వదులు జీవితాలు

అయ్యగారో, అమ్మగారో
దయతో పడేసిన బట్ట వదులు

అతిముందు చూపుతో
చానాళ్ళు ఆగాలని ఆబగా కుట్టించుకున్న
స్వంత గుడ్డా వదులే

ప్రతివాడి పిలుపులో పేరు వదులు
ప్రతిగుంపు మధ్యలో చోటు వదులు

శ్రీనాథ, అధినాథులకు ఒత్తి కింద పీటేసే అక్షరాలకు,
వాడుకలో పలికేందుకు ముడ్డిచూపేంత వదులు.
నాథుడు లేని నేలచూపుకు
ఏ మెత్తలూ, ఒత్తులూ వుండనీయరేమో.

తొక్కిపట్టిన సర్పిలం విచ్చుకుంటోంది.
మోకరిల్లిన దేహం పిడికిలై బిగుసుకుంటోంది.
తప్పదిక నాకోసం దారివదులు
బిగించిపట్టిన నాజీవితంపై నీ పట్టు వదులు
అధికారంలో నా వాటా నాకే వదులు.

కామెంట్‌లు