తెలుగు పద్యానికి వన్నె తెచ్చేవి యతి, ప్రాస, ప్రాస యతి, అనుప్రాస, అంత్యప్రాస, మున్నగునవి. వీటికి అనేక ప్రమాణాలూ, నిబంధనలూ ఉన్నాయి. పద్యం అలవాటు తప్పడం వల్ల మనం చాలామటుకు కొన్ని తప్పులు చేయడం జరుగుతూ ఉంటుంది. తప్పులు చేయడం తప్పుగాదుగానీ, వాటిని సరిదిద్దుకూంటూ నేర్చుకోకపోవడం తప్పేకావచ్చని కొందరి వాదన. మరికొందరు, భాషా పరివర్తనతో పాటూ, ఛందస్సుకూడా పరివర్తన చెందాలి, పాత సూత్రాలు కవిత్వానికి ప్రతిబంధకాలు, అవి భావవ్యక్తీకరణకు తోడ్పడాలికాని భావప్రతిషిద్దాలు కాకూడదు అంటారు. ఏది ఏమైనా సూత్రాలను పాటించుతూ, భావాన్ని పలికించగలిగితే అందులో ఉండే అందమే వేరు. అలా పలికించగలిగే శక్తి, ఆసక్తి ఉన్నవారికి ఉపకరణాత్మకంగా ఉండటానికి కొన్ని నియమాలను పొందుపఱచే ప్రయత్నమిది.
యతిప్రాసలు పద్యానికి అందాన్నిస్తాయి. ఈ మధ్యన పద్యం హృద్యం లోవచ్చిన కొన్ని పూరణలలో యతిప్రాసలు అక్కడక్కడా తప్పాయి. పద్య రచనకు సహకరిస్తుందని నాకు తెలసిన నియమాలను క్రింద ఇస్తున్నాను. యతినియమాలలో ముఖ్యమైనవి మాత్రమే క్రింద వ్రాయటం జరిగింది.
కం.//సద్యతులవి లేకున్నను పద్యము బాగుండదసలు వదలక ఛంధో విద్యను నేర్చిన తప్పక హృద్యముగా యతులు కుదురు, ఇకపై మనకున్ |
ప్రాస నియమములు:
- ప్రధమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లే ఉండవలయును.
- ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.
- ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.
- ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.
- ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురును.
యతి నియమములు:
(1) ఈ క్రింది వర్ణసమూహములలో ప్రతి వర్ణమునకు మిగిలిన వాటితో యతి చెల్లును
- అ, ఆ, ఐ, ఔ, హ, య, అం
- ఇ, ఈ, ఎ, ఏ, ఋ
- ఉ, ఊ, ఒ, ఓ
- క, ఖ, గ, ఘ, క్ష
- చ, చ, జ, ఝ, శ, ష, స
- ట, ఠ, డ, ఢ
- త, థ, ద, ధ
- ప, ఫ, బ, భ, వ
- న, ణ
- ర, ఱ, ల, ళ
- పు, ఫు, బు, భు, ము
(2) కఖగఘఙ్, చచజఝఞ్, టఠడఢణ, తథదధన, పఫబభమ లను వర్గములందురు. ప్రతివర్గములోను చివర ఉన్న అనునాసికమునకు,ముందు ఉన్న నాలుగక్షరాలతో అవి పూర్ణ బిందు పూర్వకములైతే యతి చెల్లును. ఉదాహరణకు, తథదధన వర్గములోని అనునాసికమైన “న” కు “కంద” లోని “ద” కు యతి చెల్లును. ఉచ్చారణ పరంగా “కంద” ని “కన్ద” లా పలుకవచ్చు. అందువలన “న్ద”లోని “న”తో యతి కుదురును.
(3) అటులనే, “మ” కు పూర్ణబిందుపూర్వకమైన య, ర, ల, వ, శ, ష, స, హ లతో యతి కుదురును.
(4) యతి స్థానమున గాని యతి మైత్రి స్థానమున గాని సంయుక్తా క్షరమున్నచో అందులో ఏ ఒక్క అక్షరానికి యతి చెల్లినా సరిపోతుంది. ఉదాహరణకు, యతి స్థానములో “క్ష్మ” ఉన్న, అందులోని, “క”, “ష”, “మ” లలో ఏ అక్షరమునకైనా యతి కుదర్చ వచ్చును.
(5)ఋకారముతో నున్న హల్లులకు యతి కుదురును. ఉదాహరణకు, “ద” కు “గ” యతిమైత్రి లేకున్ననూ, “దృ” కు “గృ” కు యతి కుదురును.
(6) హల్లులకు యతి కుదుర్చునపుడు, హల్లుకి దానిపైనున్న అచ్చుకి కూడా యతి మైత్రి పాటించవలెను. ఉదాహరణకు, “తు” కు “ఒ” కు యతి చెల్లదు. “తు”(త+ఉ) లో ఉన్న “త” కు కూడా యతి కుదర్చవలెను.
ప్రాసయతి నియమములు:
పాదమందలి మొదటి అక్షరమునకు, యతి మైత్రి స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుటకు బదులు, పాదమందలి రెండవ అక్షరమునకును, యతి మైత్రి స్థానము తరువాతి అక్షరమునకు ప్రాస కుదుర్చుటను “ప్రాసయతి” అందురు. తేటగీతి, ఆటవెలది, సీసము మొదలగు పద్యములలో “ప్రాసయతి” వాడవచ్చు. ఉదాహరణకు, “వేడి గిన్నె చురక వాడిగా తగలగా” అన్నపాదంలో, “వే”కి “వా”కు యతి కుదరదు. కానీ, “వేడి”కి “వాడి”కి “ప్రాసయతి” కుదురుతుంది.
ఈ ప్రమాణాలే కాకుండా, యతిప్రాసలకు ఇంకా ఎన్నో నిబంధనలు ఉన్నాయి. కానీ సామన్యంగా అవసరమైనవి మాత్రమే ఈ వ్యాసంలో ఇప్పుడు చర్చించడం జరిగింది. ముందు ముందు మరిన్ని విషయాలు తరువాయి వ్యాసాలలో పరిశీలిద్దాం.
మూలం : సుజన రంజని
మూలం : సుజన రంజని
ఆర్యా,
రిప్లయితొలగించండినా బోటి వారికి చాలా ఉపయుక్తమైన వ్యాసం. అభినందనలు.
"ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన" అన్నది కొంచెం మార్చాలని సూచన. "ప్రాసాక్షరము పూర్ణబిందుపూర్వకమైన" అంటే బాగుంటుంది స్పష్టంగా.
జ్ఞ అనే అక్షరాఅనికి క ఖ గ ఘ చ చ జ ఝ శ ష స న ణ లతో యతి కుదురుతుంది. ఇటువంటి విషయాలు మరికొంత స్పష్టంగా వివరించగలరు.
విద్వత్ శీలురు శ్యామలీయం గారికి నమస్కారం.
రిప్లయితొలగించండిఈ వ్యాస మూలం http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july2007/yati_praasa_niyamaalu.html
(రచయత మీరే కాదుకదా)
మీ పరిచయానికి ధన్యవాదాలతో
ఆ వ్యాసం నాది కాదండీ. నా పేరు తాడిగడప శ్యామలరావు.
తొలగించండిమరికొంచెం విపులంగా మీరడిగిన సమాచారాన్ని కూర్చేందుకు ప్రయత్నిస్తాను. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలతో...
తొలగించండి