వయసులో వుంటే పందికూడా
అందగానే వుందనే ఈ సమాజంలో
వందలో ఒక్కరినయినా వందనీయులను చూడాలి.
చూపులవంకరలను తొలగించే పట్టకం కావాలి.
దృష్టిలో కల్మషాలను కడిగేసే సాధనం కావాలి.
వంకర గీతల్ని సరిచేయలేకుంటే చెరిపేసేందుకో ఎరేజర్ కావాలి.
పిచ్చి చూపుల పైత్యానికో మందుబిళ్ళ కావాలి
చేతల చత్వారాలకు ముందుచూపు నేర్పే ఓ పాఠశాల కావాలి.
నాకో దండం కావాలి. దానికి కొంచెం అండ కావాలి.
మనిషిగా నడుచుకుంటూ వెళ్లేందుకు
చూపులేవీ ఒరుసుకు పోని చోటు కావాలి.
గోడలేవీ అడ్డురాని జాగాలో నాక్కొంచెం ఊపిరాడాలి.
వేడి వేడి మీ ఊర్పులతో ఉడికిపోతున్న వేళ
సేదదీరి నిలుచుందుకో చల్లని నీడ కావాలి.
గాలాలూ, వలలూ తగలని ఓ స్వేచ్చా ప్రయాణం కావాలి.
తోడేసినా, తిట్టుకున్నా పయనం ఆపని మురికికాలువ ప్రవాహానికి
కారకాన్ని కనిపెట్టి నిర్మూలించే ఓ చేతి సాయం కావాలి..
చిత్తకార్తె కుక్కలనడ్డగించే ఓ చట్టం కావాలి.
నాడి ఎప్పుడో తెలిసింది మందువాడే ఓ వైద్యుడు కావాలి.
సోషల్ కాస్ట్రేషన్ చేసేందుకో సాధనం కావాలి.
శవాలలోనైనా చర్మాన్నే చూసే మీడియా కంటికో అద్డం తొడగాలి.
అంగాంగాన్ని అమ్మకపు వస్తువుగా చూపని విపణి కావాలి.
ఆదర్శంగా తలెత్తుకుని చేయగలిగే పని కావాలి.
అందాన్ని ఆరబెట్టటం కాదు, అమ్మపాత్రలో చూపే రంగస్థలం కావాలి.
కనీసం ముక్కుకో కళ్ళకో కట్టుకునేందుకో వడగుడ్డ కావాలి.
లేదా కుళ్లిన బాగాలను తెగనరికే ఆయుధం కావాలి,
కనీసం నా వెన్నెముకనే ఆయుధంగా మలచే నైపుణ్యం కావాలి.
◘ 04-02-2013
https://www.facebook.com/groups/kavisangamam/permalink/511382878914469/
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి