ఆడదానివే కావచ్చు
ఐనా నీవెంత తీవ్రవాదివి
మానవత్వపు ఆటం బాంబుల్ని
ప్రపంచంలో ప్రత్యేకంగా ఎన్నకుని మరీ
భారత గడ్డపై పెటిల్మని పేల్చావు
అడుగు పెడితే చాలు
హఠాత్తుగా పేలేలా
అడుగడుగునా మందుపాతరల్ని
జాలి రూపంలో
గుండెలంచులేమ్మడి కూర్చి పోయావు.
పాషాణ హ్రుదయాల
సన్నని లోతు పగుళ్ళలో దయాబీజాలు
ఎంత నిశ్శబ్దంగా నాటేవు.
నీ వాత్సల్యపు వేడికి జనించిన
కరుణా మేఘాలు యింకా
అప్పుడప్పుడు వర్షిస్తూనే వున్నాయి.
మా కను కొలకుల్లోంచి
ఈ ఒక్కోచుక్కా చాలు
వేయి గునపాల శక్తని
ఓ బుల్లి విత్తనానికి యిచ్చేందుకు.
ఈ విద్వంసం నీతోనే ఆగకుండా
మరి కొంత సైన్యం తయారవ్వాలని
తపిస్తావా ?
ఎంత ధైర్యం ?
కరెన్సీ మహారాజుని నడి నెత్తిపై మోస్తున్న వాళ్ళం
వ్యాపార పునాదులపై సౌదాలు నిర్మించుకున్న వాళ్ళం
స్వార్థపు పరదాల నీడలో సుఖిస్తున్న వాళ్ళం
స్వామి ద్రోహం చేస్తామని కలలు కంటున్నావేమో
ఔరా ఎన్ని తూటాలు పేల్చవు
గురి చూసిమరీ మా గుండెలోతుల్లోకి
నీ మాటల రూపంలో...
‘‘ ప్రార్దంచే పెదవులకన్నా
సాయం చేసే చేతులు మిన్నంటావా’’
సంపాదించే జేబుల గురించి తప్ప
మాకేం చేవుల కెక్కదు సుమా!
కాదుగాని...
నీలాంటి వాళ్ళకిక్కడ
అసలే మాత్రం తగదు
నీవిక్కడుండటం ఈ మాత్రపు మనుగడకే ప్రమాదం
నీకు, నీ లాంటి వాళ్ళకూ మరో ప్రవేశముంది
అక్కడికే వెళ్ళిపో.
కుదిరితే వాళ్ళలోనే ఉండిపో
దాన్ని స్వర్గమని
నీలాంటి వాళ్ళనే దేవతలనే పేరుతో
తిడతారని
ఎక్కడో విన్నా
మరిచి పోకు
చివరగా
మరో మాట
పొరపాట్న మళ్ళి పుట్టేవు సుమా
మా సువిశాల సుసంపన్న
సామ్రాజ్య సౌధాల్ని
మళ్ళీ కూల్చటం ప్రారంభించేందుకు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి