వీరిచే పోస్ట్ చేయబడింది
Katta Srinivas
న
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
------------------------------ -----------------------
శ్రీనివాస్ కవిగానే పరిచయం...
పుస్తకముఖంగా (FB) పరిచయమైన కొంతమంది ప్రత్యేకవ్యక్తుల్లొ కట్టా ఒకరు. డిశంబర్ తొమ్మిదిన మొదటిసారి అతన్ని కల్సినప్పుడు నా అంచనా తప్పుకాలేదన్న తృప్తి మిగిలింది. మనిషితనాన్నీ, మంచితత్వాన్ని ఒంటికి చుట్టుకుని మన:స్ఫూర్తిగా ఆలింగనం చేసినప్పుడు 'ఇతను మన మనిషే' అన్న భావన ఉక్కిరిబిక్కిరి చేసింది. చేతిలో గుప్పెడు "మట్టివేళ్ళు" నాకందించినప్పుడు అవి ఒఠ్ఠివేళ్ళు కంటే ఎక్కువే అని తెల్సినా పూర్తిగా చదివాకే "ఓమాట" చెబుదామని ఆగాను ఇన్నాళ్ళు. చదవటం అయింది. ఇక మీతో పంచుకోవటమే మిగిలింది.
ఏ పుస్తకమైనా వెనకనుంచి చదవటం అలవాటు నాకు. ఇది కూడా మినహాయింపు కాలేదు. 106 వ పేజీలో "కృతజ్ఞతాభివందనాలు" అన్న అతని వ్యాసంలో కట్టా వ్యక్తిత్వం పూర్తిగా అవగతమయ్యాక అతని కవితల్లోకి చొచ్చుకుపోగలనన్న నమ్మకం బలపడింది.
ఇప్పుడు కట్టా శ్రీనివాస్ మనిషిగా కూడా పరిచయం....
వచనకవిత్వాన్ని పూర్తిగా నేలమీదకి దింపి, నేలలోపలినుండి వేళ్ళు తీసి మన 'sense of belongingness' ని మనకంటించాడు శ్రీనివాస్. ఆడంబరాల్లేని పదప్రయోగాలూ, భేషజాల్లేని శీర్షికలూ, అందరికీ తెల్సిన కవితా వస్తువులూ కట్టా శ్రీనివాస్ కవిత్వ లక్షణాలని ఇప్పటికే కొంతమంది తమ సమీక్షల్లో రాసారు. వాళ్ళతో నాకెలాంటి విభేదాలూ లేవు. ఏ 'తనమో' ఏ 'ఇజమో' మరే 'త్వమో' తన కవిత్వానికి అంటకుండా జాగ్రత్తపడ్డాడని అనిపించకమానదు ఈ సంకలనంలోని 67 కవితలు చదివాక. ఒక్క 'మనిషితనాన్ని' మాత్రం వదులుకోడానికి ఇష్టపడలేదు.
కవిత్వం చదవకుండా మనిషి బ్రతకొచ్చు. కవిత్వం చదివితే స్వర్గానికే వెళ్తామని కూడా ఎవరూ ఎక్కడా చెప్పలేదు. అలా కాకుండా కవిత్వం మనిషి జీవితంలో ఎంత మార్పుతీసుకొస్తుందో చెప్పే వాక్యం ఈ సంకలనంలోని మూడో కవిత "మిత్రపొత్తం" లో ఉంది.
"పుస్తకాల అల్మరా తెరిస్తే
ప్రపంచపు కిటికీ తెరిచినట్లె"
Can observer be observed?
Can finder be found? అన్న అనూహ్యమైన విషయపరిశీలనాధారంగా రాసిన "ఛా..బిస్కట్లబ్బాయి" కవితలో బోలెడంత తాత్వికత ఉందనిపిస్తుంది. కవికి ఉండాల్సిన ముఖ్యలక్షణాల్లో 'గమనింపు ' ఒకటన్నది మనకందరికీ తెల్సినదే-- ఆ గమనింపు కి పరాకాష్ట ఈ కవిత. మనందరం అతి సాధరాణంగ వదిలేసె విషయాల్లోంచి కూడా కవితా వస్తువుని తిసుకోవచ్చన్నది ఈ కవిత సందేశం-- అనుకుంటాను.
"నో స్టాంప్స్ ప్లీజ్" అన్న కవిత చిన్నదే కానీ సంక్లిష్టమైనది--
"ఆలొచనల స్టాంపులు
ఆచరణకి నమూనాలు
వాళ్ళే నిర్ణయిస్తారట!" ఇది అర్ధమైతే ఈ ప్రపంచం అర్ధమయినట్లే!
శీర్షికల విషయంలొ ఆసక్తిగా రాసినవాటిల్లో "రేవుకొచ్చిన జీవితాలు" ఒకటని నా అభిప్రాయం.
"పసిగొట్టాలకు నికోటిన్
నల్లరంగు పుసింది"-- పదాలపొందికకి ముచ్చటేస్తుంది. కవి సామాజిక స్పృహకి ముచ్చటేసి ఆనందించేలోపు కవిత చివర్న బ్రాకెట్స్ లో ఉన్న వివరణ చూసి మనకేమాత్రం సంబంధంలేని వాళ్లపై కూడా జాలిపడ్డం మొదలవుతుంది.
మనిషి మారాలా? అసలెందుకు మారాలి? మారకపోతే ఏమవుతుంది? మారితే ఎంతబావుంటుంది ఈ జీవితం అని శ్రీనివాస్ తనలో తానే తీవ్రంగా ఆలొచించాక తన మానసిక సంఘర్షణలోంచి వచ్చిన కవితై ఉంటుంది "నేనెలా మారాలి" అన్నకవిత(18 page 40).
అలాగే "చీకటి చెరలొ" కవిత కూడా ఆలోచింపచేస్తుంది. గాఢత ఉన్న కవిత ఇది. ప్రతీ వాక్యం జాగ్రత్తపడి రాసినట్టుగా అర్దమవుతుంది.
ఈ సంకలనంలొ ప్రత్యేకమైన కవిత 'నెగటివ్ వాయిస్'. నాకు చాలా నచ్చిన కవిత. మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనలోని మన 'అసలు ' మనిషి కన్పడితే ఎలా ఉంటుందోనన్న ఆలొచనే ఈ కవితనుకుంటా. భాషా, భావ తీవ్రత అమోఘమనిపించకమానదు.
"నాలోపల లోలోపలినుండీ
నాకో గొంతు వినిపిస్తూ ఉంటుంది" అని కవిత ప్రారంభమయినా
"పురాదృష్టి జఢమతికిచ్చి,
అపూర్వ సృష్టికి నాందీగీతమవ్వాలి" అని ముగుస్తుంది ఓ పాజిటివ్ నోట్తో.
కొన్ని కవితలు చాలా చిన్నవిగా ఉన్నా హత్తుకున్నాయి. ఉదాహరణగా "ప్రయాస" చెప్పుకోవచ్చు. అవును చెప్పుకోతగ్గ కవిత ఇది. ఏ విశాలంధ్రకో, బుక్ సెంటర్ కొ వెళ్ళినప్పుడు "మట్టివేళ్ళు" కొంటే (ఎలాగూ కొంటారు) మీ ఖర్చుకి ఈ కవితొక్కటీ చాలు.
"తెగిన దారాన్ని/పగిలిన అద్దాన్ని అతికిద్దామని
మాటలమైనం ఎంతపూసినా”
ఇందులో 'మాటలమైనం' ఎంత బావుందనీ......
"ఒక ఫిరమోన్ కన్నీటి నవ్వు" నూటికినూరుపాళ్ళూ శ్రీనివాస్ ని కవిగా నిలబెట్టే కవిత. ఇందులో
"మీ ఊరిమురికి కాల్వ ఒడ్డున /నా వంటశాలను నిర్మించుకున్నదాన్నిగా
మీ మదిగదిలో చోటుకు నోచకున్నా /నాలుక చివరి/చిలిపి చీత్కారాలకు సిధ్ధమై
నగ్నంగా నిలబడినదాన్ని"
ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు అప్రయత్నంగా పక్కనే ఉన్న పెన్సిల్ తో చివరి వాక్యాలని అండర్లైన చేసాను
మనసుతత్వాన్ని, మనిషితత్వాన్నీ ఏకంచేసి రాస్తే అది కట్టా కవిత. పుస్తకం చదవటం పుర్తయ్యాక ఓ మంచి మనిషితో కొంచెంసేపు మనసారా మాట్లాడిన అనుభూతికి నాది గ్యారంటీ.
ఓ కథానికలా సాగిన "సురాశోకం", సన్మానపత్రంలా మలచిన ""అమ్మా!..ఎంతపనిచేశావ్" కవితలు ఈ సంకలనానికి అవసరమనిపించాయి. కట్టా రాసీన కవితల్లో నేను మొట్ట మొదటిసారిగా చదివినది "సై కూత పైమాట" కవిత. ముఖపుస్తకంలొ చదివిన ఆ కవిత గురించి పుస్తకం చేతిలో పడగానే వెదికాను. కనపడగానే మళ్ళీ ఉత్సాహంగా చదువుకున్నాను. "పరుషాలు సరళాలుగా మారితేనే సమయం ప్రశాంతం కదా" అన్న ఈ వాక్యాలు కవిత చివర బ్రాకెట్స్ లో ఉన్న విషయం కూడ నాకు ఫ్రెష్ గా గుర్తుంది..ఈ ఒక్క కవితకోసమేనా ఈ పుస్తకం సొంతం చేసుకోవాల్సిందె.
ఇంకా "మానవుడు", "సంధిప్రేలాపన", "విరాగినవ్వు" లాంటికవితల్లొ ఇంతవరకూ అంతర్ముఖంగా ఉండిపోయిన కవి భళ్ళుమని బద్దలవుతూ తన గోడుని మనతో ఇలా పంచుకుంటున్నాడనే అనుకుంటాం.
కవి మానసిక సంఘర్షణే కొన్ని కవితలకి పునాది. అది కట్టాలో కట్టలుకట్టలుగా ఉందన్నది నిర్వివాదాంశం.
కొన్ని కవితలూ నిరాశకలిగించినా చాలా కవితలు అతన్ని కవిగా నిలబెడతాయి. ఈ సంకలనానికి చాలా మంది "ఉన్నమాట" రాసినా అన్నీ చదవతగ్గవే. అందులో అఫ్సర్ రాసిన .......... మనతోడి తెచ్చుకోవవల్సినదె. పుస్తకం చదివేముందు తప్పకుండా అఫ్సర్ ముందుమాట చదివి మరీ లోపలికెళ్ళండి. శ్రీనివాస్ పూర్తిగా అర్ధమవుతాడు.
అంతా బానే ఉందా ఇంకేమైనా చెప్పదల్చుకున్నారా అంటే కొన్ని లేకపోలేదు……
-------------------------------------------------------------------
సంకలనంలో అన్ని కవితలు అనవసరమేమో అనిపిస్తే అది మీ తప్పుకాదేమో.
మొట్టమొదటి కవితలో
" ఒక్కొక్కటి కాదు కాలభైరవా నిన్ను వందసుడిగుండాలు చుట్టుముడతాయి"
ఈ మధ్య పాప్యులర్ అయిన ఓ సిన్మాలో డైలాగ్ కి అనుకరణ కదా అనిపిస్తుంది. అలాంటివి ఎవాయిడ్ చేసి ఉండొచ్చు.
కొన్ని కవితలు మరీ చిన్నవిగా ఉండి 'ఇదెందుకు రాసినట్టు' అనుకునే ఆస్కారం ఉంది. కొన్ని కవితల్ని హడావుడిగా రాసారా అనిపిస్తుంది. భాష సరళతరం చెయ్యడంలో సఫలీ కృతుడైనా "పంచ్" వాక్యాలు కొరవడ్డాయి.రిపీట్ రీడర్స్ ఉండాలంటే కొన్ని ప్రత్యేక వాక్యాలు (కోట్స్ లా) ఉండేలా చూసుకోవాల్సిందేమో.
కట్టాకి అచ్చులతో అనుబంధమెక్కువ. "అ" తోనూ "ఆ" అక్షరాలు ఎక్కువసార్లు వాడడం చూసాను. కొన్ని కవితలేకాదు ముఖపుస్తకంలో స్పందనలు రాసేటప్పుడూ ఈ విషయాన్ని గమనించాను. అతని వ్యాసం "కృతజ్ఞతాభివందనాలు" లో అఫ్సర్ కి ధన్యవాదాలు తెలిపే వాక్యం ఇలా ఉంది "ఆత్మీయ ఆలింగనంతో ఆశీస్సులు అందించిన అఫ్సర్ గార్కి". అలాగే సంకలనంలో చాలా కవితలు కూడ ఇలానె ముగిసాయి. "మిత్రపొత్తం" లో చివరి స్టాంజా అంతా "అ" తోనో "ఆ" తోనో ముగుస్తుంది.
పుస్తకం చదవటం ముగిసాక ఓ ఆత్మీయుడితో గంటసెపు గడిపామన్న సంతృప్తి మిగిల్చే సంకలనం. మీకు షాప్ కెళ్ళి కొనుక్కోడానికి బధ్ధకమో, వీలులేకపోవటమో అయితే ఎంచక్కా అతితక్కువధరకి www.kinige.com లో అద్దెకీ తోస్కోడమో, కొనుక్కోవడమో చెయ్యొచ్చు. కవిమిత్రుడు కట్టాకి అభినందనలతో.....వాసుదేవ్
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి