మాటలు నేర్చిన సినిమా : భక్త ప్రహ్లద ఎప్పుడు రిలీజయ్యింది?

మన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’. తెలుగు నాట టాకీ వేళ్లూనుకోవడానికి ఈ సినిమానే శ్రీకారం చుట్టింది. అందుకే ఈ చిత్రం విడుదలైన రోజుని తెలుగు సినీ ప్రియులందరూ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. నిన్న మొన్నటివరకూ ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ 15న విడుదలైందనే అనుకున్నారు. అయితే సీనియర్ పాత్రికేయుడు రెంటాల జయదేవ నాలుగేళ్లు శ్రమించి, ఎంతగానో పరిశోధించి విడుదల తేదీపై వాస్తవ చరిత్రను వెలికి తీశారు. ఆయన పరిశోధన ప్రకారం తెలుగు సినిమా అసలు సిసలు పుట్టినరోజు 1932 ఫిబ్రవరి 6. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సంపాదించారు. మొత్తం 9,762 అడుగుల నిడివి గల పది రీళ్ల ‘భక్తప్రహ్లాద’ చిత్రం 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది.

ఆ సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్-11032. ‘తొలి 100% తెలుగు టాకీ’గా సగర్వంగా ప్రకటించుకున్న ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్‌లో తొలుత విడుదలైంది. ఆ లెక్క ప్రకారం ఈ సినిమాకు నేటికి 82 ఏళ్లు నిండాయి. అప్పటి వరకూ సినిమా అంటే బొమ్మలు కదులుతాయి కానీ మాటలేమీ వినబడని స్థితినుంచి హిందిలో తొలి టాకీ అర్దేషిర్‌ ఇరానీ ‘‘అలం ఆరా’’ తర్వాత తెలుగులో దీన్ని నిర్మించారు.

ఈ కథని అప్పట్లో సురభీ నాటక కంపెనీ వేస్తుండే వారు. వారితో ఒప్పందంచేసుకుని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు.

రెండేళ్ళ తర్వాత విజయవాడలో ప్రదర్శిస్తున్నప్పుటి పోస్టర్ లో చెప్పినట్లు భారీబడ్జెట్ తో తీసారు. నిజమండీ పద్దెనిమిది నుంచి ఇరవైవేల రూపాయిల వరకూ వెనకాడకుండా ఖర్చుపెట్టారు. సురభి కమలాబాయి చిత్రంలో లీలావతి పాత్ర పోషించారు. మొదట 500 రూపాయిలు ఇద్దామనుకున్నా చాలా బాగా నటించారని పారితోషకాన్ని భారీగా పెంచి 1000 రూపాయిలు చేసేశారు. టైటిల్ రోల్ చేసింది 9 సంవత్సరాల కృష్ణారావు తొలి టాకీ హీరో కదా అందుకే తనకి కూడా 400 రూపాయిలు ఇచ్చారు. సంగీత దర్శకులంటూ ప్రత్యేకంగా లేరు వున్న వరసల్నే వాడుకుంటూ ఏదో ఒక 40 పాటలూ పద్యాలూ పెట్టారు 108 నిమిషాల ఈ సినిమాను 21 రోజుల పాటు సుధీర్ఘ షూటింగ్ చేసారు తెల్సా. హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి హార్మొనీ వాయిస్తూ అందరికీ పాట, పద్యం నేర్పారు. సరే అక్కడక్కడా బొమ్మ కనపడక పోయినా సౌండు ఒక్కోసారి గందరగోళంగా వచ్చినా జనం విరగబడి చూసారు. ఇంకా చెప్పాలంటే నాలుగణాల టిక్కెట్లు నాలుగు రూపాయిలకు కూడా కొనుక్కున్నారంటే ఎంత బ్లాక్ బస్టర్ సూపర్ డూపరో అంచనా వెయ్యెచ్చు మనం. సికింద్రాబాద్ లోనే 10 నెలలు ఆడిందీ సినిమా.

చిత్రపు నారాయణమూర్తి గారి దర్శకత్వంలో స్వాతంత్రానికి మందే 1942 లో ఇదే పేరుతో మరోసినిమా వచ్చింది. రోజారమణి ప్రహ్లాదునిగా 1967 లో మరో సినిమా వచ్చాయి.


నిజానికి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే, తెరపై బొమ్మలు తెలుగులో మాట్లాడాయి. ”తొలి భారతీయ తమిళ – తెలుగు టాకీ” ‘‘ కాళిదాస్’’ ‘భక్త ప్రహ్లాద’ కన్నా దాదాపు మూడు నెలల పైచిలుకు ముందే తెరపై బొమ్మలు తెలుగు మాట్లాడిన సినిమా ఈ ‘కాళిదాస్‌’. ఈ చిత్రానికి రూపకల్పన చేసిన దర్శకుడు  ‘దక్షిణ భారత సినీ పితామహుడి’గా తరువాతి కాలంలో పేరొందిన తెలుగు వాడు హెచ్‌.ఎం. రెడ్డిగా ప్రసిద్ధుడైన హనుమప్ప మునియప్ప రెడ్డి!! ”తొలి తమిళ – తెలుగు టాకీ” ‘కాళిదాస్‌’ 1931లో బొంబాయిలో తయారైంది. తొలి భారతీయ టాకీని రూపొందించిన అర్దేషిర్‌ ఇరానీయే దీన్ని కూడా నిర్మించారు. ఆనాటి ”సుప్రసిద్ధ దక్షిణ భారత రంగస్థల నటి” టి.పి. రాజలక్ష్మి కథానాయికగా నటించారు. మూకీల రోజుల నుంచి బొంబాయిలో ఉన్న మన తెలుగు వెలుగు ఎల్‌.వి. ప్రసాద్‌ తొలి భారతీయ టాకీ ‘ఆలమ్‌ ఆరా’లో లాగానే, ఈ తొలి తమిళ – తెలుగు టాకీలోనూ ఓ చిన్న వేషం (”పురోహితుడు”గా) వేశారు. ఈ తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం మొదటిసారిగా 1931 అక్టోబర్‌ 31న విడుదలైంది. ఆ తరువాత మూడు నెలల పైచిలుకుకు 1932 ఫిబ్రవరి 6న తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ జనం ముందుకు వచ్చింది.


1931 తొలి నాళ్ళకే భారతదేశంలో విదేశీ టాకీలు విడుదల కాసాగాయి. తొలి భారతీయ టాకీ ‘ఆలమ్‌ ఆరా’ 1931 మార్చి 14న రిలీజైంది. హిందీ, ఉర్దూల్లో మాటలు, పాటలున్న ఆ సినిమా అదే రోజున బొంబాయితో పాటు మన విజయవాడ లాంటి దక్షిణ భారత ప్రాంతాల్లోనూ విడుదలైంది.



ఈయనెవరో తెలుసా?

వల్లూరి వెంకట సుబ్బారావు
తొలి తెలుగు సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన కథానాయకుడు, సుప్రసిద్ద రంగస్థల నటుడు వల్లూరి వెంకట సుబ్బారావు. గారు. నటశేఖర అనే బిరుదు మొట్టమొదట ఈయన గారిదే. గుంటూరు జిల్లాలోని మునిపల్లెలోపుట్టడం వల్ల మునిపల్లె సుబ్బయ్యగా ప్రఖ్యాతులయ్యారు. వెంకటగిరి రాజా వారిచే "నటశేఖర" బిరుదు అందుకున్నారు. అప్పట్లో సురభి సమాజంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుడు సుబ్బయ్యనే.

1929లో తండ్రి చనిపోవడంతో సుబ్బయ్య స్వగ్రామమైన మునిపల్లెకు తిరిగివచ్చాడు. హెచ్.ఎం.రెడ్డి కోరిక మేరకు దొరస్వామి నాయుడు (భక్తప్రహ్లాద సినిమాలో ఇంద్రుడు పాత్రధారి) మునిపల్లె వెళ్ళి సుబ్బయ్యను బొంబాయికి తీసుకుని వచ్చాడు.

1931లో హెచ్.ఎమ్.రెడ్డి రూపొందించిన తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో హిరణ్యకశపునిగా నటించి మునిపల్లె వెంకటసుబ్బయ్య చరిత్ర సృష్టించాడు. ఈయన తొలి తెలుగు కథానాయకుడే కాక, తెలుగు సినిమాలలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఘనత కూడా సాధించాడు. 1937లో రూపొందిన సతీ సులోచన అనే చిత్రంలో రావణబ్రహ్మగా, ఇంద్రజిత్‌గా అలరించి ఓ కొత్త ప్రక్రియకు నాంది పలికాడు. ఆ తరువాత ద్రౌపదీ మానసంరక్షణం, సతీ సావిత్రి తదితర చిత్రాల్లో నటించాడు సుబ్బయ్య. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'సతీ సావిత్రి'లో సుబ్బయ్య యమధర్మ రాజు పాత్రను పోషించాడు.

భక్త ప్రహ్లాదుడు ఖమ్మం జిల్లావాడేనట

ప్రహ్లాదుడు పాత్ర కథానాయకుడు అనుకున్నా మొదటి భక్త ప్రహ్లద చిత్రంలో ప్రహ్లాదునిగా నటించిన కృష్ణాజిరావు సింధే గురించి చెప్పుకోవాలి. ఖమ్మంలో 1923లో సురభి నాటక కళాకారులైన రాములమ్మ- రంగారావులకు ఏకైక సంతానంగా జన్మించాడు కృష్ణాజిరావు సింధే. తన నట జీవితం రెండవ యేటనే మొదలైంది. సురభి నాటక సమాజంలోని కుటుంబాలకు చెందిన పసిపిల్లలే ఆనాడు అనేక బాలపావూతల్లో వేషాలు వేశారు. మన కృష్ణాజిరావు బాలకృష్ణుడుగా, కనకశేనుడుగా, భక్త ప్రహ్లాదుడుగా, లోహితుడుగా పలు పౌరాణిక వేషాలు వేసేవాడు. తన నాలుగో యేట అంటే 1926లో వీరి నాటక బృందం మద్రాసు వెళ్లింది.

‘భక్త ప్రహ్లాద’ సినిమా నిర్మాణం మొదలయ్యే నాటికి కృష్ణాజిరావు వయస్సు ఏడేళ్లు. ప్రహ్లాదుని పాత్రకోసం మొత్తం ఐదుగురు పోటీ పడ్డారు. వారిలో ‘అమ్మా! ఇటు బంగారు బండి నాకియ్యన్’ అని పాడిన కృష్ణాజిరావునే దర్శక నిర్మాతలు ఎంపిక చేశారు. బొంబాయిలో 20 రోజుల పాటు మొత్తం నాటకం రూపుతోనే చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ చిత్రంలో కృష్ణాజిరావుకు ఒక పాట, రెండు పద్యాలు ఉన్నాయి. అయితే, వాటిని ఆయనే స్వయంగా పాడటం మరో విశేషం.

సినిమా చిత్రీకరణ సమయంలోనే వాయిస్8 రికార్డింగ్ కూడా ఏకకాలంలోనే జరిగేది. పద్యం గుర్తుకు రాక, చదవడం సరిగ్గా రానపుడు... ఎదురుగా బోర్డుమీద రాసి ఉంచేవారు. అది చూసి కృష్ణాజిరావు పాడే వాడు. ఈ సినిమా టైటిల్స్‌లో కృష్ణాజిరావు పేరు ‘మాస్టర్ కృష్ణ’ అని వేశారు.

ఇందులో నటించినందుకు ఆయనకు ముట్టిన పారితోషికం రూ.400 లు. ‘భక్త ప్రహ్లాద’ విడుదలై విజయవంతంగానే ఆడింది. సికింవూదబాదులోనూ విడుదలై ఎక్కువ కాలం ప్రదర్శితమైంది. అయితే ఇదే సమయంలో బొంబాయిలో మత కలహాలు రేగాయి. దాంతో ఆయన తల్లిదంవూడులు భయపడి పోయారు. ఒక్కగానొక్క కొడుకైన కృష్ణాజిరావును అక్కడ్నించి ఖమ్మం తెచ్చేశారు.

ఒకవేళ అలా జరగకపోయి వుంటే ఎలా ఉండేదో కాని మన కృష్ణాజిరావుకు మొదటి చిత్రమే దురదృష్టవశాత్తూ చివరి చిత్రమైంది. మళ్లీ సురభి సంస్థలో చేరి నటన వైపు వెళ్లకుండా హార్మోనియం నేర్చుకున్నాడు. అలా హార్మోనియం ప్లేయర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా సురభి నాటక సమాజానికి ఆయన చాలాకాలం తన సేవలు అందించారు. ఈ సురభి నాటక సమాజంలో పెద్దలైన వనారస రామయ్య, గోవిందరావు, కమలబాయి, పూర్ణిమ, సుభవూదమ్మ, శాంతాబాయిల పద్యాలకు ఈయనే వరుసలు చేశారు. అయితే, ఆయన జీవితం ఎంతో కాలం సాఫీగా సాగలేదు. అష్టకష్టాలు అనుభవించారు. ఆయన భార్య కేన్సర్ బారిన పడి మృతి చెందగా, కొడుకులు, కూతుళ్లు కూడా పేదరికాన్ని అనుభవించారు.

1957లో సురభి సంస్థలోంచి బయటకు వచ్చిన కృష్ణాజిరావు తణుకు దగ్గర్లోని ఉండ్రాజవరంలో స్థిరపడి, కొంతకాలం చిల్లర దుకాణం నడిపాడు. అందులో నష్టాలు వస్తే కూలి పనులు చేసి మట్టి తట్ట మోశాడు. మొదటి టాకీలో నటించి చరివూతలో నిలిచిపోయిన అంత గొప్ప నటుడు ఇలా పలుగు, పార పటి ్టమన్నుమోసి జీవికను గడిపిన దైన్యజీవి అని తెలిస్తే ఎవరికైనా హృదయం కరుగుతుంది. ఆయన ఇద్దరు కొడుకులు, ముగ్గురు ఆడపిల్లల్లో ఒక్క కుమార్తె అల్లుడు మాత్రం సురభి సంస్థలో పనిచేసేవారు. మళ్లీ వాళ్ల చొరవతో సురభిలోకి పునఃవూపవేశించారాయన.

2001లో ఒకనాడు - ఆనాటి ‘ఉదయం’ దినపత్రిక మొదటి పేజిలో ‘భక్త ప్రహ్లాద బతికే ఉన్నాడు’ అన్న వార్త రావడంతో ఈయన వెలుగులోకి వచ్చారు. కథనంతో కొందరు మేల్కొన్నారు. కృష్ణాజిరావును హైదరాబాదుకు పిలిపించి, ‘మా’ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఆయనకు కొంత ఆర్థిక సహాయమూ అందించారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా గడిపేందుకు ఇది ఆయనకు తోడైందనాలి.

2004 సెప్టెంబర్ 7. తన కూతురును చూడటానికి కడపజిల్లా కలసపాడుకు వెళ్లిన కృష్ణాజిరావు దురదృష్టవశాత్తు అక్కడే తుదిశ్వాస విడిచారు


కామెంట్‌లు