Narayana Sharma Mallavajjala |
విఙ్ఞానం రూపంలో ప్రకృతి మనిషిలోకి ప్రవేశించి అది కళ,సౌందర్యం రూపంలో వెలువడుతుందని ఆమేరకు దాని ప్రతిఫలనలుంటాయని లెనిన్ భావించాడు.ఇదే జీవితమైతే అది తత్వం రూపంలో వెలువడుతుంది.ఈ తత్వానికి అతిస్థాయి వేదాంతం.జీవితం గురించి తాత్వికంగా మాట్లాడుతున్నప్పుడు వేదాంతం ధ్వనించడం అందుకే కాబోలు.
జీవితానికి కొన్ని దశలుంటాయని అభిప్రాయముంది.వాస్తవంకూడా.వీటినే శైశవ,బాల్య,యవ్వన,కౌమార్య,దాంపత్య ,గార్హస్త్య,వార్ధక్య దశలుగా చెప్పారు.ఇవన్నీ ఒకటిగా సాగుతున్నట్టేగాని వీటన్నిటికీ కొనసాగింపు లేనట్టుగా అనిపిస్తుంది.దానికి కారణం గతం ఙ్ఞాపకంలా మిగలటం.శ్రీనివాస్ ఇలాంటి "ఎరుక"నే కవితా వాక్యాలుగా ప్రకటిస్తున్నారు.
ఈ కవితలో భార భూతమైన ఆలోచనా ధార ఉంది.అది ప్రతివాక్యంలోనూ ప్రవహిస్తుంది.
"నాకు ముందు నేనున్నాను./నా తర్వాతా నేనుంటాను."
"దారం ఉనికి తెలియనంత వరకూ
ప్రతిపూసా విడిననే మెలిపడుతుంది."
"రెండో ఇన్నింగ్స్/సెకండ్ లైఫ్
ద్విదానో, బహుదానో/అవిచ్ఛిన్న విచ్ఛిత్తి"
ఓభాగం పూర్తయ్యాక ఇంకోభాగాన్ని అనుభవిస్తున్నప్పుడు గతానికి సంబంధించి ఉండే ఉనికి సంఘర్షణ ఇక్కడ కనిపిస్తుంది.ఈ వచనంలో పరోక్ష ఆఖ్యానం(Indirect neretion)ఉంది.తాను దేని గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా ఉండదు.కాని చెబుతున్న దాన్ని ప్రతీ అక్షరమూ ప్రతిబింబిస్తుంది.సూత్రత ఉన్న దేనికదే ఒంటరిగా కనిపిస్తుంది.ఎన్నిరకాలుగా విడిపోతుందో కూడా అర్థం కాదు.
"నానుంచి వచ్చిన వాళ్ళుకాదు.
నాగుండా ప్రవహించిన వాళ్ళని తెలుసుకుంటాను.
చిన్నారి బుగ్గలు పుణికినప్పుడల్లా,
నాజ్ఞాపకాలతోనే నాకు వణుకు."
ఇందులోని ప్రతీవాక్యంలో మనోవైఙ్ఞానిక భూమిక కనిపిస్తుంది.ఫ్రాయిడ్ మనోమూర్తిమత్వ నిర్మితి(Anatomy of mental personaality)గురించి చెప్పాడు,ఇందులోని మూడు అంశాలలో మొదటిది అహం.ఈ అహం రెండు లక్షాల మేరకు పనిచేస్తుంది.1.సుఖ సంతోషాల అన్వేషణం2.బాధా దుఃఖాలకు దూరంగా ఉండటం.వ్యాకూలత(Anxeity)ప్రదర్శించడం ద్వారా రాబోయే బాధ దుఃఖాలను అహం పసిగడుతుంది."చిన్నారి బుగ్గలు పుణికి నప్పుడల్లా/నాఙ్ఞాపకలతోనే నాకు వణుకు." ఈవాక్యంలో ఆ తత్వం కనిపిస్తుంది.
అస్తిత్వవాదం ఒకటివచ్చకా దుఃఖాన్ని అనేకరకాలుగా వ్యక్తం చేయడం కనిపిస్తుంది.ఈ ఎరుక లోనూ అది కనిపిస్తుంది.మంచికవిత అందించినందుకు ధన్యవాదాలు కట్టా శ్రీనివాస్ గారు.
కవిసంగమం ఈనాటి కవిత
ఎరుక కవిత్వం
పుత్రోత్సాహం లాగానే కవితోత్సాహం కూడా కవికి కవితజనియించినపుడే కలుగదు జనులా కవితను కనుగొని పొగడగ/ చదువగ కవితోత్సాహంబునాడు ....
రిప్లయితొలగించండిఇవండీ శర్మగారూ నా మనసులో ఈ మీ విశ్లేషణ చదవగానే అనిపించిన మాటలు. కాకుంటే నాకిది డబుల్ దమాకా
అటు కొడుకు పుట్టిన రోజునాటి పుత్రోత్సాహం ఆ సందర్భంగా రాసుకున్న కవితపై మీవంటి చదువరి యైన విశ్లేషకుని మంచి మాటలు ఇలా చెప్పుకోవటం ఆడంబరంగానే అనిపించినా మరి అది నా సంబరం కదా.
....
అప్పుడప్పుడూ ఖాళీగా వున్నప్పుడు సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటుంటాను. ఒక క్యారెక్టర్ ఆటలో పొరపాట్లు చేసి లక్ష్యాన్ని చేరలేకపోతే రెండోది, కొన్నిట్లోది మూడొది లైఫ్తో ఆ ఆటలో అవకాశం వుంటుంది.
ఒక ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అవుతుంటుంది.
అదేమిటో మనజీవితం ఒక్కటే కదా ఒక సారి మనం ఎవరమైనా వెనక్కి తిరిగి చూసుకుంటే అరరే ఈ పొరపాట్లు చేయకుండా వుంటే మనం మరింత సరైన స్థానంలో వుంటే వాళ్ళం లక్ష్యాన్నిక మరింత చేరువగా వుండేవాళ్ళం అనుకోకుండా మానం. కానీ ఈజీవితాన్ని రెండోసారి జీవించలేముకదా అనుకునే వాడిని నా పిల్లలవైపు మరికొంచెం లోతుగా చూసేరోజుదాకా. ఎప్పుడో చదువుకున్న ఖలీల్ జీబ్రాన్ మాటలు తళుక్కుమనేదాక. సైన్సుపాఠం సినిమారీలులా ఓ సారి తిరిగొచ్చేదాక.
.....
అదే
ఆ ఒక్క ముక్కనే మీతో పంచుకుందాం అనిపించిది. మళ్లీ నిన్న నా కొడుకుని పుట్టిన రోజు బట్టల్లో కొంచెం ఎదిగాడు సుమా అని చూసుకుంటున్నప్పుడు.
విడివిడిగా కనబడే జీవన పయనంలో ప్రవహించే జీవనాడికి ఏకసూత్రత వున్నట్లే, గజిబిజిగా వదిలిన జిగ్ సా పోలికలలో ఒకే విషయపు గాఢతను అందిచాలనుకున్నను నిజంగా మీరా విషయాన్ని గమనించి చెప్పటం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిది.
క్షయకరణ విభజనలో రెండు సగాలు కలిసి ఒకటయ్యే లైంగికోత్పత్తికి ముందునుంచే వున్న రెండుగానో(ద్విధా) అనేకం(బహుధా) గానో విడిపోయి మరొతరం గా మారే జీవులకు మరణం లేనట్లే కర్బన సమ్మేళనానికి ఏదో సాప్ట్ వేర్ ఇన్ స్టాల్ కాగానే జీవిలా మనుగడ సాగిస్తోంది. నిజానికి పదే పదే అదే సాప్ట్ వేర్.. ద్రవ్య నిత్యత్వ నియమం లా చూస్తే శరీరాన్ని ఏర్పరచుతున్న పదార్ధం కూడా కొత్తగా పుట్టదు. ఆసాంతం నాశనమూ కాదు. జెనెటికల్ గా చూసినా లక్షణాలకు కారణమయ్యేది ఏదో ప్రవహిస్తూనే వుంది. అది ఇప్పటిది కాదు మనిషి కూడా ప్రారంబం కావడానికంటే ముందున్నది. దాన్ని చూడగలిగితే ప్రతి జీవినీ ఒక్కటిగా కలుపుతున్న దారంలా మనలోనే వుంటుంది.
.....
మనిషి పుట్టటం చావడం చాలా పెద్ద ప్రయాణంలో చిన్న మజిలీ, చిన్న విషయం మానవజాతి, జీవిజాతి ఎటుపయనిస్తుంది. దాని ప్రయాణానికి బిందురూపంలో కొంతమేర స్వతంత్ర చలనం కలిగిన మనమేం చేస్తున్నాం. మరింత ముందుకు మరింత సాఫీగా వెళ్లేందుకా?? లేక ప్రావాహం ఇంకిపోయి, ప్రమోదం బోసిపోయి నడకే నాశనం అయిపోయేందుకా, నా చిన్నారినే కాదు ఏ చిన్నారిని చూసినా నాతరం మీకేమిస్తోంది అని నాకెప్పుడూ వణుకే.
....
శర్మగారూ మీ లోతైన విశ్లేషణ తో పరోక్షఆఖ్యానాన్ని పట్టించినా మీ ప్రేమతో నన్ను ఉద్విగ్నతకు గరిచేసి ప్రత్యక్షవ్యాఖ్యానం చేయించారు. మీకు, కవిసంగమాననికీ స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా వందనం..
_/|\_