ఎవ్వరూ కనిపెట్టకపోతే భాష ఎలా పుడుతుందని మాయాబజార్‌లో పింగళివారు పలికిన మాటలు అందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. పాండవులు అస్మదీయులు అని చెప్పి కౌరవులు అనగానే తసమదీయులు అంటారు లంబుజంబు. ఆ పదం భాషలో లేకపోయినప్పటికీ అది జీవితంలో భాగంగా మారిపోయింది. మధ్యయుగంలో బెనెడిక్టిన్ మాంక్స్ మత సంబంధమైన గ్రంథాలను రచించే సమయంలో ఇంగ్లీషు భాషను అభివృద్ధి చేశారు. ఇప్పుడు కొత్తగా ఇంగ్లీషు భాషలో 27 వ అక్షరం వచ్చి చేరబోతోంది.
ఇంగ్లీషులో అతి తరచుగా వాడే పదాలు the, be, to, of, and. వీటిలో and పదానికి ఇప్పటికే ఒక సింబల్ ఉంది. THE ని మాత్రం అలాగే వాడుతున్నాం. దాన్ని కూడా చిన్నదిగా వాడితే ఎలా ఉంటుందా అనే ఆలోచన పౌల్ మ్యాథిస్ అనే రెస్టారెంట్ ఓనర్ మెదడులో మెదిలింది. the కి బదులుగా ఈ పక్కన చూపిన ఆకారంలో అక్షరాన్ని డిజైన్ చేసి విడుదల చేశారు. theకి బదులుగా దీనిని ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలో టైపింగ్ చేయవచ్చుననేది ఆయన ఉద్దేశ్యం. ఈ అక్షరాన్ని టైప్ చేయడం అతి తేలికవుతుందని పౌల్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాలో 20 కి పైగా రెస్టారెంట్లు తెరిచిన మ్యాథిస్ పౌల్ మూడు దశాబ్దాలుగా తన వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతూ, ‘మిస్టర్ మిడాస్’ గా ప్రఖ్యాతి పొందారు. కేవలం మెల్‌బోర్న్‌లో ఆరు రెస్టారెంట్లు నడుపుతున్నారు. ఆయన బిబిసికి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘నేను ఈ అక్షరాన్ని ఆప్స్‌లో చేర్చమని ఆపిల్ కంపెనీని అడిగాను. అందుకు వారు నిరాకరించారు. వారి ఆలోచనను మార్చగలనన్న నమ్మకం నాకుంది’’ తన మనసులోని భావాలను వ్యక్తపరిచారు.
‘‘ఈ మార్పు అవసరమా’ అని ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి ‘‘అవసరం లేదు’’ అన్నారు. ‘‘ఈ అక్షరం ప్రపంచంలో ఏదైనా మార్పు తీసుకువస్తుందా’’ అని ప్రశ్నిస్తే ‘‘అటువంటిదేం లేదు. కాని ప్రజలందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. ట్విటర్‌లో కాని, స్విప్ట్ టైపింగ్‌లో కాని the బదులుగా దీనిని టైప్ చేయడం వల్ల పని సులువవుతుందని నేను భావిస్తున్నాను. అతి ఎక్కువగా ఉపయోగించే and పదానికి ఇంగ్లీషులో ఇప్పటికే ఒక సింబల్ ఉండటం వల్ల ఆ పదాన్ని అతి తేలికగా వాడగలుగుతున్నాం. అదేవిధంగా theకి కూడా ఉంటే ఆ అక్షరాన్ని తేలికగా రాయగలమా? లేదా? ఒక్కసారి ఆలోచించండి. నేను the అనే పదాన్ని మార్పు చేయట్లేదు. కేవలం అక్షరంగా మాత్రమే చేస్తున్నాను. 500 సంవత్సరాల తర్వాతైనా ఈ అక్షరాన్ని వాడనందుకు ప్రజలు ఆశ్చర్యపడకపోరు’’ అని పౌల్ అన్నారు.
- డాక్టర్ వైజయంతి -ఆధారం : సాక్షీ దినపత్రిక
already ppl using 'd' for 'the' word ,no need to put new letter
రిప్లయితొలగించండి