కవిత్వం :అభివ్యక్తి :మెటానవికాభివ్యక్తి

"కవిత్వం మెటాఫర్ నుండి మెటానమీకి... ప్రయాణించాలి" (వేగుంట మోహన్ ప్రసాద్).

          కవిత్వాభివ్యక్తిలో ఒకానొక నిలకడ స్థితి వచ్చిందని అనిపించినప్పుడల్లా పెద్దకవులు ఇటువంటి సూచనలివ్వడం సహజమే. వర్తమాన తెలుగు కవిత్వం లో ఇటువంటి స్థితి ఉన్నట్టు మనకు కనిపించదు. మరి అట్లాంటప్పుడు ఎందుకీ సూచన ఇచ్చాడన్న సందేహమోస్తుంది. కవులు మెటాఫర్ దగ్గరే ఆగకుండా ముందుకు పోవాలన్నది అ కవి ఆకాంక్ష. వ్యక్తీకరణ సాధారణమైపోకుండా ఉండాలంటే సాధనాలను నిరంతరం మార్చుకుంటూ ఉండాలి కవులు.అలా మారిస్తేనే అభివ్యక్తిలో వైవిధ్యం సాధ్యపడుతుంది. వర్తమాన తెలుగు కవిత్వం ఈ మెటానమీని ఆశ్రయించి సాగుతున్నది.అసలు మెటానమీ అంటే ఏమిటి? గ్రీకు పదమైన మెటనామియా నుంచి నిష్పన్నమైంది మెటానమీ.మెటా అంటే మార్పు, వోనోమ్ అంటే పేరు. ఇక్కడ ఒక వస్తువు పేరు దానితో సంబంధం ఉన్న మరొక దాని స్థానానికి బదలాయించడం ఉంటుంది. ఒక పదానికి బదులుగా ఆ పదం తో దగ్గర సంబంధమున్న మరొక పదాన్ని ఆ స్థానం లో వాడటమే ఉంటుంది.యాకబ్ సన్ భాషా విషయంగా చెప్పిన రెండు ద్రువాలలో మెటానమీ కూడా ఒకటి. మెటాఫర్ సాదృస్యత మీద ఆధారపడితే మెటానమీ రెండు వస్తువుల మధ్య సారూప్యం లేదా అ రెండు వస్తువుల మధ్య అవిచ్చిన్న సంబంధం వల్ల వ్యక్తం అవుతుంది.

ఇక్కడ జయప్రభ కవితను చూడొచ్చు మనం .

"నయావిస్పర్" అంటూ 
పావురం లా పాపాయి 
తెల్లచూడిదార్ లో 
ఎగిరితే ఎంత హాయి
కానీ ప్రకటనల్లో పాపాయిలకి కూడా
కాళ్ళు గుంజుతాయి, ఎగిరినందుకు కాదు!
కడుపు బిగుసుకుపోయి నొప్పె నొప్పి అత్తయ్యకి
ఎదిరినందుక్కాదు"

ఇందులో సదృశీకరణం తో పాటుగా మెటానమీని ఆశ్రయించింది. ఎగిరినందుకు కాదు అన్న క్రియాంత వాక్యం, కారణాన్ని చెప్పడం వల్లా `నయావిస్పర్’ అన్నది బహిష్టుతో సంబంధాన్ని తెలిపేందుకు వాడటం వల్ల మెటానమిక్ అభివ్యక్తిగా రూపం తీసుకుంది కవిత. కార్యకారణాలలో ఎ ఒక్కటి చెప్పినా మెటానామి అవుతుంది. 'గదిని మంచం మీదనుండి కిందకి దించారు ' అన్నచోట కవి మృత్యువుని సూచించదలచాడు. ఇక్కడ గది మంచామెక్కుతుందా అన్న ప్రశ్న వేసుకుంటే హాస్యాస్పదం గా తోస్తుంది విషయమంతా. గదిలో మంచం మీదే మరణించిన మనిషిని క్రిందికి దింపడమే కవి చెప్పాలనుకున్న విషయం. చనిపోయిన మనిషితోపాటుగా గదిని నిర్జీవం చేస్తున్నాడు. అ గదిలో మనిషి బ్రతికిఉన్నంత కాలమే అ గది జీవించి ఉందనేది కూడా కవి చూపించదలచిన కోణం. అలాగే 'ఈ మనిషికి మరో చెయ్యి అవసరం' అని మనం ఎక్కడో వింటూ ఉండే వాక్యం లో కూడా మెటానమిక్ అభివ్యక్తి ఉంది. ఈ క్రింద పేర్కొనే వాక్యాలు మెటానామీ కి ఉదాహరణలు :

1. వాషింగ్టన్ మాస్కోతో చర్చలు మొదలుపెట్టింది.
2.వైట్ హౌస్ పెదవివిప్పలేదు (ఒబామా)
3. భీతిల్లిన త్రిలోకపురి (ప్రజలు)
4. బహిష్కరణ ను సమర్థించిన క్రెమ్లిన్


ఇవన్నీ మెటానామీలో ఉన్న సాధారణ నియమాన్ని ప్రతిఫలింపచేస్తున్నాయి. వాస్తవానికి కవిత్వం లో ఉండే మెటానామీ తో సమానంగా పత్రికలలో వచ్చేవార్తలకు పెట్టే శీర్షికలలో ఈ విధమైన మెటానామిక్ అభివ్యక్తి కనిపిస్తుంది.పత్రికలలో అధికశాతం కవులే ఉపసంపాదకులుగా పనిచేయడం ఒక కారణం. అయితే దీన్ని ఒకరకమైన లింగ్విస్టిక్ బిహేవియర్ గా కూడా పేర్కొనవచ్చు. 

కవిత్వంలో ఒక్కోసారి సంఘటనకు బదులుగా ఆయా స్థలాలను మాత్రమే చెబుతాడు కవి. 'ఇరాక్ ను మరో వియత్నాం కానీయకు' ఇటువంటిదే. మెటానమిక్ అభివ్యక్తి ఉన్నచోట పాఠకులు సులభంగానే వాటికి తగిన సూచితాలను నిర్దారించుకోగలరని సైకోలింగ్విస్టిక్స్ పరిశోధనలు తెలుపుతున్నాయి. సరియైన అన్వయాన్ని పాఠకుడు ఎలా సాధించుకుంటాడుఅన్నది ప్రస్నార్థకమే. ప్రతి పదానికీ ఉండే సాధారణ అర్తాలన్నిటినీ పాఠకుడు తన మనఃపదకోశంలొనే జాబితీకరించుకుంటాడనీ, ఒక పదం ఇచ్చిన సందర్భంలో వెనువెంటనే పాఠకుడు ఆ నిఘంటువులోంచి తనకు కావల్సిన అర్థాన్ని ఎంపిక చేసుకుంటాడనీ, ఎంచడం కలపడం అనే ప్రక్రియలో పర్యాయతను చూపి కవిత్వాన్ని సృష్టించి ఇచ్చిన కవిని అనుసరించడు; సరికదా అర్థం చేసుకునే క్రమంలో విధిగా పర్యాయతను పాటిస్తుండడం చేత ఈ విధమైన అభివ్యక్తి పధ్ధతులను పాఠకుడు అర్థం చేసుకుంటాడు.
కత్తిని సూచించేందుకు ఫోర్కునూ, దీపానికి బదులు అది పెట్టే స్థలాన్ని వెలుతురు బల్లగా, సినిమా తెరకి బదులు పెద్ద టీవీ అని పిల్లలు చెబుతారు. ఇట్లాంటి పొరపాట్లు భాషావైకల్యం (అఫేజియా) ఉన్నవారు చేస్తారు. అయితే కవులు ఉద్దేశపూర్వకంగానే కవిత్వంలో చేస్తారు. అవి దోషాలుగా కాకుండా గుణాలు అవుతాయి కవిత్వంలో.

a figure of speech that consists of the use of the name of oneobject or concept for that of another to which it is related, or ofwhich it is a part, as “scepter” for “sovereignty,” or “the bottle” for“strong drink,” or “count heads (or noses)” for “count people.”

[సీతారాం ‘అదేపుట’ వ్యాస సంకలనం నుండి] సోదరుడు యశస్వికి ధన్యవాదాలతో

మరికొంత సమాచారం వికీలో : http://en.wikipedia.org/wiki/Metonymy

కామెంట్‌లు