అతిశయం

నావరకూ నాకు
క్షణకాలపు వెలుగూచీకటి ఆశ్చర్యమే,
అణు మాత్రపు చోటూ అబ్బురమే.

కాలపు దారిలో పడుతున్న ఒక్కో అడుగూ
పదిలంగా నిలబడే జ్ఞాపకమే.

స్వచ్ఛంమైన  అద్దాన్ని శుభ్రంగా తుడుచుకున్నాక.
కనిపించే ప్రతిరంగూ శుద్దంగానే ప్రతిఫలిస్తుంది.

ఆకాశం నుంచి తెగిపడే ఏదో ఒకనాటి సంఘటనే విచిత్రం కాదు.
తల్లి పేగుతో తిండీ తిప్పలు పూర్తి చేసుకుని వెలువడే నీదీ ఓ మహత్తే

దేశాలను దాటుకుంటూ తిరుగుతున్న రాత్రీ పగలు మధ్యరేఖ
మనసుతో మాత్రమే చూస్తుంటే ఊహలకే ఊపిరాడదనేది నిజం.

ఎండిన ఆకు రాలే ముందు దాచుకున్న ఆస్తినంతా
మాతృదేశానికే ఇచ్చివస్తుందనేది స్విస్ ఖాతాను సైతం సిగ్గుపరచే నైజం.

నీటిలోని చేపకు ఊపిరందటం, ఆకులోని రంగు ఊపిరులూదటం
తేనెపట్టు కూడికలో లెక్కకుదరటం, క్రమంలేని తనానికో హద్దుగీయటమే.

ట్రాఫిక్ దాటుకొచ్చాక చీమల వరుసల నడక ప్రతిసారీ చిత్రమే,
రణగొణ ధ్వనులను తప్పుకొచ్చాక లోపలి నిశ్శబ్దం ఆనందమే

అపార సాహిత్యమైనా అర్ధం చెప్పలేని అంశాలను,
ఓ నిశ్శబ్దం ప్రసరింపజేయటం నాకెప్పుడూ ఓ పాఠమే.

చుట్టూతా వున్నది ఎడారని మోడువారి పోవొద్దు
అల్లుకుంటూ తిరిగే ప్రవాహాలను కళ్ళుతెరిచి చూడు నేస్తం.
జీవితమంతా పొడిబాడిపోయిందని దరిలేకుండా తిరుగాడకు.
సంకల్పం ఒక్కటిచాలు నిత్యం నిండుగానే నిన్నుంచేందుకు.

14 - 04 - 2013

https://www.facebook.com/groups/kavisangamam/permalink/544284902290933/

కామెంట్‌లు

  1. బావుంది మీ అతిశయం... నాకైతే
    " చుట్టూతా వున్నది ఎడారని మోడువారి పోవొద్దు
    అల్లుకుంటూ తిరిగే ప్రవాహాలను కళ్ళుతెరిచి చూడు నేస్తం.
    జీవితమంతా పొడిబాడిపోయిందని దరిలేకుండా తిరుగాడకు.
    సంకల్పం ఒక్కటిచాలు నిత్యం నిండుగానే నిన్నుంచేందుకు." ఇది బాగా నచ్చేసింది,.. మీరిలాగే ఇంకా ఇలాంటి మంచి కవితలు అందించి కవితా మూర్తిగా నిలిచిపోవాలని నా కోరిక..

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి