దీప న్యాయం

సంస్కృతంలోని విశేష న్యాయాలు

ఇప్పుడంటే ఒక్క మీటనొక్కితే భళ్ళున వెలుతురు పరచుకుంటోంది. హోరున గాలి వీచిన సరే చలించకుండా నిలబడి వుంటున్నాయి. కానీ నునెదీపాలు, కాగడాలూ వాడే రోజుల్లో పగటి వెలుతురు ముగియగానే పనులేవి చక్కబెట్టుకోవాలన్నా దీపాలతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చేది. లేదంటే ‘‘ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో’’ మనే వారు. సాహిత్యంలో కూడా దీపాన్ని అనేక రకాలుగా వర్ణించారు. తాత్వికతలో కూడా దీపాన్ని జ్ఞాన రూపంగా పేర్కొన్నారు. ఇప్పటికీ అనేక కార్యక్రమాలు పట్టపగలే చేసినా సరే జ్ఞోతీ ప్రజ్వలనం చేయటం అనే సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే వున్నారు. అంతటి ప్రాధాన్యత వున్న దీపం చుట్టూ సంస్కృతన్యాయాలు కొన్ని ముడిపడి వున్నాయి. వాటిని ఒక దగ్గర పొందుపరచటంకోసం ఇక్కడ ఇస్తున్నాను.

అస్నేహదీపన్యాయం
: సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి)
2006    
నూనె లేని దీపం కొద్దిసేపట్లోనే ఆరిపోయినట్లు. [క్షణికం అని భావం.]
 ________________________________________________________________

కాచకుంభదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
గాజుకుప్పెలోని దీపం ఎంత గాలి వీచినా కదలకుండా నిలిచినట్లు. (వేమన.)
 ________________________________________________________________

ఘటప్రదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
కుండలో పెట్టిన దీపం వెలుతురు ఆ కుండలోనే ఉండి పైకి వ్యాపించనట్లు. [తన లాభం మాత్రమే కోరేవాడు ఇతరులకు మేలు చేయడు.] చూ: కుంభదీపన్యాయం.

 ________________________________________________________________

చక్షుర్దీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
చీకటిని పోగొట్టుకోవడానికి కన్నులు, దీపము- రెండూ అవసరమైనట్లే ఒక పనిని సాధించడానికి బుద్ధి, ప్రయత్నం- రెండూ అవసరమౌతాయి.

 ________________________________________________________________

తమోదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
దీపంతో చీకటిని చూచినట్లు. [జ్ఞానంతో అజ్ఞానాన్ని చూస్తాడు.]
"ప్రమాణోత్పన్నయా దృష్ట్యా యోవిద్యాం ద్రష్టుమిచ్ఛతి దీపేనాసీద్ధ్రువం పశ్యేద్గుహాకుక్షిగతం తమః"

  ________________________________________________________________

దేహళీదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
గడపమీద పెట్టిన దీపం ఇంటిలోనూ, ఇంటి బయటా వెలుతురు ప్రవరింపజేసినట్లు. [ఒకే వస్తువు రెండు ప్రయోజనాలను సాధించడం.]
"ఏకా క్రియా ద్వ్యర్థకరీ." (one shot two birds)

 ________________________________________________________________

నివాతస్థితదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
గాలి లేనిచోట దీపం ఉంచినట్లు. [శమాదిషట్క సంపత్తి ఉన్న చిత్తం నిశ్చలత్వాన్ని పొందుతుంది.]
"నివాతస్థో యథా దీపః" (భగవద్గీత.)

  ________________________________________________________________
ప్రదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
1. దీపం ఒక్కచోటే వెలుగుతూ ప్రకాశింపజేసినట్లు.
2. చమురు, వత్తి విడివిడిగా నిప్పును కొంత చల్లార్చేవే ఐనా మూడూ కలిసి దీపంగా వెలిగినట్లు. [పరస్పర విరోధులే ఐనా అందరూ కలిసిఒక మంచి పనిని చేయవచ్చు.]

 ________________________________________________________________

బహుచ్ఛిద్రఘటప్రదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
చాలా రంధ్రాలున్న కుండలో పెట్టిన దీపం రంధ్రాల్లో నుండి పైకి వ్యాపించినట్లు. [జీవునికి ఉపాధియైన బుద్ధి శరీరంలోని నవరంధ్రాల నుండి బాహ్యవిషయాల్లో వ్యాపిస్తుంది.]
"నానాచ్ఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం, జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిః స్యందతే." (దక్షిణామూర్తిస్తోత్రం.)

  ________________________________________________________________
మధ్యదీప(పికా) న్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
గృహమధ్యంలో ఉన్న దీపపుకాంతి ఇంటిలో అన్ని దిక్కులకూ కాంతిని ప్రసరింపజేసినట్లు.
"గృహే దధిఘటీం ద్రష్టుమానీతో గృహమేధినా, అపూపానపి తద్దేశాన్‌ ప్రకాశయతి దీపకః" (ఇంట్లో పెరుగుకుండను చూడడానికి దీపం పట్టుకొని లోపలికి వచ్చిన ఇంటి యజమాని ఆ దీపపుకాంతితో అక్కడున్న రొట్టెలను కూడా చూస్తాడు.)

 ________________________________________________________________

రథ్యాదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
దీపం పట్టుకొని దారిలో నడుస్తుంటే దీపం వెలుతురు ముందున్న స్థలంమీద పడుతుంది. తరువాత ఆ స్థలంమీదికి దీపమే వస్తుంది. వెలుతురు ముందుకు పోతుంది. వెనుక చీకటి ఆక్రమిస్తూనే ఉంటుంది.

 ________________________________________________________________
వాతప్రదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
గాలికి పెట్టిన దీపం మాదిరిగా. [స్థిరంగా ఉండక వెంటనే నశించి పోయేదని భావం.]

 ________________________________________________________________

స్నేహదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
చమురు లేకపోతే దీప మారిపోయినట్లు.

మరింత వివరంగా తెలుసుకునేందుకుసంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006
సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939

కామెంట్‌లు