కవిత్వం కావాలి కవిత్వం


1

ఒక్కక్షణం కంటికి జిగేల్మనేలా

అలంకరించుకుంది తను.

తనకింత శోభనిస్తోంది శబ్దమా,

అలంకారప్రాయమైనది అర్దమా,

ఏదేమైనా కానివ్వండి

తనకెదో అలంకారముండవచ్చుగాక

తనే అలంకారమైతే కాదు.




2

తనోసారి అనుభూతికి పరవశించి గాలిలో తేలియాడింది.

తనలోనే మరోసారి ఆవేశం ప్రవహించి పిడికిలై ఉప్పోంగింది.

అయినా తనే అనుభూతో, ఆవేశమో

కానే కాదు.

కాదు కాదు.




3

తనతో కలిసి తనగుండా పదాలూ, వాక్యాలూ

నిరంతరంగా పరుగులిడుతూనే వున్నాయి.

ప్రవహింపజేసుకునే తను మాత్రం

కేవలం పదమో, వాక్యమో కాదంటే కాదు.




4

తనకున్న రూపమే తనుకాదు.

తను చెప్పేసందేశమే తనుకాదు.

నాకోచ్చిన సందేహమూ తనుకాదు.

పేరైతే తెలుసు కవిత్వమని,




5

తన సాంగత్యం ఎలావుంటుందో చవిచూసాను,

నిర్వచనమైతే వుంటుందో లేదో కూడా తెలియదు

నిర్వచించాలనుకునే మూర్ఖత్వమూ నాకు లేదు

కాని నాకు

తను కావాలి తనే కావాలి.
* 06-09-2012

కామెంట్‌లు