యూనికోడ్ కన్సార్షియంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని యూనికోడ్ కన్సార్షియం ఉపాధ్యక్షురాలు లిసామూర్ వెల్లడించారు. తెలుగు భాషకు సంబంధించిన కంప్యుటేషనల్ భావనలపై కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ వేదికగా నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు (International Telugu Internet Conference, 2011)లో ఆమె కీలకోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక శాఖ తోడ్పాటుతో సిలికానాంధ్ర నిర్వహించిన ఈ సదస్సుకు పలు దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
సమాచార సాంకేతిక రంగంలో తెలుగువారు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని, సమాచార-సాంకేతిక విజ్ఞాన ప్రగతికి తెలుగు పౌరులు చేస్తున్న కృషి నిరుపమానమని లిసామూర్ పొగడ్తల జల్లు కురిపించారు. తెలుగుభాష యూనికోడ్‌లో పూర్తిగా ఒదిగిపోవాలంటే తెలుగుపండితులు, పరిశోధకులు, కంప్యూటర్ రంగ నిపుణులు మరింత క్రియాశీలం కావాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యూనికోడ్‌లో ఇప్పటికే తెలుగు భాషకు సంకేత పట్టిక (code chart) రూపకల్పన పూర్తయిందని వెల్లడిస్తూ తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, అస్సామీ, దేవనాగరి లిపులను కూడా యూనికోడ్‌లోకి తీసుకువచ్చామన్నారు. అయితే ప్రాంతీయ భాషల విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయన్నారు.
ఇక తెలుగు భాషలో విద్యాభ్యాసం చేస్తే ఉద్యోగాలు దొరకవనే అపనమ్మకాన్ని తొలగించాలన్నది కూడా ఈ సదస్సు లక్ష్యాల్లో ఒకటని స్వాగతోపన్యాసం చేసిన సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభోట్ల నొక్కి చెప్పారు. ప్రాచీనభాషగా గౌరవాన్ని దక్కించుకున్న తెలుగు భాషకు అంతర్జాతీయ భాషగా గుర్తింపు లభించాలంటే తెలుగువారంతా తక్షణం నడుం బిగించాలని స్పష్టం చేశారు. ఇంటర్‌నెట్‌లోగానీ, మొబైల్ ఫోన్‌లోగాని మాతృభాషలో ఎస్ఎంఎస్‌ను పంపలేని నిస్సహాయస్థితి తెలుగువారికి ఉండరాదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి