బతుకమ్మ తెలంగాణాలో మాత్రమే జరుపుకోవడం వెనుక కారణం ఏమిటి?



బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.

మహిషాసుర మర్ధని నేపద్యంలో చెప్పే బతుకమ్మ కథ: శ్రీగౌరి మహిషాసురుని చంపిన తర్వాత (ఆశ్వీయుజ శుద్ధ పాఢ్యమినాడు) అలసటతో మూర్చపోయింది. ఆ మూర్చనుంచి ఆమెను తేర్చటానికి స్త్రీలంతా గుమిగూడి పాటలు పాడినారు. సరిగ్గా పదవరోజున ఆమె మూర్చనుంచి తేరుకొని స్పృహలోకి వొచ్చింది. మూర్చలోని ఆమెను తిరిగి ‘బతుకమ్మా’ అని పాడితే బతికింది. గనుక ఆ పదిరోజులు పండగ జరుపుకొంటారు.

కాపు బిడ్డ కథ..

పూర్వంలో కాపు దంపతులకు పుట్టిన పిల్లలు పురిట్లోనే చనిపోతే ఎడవ కాన్పులో పుట్టిన బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొడుకు పుట్టడం. కొంత కాలానికి బతుకమ్మకు పెళ్లి చేసిన తర్వాత ఆమె సోదరునికి కూడా పెళ్లి చేస్తారు. తర్వాత అత్తవారింటి నుంచి తల్లిగారింటికి వచ్చిన బతుకమ్మ మరదలు కలిసి చెరువులోకి దిగి స్నానం చేస్తారు. పొరపాటున ఒకరి చీర ఒకరు ధరించడంతో ఆగ్రహించిన మరదలు బతుకమ్మను గొంతు నలిమి చంపిపాతిపెట్టి వెళ్లి పోతుంది. మరణించిన బతుకమ్మ తన భర్తకు కలలో కనిపించి తనను తీసుకెళ్లమని వేడుకోనడంతో ఆయన తెల్లారి బయల్దేరి చెరువు గట్టు వద్దకు వెళ్లాడు. బతుకమ్మ స్నానం చేసిన చెరువు గట్టు వద్దకు చేరుకున్నాడు. గతంలో ఎప్పుడు చూడని తంగేడు పువ్వులను ఆశ్చర్యంతో చూశాడు. వాటిని చూసిన అతను తెంపబోగా ఆ చెట్టు జరిగిన కథను చెప్పిందట. అప్పటి నుంచి ఆమె కోరిక మేరకు తంగేడు పూలతో బతుకమ్మను పేర్చడం.. అలంకరించడం..అనవాయితీగా మారింది.


బతుకమ్మ పండుగ వెనుక ఇంకా చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నదిది : ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం "బతుకమ్మా !" అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.


ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసినారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది.

ఈ పండుగలో భాద్రపద అమావాస్య చాలా ప్రాముఖ్యమైంది. ‘పెద్దల అమావాస్య’ అనే ‘పెత్తరమాస’ అని పలుచుకునే ఈ రోజు గౌరవమైనది. పనుల హడావుడిలో తీరది గనుక, వేర్వేరు తిథులు దినాలు గుర్తుపెట్టుకోవటం కష్టం గనుక ఒకరోజు అనుకొని అందరూ. తమ పెద్దలకు, పితృలకు పండుగ చేస్తారు. బియ్యం దానమివ్వటం, ఇష్టమైన వంటలు వండిపెట్టడం, వచ్చేవాళ్లతో పొయ్యేవాళ్లతో పల్లెటూళ్లల్లో పండుగ జరుగుతుంది.

బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.‘బొడ్డె’ అంటే చిన్నకుప్ప లేదా రాశి. ‘బొడ్డె’ అమ్మ బొడ్డెమ్మ. నిజానికి ఒకరకంగా ఇది మట్టిపూజ. ఉత్పత్తి (పంటలు, పనరుత్పత్తి (సంతానం) సవ్యంగా జరగాలని చేసే పూజ.

‘‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డాపూందరే కోల్
నీ బిడ్డపేరేమె కోల్ నిండా నూరేళ్లే కోల్’’

చీకటి పడిందాక ఆడి ‘బొడ్డెమ్మ’లు తీస్తారు. ‘నిదురపో బొడ్డెమ్మా నిదురపోవమ్మ, నిద్రకు నూరేళ్లు నీకు వెయ్యేళ్లు’’ అని పాటల్తో నిద్రపుచ్చి ఎవరింటికి వాళ్లు తీసుకెళ్తారు.

బత్కమ్మ పేర్చే తీరు...


బొడ్డెమ్మలు, ఎంగిలిపూలు మొదలు ఆడపిల్లల సంబురమే ఇల్లంతా, ఊరంతా నిండుతుంది.
బతుకమ్మ రెండోరోజు నుంచి కుటుంబంలోని మగపిల్లలు పువ్వుతేవటానికి కంచెకు వెళ్లుతారు. ప్రతిరోజు మబ్బుల (తెల్లవారకముందే) అరికంట్లం (చలినుంచి రక్షణ కోసం ధరించే పాతబట్ట) కట్టుకొని చిన్న పిల్లలు తట్టలు, ఎలితె గంపలు సంకల పెట్టుకొని పోయి పూలవేట మొదలు పెడతారు. మధ్యాహ్నం స్త్రీలు ముక్కాలి పీటమీద


పెద్ద తాంబోళం లేదా సిబ్బి (వెదురు బొంగు పూలతో తయారు చేసిన ప్లేటు) లేదా తపుకుపైన గుమ్మడి ఆకులను పేర్చి మొదటి వరుసలో గుండ్రంగా తంగేడీ పూలను పేరుస్తారు. ( దీన్ని మెరక తంగేడు, తంగేడు, తుంగేర, గొబ్బిపూలు అని అనేక పేర్లతో పిలుస్తారు. సంస్కృతంలో చరమ రంగ లేక మాయహరి, ఆవర్తకి, పీఠకిలక, తిమిరిహరి అని అనేక నామాలున్నాయి. ఆంగ్లంలో టానర్స్ కాషియా లేక టానర్స్ సెన్నా అని, శాస్త్రీయంగా కేషియా ఆరిక్యులేటా లేక సెన్నా ఆరిక్యులేటా అని పిలుస్తారు. ఇది సీసాల్పినియేసి అనే కుటుంబానికి చెందినది. ఈ మొక్క బెరడులో టాన్లి ఎక్కువగా ఉన్నాయి. మొక్క సమూలంలో బీటా సైటోస్టీరాల్, గ్లైకోసైడ్లు వున్నాయి. ఆయుర్వేదంలో మధుర, రూక్ష, పిత్త, వాత కఫ హర గుణాలున్నట్టు పేర్కొన్నారు.) మలి వరుసల్లో సాధారణంగా గునక పూలను పేలుస్తారు. గునక పూలు 'అర తెలుపు' రంగులో ఉంటాయి కాబట్టి ముదురు నీలి, గులాబి, ఆకుపచ్చ రంగుల్లో ముంచుతారు. పది, పదిహేను పూలను ఒక కట్టగా కట్టి పూవు కొనలను తుంచి రంగులో ముంచుతారు. ఆ తర్వాతి బంతి, చామంతి, గన్నేరు, మందార, కలువ, తామర తదితర పూలను శంఖం ఆకారంలో పేరుస్తారు. మధ్యలో కడుపులో ఆకులు, తుంచిన కాడలను నింపుతారు. పూలు జారిపోకుండా సన్నటి నూలు దారాలను గుమ్మడి ఆకుల క్రిందగా ముడివేస్తారు. పేర్చిన బత్కమ్మ మీద రెండు తమలపాకులు పెట్టి పిడికెడంత పరిమాణంలో పసుపుముద్దను పెడతారు. ఇది కూడా త్రికోణాకారంలో ఉంటుంది. దీనికి కుంకుమ బొట్టు పెడ్తారు. పుదిచ్చిన (పేర్చిన) బ్రతుకమ్మకు వెలిగించిన అగరవత్తులు కుచ్చుతారు. మొదట ఇంట్లో దేవుని గదిలో పెట్టి మొక్కుతారు.ఈ బతుకమ్మను పీటపై ఉంచి వాడిపోకుండా తడిబట్ట కప్పుతారు.


సాయంకాలం ఇంటి ముందు (వాకిట్లో) ఆవుపేడ, ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేస్తారు. ముగ్గులపై బతుకమ్మను ఉంచి మహిళలు, పిల్లలు జీవనశైలికి సంబంధించి, ఆచార వ్యవహారాలకు సంబంధించి, కట్టుబాట్లకు సంబంధించిన, ఆడవారి కష్టాసుఖాల గురించిన పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు.ఏడేడు తరాల కథలనూ గాథలనూ తవ్విపోసుకుంటారు. కుటుంబంలోని దుఃఖాన్ని, ప్రకృతి వైపరీత్యపు కడగండ్లనూ సామూహికంగా పాడుకుంటారు. కుటుంబ జీవనంలోని సంతోషాన్నీ, పిల్లల ముద్దు ముచ్చట్లనూ, పంటచేల వయ్యారాలనూ, వీరుల త్యాగాలనూ, దేవతల దయనూ, శృంగారాన్నీ, కరుణనూ, హాస్యాన్ని బతుకమ్మ పాటలలో కలగలిపి పాడుతారు.


చీకటి పడేదాక ఆడి ‘బతుకమ్మ’లు పట్టుకొని చెరువు దనుక గుంపులు గుంపులుగా వెళ్లి అప్పటికే నీళ్ల ఒడ్డున నిలుచొని ఉన్న మగవాళ్లకందిస్తారు. వాళ్లు మోకాళ్లలోతు నీళ్లదాక వెళ్లి ఒడుపుగా తబుకు తీసి ‘బతుకమ్మ’ను నీళ్లలో వదిలి వేస్తారు. ఆడవాళ్లు గౌరమ్మ పాటలు పాడుతూ తెచ్చిన ప్రసాదం పప్పులు ఫలహారాలు తబుకుల్లో పోసి ఒకరికొకరు పంచుకుంటారు. పెసరపప్పు, శర్కర, మక్కగింజ శర్కర, కందిపప్పు, బెల్లం, పుట్నాలు, దానిమ్మ గింజలు మొదలైన ప్రసాదాల కోసం మగపిల్లలు చుట్టూ మూగి సందడి చేస్తారు. అలా అయిదు రోజులు హుషారుగా సాగిపోతుంది. ఆరో రోజు అర్రెం. బతుకమ్మలు పేర్వరు. పనులు చూసుకోవటానికి, యాంత్రికం కాకుండా ఒకరోజు విరామం. ఏడో, ఎనిమిదో రోజులు మరింత హుషారు.

సద్దుల బతుకమ్మ


బతుకమ్మను తొమ్మిది రోజులు జరుపుకొన్నాక ఆఖరు రోజు అష్టమి రోజును దుర్గాష్టమి, పెద్దబతుకమ్మ, సద్దులబతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు మహిళలు తమ ఇంటిలో పులిహౌర, దద్దోజనం, సత్తుపిండి (మొక్కజొన్న పిండి, బెల్లంతో చేసిన పిండి) వగైరా సద్దులు చేస్తారు. ఇచ్చుకోవాయినం పుచ్చుకోవాయినం అని సద్దులు పంచుతారు. అక్కడి నుండి ఊర్లో గుడి దగ్గరకు కాని, ఊరి మధ్యలో కాని ఊరడమ్మ, బొడ్రాయి దగ్గర కానీ పెట్టి ఊరి వారందరూ కలిసి ఆడతారు. తదుపరి బత్కమ్మలను డప్పులతో చెరువు గట్టు వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. మళ్లీ గట్టుమీద బత్కమ్మలను పెట్టి అందరూ కలిసి ఆడతారు. కొందరు ఉత్సాహవంతులు, యువకులు, సేవకులు చెరువునీళ్లలోకి దిగి లోతుదాక వెళ్లి బతుకమ్మలు వదులుతారు. తబుకులతో తడికాళ్లతో నడుస్తూ స్త్రీలు బతుకమ్మను సాగనంపుతారు.

‘‘పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ
మల్లొచ్చె యాడాది తిరిగి రావమ్మా’’
అంటూ.
శ్రీలక్ష్మి నీమహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
ఎన్నెన్నో రూపముల - ఏడేడు లోకముల
ఉన్న జనలకు కోర్కెలన్ని సమకూర్చేవు’’ అని పాడుతారు.
వాయనాలు ఇచ్చుకుంటూ
ఉసికెలో పుట్టే గౌరమ్మ.. ఉసికెలో పెరిగే గౌరమ్మ..
కుంకుమలో పుట్టే గౌరమ్మ..
కుంకుమలో పెరిగే గౌరమ్మ..
పసుపులో పుట్టే గౌరమ్మ..
పసుపులో పెరిగే గౌరమ్మ..అంటూ మహిళలు చెరువు గట్టు వద్ద వాయనాలు ఇచ్చుకున్న అనంతరం తమతో తెచ్చుకున్న ఫలహారాలను, సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని ఆరగిస్తారు.


బతుకమ్మ పండుగ - బోనాల పండుగ ఇవి ఎప్పుడు ప్రారంభం అయ్యాయి? వీటి మూలం ఏమిటి?


ప్రత్యేకంగా తెలంగాణా ప్రాంతం లోనే ప్రాముఖ్యత వుండి మిగిలిన తెలుగు ప్రాంతంలో లేకపోవడానికి సహేతుకమైన కారణాలున్నాయా? ఇవి నిజంగానే తెలుసుకోవలసిన ప్రశ్నలు. వీటిని రూఢిపరచుకోవలసిన సమయం కూడా నిజంగా ఇదేనేమో


క్రిస్తుకు పూర్వనుంచే ఇటువంటి పండగవుంటే దానికి సంభందించిన ఆధారాలు ఖచ్చితంగా ఏదో ఒక పద్దతిలో మిగిలే వుండేవి కదా?


1. వివిధ రాజుల కాలంలో కట్టించిన దేవాలయాలలో దీనిని ప్రతిబింబించే శిల్పాలు లేదా చిత్రాలు వంటివి ఏర్పటయి వుండివుండాలి. కాకతీయులు కట్టించిన అన్ని నిర్మాణాలలో ఎక్కడైనా ఈ సంస్కృతిని గమనించే ఆధారాలు దొరుకుతాయా?

2. చరిత్ర రాసిన వారి ఉట్టంకింపులలో కానీ, ఆ కాలపు రచనలలో కానీ పేర్కోనబట్టట్లు దాఖలాలున్నాయా?

3. వివిధ కాలాలలో చలామణీలో వున్న నాణేలలో కానీ ఎక్కడన్నా దీన్ని సూచించే చిహ్నలేవైనా వున్నాయా?

బహుశా అటువంటివేమైనా దొరుకలేదనే నేనను కుంటున్నాను.


నైజాం మినహా మిగిలిన ప్రాంతం బ్రిటీషు వాళ్ళ చేతిలో వుంటే ఇక్కడ మాత్రం తురుష్కుల దాష్టికంలో బానిస బతుకుల్లో నలిగిపోయింది. తినడానికి లేకుండే స్థితికంటే దారుణంగా స్వీయవ్యక్తిత్వాలను తాకట్టు పెట్టుకుని ‘‘నీ బాంచెన్ దొరా’’ గా గడీల అడుగులకు మడుగులొత్తుతూ పడివుంది.

ఆడవాళ్ళ విషయం మరీ దారుణం రాక్షసుడి కంట్లో పడితే తినేస్తాడన్నట్లు, కొంచెం నదరుగా కనిపిస్తే వాడు కావాలంటాడేమో నని బితుకు బితుకు మంటూ బ్రతికిన కాలం. పండుగకైనా మంచి బట్టలు కట్టుకునేందుకో, ఇంటిముందు రంగుల ముగ్గుపెట్టి ఎవడి కంట్లోనో పడేందుకో జంకిన సమయం.

ఈ అభద్రతాకాలంలోనే సంస్కృతికంగా వచ్చిన పారంపర్యత వల్ల తప్పని సరిగా ఎదైనా పండుగ చేసుకోవాలనుకోవడం వల్ల కావచ్చు.

అటువంటి దాషికానికి బలైనా ఎవరో ఒక ఆడబిడ్డను తలచుకుంటూ మిగిలిన తమ బిడ్డలు బ్రతుకాలని కోరుకునే బ్రతుకమ్మ కావచ్చు.

బహిరంగంగా ఉమ్మడిగా కలుసుకునేలా తయారు చేసుకున్న ఈ వేదిక ద్వారా పాడుకునే పాటలలో కూడా అంతర్గత సందేశాలను పరస్పరం మార్పిడి చేసుకునేందుకు కూడా కావచ్చు.

ఆకాలంలో అతిసాధారణంగా దొరికే గుణుగు, తంగేడు లాంటి పేర్చిన పువ్వుల గుట్టలో ఆయుధాలనో, సంహారం చేసిన శత్రువు తలనో గుమ్మనంగా చెర్లో కలిపేపేందుకు ఒక సాకుని ఏర్పాటు చేసుకున్నారో నిజంగానే చరిత్ర మనకు చెప్పేంత వరకూ మన ప్రతిపాదించుకోగలం మాత్రమే. చరిత్రను మాట్లాడించగలిగే సహనమూ విద్వత్తూ వున్నవారు కావాలిప్పుడు.


కానీ సంక్రాంతికి పెట్టే గొబ్బెమ్మలు వాటిపై పూలూ పెట్టటం లాంటి విధానానికి మరికొంచెం మార్పులు చేసినట్లుంటుంది ఈ బతుకమ్మపూల పేర్పు, కోలాటం లాంటి ఉమ్మడి ఆటలకూ మల్లే, గిరిజన తెగలు ఎక్కువగా వుండే ఈ ప్రాంతంలో వారి సంస్కృతిలోని ‘‘రేలా’’ నాట్యంలో ఒకరి వలయంగా ఏర్పడి ఒకరి నడుంపై మరోకరు చెయ్యేసి చేసే పద్దతికి దగ్గరగా వుంటుంది.


బహుశా ఇలా బ్రిటీష్ పాలన, నైజాం దాష్టికాల కాలంలో ఏర్పడివుంటేనే తక్కిన పురాణేతిహాస పంభంధ పండుగలకు భిన్నంగా, తాము మాట్లాడే భాషలోని ఇతర పండుగలకంటే వేరుగా భిన్నత్వాన్ని కలిగివుండేందుకు ఆస్కారం వుంది.

అంతకు ముందే ఏర్పడి వుండి వున్నట్లయితే సాంస్కృతిక ఆదాన ప్రదానాలలో నెమ్మదిగా ఎక్కువదూరం ప్రవహించివుండేది.

మరో వివరణ

బతుకమ్మ ప్రధానంగా ప్రారంభం అయ్యింది చెరువుల పండుగగానా ?


అవునని కొందరు పరిశీలకులు చెపుతున్నారు. కాకతీయుల కాలంలోనూ రాజ్యం అభ్యున్నతి చెందాలంటే చెరువులు అవసరం అని గుర్తించారు విరివిగా చెరువులు తవ్వించారు. దశబంధ చెరువులు, గొలుసుగట్టు చెరువులు, పాకాల, లక్నవరం, పొలవాస, సిర్నపల్లి, రామగుండం, కంభం, ఎలిగందల, దోమకొండ, మొదలైనవి దీనికి ఉదాహరణలు ఒక చెరువు నిండితే అదనపు నీరు అలుగుపైగా పారి క్రింద ఉన్న ఇంకో చెరువులోకి వెళ్తుంది. ఇలా ఒక దానిక్రింద ఒకటిగా గొలుసుకట్టు చెరువులుండేవి. ఇలాంటి చెరువుల వ్యవస్థ వల్ల ఆనాటి ప్రజలు సుభిక్షంగా ఉండేవారు. చెరువుల వల్ల ఆనాటి ప్రజల బ్రతుకులు బాగయ్యాయి. కాబట్టి ఊరి ఆడవాళ్ళందరూ కలిసి ఏడాదికి ఒకసారి చెరువులకు నెనరులు (కృతజ్ఞతలు) చెప్పేవారు కాబోలు. అందుకే ఇది చెరువుల పండుగ.
సహజంగా నీరు నిలిచే ఒక ప్రాంతాన్ని గుర్తించి, దానిపై ఒకవైపు కట్టను, తూములను నిర్మించి, నీటి నిలువ సామర్థ్యం పెంచేవారు. దానిని పెద్ద చెరువు అని వ్యవహరించేవారు. దాని అలుగు కింద ఇంకో చెరువు ఉంటుంది. దీన్ని చిన్న చెరువు అంటారు. ఈ రెండు చెరువులే కాకుండా ఇంకో కుంటను ఏర్పరిచే వారు. సాధారణంగా తెలంగాణలో ప్రతి పెద్ద ఊరికి ఈ మూడు నీటి వనరులుంటాయి. లేదా ఈ వసతి ఉన్నచోటనే ఊరును ఏర్పాటు చేశారు. ప్రతి చెరువుకు పరివాహక ప్రాంతం, ఆయకట్టు నిర్దేశితమై ఉండేవి. నీటి నిలువను పంపిణీని చూసుకోవడానికి 'నీరడికారులు' ఉండేవారు.

తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చెరువులున్నాయో అక్కడే ఈ పండుగ ఉంది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలోని చెరువులు లేని ప్రాంతాల్లో ఈ పండుగకు అంత ప్రాధాన్యత లేదు. ఇది మొదట చెరువుల పండగ. తర్వాత కాలక్రమంలో పూల పండుగ అయ్యింది. క్రమంగా పండుగ జరుపుకునే తీరు పరమార్థంలో కూడా మార్పులు వచ్చాయి. బ్రతుకునిచ్చిన చెరువమ్మకు పూలతో కృతజ్ఞతలు చెప్పారు కాబట్టి పూలపండగ కూడా అయ్యింది. దీనికి ఆటపాట కూడా తోడయ్యింది.

వర్తమానంలో బతుకమ్మ పండుగ పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు, అత్తవారింటికి వెళ్లిన కొత్త కోడళ్ళు జరుపుకునే పండగగా కూడా మారింది. 'బతుకును' ఇచ్చే అమ్మను పూజించే పండుగ కాబట్టి పెళ్ళికానివారు గుణవంతుడైన భర్తకోసం, పెళ్ళి అయిన వారు భర్త క్షేమాన్ని కోరుకుంటూ కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఆట పాట కూడా ఉంటుంది కాబట్టి యువతకు ఆసక్తి కలిగించే పండగ అయ్యింది. కొద్ది మార్పులతో దాదాపు తెలంగాణ అంతటా ఈ పండుగను ఒకేలా జరుపుకుంటారు. అడవి ఆవరించి ఉన్న అదిలాబాద్ జిల్లాలో ఈ పండుగను ఎక్కువగా జరుపుకోరు. పాలమూరు జిల్లాలో ఒక పక్క కూడా ఇది తక్కువే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ పండుగ పలు రూపాల్లో ఉంది. తరచి చూస్తే ఈ పండుగలో ఇంకో పరమార్థం కూడా కనిపిస్తున్నది. బత్కమ్మ అంటే తంగేడు, గునక, గుమ్మడి ఆకులు, పసుపు ముద్ద, బంతి తదితర పూలు ఈ పూలను బత్కమ్మగా పేర్చి చివరలో చెరువులో వేస్తారు. దీంతో ఆ చెరువు నీరు శుద్ధి అవుతుంది. ఆకులు, పూలు నీటిలో నాని మెత్తబడి తర్వాత కుళ్ళిపోయి నీటి అడుగుకు వెళ్లి మట్టిలో కలుస్తాయి. దీంతో ఆ మట్టి సారవంతం అవుతుంది. ఆ మట్టిని రైతులు చెరువు ఎండినప్పుడు వేసవిలో పొలాలకు తరలిస్తారు. ఇలా పొలాలు సారాన్ని సంతరించుకునే ఒక అంశం బత్కమ్మ పండగలో ఇమిడి ఉంది.



కామెంట్‌లు

  1. విగ్రహ రాదన లేకుండా ఉండటం కూడా ఈ పండుగ ప్రత్యేకం.

    రిప్లయితొలగించండి
  2. Meeru malli same post raayandi. but manassullo koddigaa unna vyatirekha baavalu teesesi.

    naaku emi mathramu e article nachhaledhu.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ గురుభ్యోనమః
    నమస్తే
    ఇటువంటి పండుగలు తెలంగాణాలోనే కాదు మొత్తం దక్షిణ భారతంలో ఉన్నాయి సమయం చేసే పద్ధతి వేరంతే, సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టి గౌరిగా సర్వమంగళగా ఆరాధిస్తారు. అలానే కన్నెపిల్లల్తోటి తప్పక గొబ్బిళ్ళు పెట్టిస్తారు. తమిళనాడు పల్లెల్లో పండగలకి ముగ్గేసి గొబ్బిళ్ళు పెట్టడందానిమీద గుమ్మడి పూవు, లేదా పెద్దగా అరవిరిసే ఇతర పూవులైన మందార వంటివి పెట్టి పూజించడం ఆనవాయితీ. తిరువణ్ణామలైలో ఇప్పటికీ ప్రతి రోజూ చూడచ్చు (ముఖ్యంగా ఆది అణ్ణామలై దేవాలయం ఎదురుగా ఉన్న ఇళ్ళదగ్గర). గొబ్బిళ్ళైనా, బతుకమ్మైనా గౌరిపూజగా కన్నెపిల్లలు ముత్తైదువలు జరుపుకునే ఉత్సవం దీనికి వైదికత అంటూ ప్రత్యేకంగా ఉండదు ఒక జానపద సంబంధ ఉత్సవంలా ఉంటుంది. గొబ్బిళ్ళ పాటల్లోనూ, బతుకమ్మ పాటల్లోనూ గౌరి దేవి, సీతమ్మ, లక్ష్మీదేవి పేర్లతో పిలిచి పూజిస్తున్నట్లుంటాయి, శ్రీ రామడు ఇంకా శ్రీకృష్ణుడు యొక్క కథలని కూడా ఈ పాటల్లో కట్టి పాడుతారు ఏదైనా సరే భగవత్సంబంధ ఉత్సవాలే ఈ రెండూ.. పైగా కన్నెపిల్లలకి మంచి వరుడు రావాలనీ సుఖంగా జీవించాలనీ పెద్దలు కోరుకునే ఉత్సవాలే ఈ రెండూ.. భావం ఒక్కటే సమయం చేసే అలంకారం, కొంత పద్ధతి వేరు... కానీ నా చిన్నప్పుడు మహాలయ అమావాస్య నాడు మహర్నవమి నాడు పువ్వులతో చేసిన బతుకమ్మకు ఉత్సవం చేసేవారు మిగతా రోజులు గొబ్బిళ్ళలానే ఆవుపేడతో చేసిన ముద్దలకి పసుపు కుంకుమ పెట్టి చంద్రకాంతం పూలు అలంకరించి మంచి ముగ్గేసి అందులో పెట్టేవారు. చాలా గొప్పగా ఉండేది గోశాల కెళ్ళి పావలాకి ఆవు పేడ ఒక తట్టెడు నిండా తెచ్చేవాణ్ణి.

    ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ శివుడొచ్చె వేళాయె చందమామ శివుడు రాకపాయె చందమామ శివునికీ సిరి గద్దె చందమామ నాకు సారె గద్దె చందమామ రెండేసి.... లో ఐనా, గొబ్బీయళోయి గొబ్బిళ్ళు సుబ్బీ గొబ్బెమ్మ సుఖమూ లియ్యావే తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యావే చేమంతి పూవంటి చెల్లెల్నియ్యావే అరటి పూవంటీ అక్కానివ్వావే పున్నాగ పూవంటీ అన్నానివ్వవే మొగలి పూవంటి మొగుణ్ణివ్వావె.. లో ఐనా ఉన్నది గౌరియే... అందుకే పస్పుల బుట్టే గౌరమ్మా, పస్పుల బుట్టె గౌరమ్మా పస్పుల పెరిగే గౌరమ్మా పస్పుల వసంతవాడె గౌరమ్మా పొన్నంగీరి తాల్లకెల్లీ పోకలగంటీ వనముల కెల్లీ.. మంగళం...

