భారత దేశం లోనే అత్యంత ఎత్తైన ఇటుకలతో నిర్మించిన మినార్ గా ప్రసిద్ధి గాంచింది కుతుబ్ మినార్. ఇది UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గౌరవాన్ని పొందింది. ఇది ఢిల్లి లోని మెహ్రౌలీ వద్ద వున్న కుతుబ్ కాంప్లెక్స్ లో వుంది. ఇండో ఇస్లామియా నిర్మాణ కౌశలం కనిపించే ఈ నిర్మాణాన్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడని అతని పేరు మీదుగా కుతుబ్ మీనార్ అని పిలుస్తున్నారు. ఎర్ర యిసుక రాయి, పాలరాళ్ళను దీని నిర్మాణంలో వాడారు.
72.5 మీటర్లు (237.8 అడుగులు) ఎత్తువున్న ఈ నిర్మాణానికి 399 మెట్లను పైవరకూ నిర్మించారు. పునాది దగ్గర దీని వ్యాసం 14.3 మీటర్లు వుంది. పైకి వెళ్తున్న కొదీ ఇది సన్న బడుతూ చివరలో 2.75 మీటర్ల వ్యాసాన్ని కలిగి వుంటుంది. అంతస్తులుగా దీన్ని పరిగణలోకి తీసుకుంటే మొత్తం ఇది ఐదు అంతస్తుల నిర్మాణం. ఇప్పటికి వాడుకలో వున్న చారిత్రక ఆధారాలు 1192 లో కుతుబుద్ధీన్ ఐబక్ నిర్మాణం ప్రారంభించగా అల్తమష్ పూర్తి చేశాడని చెపుతున్నారు. కాల క్రమంలో జరిగిన అనేక భూకంపాలకూ, పిడుగు పాట్లకూ ఎన్నోసార్లు తట్టుకుని నిలబడింది.అక్కడక్కడ దెబ్బతిన్న బాగాలను వివిధ సందర్భాలలో బాగుచేసారు. దీనికి పునరుధ్దరణ, మెరుగుదల పనులు ఎక్కువగా ముస్లిం రాజుల కాలాలలోనే జరిగాయి. ఫిరోజ్ షా తుగ్లక్ (క్రీ.శ 1351-88) మరియు సికందర్ లోడి (1489-1517) లు ఈ పనిలో పాలు పంచుకున్నట్లు మీనార్ ఉపరితలం లో దొరికిన ఆధారాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ నిర్మాణం నిట్టనిలువుకు 60 సెంటీ మీటర్లు ఒరిగి వున్నదని అయితే అది అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ వర్షపునీరు పునాదుల్లో ఎక్కువగా చేరుతున్నట్లయితే ఈ ఒరగటం మరింత పెరుగుతుందేమో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
1981 కి ముందు ఈ మీనార్ ను ఎక్కేందుకు సందర్శకులకు అనుమతినిచ్చే వారు కానీ 1981 డిసెంబర్ 4వ తారీఖున జరిగిన తొక్కిసలాటలో 45 మంది మరణించారు వారిలో ముఖ్యంగా పిల్లలున్నారు. ప్రమాద వశాత్తూ కరెంటు పోవటంతో ఏర్పడిన చీకటి వలన కలిగిన భయం వల్ల ఏర్పడిన తొక్కిసలాట అది. అది ప్రధాన కారణం అయితే నిరంతరం ఎక్కదిగుతున్న సందర్శకులవలన కట్టడానికి నష్టం వాటిల్లుతుందన్న భయంతోనూ ఆ తర్వాత దీని అధిరోహణను నిషేదించారు.
దీని అసలు పేరు విష్ణుద్వజమా ?
కుతుబ్ మినార్ ఆవరణలోనే వున్న లోహశాస్త్ర విచిత్రం లాంటి ఇనుప స్థంబం పై 4 వ శతాభ్దానికి చెందిన బ్రహ్మీ లిపిలో రాయబడిన శాసనాధారాల ప్రకారం కుతుబ్ మినార్ పూర్వపు పేరు విష్ణుధ్వజ మని తెలుస్తుంది. విష్ణుదేవుని స్థంబమనే అర్ధంలో వాడారట. హిందు శిల్పకళా పద్దతిని ప్రతిబింబించేలా స్థంభంపై అలంకరించిన గరుడ శిల్పం వుంది. మీనార్ ను నిర్మించిన కొండ ప్రాంతాన్ని కృష్ణ పాదమని పిలుస్తారట.
దీనిని విజయస్తూపంగా ముస్లింపాలకులు పేర్కొన్నారు. మహ్మద్ ఘోరి పృధ్విరాజ్ పై సాధించిన విజయానికి ఇది చిహ్నం అని చెపుతారు. కానీ పానిపట్ లో జరిగిన యుద్దం తాలూకూ విజయస్థూపాన్ని మరి ఢిల్లీలో ఎందుకు నిర్మించారనేది ప్రశ్న. పోనీ ఆయన రాజధానిలో నిర్మించారనుకుందామనుకున్నా ఆయన రాజధాని ఢిల్లి కాదు అని ప్రశ్నిస్తున్నారు
అంతే కాకుండా స్థంబం నిర్మాణాన్ని పరిశీలించిన నిపుణుల అభిప్రాయం ప్రకారం అది ఒక ప్రాచిన వేధశాల లా వుందంటూ కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కొందరు చరిత్ర కారుల పరిశీలనల ప్రకారం క్రీస్తుకు పూర్వమే 280 లో సముద్ర గుప్తుడనే రాజు నిర్మించిన వేధశాల అని చెపుతున్నారు. స్థంభం పై దీని నిర్మాణానికి సంభంధించిన రాతలలో ‘‘శ్రీ విశ్వకర్మ ప్రసాద రచిత’’ అనే మాటలు వున్నాయట అంటే విశ్వకర్మ ఆశీర్వాదాలతో నిర్మించబడిన అనే అర్ధంలో వాడారు. ఇది హిందు మైధాలజీకి దగ్గరగా వుంది.
అయితే ఇనుప స్థంభం పై రాతలను కుతుబ్ మినార్ కు అన్వయించటం ఎలాకుదురుతుందని ఇది ఉదయగిరి నుంచి క్రీ.శ 10 వశతాబ్ధంలో ఇక్కడికి మార్చారని వాటి అన్వయాన్ని ఈ మీనార్ పై చెయ్యటం కుదరదనీ వాదిస్తున్నారు. ఆరు టన్నులకు పైగా బరువుండి 7.21 మీటర్ల పొడవున్న 98 శాతం స్వచ్ఛమైన చేత ఇనుముతో తయారైన ఈ లోహ శాస్త్ర వింతను రెండవ చంద్ర గుప్త విక్రమాదిత్యుడు (375–414 AD) ఉదయ గిరి లోని ఒక విష్ణు ఆలయం ముందు నిర్మించాడు. విష్ణుదేవాలయానికి నిర్మించిన స్థంబం కాబట్టి దీనినే విష్ణుద్వజంగా పేర్కాన్నారని అంతే కానీ అది మీనార్ కు సంభందించిన అంశం కాదని ఈ వాదలలోని ముఖ్యాంశం.
చారిత్రక నిర్మాణాల విషయంలో మతకోణం కంటే అప్పటి రాజుల అధికార దర్పాన్నే చూడాలి. ఇప్పుడు కూడా పరువు సంభందించిన విషయంగా కాక చారిత్రక సత్యాలను అర్ధం చేసుకునే విషయంగా తీసుకుంటే ఉత్తమం.
ఇదే విషయంలో ఫ్రొఫెసర్ యమ్ ఎస్ భట్నాగర్ విశ్లేషణ స్క్రిబిడ్ కాపీ ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
ఇదే విషయంలో ఫ్రొఫెసర్ యమ్ ఎస్ భట్నాగర్ విశ్లేషణ స్క్రిబిడ్ కాపీ ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
.మంచి వివరాలను అందించారు,.అక్కడ వున్న గోడలలోని రాళ్లు ఎక్కువ భాగం దేవాలయాలకు సంబంధించినవే వుంటాయ్,..చరిత్ర అనేది ఓ పాక్షికమైన సత్యమే,..
రిప్లయితొలగించండి