''...56 అక్షరాలున్న తెలుగు భాషకంటే 26 అక్షరాలే ఉన్న ఇంగ్లీషు ఎక్కువ వాడుకలోకి వచ్చింది, ప్రపంచ భాష అయ్యింది. కాబట్టి తెలుగు భాషకు 16 అక్షరాలే పెట్టి నంబర్ వన్ పొజిషన్ తెస్తాను చూడండి..'' అంటాడొక నాయకుడు సినిమాలో. అది అతను భావావేశంలో సాధ్యసాధ్యాలను గమనించకుండా అన్నమాట అయినప్పటికీ భాషా సంస్కర్తలు ఈ పనికి పూనుకోవచ్చు. తెలుగులో ఎదురయ్యే మొదటి సమస్య గుణింతాలు, వత్తులు. వీటివలన అక్షరానికి క్రిందా పైనా మరో రెండు లైన్లు స్థలం అవసరమవుతుంది. టైపుమిషను, కంప్యూటర్‌లలో అక్షరాలు ముద్రించేటప్పుడు ఈ విషయం తెలుస్తుంది. ఇంగ్లీషులో కేవలం ఎ,ఇ.ఐ.ఓ.యు. అనే అచ్చులతో మిగతా 21 హల్లులు కలిసి భాష ఒకే లైనులో సాఫీగాసాగి పోతుంది. తెలుగులో అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ, ఋ,బుూ,ఎ, ఏ,ఐ,ఒ,ఓ,ఔ,అం,అః, అనే16 అచ్చులు. ఇప్పుడు ఋ, బుూ, ఁ (అరసున్న), ః (విసర్గ) లాంటివి వాడుకలోలేవు. అలాగే చ,జ,ఱ లాంటి హల్లులుకూడా వాడటం లేరు. వీటికి తోడు వత్తులు, గుణింతాలు. వాటికోసం ప్రత్యేక అక్షరాలు. తెలుగులోని పదాలు అజంతాలు (అచ్చుతోటే అంతమవుతాయి) హిందీ వాళ్ళు రామ్ అంటే మనం ' రామ ' అంటాము. సాంకేతికంగా యంత్రాలకు కూడా సులభంగా వాడగలిగేలా భాషను సంస్కరించాలి. అనవసరమయిన అక్షరాలను వత్తులను వదిలించుకోవాలి. ' ఐతే ' అనే మాటను అయితే, అఇతే అని కూడా రాయవచ్చు. గొట్టము అనే మాట ఇంగ్లీషు తరహాలోనైతే, ' గఒటటఅమఉ ' అవుతుంది. కానీ ముందుగా అక్షరాలను ' నకారపొల్లు ' శబ్దానికి మార్చి పలికితేనే ఈ సంస్కరణకు వీలు చిక్కుతుంది. ఇప్పుడు కంప్యూటర్లలో కూడా ఇంగ్లీషు కీబోర్డు వాడి తెలుగులిపిని పొందే సాప్ట్‌వేర్ వాడుతున్నారు.
''తెలుగు లిపి పరిణామం'' అనే వ్యాసంలో డాక్టర్ తిరుమల రామచంద్ర వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలివి. ''..తెలుగు లిపి గుండ్రంగా అవటానికి 2500 ఏళ్ళు పట్టింది. అంతకు ముందు ఇవి అడ్డపు, నిలువు గీతలే. భాష ధ్వనిరూపం. ఈధ్వనికి సంకేతాలే లిపులు. అచ్చు వచ్చిన తరువాత లిపి స్వరూపం మరింత సుందరమయి స్థిరపడింది. ఇక్ష్వాకుల కాలంలో శిల్పులు అక్షరాలకు ఒంపులు వయ్యారాలు చేకూర్చారు. అక్షరాల నిలువు గీతలు అడుగున పొడవై కుడి వైపునకు వంపు తిరిగాయి. శాలంకాయనుల కాలంలో కొన్ని అక్షరాల తలపై అడ్డగీత ఏర్పడింది. కొన్ని అక్షరాలు గుండ్రతనం వదిలి కోణాకారం దాల్చాయి. విష్ణుకుండినుల కాలంలో తలపై అడ్డుగీత అన్ని అక్షరాలపై కనిపించింది. వీరి కాలంలో 'ళ్జ' లనే వింత అక్షరం ఉండేది. తరువాత అంతరించింది. చాళుక్య లిపి చక్కగా నిలువుగా ఉంటుంది. నన్నయ కాలం నుంచి వేంగీ చాళుక్య లిపిలో మార్పులు ప్రారంభమై 200 ఏళ్ళకు కన్నడ, తెలుగు లిపులు విడిపోయాయి. తెలుగు మరీ గుండ్రమై పోయింది, కన్నడ లిపి కోణాకార మయ్యింది. నన్నయ్య కాలపు అక్షరాలకు మధ్యన అడ్డంగా గీత గీస్తే తలకట్టు దగ్గర తెగుతుంది. అంటే తలకట్టు సగమూ, తక్కిన అక్షరం సగమూను. కాకతీయుల అక్షరాలలో తలకట్టు చిన్నదై తక్కిన భాగం పెద్దది కావటంతో అక్షరాలు పొంకంగా , దీర్ఘవర్తులంగా అయి అందం వచ్చింది. ప, హలు తలకట్టు విదిల్చుకున్నాయి. చాప, జల్లెడ వంటి వాటిలో 'త ఒత్తు'వంటి గుర్తు 19వ శతాబ్దంలో సి.పి. బ్రౌన్ పెట్టించాడు. మరో వింత అక్షరం అరసున్న. 16వ శతాబ్దానికి ముందు కనిపించదు.
ముఖ్యాక్షరాలు ఎంతగా మారాయో గుణింతాల గుర్తులు అంతకు రెండింతలుగా మారాయి. క్రావడి మరొక్క రూపం వలపల గిలక'కర్మ' అని వ్రాయడానికి కమ్ అని వ్రాసేవారు. ఈ విధంగా తెలుగు లిపి 23 వందల సంవత్సరాలలో ఎన్నో మార్పులు పొంది నేటికీ రూపానికి వచ్చింది. ప్రస్తుత యంత్రయుగంలో ఎన్నో మార్పులు పొందవచ్చు. లోహాక్షరాలు చేతితో పేర్చుకొనే అవసరం పోయి, ఆంగ్లంలో లాగా మోనోటైప్ యంత్రాలలోను, లైనోటైప్ యంత్రాలతలోను టైప్‌లాగా కొట్టే వరకు అభివృద్ధి చెందింది. అక్షరాలను విడగొట్టి కలిపే పద్ధతిలో స్వరూపాలు గూడా ముందుకన్నా మారాయి. కంప్యూటర్ ద్వారా కంపోజ్ చేసే పద్ధతి ప్రస్తుతం గొప్ప విప్లవం. ఒకచోట వాడిన మాట పలుచోట్ల అక్షరరూపం దాల్చే పద్ధతి కూడా వచ్చింది. శ్రమ తగ్గించుకొని లాఘవం కోరే మానవుని బుద్ధి ఈ వర్ణమాలలోనూ ఎన్నోమార్పులు తలపెట్టవచ్చు.
మూడు సంవత్సరాల క్రితం కర్నాటక గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య గారు ఆంధ్ర-కర్నాటక లిపి ఏకీకరణకు బెంగుళూరు విశ్వవిద్యాలయం కన్నడ శాఖాధ్యక్షులు సచ్చిదానంద మూర్తిగారి అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించారు. అది లిపిలో ఎలాంటి మార్పు చేయకుండా రెండిటినీ ఆదాన ప్రదాన పద్ధతిలో కలిపింది. ఈ వివరాలను విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన ''మన లిపి పుట్టుపూర్వోత్తరాలు'' లో చూడవచ్చు. దీనిని ' విజయలిపి ' అన్నారు.(ఆంధ్రప్రదేశ్ దర్శిని -2 పేజీలు 389-398)
''కొన్ని తెలుగు ముద్రాక్షరాలు అచ్చు కూర్పరులకు విసుగు పుట్టించేవి. తెలుగు లిపిలో ఉన్న క్లిష్టత వల్ల తెలుగులో అచ్చు కూర్చటానికి (కంపోజింగ్‌కు) చాలా ప్రయాస పడేవారు. ఉదాహరణకు ఆనాడు అచ్చులో ఉపయోగిస్తున్న అర్ధచంద్రాకారంలో వేరొక వర్ణానికి కిందరాస్తూ ఉండిన రావడి కూర్పు చాలా శ్రమ కలిగించేది. దీన్ని సి.పి. బ్రౌన్ తెలుగు శాసనాలలో ఉన్న గుర్తును నమూనాగా గ్రహించిలాంటి రెండు రూపాలు కల్పించారు. ఈ సంస్కరణల వల్ల కూర్పరులకు కొంత శ్రమ తగ్గింది. అచ్చు కూర్పు కొంత మేరకు వేగవంతమయ్యింది. ఈ కొత్త రూపాలకు 'బ్రౌన్ రావళ్ళు' అనే పేర్లు కలిగాయి. ఇలాగే ప,వ,న, స, ల విషయంలో లిపిలో ఉన్న సామ్యాన్ని బట్టి పొరబాటు పడటానికి అవకాశం ఉన్న దాన్ని గ్రహించి కన్నడంలో ఉన్నట్లు ఈ అక్షరాలలో స్పష్టంగా మార్పు కనబడే విధంగా టైపులు పోత పోయించి సి.పి.బ్రౌన్ వాటిని వాడుకలోకి తెచ్చారు. కాని ఇవి తెలుగులో నిలిచినట్లు కనబడదు. బ్రౌన్ కొన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టినా, తెలుగు, ముద్రణ పెక్కు లోపాలతో సాగుతూ వచ్చింది. ముద్రాక్షరాల సంఖ్యను 405 కన్నా తగ్గించటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. బందరులోని కళ్యాణీ టైపు ఫౌండ్రీ అధిపతి కె.వి. కొండయ్యగారు అక్షరాల సొంపు చెడకుండా ముద్రణా యంత్రానికి ఒదిగే విధంగా టైపు తయారీలో సాంకేతిక మార్పులు చేసి, 350కి తెలుగు లిపి రూపాలను కుదించారు. దీన్ని '' కళ్యాణీ టైపు '' అన్నారు. తక్కువ వ్యవధిలో అచ్చుకూర్చి తక్కువ వ్యయంతో తెలుగు పుస్తకాలు ముద్రించవలసిన అవసరం ఏర్పడింది. దీనికి తెలుగు లిపి ప్రతిబంధక మైంది. అది ముద్రణకు అనుకూలంగా లేదు. గుణింతపు గుర్తులు (తలకట్టులు, గుడులు, సుడులు) మొదలైనవి అక్షరానికి పైనా కిందా ఉండటం, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలూ, వీటి గుర్తులు కొన్ని సూటిగా అక్షరం కింద ఉండటం, అక్షరాలు అధికంగా ఉండటం అనే అంశాలు తెలుగు లిపిలోని క్లిష్టతకు ముఖ్యమైన కారణాలు. ఇలాంటి క్లిష్టత వల్లే తెలుగులో పుస్తక ముద్రణ వేగంగా జరగటం లేదు. లోపాలను తొలగించి తెలుగు లిపి సంస్కరణ తప్పనిసరిగా జరపవలసి ఉంది.
మన మీనాడు కంప్యూటర్ యుగంలో పురోగమిస్తున్నాం. పరిణామాలను ఆహ్వానిస్తున్నాం. వేగం నేటి యుగధర్మం. ఈ వేగానికి తట్టు కోలేనిదేదీ నిలవదు. మందకొడిగా అక్షరాలు కూడా నడక సాగించలేవు. తెలుగు భాషకు. ఇదొక సంధియుగం. మద్రాసులో మురళీకృష్ణ అనే ఇంజనీరు బాపు అక్షరాలతో సహా అందంగా అక్షర స్వరూపాలకు కంప్యూటర్ ప్రింటింగ్‌కి అనువుగా కీ బోర్డులు రూపొందించాడు. లిపిని ఇంకా సంస్కరించి తెలుగు భాషా స్వరూపాన్ని ఆధునీకరించటానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.'' (ఆంధ్రప్రదేశ్ దర్శిని -2పేజీలు 506-514). ప్రభుత్వం, అధికార భాషా సంఘం ''లిపి సంస్కరణ'' కొరకై నడుము బిగించాలి.
ఇక తెలుగులో తీర్పులివ్వటం సాధ్యమని కొందరు, అసాధ్యమని కొందరు, ప్రమాదమని మరికొందరు సెలవిచ్చారు. బ్రిటీష్ వాళ్ళు, మొగలాయిలు రాకముందు ఈదేశం అనేక దేశాలుగా ఉండేది. ఎవరి భాషలో వారి పాలన సాగేది. ధర్మగంట మోగిస్తే రాజుగారొచ్చి వాదోపవాదాలు విని తీర్పు ఇచ్చేవాడు. న్యాయవాదులు ఉండేవారు కాదు. వాయిదాలు తక్కువ. ప్లీడర్ ఫీజులు లేవు. సత్వరన్యాయం చౌకగా దొరికేది. ఆనాడే సాధ్యమవగా ఈనాడెందుకు సాధ్యం కాదు? అని కొందరన్నారు.
అదంతా అరాచక కాలం. అప్పుడు చెల్లిందికానీ ఇప్పుడు రాచరికం లేదు, రాజు తీర్పులివ్వకూడదు. అందుకే న్యాయవాదులు న్యాయమూర్తులతో కూడిన న్యాయవ్యవస్థ ఏర్పడింది. పోలీసు చేతిలో, పెత్తందారు చేతిలో న్యాయపెత్తనం పెట్టకూడదు. ఇచ్చిన తీర్పు దేశమంతటా అర్ధం కావాలి గాబట్టి ఇంగ్లీషులోనే ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తుల్లో తెలుగు రానివారు కూడా ఉంటారు సుప్రీంకోర్టులో తెలుగు అనుమతించరు. ఇంగ్లీషే ఈ దేశ అధికార భాష కాబట్టి తీర్పులు ఇంగ్లీషులోనే ఉండాలి అని కొందరన్నారు. అసలు మన రాజ్యాంగాన్ని తెలుగులోకి అనువదించారా? ఆ అనువాదానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందా? సివిల్, క్రిమినల్ చట్టాలు తెలుగులో అధికార పూర్వకంగా విడుదల అయ్యాయా? అవి నోరుతిరిగే భాషలో ఉన్నాయా? అర్థం అవుతాయా? మన పిల్లలకు న్యాయవిద్య తెలుగులో అందిస్తున్నారా?పారిభాషిక పదాల కొరత ఎలా తీరుస్తారు? లాంటి ప్రశ్నలతో కొందరు ఇదంతా అయ్యేపని కాదని పెదవి విరిచారు. తెలుగు భాష విూద నాకు ఎంత ప్రేమో! ''తీర్పులు తెలుగులో ఇవ్వొచ్చు'' అని ధైర్యపరిచేవాడిని. తెలుగు దీనావస్థను చూచి కూడా ఏదో ఆశ, ఇది పునరుద్ధరించ బడుతుందని. నేను పెట్టిన పోటీ నాకే పోటీ అయికూర్చొంది.
ఈ మధ్య నేనే న్యాయమూర్తినయ్యాను. రంపచోడవరం మొబైల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అంతా గిరిజనులు, మన అచ్చ తెలుగువాళ్ళు, ఆహా, ఇంకేం తెలుగులో తీర్పులివ్వొచ్చు అని ఆనందపడుతూ వెళ్ళాను. అక్కడా పదిమంది లాయర్లు ' యువరానర్'అంటూ ప్రత్యక్షమయ్యారు. ఆంగ్ల భాషాకోవిదులైన అడ్వకేట్లు నల్లకోట్లు వేసి నాముందుకొచ్చి, నేను తెలుగు న్యాయం మాత్రమే చెప్పబూనటం అపూర్వం, సాహసం, ప్రమాదభరితం అని ఆంగ్లంలో ఉపదేశించారు. అడివిలో కూడా ఆంగ్లమేనా ఇక నా తెలుగెక్కడ తల్లీ? అని తడుముకున్నాను, మదనపడ్డాను. వాది, ప్రతివాది, సాక్షులు అంతా తెలుగులో చెబుతున్నారు. వాళ్ళు చెప్పింది చెప్పినట్లు వాంగ్మూలం టైపు చేయమంటే ''తెలుగు టైపు మిషన్ లేదు, అయినా అది కష్టం, విూరు ఇంగ్లీషులోకి మార్చి చెప్పండి కొడతాం'' అని సిబ్బంది ఇబ్బంది పడ్డారు. శక్తిచాలనివాడు సాధుత్వం వహించినట్లుగా బహుశా తెలుగును అభిమానించే న్యాయమూర్తులంతా ఇటువంటి ఇబ్బందుల్ని నెగ్గుకు రాలేక మౌనం దాల్చారని స్వానుభవం మీద అర్థం అయ్యింది.
కంప్యూటర్లొచ్చాయి, కోర్టులో తెలుగు సాఫ్ట్‌వేర్ వాడుకోవచ్చుగదా అని కొందరు ఉచిత సలహాపడేశారు. నిజమే గదా అని కంప్యూటర్ అడిగాం. ఇస్తామన్నారు అయితే దానికి ఇంగ్లీష్ కీబోర్డే ఉంటుంది. ఇంగ్లీష్‌లో కొడితే తెలుగు అక్షరాలు ప్రత్యక్షమవుతా యన్నారు. మాడుమీద కొడితే మోకాలు పగిలినట్లు ఈ బాధ మనకెందుకు తెలుగు మాటల్నే ఇంగ్లీషులో కొడదాం తేలికగా పనైపోతుంది annaru kondaru అసలు విషయం అర్థంకాకుండా పోతుంది annaru inkondaru ఇలాంటి తీర్పులు ఎవరు ఒప్పుకొంటారండీ అని ఇంకొంత మంది ఆక్రోశించారు. వత్తులు గుణింతాలతో పడిలేచి చచ్చేకంటే, యంత్రానికి అనువైన ఆంగ్లాక్షరాలతో పనిచేసుకోవచ్చు గదా అప్పుడు మన తెలుగును ఇంగ్లీషొచ్చినోళ్ళంతా చదువుతారు, తద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఇంగ్లీష్ సౌలభ్యాలన్నీ మనం కొట్టేయవచ్చు అన్నారింకొందరు అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్టవు తుందేమోనని ఆచర్చ అంతటితో ఆపాము.
ఇంతకీ తెలుగుకు వైభవం తేవటానికి ప్రభుత్వం నడుం బిగించిదనే వార్తలు, అధికారభాషా సంఘం అధ్యక్షులు పరుచూరి గోపాలకృష్ణ, ప్రజల భాషకు పట్టం కట్టడానికి పలుచర్యలు తీసుకుంటామని ప్రకటించటం సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నా తల్లి నా కందం, నా భాష నాకానందం'' అంటాడు గురుకుల మిత్రా. ''ఈనాటి కోర్టులు పరాయివి, ఊరిలో న్యాయం ఊరిలోనే జరగాలి'' అనే వ్యాసంలో (వార్త 8-7-2003) ఆయన ఇలా అంటాడు. ''ఉదయం కేసు వేస్తే సాయంత్రానికి న్యాయం ఒనగూడుతుందనే పద్ధతిని ప్రజాకోర్టుల నుండి ఈ ప్రజాస్వామ్యం నేర్చుకోవాలి. ఇప్పటి పంచాయితీలకు కోర్టు అధికారాలు కూడా ఇస్తే అక్కడే ఒక సారి కాకపోతే రెండోసారి లేక మూడోసారి కూడా కేసును తడివి తడివి విమర్శిస్తే సరిపోతుందేమో చూసుకోవాలి. ఎక్కడి ప్రజల సమక్షంలో అక్కడే తీర్పు జరిగితే ఆ కోర్టు గొప్పదవుతుంది.''
ఎన్టీరామారావుగారు న్యాయ పంచాయితీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. అవి వస్తే ప్రజల భాషలో తీర్పులొస్తాయి. పరాయి ప్లీడర్లు, పరాయిభాష, పరాయి ప్రాంతం లాంటి సమస్యలు ఉండవు. ఏ భాషలో న్యాయస్థానం తీర్పులిస్తుందో అదే నిజమైన అధికార భాష. తెలుగుకు ఆ స్థాయి రావాలి అని నాఆకాంక్ష! ''సముద్రాల అవతలి నుంచి వచ్చిన ఇంగ్లీషు ప్రభావంతో తెలుగు తెల్లబోతోంది. ఆధునికులు మాట్లాడే నాలుగు ముక్కల తెలుగులో మూడుమాటలు ఇంగ్లీషువే ఉంటున్నాయి. తెలుగు ఇంగ్లీషు కలవ్వేమో అని కొందరికి డౌటేహం కానీ అటువంటి సందేహాలు అవసరం లేదని ఇప్పటి తెలుగు రుజువు చేసింది. అందువల్లే 'అతను అదో టైపు' 'నీ కంత సీన్ లేదులే' వంటి తరచూ వినపడే మాటలు అచ్చ తెలుగులానే అనిపిస్తున్నాయి ఇంగ్లీషు మాటలతో చక్కగా కలిసి పోయి కొత్తరకం ''తెల్గిష్''భాష తయారయింది. ప్రస్తుతం ''తెల్గిష్'' వీరవిహారం చేస్తోంది.(ఈనాడు సంపాదకీయం 20.7.2003)
విశృంఖలమైన భాషను ఎవరూ ఆపలేరు. జనం నాలుకలపై నాట్యమాడే భాషే అధికార భాష కూడా. అయితే వారి భాషలోనే సమస్త పాలనా వ్యవహారాలూ జరిగితే, ఆ ప్రజలు సుఖపడతారు. ప్రాకృతం, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీషు మొదలైన భాషల నుండి ఎన్నో పదాలు మన తెలుగులో కలిసిపోయి వందల ఏళ్ళ నుండి మన వాడుకలో మన పదాలే అయిపోయాయి. వాటిని మన నిఘంటువులో చేర్చి మన భాషను శక్తివంతం చెయ్యాలి. ప్రజలు విరివిగా మాట్లాడే ''మిశ్రమ భాషే'' అందరికీ అర్థమై పాలకభాషగా చక్కగా రాణిస్తుందేమో! ఉర్దూ అలాంటిదే గదా!
ఆధారం : యన్ రహ్మతుల్లా గారి బ్లాగు
ఆధారం : యన్ రహ్మతుల్లా గారి బ్లాగు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి