహ్మాండం ఎంతో గర్వంగా తాను తయారుచేసిన ఒక పెద్ద బ్యాнер ను విప్పి చూపించాడు. దానిపై 'దోష' (D.O.S.H.A) అని రాసి ఉంది. కింద ఇంగ్లీషులో 'Mosquitoes' Health Aspirations Surveillance Helping Association' అని అందంగా అలంకరించి ఉంది.
అది చూసి ప్రసాద్ నోరెళ్లబెట్టాడు. "దోమలా? నీకు పిచ్చెక్కిందా బ్రెమ్మి?" అని అడిగాడు.
బ్రహ్మాండం ఆవేశంగా, "ఎందుకు కాదు ప్రసాద్? రాత్రిపూట మన చెవుల్లో ఎంత మధురంగా సంగీతం పాడుతాయి! రక్తం తాగడం వాటి నైజం. పులి జింకను వేటాడితే ప్రకృతి నియమం అన్నప్పుడు, దోమ మనిషిని కుడితే నేరమా? వాటి ఆరోగ్యాన్ని, ఆకాంక్షలను కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? ఇకపై మన సంస్థ ఆధ్వర్యంలో దోమలను చంపే ఫాగింగ్ మిషన్లను అడ్డుకుంటాం, దోమల నివారణ మందులను నిషేధించాలని కోర్టుకెళ్తాం. వీలైతే రోడ్ల పక్కన వీధి కుక్కలకు పెట్టినట్టే, దోమలకు కూడా ప్రత్యేక బ్లడ్ ఫీడింగ్ జోన్లు పెడదాం! ఎలా ఉంది నా ఐడియా?" అన్నాడు.
ప్రసాద్ కాసేపు తల పట్టుకున్నాడు. బ్రహ్మాండం వైపు జాలిగా చూస్తూ మెల్లగా కుర్చీలో సర్దుకు కూర్చుని విడమర్చి చెప్పడం మొదలుపెట్టాడు.
"నీ హంగామా, ప్రచారం అంతా బాగానే ఉంది కానీ బ్రెమ్మి, అసలైన ప్రకృతి సూత్రాలనే నువ్వు మర్చిపోతున్నావురా! నువ్వు చెప్తున్న ఈ అతి జీవకారుణ్యం వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక ఉన్న అసలు సమస్యను ఆలోచించు. ప్రకృతిలో ప్రతి జీవి మనుగడకూ ఒక సమతుల్యం ఉండాలి. ఏ జీవిని విచ్చలవిడిగా పెరగనిచ్చినా అది మొత్తం జీవరాశి మనుగడకే ప్రమాదకరంగా మారుతుంది. నిజానికి తోటలో అందమైన పూల మొక్కల మధ్య విచ్చలవిడిగా పెరిగే కలుపు మొక్కలను చూడు, అవి కూడా చివరికి స్థలం చాలక, పోషకాలు అందక సంతోషంగా ఉండలేవు. మన దేశంలో వీధి కుక్కల, కోతుల దాడుల వల్ల రోజురోజుకూ గాయాల పాలు కావడం, మరణాలు సంభవించడం మరీ ఎక్కువైంది. అందుకే అమెరికా, సింగపూర్, యూరప్ లాంటి దేశాల్లో వీధి కుక్కల కట్టడికి ఎంతో కఠినమైన చట్టాలు తెచ్చారు, ఎక్కడ పడితే అక్కడ వాటికి ఫీడింగ్ ఇవ్వడం నేరంగా మార్చారు. మానవ రక్షణే పరమావధిగా భావించారు కాబట్టే అక్కడ పరిస్థితి అదుపులో ఉంది. కానీ మన దగ్గర మాత్రం కొందరు జీవకారుణ్యం పేరుతో వీధుల్లోనే వాటిని పెంచేస్తూ సమాజ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు."
అంతేకాకుండా, ప్రసాద్ నవ్వుతూ మిత్రుడి భుజం తట్టి, "ఇక నీ సంస్థ విషయానికి వస్తే... నువ్వు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యావురా! అక్కడ నువ్వు ఇంగ్లీషులో 'మస్కిటో' అని రాశావు కదా... మరి మస్కిటో అని రాస్తే ఆ సంస్థ పేరు 'మోష' అవ్వాలి కానీ 'దోష' ఎందుకు అవుతుంది? అయినా... రోడ్ల మీద తిరిగే జీవుల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా, జీవకారుణ్యం పేరుతో సమాజ సమతుల్యాన్ని దెబ్బతీసే వాళ్ళ ఆలోచనల్లో ఎంత లోపం ఉందో, దోమలను కాపాడాలనే నీ ఈ వెర్రి ఆలోచనలోనూ అంతే పొరపాటు ఉంది. అసలు నీ ఈ ఆలోచనలోనే 'దోషం' ఉంది చూడు!" అన్నాడు.
బ్రహ్మాండం చేతిలోని స్కెచ్ పెన్ను కిందపడిపోయింది. సమాజంలోని అసలైన 'దోషం' ఏమిటో మిత్రుడి మాటల్లోని లాజిక్ ద్వారా అర్థమవడంతో అతను నోరు వెళ్లబెట్టి నిశ్శబ్దంగా ఉండిపోయాడు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి