కలవరపెడుతున్న కచ్చాతీవు - డా॥గోపరాజు నారాయణరావు

చైనా అల్లుకుంటూ వస్తున్న ‘ముత్యాలదండ’ (పెర్ల్ గార్లెండ్) వ్యూహం మేరకు ఇప్పటికే కెదర్ (పాక్), హింగ్ హి (మయన్మార్), మాల్దీవులు, అంబన్‌థొట్టా (లంక)లలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కచ్చాతీవులో డ్రాగన్ కదలికలు సుస్పష్టం.  భారతీయ క్రైస్తవులు చెప్పిన సమాచారం ప్రకారం కచ్చాతీవులో చైనా సేనల గుడారాలు ఉన్నాయి.
 

‘భారతదేశమంటే కేంద్ర సర్కారు సొంత జాగీరని కాంగ్రెస్ అనుకుంటున్నదా?’ ఈ సెప్టెంబర్ 2న రాజ్యసభలో అన్నా డీఎంకే సభ్యుడు వి.మైత్రేయన్ వేసిన ప్రశ్న ఇది. 1962 ముందు అక్సాయ్‌చిన్, నీఫా సరిహద్దుల గురించి పార్లమెంటు చర్చించినప్పుడు సరిగ్గా ఇలాంటి ప్రశ్నకే నెహ్రూ సమాధానం చెప్పవలసివచ్చింది. గడ్డిపోచ కూడా మొల వని ప్రదేశం గురించి ఎందుకు బెంగ? అం టూ మహావీర్ త్యాగీని ప్రథమ ప్రధాని దబాయించారు. తరువాత చైనాతో యుద్ధం జరి గింది. ఈ కాలంలో వచ్చిన మార్పు ప్రమాదకరమైనది. గడ్డిపోచలు మొలవకపోవచ్చు. కానీ తుపాకి గిడ్డంగులు అలాంటి చోట వెలి సే ముప్పు ఉంది. అన్నా డీఎంకే సభ్యుడు వేసిన ప్రశ్న- నిర్మానుష్యంగా ఉండే దీవిలో పొంచి ఉన్న విపత్తు గురించినది. ఇప్పుడు ఆ విపత్తు గురించి తమిళ ఎంపీలూ, పార్టీలే కాదు, దేశం మొత్తం ప్రశ్నించుకోవాలి.
 
భారత్, శ్రీలంక మధ్య సరిహద్దు జలాలలో ఉన్న కచ్చాతీవు 285 ఎకరాల చిన్న దీవి. ఈ రెండు దేశాల మధ్య సముద్రాన్ని మూడు సెక్టార్లుగా విభజిస్తారు. ఇందులో రామేశ్వరం (భారత్); తలైమన్నార్ (శ్రీలంక)- ఆడమ్స్ బ్రిడ్జ్ వరకు ఉండే సెక్టార్‌ను పాక్ జలసంధి అంటారు. కచ్చాతీవు ఇందులోదే. ఈ సెక్టార్ రామేశ్వరానికి ఈశాన్యంగా 11 నాటికల్ మైళ్ల దూరంలోను, తలైమన్నార్‌కు ఆగ్నేయంగా 18 నాటికల్ మైళ్ల దూరంలోను ఉంది. ఈ దీవిలో వందేళ్ల నాటి సెయింట్ ఆంథోనీ కేథలిక్ చర్చి తప్ప జనసంచారం ఉండదు. 1974 లో ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, సిరి మావో బండారు నాయకే మధ్య, రెండేళ్ల తరువాత రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగిన చర్చల మేరకు (కరుణానిధి హయాంలో) కచ్చాతీవును శ్రీలంకకు ధారాదత్తం చేసినట్టు కేంద్రం చెబుతోంది.
 
 కానీ 1974 నాటి ఒప్పందం ‘సగం అచ్చయిన రూపాయి నోటు’ వంటిదని వ్యాఖ్యానిస్తారు. ఎందుకం టే, ఆ అప్పగింతను పార్లమెంటు ఆమోదిం చాలి. అది జరగలేదు. తాజాగా కచ్చాతీవును భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు రాజకీయ పార్టీలు కోరుతున్నా యి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జూన్, 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ రెండు ఒప్పందాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కూడా ఆమె కోరారు. ఈ అంశం మీద కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కచ్చాతీవును తిరిగి స్వాధీనం చేసుకునే ప్రశ్నే లేదని పేర్కొన్నది. దీనితో తమిళ పార్టీలకూ కేంద్రానికీ మధ్య ఘర్షణ అనివార్యమైంది.
 
 కచ్చాతీవు భారత యూనియన్‌లోనిదేనని కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. రామనాథపుర రాజవంశం ఏలిన ఎనిమిది దీవుల లో ఇదొకటి. అక్కడ చేపల వేటకీ, ముత్యాల వెలికితీతకీ ఆ వంశీయులే అబ్దుల్ మరికర్‌కు ఏడు వందల రూపాయలకు లీజుకు ఇచ్చారనీ ఇందుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని ఆ వంశీకుడు రాజకుమారన్ సేతుపతి ఇటీవలే చెప్పారు. ఈ పత్రాలను కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వవలసిందని కరుణానిధి కూడా జయకు సలహా ఇచ్చారు. కచ్చాతీవు శ్రీలంకదేనని 2010 ఆగస్టులో నాటి విదేశాంగ మం త్రి ఎస్‌ఎం కృష్ణ ప్రకటించారు. ఒకసారి ధారాదత్తం చేస్తే ఇక మనది కాదనీ, అక్కడకు వెళ్లే తమిళ జాలర్లకు రక్షణ కల్పించలేమనీ కూడా వెల్లడించారు. అదే సమయంలో భారత్ ఏ భూభాగాన్నీ ఎవరికీ అప్పగించలేదనీ, ఏ భూభాగం మీదా సార్వభౌమాధికారాన్ని వదులుకోలేదనీ తాజాగా కేంద్రం పేర్కొనడం విశేషం. శ్రీలంక కూడా ఘర్షణ వైఖరికే మొగ్గుతోంది. 1974 ఒప్పందం చెల్లదని భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదని 2010 లోనే ఆ దేశం తమిళనాడు ప్రభుత్వానికి నోటీ సు ఇచ్చింది. ఇక, ఎల్‌టీటీఈ సమస్య దరి మిలా శ్రీలంక ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పుతో కచ్చాతీవులో తమిళజాలర్లు ప్రవే శం ప్రాణాంతకంగా మారిపోయింది. 1974 ఒప్పందం ప్రకారం ఇక్కడ భారతీయ జాలర్లు వేటాడవచ్చు. వలలు ఎండబెట్టుకోవచ్చు. ఈ అంశం మీదనే తమిళ పార్టీలతో పాటు బీజేపీ, సీపీఐ కూడా గళమెత్తాయి.
 
 కచ్చాతీవులో విజృంభిస్తున్న భారత వ్యతిరేక పవనాల గురించి కేంద్రం ఎందుకు కినుక వహిస్తున్నదో అర్థం కాదు. ఈ గొడవ మొదలైన తరువాత సెప్టెంబర్ 10న కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ సహాయ మంత్రి ఈఎం సుదర్శన్ నాచియప్పన్ మరీ చిత్రమైన ప్రకటన చేశారు. ఢిల్లీలోని ప్రగతీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన విధంగానే కచ్చాతీవులో వాణి జ్య ప్రదర్శన నిర్వహించడం సాధ్యంకాగలదే మో శ్రీలంక ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెన్నైలో ప్రకటించారు.
 
 కేంద్రానికి కచ్చాతీవు లో వాస్తవ పరిస్థితులు తెలియవని తమిళ మేధావులు, ఆందోళనకారులు విమర్శిస్తున్న ది ఇందుకే. శ్రీలంక అజమాయిషీ ఆరంభమ య్యాక కచ్చాతీవును పవిత్రదీవి (చర్చి వల్ల) గా ప్రకటించింది. కానీ ఆ పుణ్యభూమిని భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చింది. చైనా అల్లుకుంటూ వస్తున్న ‘ముత్యాలదండ’ (పెర్ల్ గార్లెండ్) వ్యూహం మేరకు ఇప్పటికే కెదర్ (పాక్), హింగ్ హి (మయ న్మార్), మాల్దీవులు, అంబన్‌థొట్టా (లంక)ల లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కచ్చాతీవులో డ్రాగన్ కదలికలు సుస్పష్టం. ఏటా ఆంథోనీ చర్చిలో జరిగే 3 రోజుల ఉత్సవాలకు మన రెండు దేశాల మత గురువులు, క్రైస్తవు లు హాజరవుతారు. భారతీయ క్రైస్తవులు చెప్పిన సమాచారం ప్రకారం కచ్చాతీవులో చైనా సేనల గుడారాలు ఉన్నాయి. భారత్ జాలర్లను వెంటాడి చంపుతున్న గస్తీ నౌకలలో చైనా సైనికులు కనిపిస్తున్నారు.
 
 కచ్చాతీవులో వేటాడే హక్కు తమిళ జాల ర్లకు ఉండాలని జయ కోరడం సబబే. కానీ అంతకుమించి కేంద్రం నిర్వహించాల్సిన గురుతర బాధ్యత కూడా ఉందని ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. సుప్రీం నిర్ణయం తరువాత ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.ఇది  సాక్షి దినపత్రిక లో 18-09-2013 న ప్రచురింపబడిన వ్యాసం

కామెంట్‌లు