లఘు కవితా ప్రక్రియ ‘‘ రెక్కలు ’’

రెక్కలు ఆరుపాదాల ప్రక్రియ.
దీనికి ఎలాంటి నియమం లేదు గాని మొదటి నాలుగు పాదాల తర్వాత ఒక ఎడం,
దాని తర్వాత రెండు పాదాలువస్తాయి.
అంటే పంక్తులను రెండు భాగాలుగా విడగొట్టడం జరిగింది.

దు:ఖాన్ని ఉపశమింపజేసే తాత్వికమైన ఓదార్పు


రెక్కలు కవిత ఆరు పాదాల్లో ఉంటుంది. మొదట నాలుగు పాదాలు రాసి, చిన్న గ్యాప్‌ ఇచ్చి మిగతా రెండుపాదాల్ని రాస్తుంటారు. ఈ ఎడం పాఠకుని ఊహకు పదునుపెట్టేదిగా వుంటుంది. రెక్కలు కవిత రెండు భాగాలుగా ఉంటుందన్నమాట! పై నాలుగు పాదాలు పక్షి శరీరంగాను, మిగతా రెండూ పక్షి రెక్కలుగాను భావిస్తూ దీనికి ‘రెక్కలు’ అనే పేరుపెట్టారనుకోవచ్చు. ఈ రెండు పంక్తులు రెక్కలై ఎగరనిదే సందేశం పూర్తికాదు.  వీటి గురించి ప్రముఖ విమర్శకుడు డా అద్దేపల్లి రామమోహనరావు వ్యాఖ్యానిస్తూ ‘పైనాలుగు పాదాలు ఒక జీవితానుభవాన్ని గూర్చి చెబితే, చివరి రెండు పాదాలు ఆ అనుభవం ద్వారా కవి చెప్పదలచిన తత్త్వం గూర్చి చెపె్తై. జీవితానుభవం నుంచి ఉపరితలానికి వెళ్ళి ఆలోచిస్తేనే తత్త్వం విశదమౌతుంది. రెక్కలతో, ఆకాశంపైకి ఎగిరితేనే చలనం ఉన్నతమౌతుంది అన్నారు. ‘‘స్పష్టమైన లక్ష్యం, లక్షణం రెక్కల్ని ప్రతిభావంతం చేశాయి. రెక్కలు అంటే పైకి ఎగరడానికి ఉపకరించేవి అని అర్థం.’’అని పేర్కొన్నారు.

“రెక్కలు’ను నూతన కవితా ప్రక్రియగా చేసి అందించిన వారు ఆనాటి పైగంబరకవి యం.కె.సుగమ్‌బాబు. కేవలం తెలుగులోనే కాకుండా ఆంగ్లంలోకీ ఈ కవితలు అనువాదం పొందాయి. సుగమ్‌ బాబు రాసిన కొన్ని ఎంపికచేసిన రెక్కలు కవితల్ని డేవిడ్‌ షూల్‌ మ్యాన్‌, ఆవులమంద మోహన్‌ ఆంగ్లంలోకి అనువదించగా, డా నోముల సత్యనారాయణ సంపాదకత్వంలో అది  2008లో ప్రచురితమైంది. తర్వాత కాలంలో శ్రీనివాస గౌడ్‌ ‘వెలుతురు వెలయాలు’, పద్మకళ ‘దృష్టి’, పెద్దూరి వెంకటదాసు, ధూర్జటి, షరీష్‌భాయ్‌ ముగ్గురూ కలిపి ‘త్రివేణి రెక్కల శతకం’ (2011), మల్లవరపు చిన్నయ్య ‘ఆమని’- ఇంకా చాలా మంది రెక్కలు కవితా సంపుటాల్ని ప్రచురిస్తున్నారు. రెక్కలు కవిత్వాన్ని పత్రికలు కూడా విరివిగానే ఆదరిస్తున్నాయి. 

పి.శ్రీనివాసగౌడ్‌, రంగనాథ్‌, కేతవరపు రాజ్యశ్రీ, ద్యావరి నరేంద్రరెడ్డి ఇత్యాది కవులు “రెక్కలు’ప్రక్రియలో రచనలు చేస్తున్నారు.దాదాపు ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యి సుమారు దశాబ్దకాలంలోనే  60 కి పైగా రెక్కల సంపుటాలొచ్చాయట.

'సీస' కవిత్వ ప్రక్రియకు, 'రెక్కలు'కు గల పోలిక

ప్రాచీన చందోబద్ద రచనల్లో సీసపద్యానిది పత్యేకమైన స్థానం దానిలో  సీసం తర్వాత ముగింపులో ఆటవెలది కానీ, తేటగీతి గానీ చెప్పాలి. అదే పద్దతిలో రెక్కలు ప్రక్రియలో చివరి భాగం వుంటోందని విశ్లేషకులు పేర్కొన్నారు.

నాలుగు భాగాలుగా ఉన్నా, ఇది హైకూ, నానీల మాదిరిగా కాకుండా సిలబల్స్‌ లేదా అక్షర నియతికంటే పాదాలు, పదాల నియమానికి కట్టుబడినట్లుంది. ఒకటి నుండి మూడు పదాల వరకూ ఒక్కో పాదంలో పాటిస్తున్నారు. ఎక్కవమంది చివరి రెండు పాదాల్లో చివరి పాదాన్ని ఒకే పదంతో ముగించడం కనిపిస్తుంది. అలాగే మరో నియమం- ఎక్కువ మంది ఆరు పాదాల్నీ ఒకటి రెండు పదాలతోనే కవిత్వీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల సంక్షిప్తతతో పాటు, కవితకి సూటిదనం వస్తుంది.

సుగమ్‌బాబు గారి  అంతర్యానం రెక్కల సంపుటిలోని తొలి రెక్కను పరిశీలించి దాని లక్ష్య, లక్షణాలను తెలుసుకుందాం-

ఆదికవి ఆక్రందనే
తొలిశ్లోకం
అలా ఉపశమించింది
ఆక్రోశం-

దు:ఖ పరిహారం
కవిత్వం!


సాహిత్య ప్రపంచంలో అత్యంత సుపరిచితమైనది ఆదికవి వాల్మీకి శ్లోకం.

''మానిషాద ప్రతిష్టాం త్వమగమ: శాశ్వతీ సమా:
యత్క్రౌంచ మిధునాధేక మవధీ: కామమెహితమ్‌''


అంటే ఈ రెక్కలో వాల్మీకి అధిక్షేప శ్లోకం ద్వారా జరిగిన అన్యాయం ఉపశమించింది అన్నభావం వ్యక్తమైంది. దు:ఖ నివారణ మార్గం కవిత్వం అనేది ఒక తత్వంగా చెప్పబడింది.

కొన్ని విమర్శలు, సమాధానాలు

వచనానికి నిభందనలని జోడించి ప్రక్రియగా పేర్కొనడం వల్ల అదనపుప్రయోజనం ఏమి వుంటుందని, ఆధునిక ఛందోబందనాలను కవిత్వానికి తొడగటం కంటే మినికవితలను అలాగే వుండనివ్వొచ్చుకదా అనే కొందరు సాహితీవిమర్శకుల వాదన వున్నప్పటికీ ఒకపద్దతి ఎంచుకుని రాయడం వల్ల తొలినడకలకు చేదోడుగా వుంటుందనేది వివిధ నూతన ప్రక్రియలను అభిమానిస్తున్నవారి సమాధానం.. ప్రక్రియ ఏదైనప్పటికీ కవిత్వాన్ని వదలకుంటే పాఠకుల మనసులని తప్పకుండా రంజింపజేస్తుంది.




ప్రత్యేక ధన్యవాదాలు

►  డాక్టర్ ధార్ల వెంకటేశ్వరరావు గారి సూర్య దినపత్రికలోని వ్యాసం : 
జీవన తాత్త్వికతను ఎగరేసే రెక్కలు !
ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం
ఆరోగ్యకరమైన పోటిలో నానీలు-రెక్కలు (ఆంధ్రప్రభ)



కామెంట్‌లు