మౌనమా ? నిశ్శబ్దమా ??

గతం లో జరిగిన ఫేస్ బుక్ లో నావాల్ పై జరిగిన  చర్చకు నావివరణ కూడా ఇద్దామనే ఉద్దేశ్యంతో రాసిందే ఇది

చలనమంటూ లేకుంటే ప్రపంచమే లేదు.

శబ్దం పుట్టాలంటే ప్రకంపన స్థితిలోకి ఒక వస్తువు మారాలి. ఆ వస్తువు గాలిలో కలిగించే సంపీడనాలూ, విరళీకరణలూ చెవికి చేరగా తెలుస్తున్న స్పందనను శబ్ధం అంటున్నాం.( Vibrations that travel through the air or another medium and can be heard when they reach a person's or animal's ear.)

స్వరపేటికలోపలి కంపనాల నుండి పుట్టే శబ్దాలు బావప్రసరణకు వినియోగ పడితే వాటిని మాటలంటున్నాం. స్వరపేటికనుండే వెలువడినా సరే ప్రతిశబ్ధం మాట కాదు. 


► అంటే మాటలన్నీ శబ్దాలే కానీ శబ్దాలన్నీ మాటలు కాదు.

మాటలు లేవీ ప్రయత్నపూర్వకంగా వెలువరచకపోతే మౌనం అంటున్నాం. మాటలేవీ వెలువరచటం లేదు అనేందుకూ మౌనంగా వున్నారు. మౌనాన్ని ఆశ్రయించారు అనిచెపుతున్నాం. ఇక్కడ నిశ్శబ్దంగా వున్నారు అన్నా తప్పులేదు. అందుకే సినిమా హాళ్ళలో నిశ్శబ్ధాన్ని పాటించండి(వుండండి కాదు) అంటుంటారు. మీరు మాట్లాడకుండా వుండటమే కాదు మరేవిధమైన శబ్దంకూడా కానివ్వకండి అని చెప్పకనే చెప్పినట్లవుతోంది.

చుట్టూ గందరగోళంగా శబ్దాలున్నా వాటి మద్య ఎవరన్నా మాట్లాడకుండా కూర్చుంటే వారు మౌనంగా వున్నారంటాము కానీ అక్కడ నిశ్శబ్దంగా వుందని అనం. వస్తువులనుండి శబ్దం రాకుండా నిశ్చలంగా వుంటే మౌనంగా వున్నాయని అనం.అక్కడి వాతా వరణం నిశ్శబ్దంగా వుందనే అంటాం.

ఇంగ్లీషు భాషలోని పదాలతో వీటిని అర్ధంచేసుకోవాలంటే కొన్నిపదాలను చూద్దాం
hush - quiet - still - quietness - calm - stillness - hush - shush - shut up -
quiet - tranquil - still - placid - serene - peaceful - - calmness - quietness - tranquillity - serenity - pacify - appease - soothe - lull - quieten.

నాకయితే ఈరెండింటి మధ్య తేడా బాగానే తెలుస్తున్నట్లుగా నే వుంది . నేను వాడిన మాటలు మీకు ఆభావాన్ని సరిగా చేరవేసేలా ఎన్నుకున్నానో లేదో కానీ. ఏ ప్రతిపాదన మీద ప్రశ్నవున్నా, మీ వైపునుంచి మరికొంత సవరణ, వివరణ పూరణ వున్నా దయచేసి శబ్దంగా వుండండి. స్ధబ్దంగా వద్దు.

కవిసమయాలలో భాషచేరవేయలేని చాలాభావాలను మౌనం చేరవేస్తుందని కవులు రాస్తుంటారు. భాష నిజానికి శబ్దంతోనో, సంకేతాలతోనో మాత్రమే ఏర్పడి లేదు. దానిలో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా ఒక భాగమే చిరునవ్వు కావచ్చు, దయాపూరిత చూపులు కావచ్చు, ప్రేమగా దగ్గరకు తీసుకున్న ఒక హగ్ కావచ్చు బాడీ లాంగ్వేజ్ కావచ్చు ఇవ్వన్నీ కూడా కొన్ని భావాలను చేరవేస్తాయి. భాషలో చెప్పలేని అనుభూతులను కూడా భాషలో పదాలకందని అభినివేశాలను కూడా నాన్ వెర్బల్ ఒక్కోసారిచేరవే
స్తుంది. అందుకే మౌనం మిన్న అనుంటారు. ప్రతిదానికీ దాని శక్తి వుంటుంది. పరిమితీ వుంటుంది వాటిని ఎంతబాగా తెలుసుకుంటుంటే అంతబాగా వినియోగించుకోగలుగుతాము.

కామెంట్‌లు