మట్టివేళ్ళు On Kinige
యుద్ధాల మధ్య అస్తిత్వవేదనకి సున్నితత్వమూ, గరుకుదనమూ వొక్కలాగానే వుంటాయి. అందులోంచి పుట్టే కవిత్వవాక్యాలు ఎంత సున్నితంగా వుంటాయో, అంత గరుకుగానూ వుంటాయి. అనుభవం కన్నా పెద్ద యుద్ధరంగం లేదు. వాస్తవంలో రోజూవారీ జీవితం వొక ప్రపంచ యుద్ధమే. ప్రతీ వ్యక్తి ప్రపంచంతో తనదయిన యుద్ధం చెయ్యాల్సిందే. శ్రీనివాస్ ఈ సంపుటిలో చూపిస్తున్నవి నిజంగా కొన్ని Snapshots. అందులోంచి మనకు మనమే కనిపిస్తాం ఏదో వొక రూపంగా.
వాస్తవికతని ఎలాంటి ముసుగులూ లేకుండా వాస్తవికతగా చూసే దృష్టి శ్రీనివాస్‌కి వుందని ఇందులోని ప్రతి కవితా మనకి చెబ్తుంది. ఇప్పుడు తెలుగు సాహిత్యం, ప్రధానంగా కవిత్వం వున్న స్థితిలో ఇది ఆరోగ్యకరమైన విషయం. తెలుగు కవులు ఏదో వొక మూసవాద ఉరవడిలో కొట్టుకుపోతూ వాస్తవికతకి దూరమవుతున్నారు. వాదాల పాక్షికత్వంలోని ఉద్వేగం వాళ్ళ వ్యక్తిత్వాల్ని మింగేస్తోంది. శ్రీనివాస్ అలాంటి ప్రమాదంలో లేడు. తనేమిటో, ఈ కవిత్వం పటం మీద తనెక్కడున్నాడో వొక ఎరుకతో శ్రీనివాస్ రాస్తున్నాడు. అలాగే వాస్తవికతని తొందరపడి బేరీజు వెయ్యాలన్న ఆరాటం అతనికి లేదు. శ్రీనివాస్ వ్యక్తిత్వంలో వొక్ నెమ్మదితనం, వొక ప్రశాంతత వున్నాయి. అవి ఇప్పటి కవిలోకంలో నిజంగా అరుదే!
- అఫ్సర్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి