బొమ్మలాట

శ్రద్దలేనితనం చెరబట్టి చంపేస్తున్నారా ?

అభిమానం నిర్లక్ష్యంగా చెదబట్టి చనిపోతున్నారా ??

ఏదేమైనా ఒక్కసారి చేజారాక తిరిగిరానిదే పోయింది.

కొడగడ్డిన దీపాన్ని గొప్పవైన నక్షత్రాలు వెలిగించలేవు.

గుడిసెలో అన్నంముద్దను అందరాని పుంగరాల వేళ్లు తినిపించలేవు.

ఎవరేమన్నా తెరమీదిబొమ్మ నిజజీవితాన్ని దోచింది

ఇక ఫ్యానుకే ఊపిరాడక పోతే

ఉక్కిరిబిక్కిరయ్యేది ఎవరో తెలిస్తే చాలు.

బాదుషాలు మదిలో పాతుకున్నా

విషాదాల చీకట్లని తొలగించే ఆయుధమే లేదు

నాజండా కర్రమాత్రం వుంది.

నీ సమాధి మెట్టెక్కి ఎగరేసేందుకు.

కొన్ని నోట్ల కట్టలున్నయి.

తెరుచుకున్న నోళ్ళకు ఎరవేసేందుకు.

మరణానంతర జ్ఞానమంటూ వుంటే

తరవాతి వాళ్ళకైనా చెప్పు

ఈ రంగులెంట పరుగెత్తొద్దని.

కాలినకడుపుకు బర్నాల్ లేదు.

వెలిగే చితులకు టర్నింగ్ రాదు.

కామెంట్‌లు