నిశ్శబ్ధమే నయం నీకూ నాకూ మధ్య

అదేమిటో నామాటల్లో
కరకుదనాన్ని వింటూ కళ్ళు మూసుకునే నీకు
నా కళ్లలోని సలహా మనసు కాన్వాసుపై పిచ్చిగీతైనా కాదు.
ఒక్కో సారి ఉరిమే కళ్ళలోని కోపాన్ని విపత్తేమోనని భయపడి
మాటల గుడారాన్ని నిర్మించేసి
ఆత్మీయపు చేతల తొలకరి జల్లును అడ్డుకుంటావు.
పూర్తి నిశ్శబ్దమే గోడ కడుతుందనుకున్నాను కానీ,
సగం సగం మాటలు గోతిలో పడేస్తాయని తీరా ఇప్పుడర్థం అయ్యింది.

వంతెన పనులు పూర్తవ్వవు.
వంతులు వేసుకు కూర్చుంటే
కరవాలల కలకలం మధ్యన
కరచాలనానికి ఖాళీదొరకదు.

మరేదో అంటాను
నీకు సగమే వినబడుతుంది.
అందులో సగానికి తక్కువ లోపటికి ఇంకుతుంది.
స్వంత ఊహల మైనానికి
పాత మాటల మేలిముసుగు కప్పేసి
కాక్ టెయిల్ కలిపేస్తావు.
బంధం ఘనీభవిస్తూ ఖాళీ కాళ్ళు చాపుక్కూర్చుంటుంది.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి