నిండైన పదాలకోసం

పదాలదేముంది ఎన్నైనా దొరుకుతాయి.
నడిచే దారుల్లో చెవులింతగా పనిచేస్తున్నప్పుడు-
కానీ… వాటి లోపలి విశాలమైన బోలుతనం నిండా
అర్ధాన్ని నింపిన అసలైన రూపాన్నే పట్టుకోలేకపోతున్నాను.

కొన్ని రంగులు పూసుకొస్తున్నాయి.
ఒక్క పదాన్ని నా దండలో వేసినా
నిండా రంగుల్ని ఒంపేస్తున్నాయి.
ఎర్రనివి-
నా పిడికిలి బిగించాననీ,
తెల్లనివి-
నేనో బుద్దుని శిష్యుడిననీ
మెడలో ఓ పలక రడీగా తగిలించేస్తున్నాయి.

కొన్ని
మరీ అరిగిపోయాయి.
కంకరుతేలిన దారుల్లో
దొరికిన సందర్భానికల్లా అడ్డంగా
బరాబరా రుద్దేసిన పదాలవి.
చెవుల్లోంచి గాలిలోకే జారిపోతున్నాయి.
మనసుకి అంటుకునే తడీలేదు, అంచూలేదు.

దండకోసమై ఏరుకుంటున్నాను.
తప్పదు
ఇలా నలుగురు నడిచే దారిలోనే ఈ చెట్టుంది.

కొన్నిటికి కిరీటాలు పెట్టి లేని సోగసుని ఆపాదించేస్తున్నారు.
కొన్నింటిని డొల్లకొట్టి ఏం లేదని రాపాడించేస్తున్నారు.
మరికొన్నింటికి పొగబెట్టి పంపించేశారు.
ఇంకెన్నింటినో అంటుకట్టి సంకరం చేసేశారు.
అయినా కొందరు ఓపిగ్గా ఏరుకుంటున్నారు.
చాలా డొల్లల మధ్య ముత్యంలా అర్ధాన్నిపొదువుకున్న
అచ్చమైన పదం కోసం,
వాక్యానికే కాదు మొత్తం బావానికే బాసటగా నిలిచేందుకు.
అల్పాయుష్కు శూన్యంలో తేలేలోగా చిత్రంగా నిలిపేందుకు.


పదునెక్కిన సందర్భాన్ని పలుకుబడిగా మలిచేందుకు
వెతకితే పోయేదేముంది లోతులు తెలీని అహం తప్ప.


https://www.facebook.com/groups/kavisangamam/permalink/649617021757720/


కామెంట్‌లు

  1. భాష ,పదం, సాహిత్యం లో వాటి సముచిత వినియోగం గురించి యోచించేది ఏ కొందరో . మీ ఈ కవితలో ఆ తపన ....అభినందనీయం. మీరన్నట్లు.... వెతికితే పోయేదేముంది లోతులు తెలీని అహం తప్ప .....ఎంత నిండైన యోచన ?....కవిత భవ్యం . అభినందనలు ...శ్రేయోభిలాషి ..నూతక్కి రాఘవేంద్ర రావు. (కనకాంబరం)

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి