పదాలు అటూ ఇటూ పరుగులు తీస్తాయి
అర్ధాలు ఎటెటో దిక్కులు చూస్తాయి
ఆలోచనలు ముందుకి వెనక్కి వూగిసలాడతాయి
చివరికి,శూన్యంలోంచి పువ్వులు రాలుతాయి
అప్పుడేం జరుగుతుంది?
ఒక కవిత పుడుతుంది.
పుట్టగానే అది పరిమళిస్తుంది.
అంత మంచి కవిత,కాల ప్రవాహానికి ఎదురీది కలకాలం గుర్తుండిపోయే కవిత రాయాలంటే కవికి ఎటువంటి మానసిక స్థితి ఉండాలి? ఎలాంటి శిక్షణ కావాలి? ఇవన్నీ కవిత్వాన్ని చదువుతూ లేక రాస్తూ ఉన్నవారికి కలగాల్సిన అనుమానాలే,సందేహం లేదు.
మొదటిది: మానసిక స్థితి
సమస్యకు స్పందనను యధాతధంగా రాసిపారేయడం కవిత్వం కాదు.నిజానికి సమస్యకు కావాలసింది పరిష్కారం,కవిత్వం కాదు. సమస్య గురించి కవి తాను ఆవేదన చెంది పాఠకుడిని చైతన్య పరచదల్చుకుంటే ఆ విషయానికి సరి అయిన కవిత్వ రూపం ఇచ్చి మనసుకు హత్తుకునేలా సున్నితంగా చెప్పగలగాలి కానీ తిట్లు, విద్వేషాలు,శాపనార్థాలూ కవిత్వం కాదు.
కేవలం ఒక వర్గానికో కులానికో మతానికో తనని తాను పరిమితం చేసుకుని ఆ వర్గం,కులం లేదా మతానికి సంబంధించిన సమస్యలపైనే కవిత్వం అల్లే సంకుచిత మానవుడు కవి ఎలా అవుతాడు? విశ్వ నరుడే కవి కాగలడు.
ఆవేశాల్లోంచీ ఆక్రోశాల్లోంచీ పుట్టేది ఒక స్థాయి కవిత్వం మాత్రమే.కేవలం దిగులుని,దుఖాన్ని “గ్లోరిఫై” చేయడం కవిత్వం కాదు.కవిత్వం పాఠకుడి మానసిక స్థాయిని పెంచాలి.కవిత్వం చదిన తరువాత మనిషి మరి కొంచెం ఉన్నతుడు కావాలి.
అన్ని బాహ్య ప్రభావాలనూ, ఆలోచనలనూ వదిలి పెట్టాలి కవి. అన్ని సామాజిక విలువల వలువలను మురికి గుడ్డలను వదిలినట్టు వదిలేయాలి కవి. ఏకాంతంలో తన్ను తాను దర్శించుకోవాలి. ఈ విశాల ప్రకృతిలో, అప్పుడే పుట్టిన పాపాయిలా స్వచ్చంగా స్పందిస్తూ ఆ అనందంలో మమేకమవ్వాలి. అప్పుడు అల్లాంటి మానసిక స్థితిలోంచి పుట్టేది గొప్ప కవిత.
రెండవది: పదాల ఎంపిక
ఎల్లాంటి పదాలను వాడాలి? సరళమైన పదాలనూ,వినసొంపైన తేట తెలుగు పదాలనూ వాడాలి.ఏ ఏ పదాలు కలిస్తే కవిత అందం పెరుతుందో కవికి తెలియాలి.ఏ ఏ పదాలు కలిస్తే కవిత అందం చెడుతుందో కూడా తెలిసిపోవాలి.పదాలను పొదుపుగా వాడడంలో నైపుణ్యం సాధించాలి. ఇంగ్లీషు,ఉర్దూ,హిందీల్లాంటి అన్య భాషల పదాలను తెలుగు పదాలతో కలిపి కాలకూట కషాయాలను కాచి పాఠకుల చేత బలవంతంగా తాగించడం భావ్యం కాదు.
తెలుగు కవిత్వం తెలుగులోనే ఉండడం సమంజసం.
ఢమఢమలాడే పదాలను తెచ్చిపోస్తే అది ఘనమైన కవిత్వం అయిపోదు.
పాఠకుడిలో సున్నితమైన భావాలను మేలుకొలిపేదే కవిత్వం.
మూడవది: కల్పనాశక్తి
కవికి ముఖ్యంగా కావలసింది భావనా బలం,కల్పనా శక్తి. అల్లాగని ఊహలోంచి ఊహ,ఊహలోంచి ఊహలోకి వెళ్ళిపోతూ పాఠకులను గందరగోళానికి గురిచేయకూడదు. సరళంగా చెప్పగలగాలి.కవితకి ఒక తుది మొదలూ ఉండాలి.ఎక్కడించి ఎక్కడికో వెళ్ళిపోయి పాఠకుడిని గజిబిజి గల్లీల్లో వదిలేసి రాకూడదు. పదచిత్రాలే కవితకు ప్రాణం.
నాలుగవది: రూపం
వచన కవిత్వం అన్నారు కదా అని తుది మొదలూ లేకుండా వాక్యాలు వాక్యాలు రాసిపారెయ్యడం పరిపాటిగా మారింది తెలుగు దేశంలో.చందోబందోబస్తులు తెంచుకుందంటే దానర్ధం ఒక రూపం,నిర్మాణం,లయ లేకపోవడం ఎంత మాత్రం కాదు. పక్క పక్కన పేర్చితే వ్యాసమయ్యే వాక్యాల సముహాన్ని,ఒకదాని కింద ఒకటి రాసి దాన్ని కవిత్వమనడం మహాపరాధం. చక్కని రూపం,లయ మంచి కవితకు కావాల్సిన ముఖ్యమైన దినుసులు.
అయిదవది:వస్తువు
తీసుకున్న వస్తువు కవి మనసుకు బాగా దగ్గరదై ఉండాలి.ఎంత చిన్న విషయమైనా కవిత్వం కావచ్చు.నిత్య జీవితంలో జరిగే ఏ చిన్న సంఘటననుంచైనా కవిత్వం పుట్టవచ్చు.నిర్జీవ వస్తువులు కూడా కవితావస్తువులు కావచ్చు.
చివరగా,కవి ఏకాంతంలో తన కవిత్వాన్ని మెరుగులు దిద్దుకోవడం తాను పూర్తిగా సంతృప్తి చెందాకే పాఠకుల ముందు ఉంచడం చేస్తే తెలుగు పాఠకులకి పుంఖాలు పుంఖాలుగా వెలువడున్న కవితాసంకలనాల సముద్రాల్లో కొట్టుమిట్టాడే బాధ తప్పుతుంది.
courtesy source : పుస్తకం.నెట్
కవన రచనకు కావలసిన దినుసులని పేర్కొని చక్కగా చిక్కగా గుదిగుచ్చారు!ఏమి చేయాలో ఏమి చేయకూడదో విడమర్చి చెప్పారు!సృజనశక్తి లేకుండా భావుకత లేకుండా పంక్తి కింద పంక్తి రాస్తే అమాంతం కవనమయి కూర్చోదు!రాయకుండా ఉండగలిగితే కవిత్వం రాయకూడదు!కూకుండనీదురా కూసింతసేపు అనిపిస్తేనే కవిత్వం జాలువారాలి!రాయగానే సిరాతడికూడా ఆరకుండా టపాలకెక్కించి పత్రికలకి పంపించి ఫలితంకోసం పడిగాపులు పడకూడదు!కవనరసాయనం తెలిసినవాడే కవికాగలడు!ప్రతి చనుబాలకవి కవనంలో రాణించగలరని చెప్పలేము!ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసంతో నిరంతరం తపన పడాలి!అర్రులు సాచాలి!తపస్సు చేయాలి!
రిప్లయితొలగించండి