గుండె చప్పుళ్ళు మట్టివేళ్లు - నియోగి


తన అనుభవాలను, తనవారి అనుభవాలు, విన్నవి, కన్నవి అన్నీ కవికాలపు విషయాలే. నిశ్శబ్దంలోనో, స్థబ్ధతలోనూ మునిగి పోతే కవి కాలేడు. కవి కావడానికి హృదయాంతర లోకాల్లో ఒక అలజడి కావాలి. ఆలోచనా పరిధి విస్తరించాలి. అక్షరాల కూర్పు తెలిసి వుండాలి. అవన్నీ నిండుగా వున్నప్పుడు తాను చెప్పదలచుకున్నదేమిటో అర్థమౌతుంది. అలా కానప్పుడు కవి రాసిన దాంట్లో ఏముందో తెలియక, అర్థం కాక ఆ యెక్క కవిత వ్యర్ధంగా మిగిలి పోతుంది. అయితే కొందరు తమ ఆనందం కోసం ఏవేవో రాసుకుంటారు. అది కేవలం వారికి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల ఎవరూ ఏ రసానందాన్ని పొందలేరు. కానీ ఇక్కడ కట్టా శ్రీనివాస్ అందించిన మట్టివేళ్ళలో కొన్ని కవితలు మనకు సంబంధించినవేననిపిస్తుంది. కొన్ని సమాజపు రుగ్మతల్ని ఎత్తి చూపిస్తాయి. ఇలా ీ కవితా సంపుటి లోని కవితలన్నింటిలోను అనుకున్న దాన్ని ఖచ్చితంగా చెప్పగలిగాడు కట్టా శ్రీనివాస్.

‘‘నేనెలా మారాలి? ’’ అనే కవితలో
సరదాగా సిన్మాకెళదాం అంటావు/ పాడు పర్సుముక్కును పైకిలేపి/ నాలుక కనపడేలా వెవ్వెవ్వె అంటే/ ఉక్రోషంతో/ నీవ్వోండిన కూరలో/ ఉల్లిపాయెందుకు వేసావని/ కొత్తగా కొన్న గాజు కూజా/ పగులగొట్టి పార్కులో కెల్తా / సిగరెట్లతో...
ఇది లేమిలో వున్నపుడు ఏమీ చేయలేక భార్యపై అసహనం ప్రదర్శించడాన్ని చూసిస్తాడు.
ఇందులోనే మరోచోట
తలుపుతీస్తూ కళ్ళతోనన్నా ఈసడిస్తావని నే సిద్దమైతే / తప్పు చేసిన తనంతో/ నేలను చూసే కంట్లో నీళ్ళతో నీవు/ పాత రిజర్వాయరులా భళ్ళున / పగిలే గుండెనుంచి/ నీ కాళ్ళైనా తనివితీరా / కడగాలనుకుంటా...
అంటాడు.
ఇందులో చేసిన తప్పుకు పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఇటువంటివి మధ్యతరగతి కుటుంబాల్లో సహజం. దాన్ని చెప్పడంలో కట్లా శ్రీనివాస్ కి మధ్య తరగతి జీవుల జీవనం సంపూర్ణంగా తెలుసని మనకు తెలుస్తుంది.
అలాగే ‘‘నవ్వే నక్షత్రాలు’’ అనే కవితా ఖండికలో ఋతువులు తప్పిపోయాయి/ కాంక్రీటు అరణ్యంలో/ లోహ విహంగాల పరుగులకు భయపడి / ఎరువుల తిండి వికటించి / నకిలీ వైద్యంతో నలిగి పోయి / దిక్కు తోచక వెబ్ సైట్ల బైట్లకి గురైనట్లున్నాయి. అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఈ కవితా సంపుటిలో 67 కవితలున్నాయి. అవి వేటికవే ప్రత్యేకత కల్గి చదివించే విధంగా వున్నాయి. మొదటి ప్రయత్నంలోనే కట్టా శ్రీనివాస్ ఒక మంచి పుస్తకంతో ముందుకు రావడం అభినందనీయం.

పేజీలు : 105 వెల : 90రూపాయిలు
ప్రతులు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభ్యం.

కామెంట్‌లు