    రిప్లయితొలగించండి
  4. గౌలిపురా గాంధీబొమ్మ దగ్గర బతుకమ్మబాయి హైదరాబాదులో బతుకమ్మ ఉత్సవానికి చాలా ఫేమస్.. it used to be fantastic experience.. ఆహ్లాదం ఆనందం అమ్మవారి అనుగ్రహం.. its gives great feeling to participate in this.. ఫ్లాట్ మారాక ఎవరూ ఈ సారి బతుకమ్మ పెట్టి ఉత్సవం చేయలేదు మా ఫ్లాట్స్లో, పాటలు నేర్పించి నవమికి మా పిల్లల్తో నేనే చేయుద్దామనుక్కుంటున్నా.. సంక్రాంతికెలాగూ చేస్తారుగా ఆ experience ఉంది..

    రిప్లయితొలగించండి
  5. సద్దుల బ్రతుకమ్మరోజు మహిళలు ఇంటిలో పులిహోర చేస్తారని వ్రాసారు.
    తెలంగాణా వారు ప్రత్యేకంగా చేసేది బిర్యానీ‌ కదా? పులిహోర కూడా చేస్తారా? తెలియక అడుతుతున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలంగాణా వారు చేసేది బిర్యానీకాదు అది మొఘలాయి ఐటం, ముస్లిం వంట. చింతపండుని తమిళంలో పులి అంటారు కదా! పులి హోర తమిళ వంటా? తెలంగాణ వంటా సీమాంధ్ర వంటా? లేక తమిళ వంటా తెలుగు వంటా నాకూ తెలియకడుగుతున్నాను. తెలంగాణ జిల్లాల్లో కనీసం చిత్రాన్నం అంటారు పులిహోరని... పులిహోర అందరి వంట, హరిద్రాన్నం అని సంస్కృతం. ఒక్కో ఊళ్ళో ఒక్కో పేరు అది ఎవరి పేటెంట్ కాదు

      తొలగించండి
    2. బతుకమ్మ పండుగలో సద్దుల బతకమ్మకు తొమ్మిది రకాల సద్దులు సమర్పిస్తారు.

      చింతపండు, నిమ్మ, దబ్బ, దానిమ్మ, నువ్వులు, ఆవపిండి, పల్లీలు, కొబ్బరి మొదలైన వాటితో కూడా పులిహోరలు తయారు చేస్తారు.

      ఆవాలుకు చిటికెడు పసుపు, పచ్చిమిర్చి నూరిన మిశ్రమం కలిపి పూర్తైన పులిహోరలో కలిపుతారు, దీన్ని ఆవ పెట్టిన పులిహోర అంటారు.

      తొలగించండి
  6. Saddhula brathukamma naadu neesu thinaru. a a roju pulihora, pergu annamu, sathhu pindi ekkuvaga untaayi.

    dasra naadu no veg compulsory.

    రిప్లయితొలగించండి


  7. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గ్రామదేవతను కొలుస్తారు.ఉదా;;విజయనగరం లో పైడితల్లి,అనకాపల్లిలో నూకాలమ్మ ఇలాగ.అమ్మతల్లి ఉత్సవాలు ఇతరదేశాల్లోను,కల్చర్స్ లోను కూడా ఉండేవట.(మెసపొటేమియా,ఈజిప్టు,గ్రీసు మొ;;.)ఆర్యసంస్కృతీ ప్రభావంవలన గ్రామదేవతలని పార్వతి,దుర్గ లేకగౌరీదేవి అవతారాలుగా పరిగణించడం జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం.
    ఇక 'పులిహోర ' తెలుగుపదమే.కాని తెలుగు,తమిళంలకు సమానంగా కొన్ని పదాలు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి.పులి(పుల్లని) + ఓగిరము (అన్నము) నుంచి పులిహోర అనే వాడుక పదం వచ్చింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సర్ చాలా మంచి చక్కని సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలు

      తొలగించండి
    2. కన్నడ భాష లో హుళియోగిరె అని అంటారు. హుళీ అంటే పులుపు, యోగిరె అంటే అన్నము.

      తొలగించండి
  8. చక్కని వివరణాత్మక వ్యాసం అందించారు శ్రీనివాస్ గారూ ! మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి