1
ఎవరో నీ సహాయం కోరుతున్నారు
ఎక్కడో అగాధపు అంచుల్లో
కష్టాల సుడిగుండాల అల్లకల్లోలంలో
ప్రశాంతతకు మొహంవాచి, నిరంతరంకారే రక్తపు ఛారికలనడకల్లో
ఎవరో నీ సహాయం కోరుతున్నారు.
నీవు బెసకకుండా రోజువారీ తాటిపై నడుస్తూనే వున్నావు.
2
ఎవరో నీకోసం చేయి చాచారు.
దారపు తీగంత బలంతోనైనా పైకి లాగుతావని
కనీసపు ఔదార్యపు చూపుతో ధైర్యమైనా నింపుతావని
వడలి పోయే ఆశకు ఆఖరిచుక్కగా కన్నీరైనా పోస్తావని
ఎవరో నీకోసం చేయి చాస్తున్నారు.
నీవసలే తలచుట్టూ అరికంట్లం కట్టావు.
3
ఎవరో నీవైపే చూస్తున్నారు
రెప్పవాల్చకుండా, దృష్టిమరల్చకుండా
నీ నిర్ణయమే తమ తరువాతి జీవితానకి భరోసా అన్నట్లు
ఒక్కో క్షణం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
అవును
ఎవరో నీవైపే చూస్తున్నారు
నీవెప్పటిలా అలవోకగా రోడ్డుపక్క ఖాళీడబ్బాలను తన్నుకుంటూ
ఈలవేస్తూ కాలక్షేపం చేస్తున్నావు.
4
ఎవరో నీకై ఆక్రోశిస్తున్నారు
ప్రమాదపు ఒడిలో రక్తం కార్చుకుంటూ
కనీస ప్రథమచికిత్స చేస్తావేమోనని
గొంతుఎండిపోయేలా కేకలేసి పిలుస్తున్నారు.
ఒక్కో రక్తపు బొట్టూ ఒడిసి పట్టే ఓపిక లేక
మరో చేయి సాయం కోసం నిను చూస్తూ దీనంగా పెడబొబ్బలు పెడుతున్నారు.
ఎవరో నీకోసమే ఆక్రోశిస్తున్నారు.
నీవసలే కొత్త హెడ్ సెట్ పాటల ఆల్బంలో మునిగి లేవకున్నావు
5
నీ బలం నీకేం తెలియదంటూ
నాది ఒక్క నట్టు వదులైతే యంత్రానికేమంటూ
వదులు వదులు మాటల్ని విదుల్చుకుంటూ వెళ్తున్నావు.
పూర్ణసత్యమేదో ఎరగనే లేదంటూ
తెలియని తనాన్ని గర్వంగా నెమరేసుకునేందుకు
డబ్బాలూ, డప్పులూ బాది బాది అలసావు.
...
వాడక్కడ నీకోసం అరుస్తునే వున్నాడు
6
అంతు చిక్కని చిక్కుముళ్ళని తలచుట్టూ కంపలా అల్లుకుని
మసక చేతుల్తో కళ్ళ అద్దాల్ని పదే పదే తడుచుకుంటావు
అసలే మంచు పొరల మధ్యన దీపాన్ని ఆపేసి
పాదం కదపకుండానే పాటలందుకున్నావు.
వాడొక్కడే ఒక్క అడుగు దూరంలో వగచి వగచి చూస్తున్నాడు.
7
ఎవరో నీ సహాయం కోరుతున్నారు.
ఎవరో నీ వైపే చూస్తున్నారు.
ఎవరో ఆక్రందన చేస్తున్నారు.
ఎవరో ఆక్రోశంతో నీ వైపే చేయి చాస్తున్నారు.
ఎవరో
... ఎవరో
..... ఎవరో
8
బ హు శా
అది నీవాళ్లే కావచ్చు
బహుశా
అది నీ రక్తపు వారసత్వ బంధమే కావచ్చు
బహుశా బహుశా
అదసలు మరోలాంటి నీ మరో రూపమే కావచ్చు
బహుశా
అచ్చంగా నీవేనూ కావచ్చు.
9
అయినా
పర్వాలేదు
నీరోజుని నువ్వు నీలాగే గడిపేస్తుంటావు.
► 18-02-2014
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి