గౌహతిముచ్చట్లు01
కామరూప
రాజ్యాన్ని కొంచెం పైపైన పరిచయం చేసుకుందామా?
నేను అస్సాం లోని
గౌహతి సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ( CCRT) లో నూతన జాతియ
విద్యావిధానం 2020 అనుసంధాన శిక్షణ నిమిత్తం తెలంగాణ నుంచి వచ్చిన ప్రతినిధులలో
ఒకనిగా వచ్చాను. ఈరోజు అంటే 22-07-2026 నుంచి 11-07-2026 వరకూ శిక్షణ
కొనసాగుతుంది. సామాజిక మాధ్యమాల విషయంలో
ఉపవాస దీక్షను స్వల్పంగా విరమించి నేను తయారుచేసుకునే నోట్సులో భాగంగా మీతో కూడా
కొన్ని విషయాలు పంచుకుంటూ వుండాలని ఈ సిరీస్ ప్రారంభిస్తున్నాను. దీనివల్ల నేను
చూసిన సంగతులు మీతో పంచుకోవడమే కాకుండా మీరు సూచించిన అంశాలను అర్ధంచేసుకోవడానికి
కూడా అవకాశం వుంటుందనేది స్వార్ధం.
గౌహతి గోపీనాథ్
బోర్దొలోయి విమానాశ్రయం టి2 లో 21-07-2026నే ఉదయం దిగాము. మొదటి విమాన ప్రయాణం ఉద్వేగంగానే
అనిపించింది. తలపై వున్న ఆకాశాన్ని దాటుకుని మేఘాలను ఈదుకుంటూ, రెండు ఆకాశాల నడుమ
అన్నట్లు ఎగురుకుంటూ వెళుతున్నాం అన్న ఫీలింగ్ బావుంది. పైగా రెండువేల పై చిలుకు
దూరాన్ని రెండు గంటల్లో చేరుకోవడం గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగం నిమ్మళంగా
కూర్చున్నట్లు అనిపించడం తలచుకున్నాక ఆశ్చర్యం వేసింది.
మా
శిక్షణా కేంద్రం శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రం అక్కడికి చేరుకోవడానికి టాక్సీ
మాట్లాడుకుంటే 30 కి.మీ పైగానే దూరం వుంది. అందుకేనేమో ఈశాన్య రాష్ట్రాల
ముఖద్వారం, కామాఖ్య అమ్మవారి నిలయం అయిన గౌహతి అస్సాం రాజధాని దిస్సూర్ ని కూడా
కలుపుకున్నట్లు. ఇదే అతిపెద్ద నగరం అయ్యింది. రోడ్డు మార్గం వుంది రైలు మార్గం కూడా
వుంది వీటితో పాటు గువహాటి లోని పండూ రేవు వద్ద అంతర్దేశీయ జలరవాణా జరుగుతుంది. గోదావరి
నుంచి బ్రహ్మపుత్ర వరకూ వచ్చిన నాకు నీలాచల కొండలు చుట్టూతా నిండుగా
కనిపిస్తున్నాయి. చిరపుంజీ కన్నతల్లి అస్సాంలో వర్షాకాలం ఎలావుంటుంది మణిరత్నం
ఉరికే చిలక పాటలా తడిపేస్తోంది. అయితే చిత్రం ఏమిటంటే నిరంతర జల్లుల లోనూ ఉక్కపోత
నిండా చెమటలు పట్టిస్తోంది. తేమతో కూడిన ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితి జూలై, అగష్టు నెలల్లో ప్రతిఏటా ఇలానే వుంటుందట.
ప్రాచీన కాలంలో
గువహాటిని "ప్రాగ్జ్యోతిషపురం" (Pragjyotishpura) అని
పిలిచేవారు. దీని అర్థం "తూర్పుదిక్కున వున్న నగరం" (City of
Eastern Astrology). కామరూప రాజ్యానికి ఇది రాజధానిగా ఉండేది.
బ్రహ్మపుత్రా నదికి ఉత్తరాన ఉన్న ఉత్తర గువహాటికి దుర్జయ అనే పేరు ఉండేది.
ప్రాగ్జ్యోతిషపురం, దుర్జయ - ఈ రెండూ ప్రాచీన కామరూప
దేశానికి రాజధానులుగా ఉండేవి. గువహాటి అనే పేరు అస్సామీ భాషా పదమైన గువా నుండి
వచ్చింది. గువా అంటే పోక చెట్టు. హాటి
అంటే వరుస అని అర్థం. పోకచెట్ల వరుస మన కోనసీమలో కొబ్బరి చెట్లు కనిపించినట్లు
లాండింగ్ లో ఈ చెట్లు కనిపిస్తుంటాయి. వీటిని నమలడం కొన్నాళ్ల తర్వాత వ్యసనంగా
మారుతుంది అనుకుంటా, ఇప్పుడు ఎక్కడ చూసినా వక్కలు కాదు కానీ రకరకాల నములుడు
పదార్ధాలను నెమరవేస్తూ కనిపిస్తున్నారు. వండేటప్పుడు వడ్డించేటస్సుడు కూడా జనం
నోళ్ళలో ఈ జర్డాలాంటివి చూడటం మాత్రం ఇబ్బందిగానే అనిపించింది. కొన్ని ఉత్పత్తులు
మొదట ఉచితంగా అంటకట్టిమరీ కొన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు విస్తరించి ఆరోగ్యాలను,
ఆహ్లాదాన్ని కాలరాస్తున్నాయి. చత్తీస్ ఘడ్ దసరా ఉత్సవాలు వంటి సందర్భాల్లో ఇలాంటి
పదార్ధాలు ఉచితంగా పంచే పద్దతులను గమనించినప్పుడు ఇటువంటి పరిస్థితే ఏర్పడుతుందేమో
అనే భయం వేసింది. ఒకరోజుకి కొన్ని అమ్మక పోతే ప్రభుత్వాలు నడపటం కష్టం కదా అని
ప్రతినిధులే అనేంత బలంగా ఇవి గొంతులకు ముడివేసుకుంటాయి కావచ్చు.
ఈ నగరం
ప్రాచీనత గురించి చెప్పాలంటే గౌహతి (గువహతి) నగరంలో లభించిన 'అంబారి తవ్వకాలు' గురించి
మాట్లాడుకోవాలి. 1960వ దశకంలో బయటపడిన ఈ పురావస్తు ప్రదేశం అంబారి తవ్వకాల్లో ఈ ప్రాంతం 2వ శతాబ్దం BC నుండి 6వ శతాబ్దం
AD వరకు మానవ నివాసంగా ఉన్నట్లు ఆధారాలు లభించాయి.
దీని ద్వారా అస్సాం
చరిత్ర ఇంకా చెప్పాలంటే ఈశాన్య భారతదేశ ప్రాచీన చరిత్ర లోతులు తెలిసివచ్చాయి, నీలాచల పర్వతాలు,
బ్రహ్మపుత్ర లోయ మానవనాగరికతకు అత్యంత ప్రాచీన ఆనుకూల ఆనవాలుగా తేలింది.
పురాణమే కావచ్చు రామాయణంలోని
కిష్కింధ కాండలో ప్రస్తావించబడిన రాజ్యం పడమటి వైపున వరాహపర్వతం దగ్గర సముద్రంలో
ఉన్నట్లు వర్ణొంచబడింది. మహాభారతం అశ్వమేధ-పర్వంలో అర్జునుడు ప్రగ్జ్యోతిషకు
చెందిన వజ్రదత్తుడిని ఎదుర్కొన్నాడు. మహాభారతంలో కూడా ఈ నగరం నరకాసురుడు, అతని కొడుకు భగదత్తుని
రాజధానిగా ప్రస్తావించబడింది.
చైనా
యాత్రికుడు హుయాన్ త్సాంగ్ తన రచనలో కామరూప సామ్రాజ్యం గురించి పేర్కొంటూ 7వ
శతాబ్దంలో భాస్కరవర్మనుని పరిపాలన కాలంలో నగరం చుట్టూ 15 కిలోమీటర్ల మేర
విస్తరించి వున్నట్లు పేర్కొన్నాడు.
అహోం సామ్రాజ్యం & మొఘల్ దండయాత్రలు: అహోం రాజ్యంలో ఇదొక ముఖ్యమైన సైనిక
స్థావరంగా ఉండేది. 1671లో
మొఘలులతో జరిగిన ప్రసిద్ధ "సరైఘాట్ యుద్ధం"
(Battle of Saraighat) గువహాటి సమీపంలోనే బ్రహ్మపుత్రా నది ఒడ్డున
జరిగింది. ఇందులో అహోం సైన్యాధికారి లచిత్ బోర్ఫుకాన్ మొఘల్ సైన్యాన్ని ఓడించారు.
అస్సాంలో బ్రిటిష్
పాలన యాందబో సంధి తర్వాత ప్రారంభమైంది. ఈ సంధి ప్రకారం బర్మా అహోం రాజ్యంపై తన
నియంత్రణను వదులుకుంది, బ్రిటిష్
వారు దానిని తమ రక్షణ ప్రాంతంగా (ప్రొటెక్టరేట్) మార్చుకున్నారు. 1833లో బ్రిటిష్ వారి విలీనంతో ఈ రాజ్యం ముగిసింది. ఈ ప్రాంతంలోని ఇతర విలీన
ప్రాంతాలు ఒక అస్సాం ప్రావిన్స్‌గా ఏకీకృతం చేయబడి, 1947లో
భారత స్వాతంత్ర్యం వచ్చే వరకు బ్రిటిష్ గవర్నర్ ద్వారా పాలించబడ్డాయి.
ప్రాచీనతకు ఆనవాళ్ళు
లాగా అస్సాంలో విభిన్న సంస్కృతులు, భాషలతో కూడిన అనేక ఆదివాసీ (గిరిజన) తెగలు ఇప్పటికీ ఉన్నాయి.
మనం వార్తలలోబాగా వినే బోడో (Bodo) అనేది అస్సాంలోని అతిపెద్ద గిరిజన సమూహం. వీరు బోడోలాండ్ ప్రాంతంలో ఎక్కువగా
నివసిస్తారు. మిషింగ్ / మిరి (Mishing/Miri) అనే
తెగ బ్రహ్మపుత్ర నది లోయ పరిసర ప్రాంతాలలో నివసించే
ప్రధాన ఆదివాసీ వర్గం. కర్బీ (Karbi) అనేది అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో నివసించే ప్రముఖ గిరిజనులు. ఇక రాభా (Rabha) అనేది ప్రత్యేకమైన సంస్కృతి, నృత్యాలు కలిగిన ఆదివాసీ తెగ. డిమాసా (Dimasa) తెగ విషయానికి వస్తే దిమా హసావో, కచార్ జిల్లాలలో కేంద్రీకృతమై ఉన్న పురాతన తెగ. డియోరి (Deori) విషయానికి వస్తే అస్సాం, అరుణాచల్
ప్రదేశ్ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రత్యేకమైన పూజా విధానాలు గల తెగ. టీపంటలు
సిరులు కురిపించే అస్సాలో టీ ట్రైబ్స్ (Tea Tribes) అనే గిరిజన తెగ కూడా వుంది. బ్రిటిష్ కాలంలో కార్మికులుగా వలస వచ్చి,
అస్సాంలోని తేయాకు తోటలలో స్థిరపడిన ముండా, సంతాల్,
ఒరావ్, గోండ్ మొదలైన ఆదివాసీల సమూహం వీళ్ళు.
అలాగని వెనకపడిన
ప్రాంతం అనుకోవడానిక లేదు. గువహాటి ఈశాన్య భారతానికి విద్యాకేంద్రం.ఇక్కడున్న
విద్యాసంస్థలకు తలమానికమైనది ఐఐటి గువహాటి. కాటన్ యూనివర్సిటీ (గతంలో కాటన్
కాలేజీ) వందేళ్ళ పైబడిన సంస్థ. నగరంలో ఉన్న ఇతర ప్రధాన విద్యా సంస్థలు: గౌహతి
యూనివర్సిటీ, అస్సాం
సైన్స్ అండ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, గౌహతి కామర్స్ కాలేజీ,
ఐఐఐటి, దిస్పూర్ కాలేజీ, బి బారువా కాలేజీ, ఎన్ ఇ ఎఫ్ లా కాలేజీ, నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జుడిషియల్ అకాడమీ, లక్ష్మీబాయి
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొదలైనవి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్,
డాన్ బాస్కో, సంస్కృతి ది గురుకుల్, కేంద్రీయ విద్యాలయ మాలిగావ్ వంటి పాఠశాలలు ఉన్నాయి.
సంపాదనలోనూ వెనకబడి
లేదు తెలుసా. పెట్రోలియం ఉత్పత్తుల తయారీ గువహాటిలోని ప్రధాన ఆర్థిక
కార్యకలాపాల్లో ఒకటి. గువహాటి రిఫైనరీను ఇండియన్ ఆయుల్ కార్పొరేషన్ 1962 లో స్థాపించింది.
దీని ప్రస్తుత సామర్థ్యం, సంవత్సరానికి 10 లక్షల టన్నులు. నగరంలో ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంటు కూడా ఉంది.
టీ తయారీ, టీ వేలం గూవహాటి లోని
మరో ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపం. అస్సాం భారతదేశం లోని అతి పెద్ద టీ పెంపక
కేంద్రం. భారత టీ ఎగుమతుల్లో 80%, భారతదేశ మొత్తం టీ
ఉత్పత్తిలో 55% అస్సాం లోనే జరుగుతుంది. ఇది రాష్ట్రం లోని
అతి పెద్ద పరిశ్రమ. గువహాటిలో ఉన్న సిటిసి టీ వేలం కేంద్రం ప్రపంచంలోనే పెద్దది.
మొత్తం వేలం పరిమాణంలో రెండవ స్థానంలో ఉంది.
అస్సాం రాష్ట్రం సంస్కృతికి, జానపద కళలకు పుట్టినిల్లు. ఇక్కడి
గిరిజన సాంప్రదాయాలు, పండుగలు నృత్య రూపాల ద్వారా అత్యంత
వైభవంగా వ్యక్తపరచుతారు. 15వ శతాబ్ధపు శ్రీమంత శంకరదేవుడు ప్రవేశపెట్టిన సత్త్రియా నృత్యం (Sattriya Dance) భారతదేశంలోని ఎనిమిది శాస్త్రీయ నృత్యాలలో (Classical Dances) ఒకటి. ఇది ప్రధానంగా
భక్తి తత్త్వాన్ని, శ్రీకృష్ణుని లీలలను ప్రతిబింబిస్తుంది.
అస్సాం జాతీయ పండుగ అయిన బోహాగ్ బిహు సందర్భంగా చేసే బిహు నృత్యం ఇక్కడి ప్రసిద్ధ
జానపద నాట్యం. డోల్, పెపా వంటి సాంప్రదాయ వాద్యాలు దీనిలో ఉపయోగిస్తారు. 'బోడో' (Bodo) గిరిజన ప్రజలు ప్రదర్శించే బగురుంబ నృత్యం (Bagurumba Dance) సీతాకోకచిలుకల కదలికలను పోలి ఉంటుంది. ఈ నృత్యం వీళ్ళ ప్రకృతి ఆరాధనకు,
సౌందర్యాత్మక దృష్టికి ప్రతీకగా అనిపిస్తుంది.): అస్సాంలోని తేయాకు తోటలలో పనిచేసే
కార్మికులు (Tea Garden Workers) తమ
శ్రమను మరచిపోవడానికి, సంతోషాన్ని పంచుకోవడానికి ప్రదర్శించే
సాంప్రదాయ నృత్యం పేరు ఝూమూర్ నృత్యం (Jhumur Dance. అలాగే
·
పురాణ గాథలను పాటలు, అభినయం ద్వారా
వివరించే ప్రాచీన కళారూపం 'ఓజపాలి'. అలాగే
అస్సామీ సంస్కృతిలో 'అంకియా నాట్' వంటి
వీధి నాటకాలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి.ఇలా విభిన్న కళా రూపాలతో అలరారుతున్న
అస్సామీ సంస్కృతి, ఆ రాష్ట్ర ప్రజల ఐక్యతకు మరియు చారిత్రక
వారసత్వానికి తలమానికంగా నిలుస్తోంది. వీలున్నప్పుడు ఈ నాట్యాల సందర్భంగా వేసుకునే
దుస్తులు, వాయిద్యాలు వంటి వాటి వివరాలు కూడా పోస్టు చేస్తాను.
అస్సామీ చేనేత గమోసా, ముగా పట్టుతో
పాటు ఎరి, పట్ రకం పట్టు వస్త్రాల గురించి, ముఖ్యంగా వెదురు ఉత్పత్తులు కళాకృతులు,
సత్త్రియ నాటకాల కోసం వెదురుబుట్టలు, మట్టితో చేసే మాస్క్ తయారీ కళ, ఆశ్రిక్ కండీ
వంటి ప్రాంతాలలో చేసే టెర్రకోట మట్టి బొమ్మలు, బెల్ మెటల్ తో చేసే కళాకృతులు
వంటివాటి గురించి కూడా మనం కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. పంటలు, ఆహారం అలవాట్లు,
ప్రముఖులు ప్రాంతాలు వీలువెంబడి చూద్దాం. వెయ్యిపదాల వ్యాసం ఓపికగా చదివిన వారు
ఎవరన్నా వుంటే వారికి నా స్నేహపూర్వక ధన్యవాదాలు. మీ స్పందన మరికొంచెం రాసేలా
చేస్తుంది. కట్టా శ్రీనివాస్,

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి