రమణీయం పాలంపేట రామప్ప దేవాలయం




గుడి చరిత్ర : 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఏర్పడిందని వాడుకలో చెపుతుంటారు. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని పిలుస్తారట. నేడు రామప్ప దేవాలయం, రామప్ప చెరువు పేరుతో పిలువబడుతున్నా ఈ రామప్ప ఎవరో తెలియదు. శాసనాల్లో లేదు. శిల్పి అని కొందరు చెప్పినా అది ఊహే. శిల్పి పేరుతో ఆలయాలు ఎక్కడా లేవు. నారప్ప అని పశ్చిమ చాళుక్య సేనాని ఒకడు నాటి శాసనాలలో ఉన్న పేరు (నగునూరు (కరీంనగర్ జిల్లా) వీరగల్లు లఘుశాసనం). అలాంటి వాడే ఓ సేనాని రుద్రునికి సన్నిహితుడై ఆలయ, తటాక నిర్మాణ పర్యవేక్షణ చేసి వుండే వుండవచ్చును. లేదా రుద్రునికి ముందే ఈ ఆలయం ఒక చిన్న ఆలయంగా రామప్ప చేత నిర్మితం అయి అన్నా ఉండాలి. ఇవన్నీ ఊహలే. చెరువు మాత్రం రుద్రుని నిర్మాణమే. రుద్రుడు మరిన్ని చెరువులు తవ్వించినట్టు ఇతర ఆధారాలున్నాయి. తండ్రి కాటయ వలెనే రుద్రుడు కూడా చెరువులు తవ్వించాడని గొడిశాల శాసనం (శ.సం.1157 = క్రీ.శ. 1236) చెబుతోంది. రామప్ప దేవాలయ శాసనానికి 23 ఏళ్ల తరువాతి శాసనమిది. రామప్ప చెరువు 65 కిమీ ల వైశాల్యంతో 10,000 ఎకరాలను సస్యశ్యామలం చేసే సామర్ద్యంతో వందల సంవత్సరాలుగా ఎందరికో తిండిపెడుతోంది.

చారిత్రక కధనం...

కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రదేవుడు పాలిస్తున్న కాలంలో ఆతని సామంతుడైన కుందూరు రాజు తైలవ దేవుడి కుమార్తె వసుంధరని వివాహ మాడి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నించిన చోడ వంశపు భీమ రాజు ఆమేరకు వర్తమానం పంపితే. తైలవ దేవుడు నిరాకరించడంతో కుందూరు రాజ్యంపై యుద్ధం ప్రకటిం చి తైలవదేవుడిని చంపి వసుంధరని బంధిస్తాడు. ఈ విషయం తెలిసిన రుద్ర దేవుడు మరో సామంత రాజైన రేచర్ల రుద్రసేనానికి ఆమెని రక్షించే బాద్యత అప్ప గిస్తాడు. భీమరాజుతో జరిగిన యుద్దంలో రుద్ర సేనాని విజయం సాధించి వసుంధర తో సహా రుద్రదేవుని కొలువుకి వెళ్లగా... ఇక నుండి వసుంధర బాధ్యతలన్నీ నువ్వే చూడాలం టూ ఆమెని భార్యగా స్వీకరించమని చెప్తాడు. అందుకు రుద్రసేనాని ఆనందంగా అంగీకరిం చడంతో ఏదైనా కోరుకో... ఇస్తానంటూ రుద్ర దేవుడు చెప్పడంతో కాకతీయ సామ్రాజ్యంలో శిల్ప కళా ఖ్యాతి ఎలా విశ్వవ్యాప్తంగా వినిపిస్తోందో తన రాజ్యంలోనూ అలాంటి కళావైభవ చిహ్నాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నానని, అందుకు ఆర్థికంగా సహాయపడాలని అర్థిస్తాడు రుద్రసేనాని. అందుకు అంగీకరించిన రుద్రదేవుడు ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తానికి దానపత్రా న్ని రాసి అందచేస్తాడు. రుద్ర సేనాని కాలంలో పాలం పేటలో ప్రారంభమైన ఈ రమణీయ శిల్పకళా వైభవ నిర్మాణానికి ఆతని తరువాత కాకతీయ సామ్రాజ్యాన్న్ని పాలించిన మహ దేవరాజు, గణపతి దేవుడు కూడా అండగా నిలవటంతో 1213 నాటికి పూర్తయ్యిందని చరిత్ర కారులు చెప్తారు. ఈ ఆలయాన్ని రామప్ప అనే ప్రధాన శిల్పాచార్యుడు రూపకల్పన చేయటమే కాకుండా ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షించడంవల్లే రామప్ప దేవాలయంగా పిలుస్తుంటారని స్థానికు లు చెప్తుంటారు. రామప్పదేవాలయం పలు దేవాలయాల సమూహంగా తీర్చి దిద్దేందుకు దాదాపు 15 ఏళ్ల వత్సరా లు పట్టినట్లు తెలుస్తోంది.
శిల్పనిర్మాణపు ముందుచూపుతో మళ్ళీ బ్రతికిన పేరిణీ నాణ్యం : శిల్పాలనుంచి ఏం తెలుస్తుంది అనుకుంటాం కానీ, ప్రధాన ఆలయానికి ఇరుపక్కలా వున్న శివతాండవం 60 చిత్రాల వరుసలను అర్ధం చేసుకుంటూ నశించి పోయిందనుకుంటున్న నాట్య విధానాన్ని నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం అను నృత్య రీతి పేరుతో పునం రూప కల్పనచేసారు.


రామప్ప ప్రజ్ఞ : నటరాజ రామకృష్ణ గారి విద్వత్ సృజన పేరిణీ పున: జీవనానికి కారణం

 కళాకారుడు, కళావేత్త,
గురువు, సంగీతజ్ఞుడు,
మేధావి, కళా దిగ్గజం

పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ.
ఆంధ్ర నృత్యానికి
జీవితాన్ని అర్పించిన అభినవ యోగి.
 నాట్యానికి ఓ కొత్త కళాపరిభాషనిచ్చిన కళా తపస్వి
సంగీతానికి సప్తస్వరాలు ప్రాణం. అలాగే మృదంగానికీ త, ది, తో, ణం, ఆధారమైనట్లు, నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి ప్రధాన స్థానాలు ఎనిమిది మాత్రమే. ఇటివంటి మూల సూత్ర స్థానాలు రామప్ప శిల్పంలో రూపొందించ బడ్డాయి. అంతే కాదు ఆ స్థానాలను ప్రయోగించేటప్పుడు, వాయించ వలసిన తొలి మృదంగ శబ్ధాన్ని ఎంత తూకంలో ప్రయోగిస్తే ఆ విన్యాసం పూర్తిగా వికసించటానికి అవకాశముందో ఆ హస్త విన్యాస క్రమం, మొదలైన వెన్నో ఆ మృదంగ భంగిమలో రామప్ప మలిచాడంటుంది ఉమా వైజయంతీమాల.

చరిత్ర గతిలో బతికి జీర్ణమై పోయి పేరిణి అని పేరు మాత్రమే మిగిలి పోయిన ఈ విశిష్ట నృత్యాన్ని, నటరాజ రామ కృష్ణగారు ఆరు దశాబ్దాలపాటు అవిర కృషి చేసి శోధించి సాధించి పరిశోధించి, పరిష్కరించి, దాని కొక సజీవ రూప కల్పన చేసేందుకు ఈ శిల్పాలు ఉపయోగపడ్డాయి.వీరు నాట్య రీతులపై అనేక వ్యాసాలు వ్రాశారు. నలబై కి పైగా పుస్తకాలు రచించారు. అన్నీ కళా సర్వస్వాలే. వీరు పరిశోధించి రాసిన    "రుద్ర గణిక " ఓ ఉద్గ్రంధం. ఇందులో ఎన్నో సరికొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఉదాహరణకు " దేవ దాసి " పద ప్రయోగం గురించి.


పేరిణి తాండవం అంటే వీరులు చేసే వీర నాట్యం. యుద్ధానికి సన్నద్ధం చేసే నృత్యం. శత్రువు ముందు తలదించకూడదని ధైర్యం నూరిపోసే నాట్యం. పాదాల కదలిక శత్రు సైన్యం మీదికి ఉరికినట్టుంది. దృపద బాణిలోని మృదంగ గంభీర శబ్ద విన్యాసాలకు శరీరంలో కలిగే కదలికలు, ఓంకార నాద మిళితమైన జతులు, కట్టుబాట్లు, ప్రకంపనాలతో సాక్షాత్తు పరమశివుడే శివతాండవం ఆడుతున్నాడా అనే అనుభూతిని కల్పించడమే పేరిణి ప్రత్యేకత. పురుషులు మాత్రమే చేయగలిగే పురుష సాంప్రదాయ నాట్యం ప్రపంచంలో ఇదొక్కటే.

జాయప సేనాని రచించిన నృత్యరత్నావళి తెలుగులో ఇక్కడ చూడండి.

క్రీ.శ.1200ల ప్రాంతంలో రాజకీయ, మత రంగాల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కాకతీయ రాజ్యాన్ని మహారాష్ట్ర యాదవ రాజులు ఓడించి రాకుమారుడు గణపతిదేవుని బందీ చేశారు. కర్ణాటకలో ప్రజ్వరిల్లిన వీరశైవ మతం ఇతర మతాల హింసను కూడా ప్రోత్సహించింది. వీరశైవ మత ప్రభావం వల్లనే కాకతీయులు జైనం నుండి శైవానికి మారి తెలుగు దేశమంతటా శైవాలయాలు కట్టించారు. ఈ రాజకీయ, మత మార్పులు దేశభక్తిని, దైవభక్తిని వీరరసంతో మేళవించి పెంపొందించాయి. ఫలితంగా పౌరుల్లో.. ముఖ్యంగా యువకులను ఉత్తేజితులను చేయటానికి ‘ప్రేరణ’ అనే ఒక కొత్త నృత్యరీతి పురుడు పోసుకుంది. ఇది అప్పటికే ఆచరణలో ఉన్న కొన్ని ఆటవిక, జానపద నృత్యరీతులను వీరరస ప్రధానంగా తీర్చిదిద్దగా ఏర్పడింది. శివుడు నటరాజుగా ప్రతిపాదించిన నాట్యరీతిగా ప్రచారంలోకి వచ్చింది.

‘ప్రేరణ’ అనే పదం రూపాంతరం చెంది పేరిణి అయ్యింది. పేరిణి శిల్పాలు రంగ మంటపం ఆగ్నేయ స్తంభానికి, ఉత్తర దూలానికి, పై కప్పుకు, అంతరాళ ద్వారానికి ఇరువైపులా చెక్కబడి ఉన్నాయి. స్తంభాలు - చూరుల మధ్య చెక్కిన మదనికల ఊత శిల్పాలలో కూడా కొన్ని పేరిణి తాండవ శిల్పాలే.
ఇటీవలి కాలం వరకు ఆంధ్రప్రదేశ్ నాట్యంగా పేరొందింది కూచిపూడి నాట్యం. అయితే దాని చరిత్రను ఎంత శోధించినా, 15, 16 శతాబ్దాల కంటే వెనుకకు పోవడం లేదు అని ప్రముఖ పరిశోధకుడు ఆరుద్ర తేల్చిచెప్పారు. మరి క్రీ.శ.1213 కంటే ముందే మనుగడలో ఉన్న పేరిణి నృత్యం మనకు కనీసం తెలియను కూడా తెలియకపోవడం విచారకరం.
పేరిణి నృత్యం ఒక జానపద లేదా దేశి నృత్యమని చెప్తూ దాన్ని ఒక ప్రత్యేక ప్రకరణంలో వివరించాడు జాయప సేనాని - తన ‘నృత్తరత్నావళి’లో. ఈయన గణపతిదేవ చక్రవర్తికి బావమరిది మాత్రమే కాకుండా ఆయన గజ సాహిణి (గజ సైన్యాధిపతి) కూడా.

చరిత్ర గతిలో బతికి జీర్ణమై పోయి పేరిణి అని పేరు మాత్రమే మిగిలి పోయిన ఈ విశిష్ట నృత్యాన్ని, నటరాజ రామ కృష్ణగారు పరిశోధించి, పరిష్కరించి, దాని కొక సజీవ రూప కల్పన చేసేందుకు ఈ శిల్పాలు ఉపయోగపడ్డాయి.
జాయప సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో కనిపిస్తుంటుందట, త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్నిచేసేంతలా ఫోటోలు లాంటి ఆధునిక ప్రక్రియలు లేని ఆ రోజుల్లోనే చెక్కారు.


కోలాట భంగిమలు కూడా చెక్కారు : జానపద నృత్యాల్లో తెలంగాణలో అత్యంత ప్రధానమైనదీ, ప్రాచీనమైనదీ కోలాటం. ఈ కోలాట దృశ్యాలు అత్యంత మనోహరంగా ఈ దేవాలయ గోడలపై చిత్రించబడ్డాయి. రంగ మంటపపు నైరుతి స్తంభంపై కూడా ఈ కోలాట దృశ్యాలు చెక్కి ఉన్నాయి. మార్చి నెలలో వచ్చే కాముని పౌర్ణమికి ముందు వెనె్నల రాత్రిళ్లలో తెలంగాణలో జాజిరి పాటలతో కోలాటం ఆడి పౌర్ణమినాడు కామ దహనం చేయడం ఆచారంగా వస్తున్న విషయం ఇక్కడ గమనార్హం.
కోలాట దృశ్యం
నందికి ఒక నమస్కారం చేసేందుకు వెళుతున్నారా తనూ కొన్ని విషయాలు చెపుతుంది కుదిరితే వినండి
 త్రికూటాలయం, ఆలయానికి తూర్పుముఖ ద్వారం, ద్వారం ఎదురుగా హుందాగా కూర్చు న్న నందీశ్వరుని విగ్రహం దర్శనమిస్తాయి. మెడపట్టెలు, చిరుగంటలు మొదలు అందమైన ఆహార్యం, బలిష్ఠ శరీర సౌష్ఠవంతో ఈ నందీశ్వరుని చూడటానికి రెండు కళ్లు చాలవు ఇక్కడి నంది విగ్రహం స్పష్టంగా '' reef knot '' రెండువైపులా కనిపిస్తుంది. తాళ్ళని ఉపయోగకరంగా శాస్త్రీయంగా ముడివేయడం, మెలికలు వేయడం ఎప్పటినుంచో వాడుకలో వుందనే విషయాన్ని 800 సంవత్సారాల క్రితం నిర్మించిన ఈ ఆలయ శిల్పి స్పష్టం చెక్కి చూపించి నిరూపించినట్లయ్యింది. బహుశా ఇటువంటి ఆధారాలే లేకపోతే ఇవ్వన్నీ ఏ ఎంగిలీసు పద్దతులనుంచో అరువు తెచ్చుకున్నాం అటుండే వాళ్ళేమో.

రామప్ప గర్భాలయం ఎదురుగా వున్న నంది విగ్రహం మూపుపై
వందల ఏళ్ళ క్రితం స్పష్టంగా చెక్కబడిన రీఫ్ నాట్ 

ఇదే నందికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లు అచ్చంగా చూస్తుంటుంది. అలాగే ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. దాని శరీరం నునుపు, అలంకరించిన ఆభరణాలలోని నిశితత్వం స్పష్టంగా గమనించవచ్చు.



గణపతిదేవుని కాలంనాటి కొండపర్తి శాసనం కాకతీయ శిల్ప నిర్మాణ సామర్థ్యాన్ని కింది శ్లోకంలో వర్ణించింది.



ప్రాకారోజయతి త్రికూటమ్ అభితస్తల్ తేన నిర్మాపితః

సుశ్లిష్టైః క్రమశీర్షకై రుపచితో నీలోపలైః కల్పితః

యశ్చా లక్షిత సంధిబంధ కథనాదేకశిలా తక్షకైః

సంతక్ష్యేవ మహీయసీమ్ ఇవ శిలాం యత్నాత్ సముత్తారితః



(నల్లని రాళ్లను సమానంగా నున్నగా చెక్కి, సన్నిహితంగా కూర్చి నిర్మించిన త్రికూట ప్రాకారం విలసిల్లుతూ ఉంది. అతుకుల గీతలు కనిపించకుండా ఏకశిలా నిర్మితంగా భాసించే ఈ ప్రాకారాన్ని మహా ప్రయత్నంతో శిల్పులు నిర్మించారు)

సన్ననిదారం ఇటునుండి అటు వెళ్ళేంత
సునిశితమైన పనితనాన్ని చూపారు
కామేశ్వర ఆలయం పక్కనున్న నరసింహాలయాన్ని పాకశాల అంటున్నారు. ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న నంది మండపంలోని నంది కాకతీయ శైలికే తలమానికంగా పేరొందింది.

 రామప్ప దేవాలయం శిల్పకళకు పెట్టింది పేరు. శిల్పాలు ఇంత అందంగా మలచగలగటానికి శిల్పినైపుణ్యం కాక
► మొదటి కారణం నల్లని గ్రానైట్ (చలువరాయి) డోలరైట్ లేదా నల్లని వోల్కానిక్ శిలను ప్రత్యేకంగా తెప్పించుకుని వాడటం,

► రెండోది అద్దం లాంటి నునుపుదనం వచ్చేంత వరకూ ఓపికగా చిత్రిక పట్టగలగటం

► మూడోది సునిశితమైన అతి సూక్ష్మమైన స్వర్ణాభరణ సదృశమైన జిలుగు పనితనం కోసం పగళ్ళూ రాత్రులూ ఎంతో ఓపికతో శ్రమించటం.

► నాలుగు పైకప్పులను మోసే నాగిని శిల్పాల విశిష్టత, శిల్పాకృతుల ముఖాల్లో హావభావాలు పలికించడం.

 దేవాలయాన్ని దాదాపు ఆరడుగుల మేరకు రాతి వేదికను ఏర్పాటు చేసి దానిపై నిర్మించారు. ఆలయం ప్రవేశించే ముందే కప్పు ను మోస్తున్న నాగిని లేదా మదనిక శిల్పాలు, ద్వాదశ మూర్తులు ఈ ఆలయ వైశిష్ట్యానికి మూలస్తంభాలు. అసామాన్య నాట్యకోవిదలు ఆభరణాలే ఆచ్ఛాదనగా, మరికొన్ని నగ్నంగా కనబడే ఈ శిల్పాల సౌందర్యం వర్ణించడం ఎవరి తరంగాదు. తైలస్నానం చేసి, అనాచ్ఛాదితంగా స్నానశాల నుంచి బయటికి వచ్చినట్టు కొందరికి కనిపిస్తే శాస్త్రీయమైన నృత్య భంగిమలతో, మృదంగ వాద్యకారిణులుగా, ఆభరణ ధారిణులుగా వివిధ మూర్తులుగా మరికొందరికి కనిపిస్తాయి.

భారదేశంలో విరజిల్లిన అధ్బుత శిల్పరీతుల్లో కాకతీయ శిల్పరీతి ఒకటి. దేవాలయాల్లోని స్తంభాల నిర్మాణరీతి, వాటిని నిలబెట్టిన విధానం గర్భాలయ ముఖద్వారాలను బట్టి అవి కాకతీయులు కట్టించారో లేదో స్పష్టంగా చెప్పవచ్చు. కాకతీయ శిల్పరీతికి మార్గదర్శకమైనది హోయసల శిల్పరీతి. కాకతీయ దేవాలయ నిర్మాణానికి దాదాపు 200 సంవత్సరాలకు పూర్వమే హోయసలలు బేలూరు, హళేబీడు, సోమనాథపురాలలో అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు. ఆ దేవాలయాలు మీద కని ్పంచే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటివి కాకతీయ దేవాలయాలలో కూడా కనిపిస్తాయి. అయితే హోయసల శిల్పరీతికి కాకతీయ శిల్పరీతికి కొన్ని భేదాలు కనిపిస్తాయి. హోయసల శిల్పులు ఆలయాల బయటి వైపుననే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కాని కాకతీయుల బయటే కాకుండా లోపలి భాగంలో కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు. హోయసల ఆలయాలపై కనిపించేవి దేవతామూర్తులు కాగా, కాకతీయ ఆలయాలపై కనిపించేవి నాటి సామాన్య స్త్రీ పురుషులవి. ఆనాటి సామాన్యుల వేషధారణ, హావభావాలను ప్రదర్శించిన ఘనత కాకతీయులదేనని నిస్సం దేహంగా చెప్పవచ్చు

గజకేసరి శిల్పాలు, రుద్రుని (భార్యాసహిత) శిల్పం, వివిధ భంగిమల నాట్యకారిణులు, పురాణ గాథలు గోడలకు స్తంభాలకు దర్శనమిస్తాయి.  ప్రధాన ద్వారం దాటి మధ్య మంటపంలోకి వెళితే తల పైభాగాన గల శిల్పాలు, బహుభుజ రుద్రమూర్తి లాస్యం, అష్టదిక్పాలకుల శిల్పాలు, వృత్తాకార శిల్పాలు, మధ్యమంటప స్తంభాలపై నాలుగువైపుల ఫలకాలపై వేసిన ఒకే ఫ్రేములో బిగించిన సమగ్ర చిత్రాల వంటి శిల్పాలు, గర్భాలయ ద్వార బంధ శిల్పాలు, ఆలయంలో నిలిచిన మహాశివలింగ రూపం ఒక్కటేమిటి ఆలయంలో దశ దిశలు మెడతిప్పక, మడమతిప్పక, కన్నార్పక ఆ్రర్ద హృదయంతో నయనానందకర శిల్పాలే చూడగలం. రోజులుగా ఆరాధించవలసిన, అధ్యయనం చేయవలసిన, హృదయ మర్పించవలసిన శిల్పనిధి రామప్ప దేవాలయం.
ఐతిహాసిక గాధలతో రూపొందిన కప్పు

రామప్ప ప్రధానాలయంలో పై కప్పు


దశభుజరుద్రుడు
రంగమంటపం మధ్య భాగంలోనున్న పైకప్పులో దశభుజుడైన నాట్యరుద్రుడు అందంగా చెక్కారు. ఇలాంటి శిల్పమే హన్మకొండలోని రుద్రేశ్వరాలయం (వెయ్యి స్తంభాల గుడి)లో కూడా ఉన్నది.పరమశివారాధకులైన కాకతీయులు వైదిక రుద్రుని ఆరాధించారనటానికి -రుద్రదేవ మహారాజు, రుద్రమదేవి, ప్రతాపకుమార రుద్రదేవమహారాజు అన్న వారి పేర్లలో కనిపించే 'రుద్ర' శబ్దమే నిదర్శనం. ఆ దశభుజ రుద్రునికి కుడివైపున ఉన్న ఐదు చేతులతో శూలము, వజ్రాయుధము, ఖడ్గము, పరశువు, అభయముద్ర ఉన్నాయి. అట్లాగే ఎడమవైపు ఉన్న ఐదు చేతులతో నాగము, పాశము, ఘంట, అగ్ని, అంకుశము ఉన్నాయి.

ప్రతాపరుద్ర చక్రవర్తికి సమకాలికుడైన పాల్కురికి సోమనాథుని 'పండితారాధ్య చరిత్ర' (వాద ప్రకరణం పు.661)లో సరిగ్గా ఇదే రకమైన వర్ణన కనిపిస్తుంది. ఆ దశభుజరుద్రుని చుట్టూ అష్టదిక్పాలకులు భార్యాసమేతులై, తమతమ వాహనాలమీద కొలువుతీరి ఉన్నారు.

ఆ రంగమంటపం చుట్టూ ఉన్న నాలుగు అడ్డ దూలాల మీద సముద్ర మథనం, త్రిపురాసుర, గజాసుర సంహారం, వరాహమూర్తి, నాట్యగణపతి, కృత్య తదితర రూపాలను శిల్పులు మనోహరంగా చెక్కారు. ముఖ్యంగా గజాసుర సంహారం చేసిన శివుడు ఆ ఏనుగును చీల్చి బయటకు వస్తున్నట్లు చెక్కిన శిల్పం మహాద్భుతం. రంగమంటపం చుట్టూ ఉన్న పైకప్పులో రకరకాల పద్మదళాలు, రాతి చక్రాలను చెక్కారు.


ప్రధానాలయం పై కప్పు
ఇప్పట్లా కాంక్రీటు స్లాబు విధానం కాదు.
మూలల నుంచి ఒక క్రమంలో మూసుకుంటూ రావడం కనిపిస్తుంది

ఒకప్పుడు దీని గోపురం చాలా అందమైన ఎనిమిది తంతెలతో ఇటుక నిర్మాణం. ఈ ఇటుక ఎంతగట్టిదో అంత తేలికైనది. నీటిలో వేస్తే తేలేదని ప్రసిద్ధి. ఇపుడా నిర్మాణం శిథిలమై, పునర్నిర్మాణం జరిగింది. గోపుర శోభ పాతది అందంగా ఉండేది. ఈ ఆలయంలోని మదని శిల్పాలు రాణీ రుద్రమదేవివని, రామప్ప రుద్రమదేవిని ఇష్టపడి ఆమె విగ్రహాలు చెక్కినాడని, అమరశిల్ప జక్కననే ఈ ఆలయ శిల్పి అని, ఈ ఆలయం కట్టినవారు 15, 20 అడుగుల ఎత్తువారని, దేవాలయ నంది దినదినము పెరుగుతున్నదని, గుడి వంగిపోతే సెనగలు పోసి నాన్చి, అవి ఉబ్బగా గుడిగా సరిగా నిల్చినదని ఇలాంటి అనేక కట్టుకథలు దీనికి సంబంధించినవి వినబడుతున్నాయి. ఆలయ విశిష్టత గొప్పదే కనుక కట్టుకథలు బాగానే పుడతాయి.

కాకతీయుల ఆలయాల్లో త్రికూటాలయాలు పేరెన్నిక గన్నవి. అయితే రామప్ప దేవాలయం మాత్రం త్రికూటాలయం కాదు. కాని మూడు ప్రవేశ ద్వారాలున్న ఆలయం. ఆలయం తూర్పునకు అభిముఖంగా ఉండగా ఉత్తర, దక్షిణ దిశల్లో కూడా ప్రవేశద్వారాలున్నాయి. ఇదొక ప్రత్యేకత. ప్రధాన ఆలయంలోకి నంది మండపం నుండి కాటేశ్వర ఆలయం నుండి, కామేశ్వర ఆలయం నుండి ప్రవేశించవచ్చు. ప్రధానాలయంలోకి ప్రవేశించి విశాలమైన రంగ మండపంలోకి చేరుకుంటాం. రంగ మంటపంలో జరిగే నాట్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు వీలుగా కూర్చునేందుకు మంటపం మూడు పక్కలా అరుగు గద్దెలున్నాయి. ఇది కూడా కాకతీయ వాస్తు ప్రత్యేకత.

రామప్ప ఆలయం ఆరున్నర అడుగుల ఎతె్తైన పీఠంపై నిర్మించబడింది. ఇలా Sand Box Foundation Technology ద్వారా  నిర్మించటం వలన గట్టిదనం పెరుగుతుందట.   ఆలయం చుట్టూ పది అడుగుల వెడల్పైన ప్రదక్షిణ పథం ఉంది. ఈ ప్రదక్షిణ పథంలో ఆలయం చుట్టూ తిరుగుతూనే రామప్ప ఆలయ శిల్పకళా చాతుర్యాన్ని వీక్షించవచ్చు.

రంగ మంటపం ఉత్తర దూలానికి గజాసురుని భక్తికి వశుడై అతని పొట్టలో బంధించబడిన శివుడు ఎనిమిది చేతులతో నాట్యం చేస్తున్న నటరాజుగా శిల్పించబడ్డాడు. ఈ శిల్పంలో కన్పించే కటి వస్త్రం, భుజ కిరీటాలను పేరిణి నృత్య ఆహార్యంలో వాడుతారు.

అంతరాళ ద్వారానికి రెండు వైపులా రెండు పొడవైన ఘనాకార శిల్ప పలకలున్నాయి. వీటికి మృదంగాన్ని వాయిస్తున్న వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తున్న స్ర్తి పురుషుల శిల్పాలు అనేకం చెక్కబడ్డాయి. ఇవి పేరిణి శివతాండవానికి చెందిన వివిధ భంగిమలను ప్రతిబింబిస్తున్నాయి. రంగ మంటపం కప్పునకు కూడా పది చేతులతో నర్తిస్తున్న నటరాజ శిల్పం అత్యద్భుతంగా చెక్కబడింది.

 రామప్ప ఆలయ అంతరాళంలో విష్ణుకుండినుల సంప్రదాయ శిల్పం సప్తమాతృకల (హారీతి) శిల్పం కన్పిస్తుంది కాబట్టి ఈ దేవాలయ మూలాలు విష్ణుకుండినుల కాలం నుండే ఉన్నాయంటే కూడా నమ్మవచ్చు.

రంగ మంటపానికి మరో పేరు నాట్య మంటపం. ఈ మంటపం మధ్యలో గుండ్రని ఏకశిలా వేదిక ఉంది. ఈ వేదికపైన దేశంలో పేరొందిన నాట్యకత్తెలు, గణికలు నృత్యం చేసేవారు. వారికి ఆనాడు సమాజంలో చాలా గౌరవం ఉండేది. కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుని భార్యల్లో ఒకామె - మాచల్దేవి. మాచల్దేవి తెలుగు దేశమంతటా ప్రఖ్యాతి గాంచిన నాట్య కళాకారిణి. సకల కళావల్లభురాలు. ఈమె ఇక్కడి రంగ మంటపంలో నాట్యంచేసి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

రంగ మంటపం నైరుతి స్తంభానికి చెక్కిన రతీ మన్మధులు, పాల సముద్ర మథనం, వాయవ్య స్తంభానికి చెక్కిన గోపికలు కృష్ణుల మధుర భక్తి శిల్పాలు నాలుగు అంగుళాల ఎత్తులోనే ఎంత అందాన్నీ నైపుణ్యతను వ్యక్తపరుస్తాయో చూస్తేనే అర్థమవుతుంది. నైరుతి, ఈశాన్య స్తంభాల శిల్పాల మధ్య సూది మాత్రమే దూరేటంత సన్నని రంధ్రాలను తొలవడం శిల్పి నైపుణ్యానికి గీటురాయి. అలాగే అంతరాళ ద్వారపు దక్షిణ పక్కనే తాకితే సప్తస్వరాలు పలికే రాతి చెట్టును శిల్పించడం శిల్పి అనన్య సామాన్య ప్రతిభకు తార్కాణం. 

రామప్ప ఆలయంలో మూడు ముఖ్యమైన శిల్పరీతులు కన్పిస్తాయి. ఒకటి - దేవతా మూర్తుల శిల్పాలు, రెండు - ఊత శిల్పాలు, మూడు - జానపద శిల్పాలు. మొదటి రెండు తరగతులకు చెందిన శిల్పాలు నల్లరాతితో చేసినవి కాగా మూడవ తరగతికి చెందిన శిల్పాలు స్థానికంగా లభించే ఎర్ర రాతితో చేసినవి.

గర్భాలయ ప్రధాన ద్వారం:
రుద్రేశ్వరాలయ గర్భాలయ ప్రధాన ద్వారం మరొక గొప్ప కళాఖండం. చెరుకుగడలు, అరటిబోదెల మధ్య బాణాలు ధరించి, రకరకాల భంగిమలలో నిలబడ్డ స్త్రీలు జీవకళతో దర్శనమిస్తారు. ఇక్కడి శిల్పాలను చేత్తో మీటితే ఆ రాయినుంచి లోహపు శబ్దం రావటం విశేషం. వాటి పైభాగాన సింహాల వరుసలు, లతలు, వాద్యకారుల చిత్రాలు అందంగా తీర్చిదిద్దబడినాయి.

శ్రీ రుద్రేశ్వర మహాలింగం:
గర్భాలయంలో ఉన్న పెద్ద శ్రీరువూదేశ్వర మహాలింగం, అనుమకొండలోని వెయ్యిస్తంభాల గుడిలోని రుద్రేశ్వరునితో పోటీపడుతున్నదా అన్నట్లు కనువిందు చేస్తుంది. పానవట్టంపైన భాగంలోనే కాకుండా, కింది భాగంలో కూడా సన్నని గీతలు గీతలుగా అందంగా చెక్కిన రీతి మనోహరం! ప్రధానలింగం నల్లని కాంతులీనుతూ నిన్ననో మొన్ననో చెక్కినట్లు కన్పిస్తుంది. ఇదొక అద్భుత కళాఖండం!



గజ సంహార మూర్తిగా శివుడు


 శిల్పకళ గురించి చెప్పాలంటే మాటలు చాలవు.

దేవతా మూర్తుల శిల్పాలు దేవాలయ అంతర్భాగాల్లో ఉండగా, ఊత శిల్పాలు దేవాలయం చుట్టూ గోడలు, స్తంభాల పైనున్న చూరుని ఎత్తిపట్టుకున్నట్లుగా ఉన్నాయి. ఇలాంటివి ఆలయ మూడు ప్రవేశ ద్వారాలకు రెండు వైపులా రెండేసి ద్వారానికి నాలుగు చొప్పున మొత్తం పన్నెండు నిలువెత్తు శిల్పాలున్నాయి. నృత్య భంగిమల్లో ఉన్న ఈ స్ర్తి శిల్పాలను మదనికలు, సాలభంజికలు, నర్తకీమణులు తదితర పేర్లతో పిలుస్తున్నారు. కాకతీయ శిల్పరీతికే ఇవి తలమానికాలు. ఇవి సహజమైన ఎత్తుతో అత్యంత రమణీయంగా వుంటాయి. కర్రతో నైనా ఇంత నునుపు సాధ్యం కదేమో అంటువంటి రాళ్ళను శిల్పులు వెన్నలా ఎలా మలిచారో తలచుకుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది.

 గజకేసరి శిల్పాలు
ఆలయం చుట్టూ 28 గజ-కేసరి (ఏనుగుపై సింహాలు) శిల్పాలున్నాయి.  పాలంపేట రుద్రేశ్వరాలయంలోనివి ఇవి మిగిలిన దేవాలయాలలో కంటే  పెద్దగా ఉండటానికి కారణం - కాకతీయ రాజులలో మొదటి, రెండవ ప్రోలరాజులకు, రుద్రదేవ మహారాజుకు, గణపతిదేవ చక్రవర్తికి, రుద్రమదేవికి, ప్రతాపరువూదునికి - అందరికీ ‘గజకేసరి’ బిరుదులు ఉన్నాయి. బహుశః అందుకేనేమో కాకతీయ శిల్పాలలో గజకేసరి శిల్పాలు ఎక్కువగా కన్పిస్తాయి.

ప్రదక్షిణా పధం

ఆలయానికి చుట్టూ విశాలమైన ప్రదక్షిణపథం ఉంది. దానిమీద నడుస్తూ ఉంటే ఆలయం వెలుపల చెక్కిన ఎన్నో కుడ్యశిల్పాలు కన్పిస్తాయి. వాటిలో - శృంగార శిల్పాలు, క్రీడా వినోదాలు, వాద్యకారులు, మల్లయుద్ధాలు, భైరవమూర్తులు వంటి విశేషాలు కన్పిస్తాయి. అవికాక - మహిషాసుర మర్దిని, వీరభవూదుడు, సప్తమాతృకలు వంటి శిల్పాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.ఇక ఆలయం చుట్టూ గోడలపై వరుసలు వరుసలుగా ఏనుగులు, వివిధ మత శాఖలు, శృంగారం తదితర అంశాలను వ్యక్తపరిచే జానపద శిల్పాలున్నాయి. ఆలయం లోపలి స్తంభాలకు కూడా ఇలాంటి శిల్పాలు చెక్కారు. ఇంకా నిలువెత్తు ఏకశిలా ఏనుగు విగ్రహాలు కొన్ని ప్రవేశ ద్వారాల్లో కన్పిస్తాయి.ఆకాలంలో స్త్రీల విలువని తెలియజెప్పే విగ్రహాలు, జంధ్యం ధరించిన స్త్రీ.. ఆకాలంలో స్త్రీలు వేదాధ్యయనం చేసేవారని తెలియజేస్తుంది. అలాగే స్త్రీలు ధర్మ ప్రచారంచేసేవారనటానికి గుర్తుగా రుద్రాక్ష మాలను జంధ్యముగా ధరించిన స్త్రీ మూర్తిని చూడవచ్చు. అలాగే, స్త్రీలు యుధ్ధ విద్యలలో ఆరితేరారనటానికి రెండు ఏనుగులతో పోరాడే యువతి, కత్తిధరించిన యువతి వగైరా. ప్రతి బొమ్మలవరుస మొదలు, చివర మానవుడి ప్రారంభ దశ, చేరవలసిన గమ్యములను తెలియజేస్తాయి.

ఆలయం చుట్టూ ఒక వరుసలో ఏనుగులు శిల్పించబడగా,ఈ వరసలో మొదట ఒక వ్యక్తి కత్తిపట్టుకుని వుంటాడు. చివరి ఏనుగు దేవుని ముందు భక్తితో తలవంచుకుని వుంటుంది. వాటిపైన వరుసలో వజ్రబంధాలు చెక్కారు. ఈ రెండు వరుసల మధ్య వరుసలో వివిధ మతాలకు చెందిన శిల్పాలు, వేట దృశ్యాలు, ఇతర జీవన విధానాలు చెక్కబడ్డాయి. ఆలయం పడమటి వైపున చెక్కిన నాలుగు శిల్పాల్లో మొదటి దానిలో స్ర్తి పురుషుడు ప్రేమించుకోవడం, రెండవ దానిలో పురుషుడు శృంగారానికి ఉద్యుక్తుడవడం, మూడవ దానిలో స్ర్తి ఉద్యోక్తురాలవడం, నాల్గవ దానిలో ఇద్దరూ సంగమించడం శిల్పించబడ్డాయి.

గోడల చుట్టూ కనీసం నాలుగైదు వందల ఏనుగులు వారి గజబలానికి చిహ్నాలా అన్నట్లు వుంటాయి అయితే అందులో ఒక్కోటి వాటి రూపం ఆకారం, ఆహార్యాలలో ప్రత్యేకతలను కలిగి వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరికొన్ని ప్రత్యేక శిల్పాలలో ఏనుగులతోపాటు సింహాలను చిత్రించారు. సింహాన్ని వేటాడే శక్తికి, స్థిమితత్వాన్ని కలిగిన రాచఠీవితో కూడిన శౌర్యానికి చిహ్నాలుగా భావించేవారు.

సాలభంజికలు
ప్రతి ద్వారానిక నాలుగు చొప్పున మొత్తం మూడు వైపులా వున్న ద్వారాలకు పన్నెండు సాలభంజికలు


తూర్పు ద్వారంలోని మదనికలు

ఉత్తర ద్వారం వైపు

దక్షిణ ద్వారం వైపు

కొన్ని మదనికలు / సాలభంజికలు / నాగిని ల ప్రత్యేకతలు

యుధ్ధ మదనిక
అన్ని శిల్పాలలాగానే అత్యద్భుత పనితనం ఉండటం ఒక ఎత్తైతే ప్రధాన మైన అంశం ముల్లు గుచ్చుకున్న యుధ్ధవనితకు కాలిలో ముల్లు తీస్తుంటే కనిపించే ఎక్స్ ప్రెషన్స్ కాలి పాదం లో ముల్లు వున్న చోట వాపు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మహిళ యుద్దానికి వెళ్ళి వచ్చినట్లు ఆమె కాలి ముల్లుని ఒక పురుషుడు తొలగిస్తున్నట్లు చూపిన శిల్పం లో జండర్ వల్ల కాకుండా చేసే పనిలో చొరవ వల్ల గౌరవం దక్కుతోందని అప్పుడే చెప్పినట్లయ్యింది. ఆమె చేతిలో పెద్ద ధనస్సు, ఆమె ధరించిన ఆహార్యం వల్ల యుద్దం నుంచి వస్తోందని సులభంగా గమనించేలా వుంది.
============================000==================================

అలంకృత మదనిక
ఈ శిల్పంలో గమనించాల్సన ప్రధానమైన అంశం. ఆ యువతి వస్త్ర ధారణ వస్త్రం పై వున్న చక్కని డిజైన్ కూడా గమనించ వచ్చు, అప్పట్లోనే అందమైన కేశాలంకరణ, కాళ్ళకు ధరించిన పట్టీలు, ఈమె పలుచని ఉల్లిపొర వంటి వస్త్రం ధరించి ఉన్నది. ఆమె చెవికి ఉన్న దుద్దులు ఆనాటి కర్ణాభరణాలకు ఒక మచ్చుతునక ఆమె సోయగం, మొహంలోని భావావేశం అప్పట్లోనే పాదరక్షలకు ఎత్తుమడమలను (హై హీల్) జోడించే ప్రక్రియ వుందని ఈ చిత్రం నిరూపిస్తోంది. ీపొడగరి అయిన యువతే ఎత్తుమడమలను ఉపయోగించినట్లు కనిపిస్తోంది కాబట్టి కేవలం అవసరార్ధమే కాకుండా అప్పటి అలంకరణ పద్దతిని అనుసరించే (ఫ్యాషన్ ట్రెండ్) ఆమె ఇటువంటి పాదరక్షలు ధరించిందని అర్ధం చేసుకోవచ్చు. శరీరంపై ఇతర ఆభరణాలు కూడా ఆమె సౌభాగ్యాన్ని సూచిస్తున్నాయి.

============================000==================================
నగ్న నాగిని
లేదా
నాగ మదనిక
అసలీ శిల్పం గ్రానైట్ దేనా లేక లోహపు పోతపోసి నునుపు దేల్చారా అన్నంత సౌందర్యవంతంగా దేహం అంతా వుంటుంది కేవలం మొహం దగ్గర మాత్రం కొంత గరుకుదనం కనిపిస్తుంటుంది. ఈ నాగకన్యను వస్త్రాఛ్చాదనా రహితంగా చెక్కారు. చేతిలోనూ కాళ్ళదగ్గర వున్న సర్పాలు ఏదో హెచ్చరిక చేస్తున్నట్లు వుంటాయి

నాగిని నాట్యకారిణి శిల్ప అందానికి ముగ్ధుడైన ఒక నిజాం ప్రభుత్వ అధికారి సుమారు వందేళ్ల క్రితం ఈ శిల్పాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడట. పీడకలలు రావడంతో మళ్లీ ఇక్కడికి తెచ్చి పెట్టాడట. ఈ శిల్పం ఇప్పటికీ ఎంతోమంది కవులు, గాయకులు, కళాకారులను అలరిస్తూనే ఉంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె దృష్టినీ ఆకర్షించి ఆయన చేత ‘నాగినివో భోగినివో, నాట్యకళా విలాసినివో’ అనే సినిమా పాటను రాయించడం ఈ శిల్ప ఘన చారిత్రకాంశాలలో ఒకటి మాత్రమే.

============================000==================================
మృదంగ మదనిక
నాట్యకారులకు తాళం వేస్తూ సహకరించే నమూనాలో వున్న యువ్వనవతి శిల్పం ఇది. ఈమె శిరోజాలంకరణలో పాపిట బిళ్ళలాంటి ఆభరణం ధరించింది. ఈ శిల్పం తో పాటే సహ వాయిద్య కారుల చిత్రాలు, నాట్య కత్తెలను కూడా విషయం అర్ధం అయ్యేందుకు గానూ చిత్రంచి నట్లున్నారు. ఈమె ముఖంలో శ్రధ్దాపూరిత అభావం కనిపిస్తూ వుంటుంది.
============================000==================================
నాట్య ముద్రా మదనిక
నాట్యం చేస్తున్న భంగిమలోని ఈ శిల్పంలో కాలి అందెలూ, చేతి కంకణాలూ, హస్తాభరణాలూ స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈమె పది వేళ్ళకూ ఉంగరాలు ధరించింది. చాలా పెద్ద దండవంటి తాడు కావచ్చు లేదా మరేదైనా నాట్య సంభందిత ఆభరణం కావచ్చు శరీరం పైనుంచి క్రింది వరకూ ధరించినట్లు కనిపిస్తోంది. ఇలా పూదండ కంటే పెద్దగా జంధ్యం లాంటి ఆభరణాన్ని వేసుకోవడం నాట్యప్రక్రియల్లో మనం గమనించం దీనికేమైనా ప్రత్యేకతవుందేమో మనకి చెప్పేవారు దొరకాలి. రెండు చేతుల వేళ్ళు వాటి ద్వారా ఏర్పడిన ముద్ర చాలా స్పష్టంగా చెక్కారు ఈ శిల్పంలో

============================000==================================
నాట్య మదనిక
నాట్యభంగిమలోని ఈ మదనికకు కూడా రెండు దండచేతుల నుంచి మోకాళ్ళ క్రిందు వరకూ వేళ్లడుతున్న తాడులాంటి దండను గమనిస్తాం. పైకి లేపిన ఎడమ కాలిని ఆ దండగుండా దాటుతున్నట్లు ఆమె బయటకు తీసినట్లు వుంటుంది. ఈ విగ్రహంలో మరింత జాగ్రత్తగా గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఆమో ఆభరణాల నీడలు ఏర్పడటం. కంఠహారం వక్షస్థలం నుంచి కొంత పైకి వుండి రాతి నగకాదు ఇదేదో నిజమైన నగనే ప్రత్యేకంగా ధరించి వుండవచ్చు అనిపించేలా వుంటుంది. కాంతి వాటిపై పడినపుడు క్రిందుగా శరీరంపై ఆ ఆభరణాల నీడలు కూడా ఏర్పడుతున్నాయి. మీకు పై చిత్రంలో కూడా కంఠహారం నీడ ఆమె పొట్ట పై భాగంపై పడటాన్ని చూడవచ్చు. జారిన కాలి పట్టీ ఏర్పడే విధం, పై కెత్తిన రెండు చేతుల్లోని స్పష్టమైన నాట్య ముద్ర. కుడిపక్కన మృదంగం వాయిస్తున్న కళాకారిణి కనిపిస్తుంటారు. ఎడమ పక్క శిల్పం పూర్తిగా ధ్వంసం అయ్యి రాలిపోయినట్లుంది. బహుశా ఆ శిల్పం ఉన్పప్పుడు తీసిన ఫోటోలు ఇప్పుడు దొరుకుతాయో లేదో.

============================000==================================
నాట్య మదనిక
చాలా స్పల్పమైన తేడాలతో పై నాట్యమదనిక లాంటి శిల్పమే ఇది కూడా. హస్త ముద్రల విన్యాసంలో కొంచెం తేడా వుంటుంది. వస్త్రదారణలో స్పల్పమైన భేదం కనిపిస్తుంది.


============================000==================================
లజ్జా మదనిక

ఈ మదనిక చీరను ఒక కోతి లాగి వేస్తుంటే, ఒక చేత్తో మానసంరక్షణ చేసుకొంటూ, రెండవచేతితో ఆ కోతిని అదిలిస్తున్నట్లు ఉన్న ఆ శిల్పంలోని ముఖంలో కన్పించే హావభావాలు అద్భుతం. ఈ కర్ణాభరణాలు అత్యంత పెద్దవిగా ప్రత్యేకంగా వుంటాయి.  వెనుక ముడివేసుకున్న కొప్పును గమనించవచ్చు.


మదనిక శిల్పాలు పన్నెండూ, పన్నెండు పేరిణీ నృత్య భంగిమలను తెలిపేవే అని వాదించేవారు కూడా కొందరున్నారు. వాటిల్లో ఒక స్ర్తి శిల్పం ఆటవిక నృత్య రీతిని తెల్పేదిగా వుంటే, మరొకటి శాస్ర్తియ నృత్య భంగిమలో ఉంది. ఒక శిల్పం గణిక ఆహార్యంతో రాజసభలో నాట్యం చేస్తున్నట్లుగా చెక్కబడగా, మరొకటి నాగిని నాట్యం చేస్తున్నట్లుగా చెక్కబడింది. ఇటీవలి కాలం వరకు కూడా తెలంగాణలో పెళ్లి మేళాలతో బాజా భజంత్రీలు - సన్నాయిల మోతలకు అనుగుణంగా ప్రత్యేకంగా భూమిపై పాములా పొర్లుతూ నాట్యం చేసే సంప్రదాయం కొనసాగడాన్ని బట్టి నాట్య నాగిని శిల్ప ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవచ్చు.



రెండు మహా గజాలతో ఒకే సారి పోరాడుతున్న యుధ్దభూమిలో వీరనారి


నిజానికి కాకతీయ శిల్పంలో ఏది నృత్య శిల్పం? ఏది కాదు? అని తేల్చి చెప్పటం కష్టం. అలా తేల్చటానికి సాంకేతికంగా కొన్ని ఆధారాలున్నా కళాదృష్టితో చూస్తే, కాకతీయ శిల్పం అంతా అందమైన, లయాన్వితమైన నృత్య శిల్పమనే అనుకోవాలి. ఉదాహరణకు, ఎర్రరాతిలో ఏమంత ప్రాధాన్యత లేని స్థలాల్లో చెక్కిన అలంకార శిల్పంలోని సింహం నడుము మీద నిల్చుని ఒక చేత కత్తి, మరోచేత ఢాలు ధరించి వున్న స్ర్తిమూర్తి యుద్ధం చేస్తున్నట్లూ ఉంటుంది. అదే సమయంలో నృత్యం చేస్తున్నట్లూ ఉంటుంది. రూపకల్పనలో గాని, జీవ చైతన్య స్ఫురణలోగాని కాకతీయ శిల్పాలు స్వతంత్ర రీతికి చెందినవిగా స్పష్టంగా చెప్పుకోవచ్చును. దేశంలోని మరే శిల్పరీతినీ వీటితో పోల్చి చూడగల అవకాశం ఇవ్వని విధంగా ఇవి రూపొందాయి.


============================000==================================
‘శివప్రియ’ నాట్య భంగిమ
రంగ మంటపం ఆగ్నేయ స్తంభానికి చెక్కిన ఒక పేరిణి నృత్య శిల్పంలో ‘శివప్రియ’ నాట్య భంగిమ కన్పిస్తుంది.
రామప్ప ఆలయం లోని శివప్రియ నాట్య భంగిమ

ఈ శిల్పంలో ముగ్గురు స్ర్తిలు నాలుగు కాళ్లతో నాట్యం చేస్తున్నట్లుగా శిల్పించబడ్డారు. మధ్యలో ఉన్న స్ర్తి కుడికాలు తనకు కుడివైపునున్న స్ర్తికి ఎడమకాలు కాగా, ఎడమ వైపున్న స్ర్తికి తన ఎడమ కాలు కుడికాలు అయినట్లుగా శిల్పించబడింది. లేదా ఒకే స్ర్తి వీరరసంతో వేగంగా నాట్యం చేస్తుండగా ప్రేక్షకులకు మూడు రూపాలుగా కన్పిస్తుందన్న భావాన్ని వ్యక్తపరిచాడేమో శిల్పి.

సింహపు గోళ్ళ శౌర్యంతో అలంకృత వీర ఆది వరాహం

============================000==================================

రామప్ప గుడి ఆవరణలోని
శాసన మంటపం

‘కాకతీయ శ్రియాపాదే భూరిషు కంటకేషు నిహితే తీక్ష్ణేషు మోహాత్‌క్షణం’ అన్న రామప్పగుడి శాసనంలో కాకతీయుల అదృష్టదేవత ముళ్లపై నడుస్తున్న సమయంలో ఆ రాజ్యరమను కాపాడినాడని స్పష్టంగా తన పేరే చెప్పుకోవడం అవిధేయత క్రిందకు వస్తుందని తెలిపేలా వుంటుంది. అందులో రుద్రసేనాని వంశాభివర్ణన, అతని పూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి పరాక్రమాలు, అలనాటి ఓరుగల్లుపుర వైభవం వర్ణింపబడినాయి.

సంస్కృత భాషలో రచించబడ్డ దేవాలయ శాసనం ప్రాఢమైన రచన. 204 పంక్తులతో అనేకంగా వృత్తాలతో రచితమైంది.

ఆలయంలో రుద్ర సేనాని వేయించిన శాసనం చాలా విశేషాలు చెబుతోంది. శాసనాన్ని అందంగా రాయించి, అందంగా చెక్కించి, మరింత అందంగా మంటపం కట్టించి, దేవుణ్ణి ప్రతిష్ఠించినట్టు నిలబెట్టిన వైనం చరిత్రలో భారతదేశంలో ఏ ఆలయంలో బహుశా కనబడదు.

1213 మార్చి 31నాటి కట్టడాలు

రామప్పలోని ప్రధాన దేవాలయ ఆవరణలో ఉన్న ఒక దీర్ఘ శాసనంలో రామప్ప ఆలయ దేవతలైన శ్రీ రుద్రేశ్వర స్వామికి, కాటేశ్వర, కామేశ్వర సాములకు శాలివాహన శకం 1135వ సం. శ్రీముఖ నామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి, పుష్యమి నక్షత్రం ఆదివారంనాడు ఈ ఆలయాల నిర్మాత రేచర్ల రుద్రయ్య తన రాజ్యంలోని కొన్ని గ్రామాలను శాశ్వత ధర్మముగా దానం ఇచ్చినట్లు  ఉంది. శాసనంలో పేర్కొన్న తేదీ క్రీ.శ.1213 మార్చి 31 అవుతుంది. అప్పటికే అన్ని ఆలయాల నిర్మాణం పూర్తయింది.

============================000==================================

రాతినుంచి సంగీతం :

సంగీతాన్ని వినిపించే రాతి శిల్పం

ప్రధాన ఆలయానికి కుడి ప్రక్కన వున్న ఈ శిల్పం చాలా ప్రత్యేకమైనది. చూడటానికి రాతిలో ఎటువంటి బోలుదనం వున్నట్లు అనిపించదు. నలుగురిలో ఒక చివరికి వున్న స్త్రీ అరటి చెట్టుని తన ఎడమ చేతితో వంచి పట్టుకున్నట్లు ఈ శిల్పం  వుంటుంది. దీనిలో రంధ్రం పెట్టేందుకు కూడా ప్రత్యేకంగా వీలుకాదు ఎందుకంటే మొత్తం శిల్పాన్ని ఏకశిల (ఒకే రాయి) ని చెక్కి నిర్మించినదే. చేతి వేళ్ళతో తట్టినట్లుతాకితే ఆ రాతి నుంచి సంగీత స్వరాల వంటి శబ్దం మనకు స్పష్టంగా వినిపిస్తుంది.


నీటిపై తేలే ఇటుకలు : ఇక్కడ వాడిన ఇటుకల గురించి కూడా ప్రత్యేకంగా చెపుతారు. అవికేవలం ప్రత్యేక రకమైన మట్టి మాత్రమే  కాకుండా ఏనుగు లద్దెతో, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు,  మరికొన్ని పదార్ధాలు కలిపి తయారు చేసారట దాంతో గట్టితనం తగ్గకుండానే తేలికగా వుండే లక్షణాన్ని కలిగివుంటాయట. ఎంత తేలిక అంటే ఆ ఇటుకను నీటిలో వేస్తే తేలేంతగా. శాస్త్రీయంగా చెప్పాలంటే నీటి సాంద్రత 1gm/cc అయితే ఈ ఇటుకల సాంద్రత కేవలం 0.9gms/cc మాత్రమే అదే మనం సాధారణంగా ఇప్పుడు వాడే ఇటుకలు 2.2 గ్రామ్స్ /cc వుంటాయి. అంతే కాకుండా ఈ ఇటుకలకు స్పాంజిలో వున్నట్లు లోపటంతా బోలుతనం వుంటుంది. ఈ పోరస్ నెస్ వలన కరిగించిన సున్నం బెల్లపు పాకం లాంటి వాటిని పీల్చుకుని దృఢంగా వాటిలోపల భద్రపరచుకోగలుగుతుంది.

 దగ్గరలోనే కోట గుళ్ళు, రామప్ప చెరుపు, లక్నవరం వగైరా వున్నాయి.

ఇప్పుడు మళ్లీ కొత్తగా అటువంటి ఇటుకలను తయారు చేసేందుకు
ప్రయోగాలు జరుగుతున్నాయి

శిథిలం కావడానికి కారణాలు
సుమారు వంద సంవత్సరాల కాలం రాజ పోషణకు, ప్రజాదరణకు నోచుకున్న రామప్ప ఆలయాలు పధ్నాల్గవ శతాబ్ద ప్రారంభంలో కాకతీయ రాజ్యంపై దండయాత్రలు చేసిన ఢిల్లీ సుల్తానుల విధ్వంసకాండకు గురైంది. నాలుగైదుసార్లు అలాంటి దండయాత్రలు జరిగాయి. నీటిపై తేలే ఇటుకలతో నిర్మించిన ఆలయ గోపురం ముస్లింల దాడిలో ధ్వంసమైంది. ఇక్కడి విగ్రహాలు విచ్ఛిన్నమయ్యాయి.

అయితే రామప్ప ఆలయాలు శిథిలమవడానికి ఇతర కారణాలు కూడా లేకపోలేదు. ఆలయ నిర్మాణంలో ఇసుక పునాదులను ఉపయోగించడం కాకతీయ వాస్తు శైలి ప్రత్యేకత. అయితే ఇసుక పునాది మీద నిర్మించిన బరువైన ఆలయం వత్తిడికి ఇసుక ఇటు అటు జరిగి, కిందికి మీదికి జారిపోయి ఆలయం కుంగిపోవడానికి కారణమయ్యింది. గత ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో చోటు చేసుకున్న చిన్నచిన్న భూకంపాల తాకిడికి కూడా గురైన ఇసుక పునాది ఆలయ కుంగుదలకు అవకాశమిచ్చింది. వర్షపు నీరు పునాదిలోకి ఇంకటం వల్ల కూడా ఆలయం కుంగింది. ఆలయం మీదుగా ఉన్న రామప్ప చెరువు నీటి బరువు కూడా ఆలయ పునాది మీద ప్రభావం చూపింది. ఫలితంగా ఆలయం కుంగి, స్తంభాలు, పైకప్పు, గోడలు పగుళ్లు చూపాయి. కొన్నిచోట్ల విరిగిపోయాయి కూడా.
ఇక ఈ మధ్య చోటు చేసుకుంటున్న మానవ తప్పిదాలు రామప్ప కట్టడాలకు మరింత ముప్పును తెచ్చిపెడుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా రామప్ప ఆలయాల పక్కనే పెద్దపెద్ద బాంబులు పేల్చడం, భూగర్భంలో సొరంగం తీయడం, గ్రానైట్ పేలుళ్లు మొదలైనవి రామప్పకు ఆగర్భ శత్రువులుగా పరిణమించాయి. ఈ మధ్య ఈ ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలున్నాయని నిర్ధారణ అయ్యింది. బొగ్గు కోసం రామప్ప కింద చేసే సొరంగాలతో రామప్ప శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 17వ శతాబ్ధములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిధిలము అయ్యిందట అయినా ఇప్పటికీ చాలా దృఢంగా కనిపిస్తోంది. ఒక ప్పుడు దాడులూ, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న ఈ ఆలయసంపద ఇప్పుడు నిర్లక్ష్యపు దాడికి గురవుతోంది. నంబర్లు వేసి పీకేసిన భాగాలు చిందరవందరగా పడేసి వున్నాయి. ఎటువంటి ప్రత్యేక భద్రత ఆదరణ లేదు. మరింత శిధిలమయ్యే పరిస్థితులను నివారించి వాటికి భద్రత కల్పించే పనులు లేవు. కనీసం శాసనాలను శిల్ప సంపదను డిజిటైజ్ చేసి అధికారికంగా అందుబాటులోకి వుంచిన ధాఖలాలు లేవు.

పాడి పంటల ప్రాధాన్యత

కాకతీయ రాజులు స్థానికులు కాబట్టి స్థానిక ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్మాణాలు చేపట్టారు. వాటిల్లో తలమానికమైనవి వారు తవ్వించిన చెరువులు. వారి కాలంలో తవ్వించిన వేల కొలదీ చెరువులను రక్షించుకుంటే చాలు, మన వ్యవసాయ రంగానికి మరో ప్రాజెక్టు కొత్తగా కట్టవలసిన అవసరమే లేదనేది నిపుణుల అంచనా. ప్రజలకు ముందు తిండి కావాలి. ఆ తరువాతే మతం. కాబట్టి రేచర్ల రుద్రుడు రామప్ప గుడి మీదుగా ఒక కిలోమీటరు దూరంలో కొండల మధ్య ఆనకట్ట కట్టించి పెద్ద తటాకాన్ని ఏర్పరిచాడు. దీనికి కూడా రామప్ప చెరువు అనే పేరు వచ్చింది. ఇది ఈ రోజు వరకు కూడా పదివేల ఎకరాల భూమికి సాగునీటిని అందిస్తోంది.

రామప్ప చెరువు గట్టు ఈశాన్య మూలలో పాడి పంటల ప్రాధాన్యాన్ని తెలిపే దేవాలయాన్ని కట్టించారు. అందులో ఇటీవలి కాలం వరకు స్థానికుల చేత వేశ్య గా పిలువబడిన ఒక నగ్న సుందరి శిల్పం ఉండేది. నిజానికది వేశ్యది కాదు అనేది మేధావుల అభిప్రాయం. ఆ శిల్పానికున్న స్తన సంపద, నగ్నత్వం, పాడి పంటలు, సంతాన సృష్టి, అభివృద్ధిలను తెలిపే సంకేతాలు. దురదృష్టవశాత్తు దుండగులు ఈ అందమైన విగ్రహాన్ని నిధి దొరుకుతుందనే ఆశతో ధ్వంసం చేశారు.

ఈ చెరువు గట్టు ఆలయంలోని ఒక స్తంభం కింది భాగంలో ఒక శిల్పం ఉంది. అందులో ముగ్గురు స్ర్తిలను నగ్నంగా చెక్కారు. ఒక స్ర్తి కుండలో నుండి పాలను వొంపుతుంటే, మరొక స్ర్తి పంట కంకిని పట్టుకున్నట్లు చెక్కారు. మధ్యలో ఉన్న స్ర్తి పంటను మోసుకొస్తున్నట్లుగా చెక్కబడింది. ఈ విధంగా రామప్ప ప్రాంతం వాస్తు శిల్పకళా కౌశలాలకే కాదు, కాసులు పండించే పంటల వృద్ధికీ నిదర్శనంగా నిలుస్తుంది.

ప్రధానాలయం నుంచి దక్షిణంగా రామప్ప చెరువు వైపు వెళ్తున్నప్పుడు రోడ్డుకు ఎడమపక్కన పంట పొలాల్లో రెండు మూడు దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. చెరువు గట్టు పైకి ఎక్కగానే మరో రెండు మూడు దేవాలయాలు కన్పిస్తాయి. గట్టుపైన ఒక ఫర్లాంగు దూరం తూర్పు వైపు నడిచి చెరువు కొనను చేరుకోగానే మరిన్ని దేవాలయాలు జీర్ణావస్థలో కన్పిస్తాయి. ఇలా ఇంకెన్ని దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోయాయో తెలియదు. ఈ దేవాలయాల పేర్లేంటి? వీటిని ఎవరు, ఎప్పుడు, ఎందుకు కట్టించారు? అనే విషయాలు చరిత్రకు అందవు. శిథిలమవుతున్న ఈ చెరువుగట్టు ఆలయాల వాస్తు శిల్ప వైభవాన్ని నెమరువేసుకుంటే హృదయం చెరువవుతుంది.

పునరుద్ధరణ ప్రయత్నాలు

రామప్ప ఆలయాలను కట్టించిన రేచర్ల రుద్రుడే ఇక్కడ వేయించిన శాసనంలో ఎవరికైనా తాము శత్రువు కావచ్చు కాని ఈ ఆలయం కాదు కాబట్టి దీన్ని ధ్వంసం చేయకూడదు అని వేడుకున్నాడు. అయినా ముస్లిం సైన్యాలు చేసిన విధ్వంసకాండల్లో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతింది. అయితే మరో ఆరు వందల సంవత్సరాల తరువాత మళ్లీ ముస్లిం రాజే (నిజాం) సుమారు వంద సంవత్సరాల క్రితం రామప్ప ఆలయాలను పునరుద్ధరించేందుకు పూనుకున్నాడు.
1914లో ఏర్పడిన పురావస్తు శాఖ ఈ ఆలయాలను వీలైనంతగా పునరుద్ధరించింది.
 1932లో పింగళి వెంకట రామారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కాకతీయ ఉత్సవాలు జరిగాయి. తత్పర్యవసానంగా వెలువడిన ‘కాకతీయ సంచిక’లో ఈ ఆలయాల ప్రాధాన్యం గురించి తెలుగు ప్రపంచానికి మొదటిసారిగా తెలిసింది. 1944లో ఆలయంలో పూజారులను నియమించారు. మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఈ ఆలయం దర్శనీయత గురించి ఇంగ్లీషులో రాసి ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’లో 1966లో ప్రచురించి ప్రపంచానికంతటికీ తెలియజేశాడు.

నటరాజ రామకృష్ణ రామప్ప శిల్పాలను అధ్యయనం చేసి పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించి, 1985 ఫిబ్రవరి 17 శివరాత్రి నాడు ఇక్కడ వేల మంది సమక్షంలో తన శిష్య బృందంతో పేరిణి నృత్య ప్రదర్శన చేశాడు. తిరిగి 1991లో జరిగిన కాకతీయ ఫెస్టివల్‌లో భాగంగా ఫిబ్రవరి 25న తన శిష్యబృందంతో పేరిణి నృత్య ప్రదర్శన ఇప్పించాడు.
భారత పురావస్తు శాఖ పూనా నుండి తేలికైన ఇటుకలను తెప్పించి ఆలయ శిఖరాన్ని పునర్నిర్మించి, పైకప్పును బాగుపరచి, ఆలయ పునాదుల్లోకి వాన నీరు ఇంకకుండా ప్లాస్టరింగ్ చేయించింది. 2013లో ఇక్కడ ఆలయం కట్టి ఎనిమిది వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు నిర్వ హించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామప్ప చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసింది. పర్యాటకుల వసతి, తిండి కోసం వసతి గృహాలను, రెస్టారెంట్లను కట్టించింది. ఇవి ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ మధ్య ఇక్కడ కొన్ని సినిమాలు తీయడంతో రామప్ప మరింత వెలుగులోకి వచ్చింది.
రామప్పకు ఇటీవల ఏర్పడిన ప్రమాదాలపై పోరాడిన ‘రామప్ప పరిరక్షణ కమిటీ’ కృషి మేరకు ప్రభుత్వం నియమించిన కమిటీ ‘రామప్పకు నిజంగానే ప్రమాదం పొంచి ఉందని, ఆ ప్రమాద నివారణకై కృషి చేయాలని’ తన రిపోర్టులో ప్రభుత్వానికి సూచించింది. రామప్ప పరిరక్షణ కమిటీ సాధించిన ఈ చిన్న విజయాన్ని పురస్కరించుకుని 1985లో నటరాజ రామకృష్ణ నిర్వహించినట్లుగానే  రామప్పలో పదివేల దివ్వెల జాతరను నిర్వహించారు.

 రామప్ప పరిసరాల్లో నేలలో నిక్షిప్తమైన బొగ్గు తవ్వి తీయడానికి ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడు ఇంకా పెద్ద ప్రమాదం ముంచుకు వస్తుంది. ఊళ్లకు ఊళ్ళు ఆనవాళ్లు లేకుండా పోయే పెనుముప్పు నుంచి కూడా రక్షించుకునే బృహత్ ప్రణాళికలను కూడా  రచించుకోవాలి. అదే విధంగా ఉపగ్రహము ద్వారా సేకరించబడిన ఛాయాచిత్రము గుడి ప్రాంతములో నేల పగులును సూచించుచున్నదట. ఈ విషయంలోనూ రక్షణ చర్యలకై ప్రయత్నాలు చేయాలి.

రామప్ప పర్యటనలో నేను తీసిన కొన్ని ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.
https://plus.google.com/photos/+SrinivasKatta/albums/5983643022011104497గూగుల్ 3డి ఇమేజింగ్ ద్వారా గుడిని మీరు వర్చువల్ గా వెళ్ళి చూసిన అనుభూతి పొందవచ్చు




రామప్పగుడిపై

మరింత సమాచారం కోసం
1) డా.పి.వి.పరబ్రహ్మ శాస్ర్తీ, ‘కాకతీయులు’
2) చలసాని ప్రసాదరావు, ‘కాకతీయ శిల్పం’ ప్రొ.జయధీర్ తిరుమలరావు, అధ్యక్షుడు, రామప్ప పరిరక్షణ కమిటీ
3) సంగనభట్ల నరసయ్య చారిత్రక పరిశోధకులు

4) 1983 లో ఈ దేవాలయం గురించి రామప్ప దేవాలయం పేర క్రిష్ణారావు కేషవ్ దర్శకత్వంలో ఓ డాక్యుమెంటరీ
నిర్మించారు. శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో యమ్కే రాము రచనతో ,శ్రీ బాలు గాత్రంతో పాటలు చిత్రీకరించారు. సంగీత నృత్య ప్రధానమైన పాటలను AVM MUSIC SERVICE వారు 1983లో 45 RPM Standard Play Record గా ఆ పాటలను విడుదల చేశారు. చిత్రం అసలు విడుదలయిందో లేదో తెలియదు. అందులోని ఒక అద్భుతమైన పాట వినండి.


5)
పుస్తకం    :    రుద్రమదేవి
 జానర్    :    చరిత్ర ఆధారిత నవల
 రచన    :    ఎస్ ఎమ్ ప్రాణ్‌రావు
పేజీలు: 176, వెల : రూ. 80
 విషయం    :    ‘రుద్రమ’ పేరులోనే శౌర్యం ప్రతిధ్వనిస్తుంది. ‘స్ఫూర్తి’ కాంతి వెల్లివెరుస్తుంది. ఆమెను గురించి వినడమైనా, చదవడమైనా గొప్ప ఉత్తేజాన్ని నింపుకోవడమే. ప్రాణ్‌రావ్ నవల అలాంటి అనుభవాన్ని ఇస్తుంది.
చారిత్రక నవల, మనం కొన్ని వందల సంవత్సరాలు, కాలయంత్రంలో ప్రయాణించి వెనక్కి పోయేట్టు చేస్తుంది. కాకతిదేవి వెంట, నవల ఆరంభంలో ఓరుగల్లు ప్రాకారాలను,బురుజులను, రాజభవనాలను, స్వయంభూదేవాలయం, రుద్రేశ్వరాలయం, వివిధ వాడలు, సంతలు, నగర వీధులు, కూడళ్ళలో వేదికల మీద జరిగే నృత్యగానడులు చూస్తూ మనల్ని మనం మరచిపోయి ఒక చారిత్రక వాతావరణంలోకి ప్రవేశించి నవల చివరిదాకా బయటకు రాకుండా ఉండిపోతాం.

చారిత్రక నవలకు ‘కల్పనే’ ముడిసరుకు కాదు. చరిత్ర అధ్యయనమూ ముఖ్యమే. ‘కల్పన’ ఎక్కువై ‘చరిత్ర’ తక్కువైనా, ‘చరిత్ర’ ఎక్కువై ‘కల్పన’ తక్కువైనా కష్టమే. ఇందులో అలాంటి కష్టమేది కనిపించదు. జనశృతులు, ఊహలు, వాస్తవాలను ఆధారం చేసుకొని రాసిన ఈ నవల ఆకట్టుకునేలా ఉంది.
‘రుద్రమదేవి నవల యథాతథంగా చరిత్ర కాదు’ అన్నారు రచయిత.



6)


కామెంట్‌లు

  1. ఎన్ వేణుగోపాల్24 ఫిబ్రవరి, 2014 4:05 PMకి

    చాల బాగుంది. జాయప సేనాని నృత్త రత్నాకరం మీద వచ్చిన ఒక పుస్తకం చదివి, పేరిణి శివతాండవం మీద నటరాజ రామకృష్ణ గారి కృషి చూసి, రామప్ప చూసి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను అక్కడక్కడా ప్రస్తావనవశాత్తూ రాసి, మాట్లాడి, పూర్తిగా రాద్దామనుకుంటూనే రాయలేకపోయిన అనేక విషయాలు రాసినందుకు ఎంతో ఆనందంగా, తృప్తిగా ఉంది. మనం చేయదలచుకున్న పని మరొకరు, మనకన్న బాగా చేసినప్పుడు నిజంగా ఎంత ఆనందం కలుగుతుంది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేణుగోపాల్ సర్ మీవంటి పెద్దల స్పందన లభించటం చాలా సంతోషం. మీ పెద్ద మనసుకు ధన్యవాదాలు.
      గణపతి దేవుడు బంధీ అయ్యి వారసత్వం లేకుండా పోతుందేమో అనే భయాన్ని 12 సంవత్సరాలు అనుభవించటం వల్లకూడా కావచ్చు తమ సంస్క్రుతి, అంతర్గత రహస్యాలూ అంతరించి పోరాదన్న తపన కూడా ఈ శిల్ప సందేశాలలో కనిపిస్తుందన దానికి నిదర్శనంగానే పేరిణీ నాట్యపు ముఖ్యంశాలను మృదంగ తాళంతో మేళవించి ఒక వరుసలో పేర్చటం, శాసనం మీద నేను శత్రవుని కావచ్చు గుడి కాదు అని చెప్పటం, శిల్పాలలో సంక్లిష్టత వున్నాయి.
      నటరాజ రామకృస్ణలాంటి వారు కొంచెం లోతుగా చూడకుంటే అది ఇప్పటికీ కిటికీ అలంకారంలాగా నాట్యభంగిమలు గీసారని మహా అయితే శిల్పిపనితనం మెచ్చుకుంటూ వుండే వాళ్ళమేమో కానీ కళని గ్రహించ లేకపోయే వాళ్ళమేమో
      ఆ కోలాటం ఆటలో, శివప్రియ నాట్యంలో నాలుగు కాళ్లే గీయటం, రంగ మంటపం కప్పులో గీసిన వివిధ కథలకు అర్ధం ఏమిటి? శాసనం పూర్తిపాఠం తెలుగులో దొరికితే బావుండునని వెతుకుతున్నాను సర్.
      నగరం నిర్మించటం వెనక వారికున్న చెరువుల నిర్మాణం లాంటి శాస్త్రీయతనుంచి మనం అనుసరించదగినవి
      ఇలా మరింత లోతైన శోధనతో భాష్యాలు రావాలని అవ్వన్నీ ‘‘ఆచార్యముష్టి’’ పేరుతో పిడికిళ్ళలో కాకుండా సాధారణ జిజ్ఞాసువుకి కూడా అందుబాటులోకి రావాలనీ కోరుకుంటున్నానండీ.
      నేను అందుకోలేక పోయిన లోతులు చాలా వుంటే వుంటాయి. మీ బోటివారు మరికొంచెం చెప్పగలిగితే కొంతైన పూర్ణత ఏర్పడుతుంది.

      మరోమారు మన:పూర్వక ధన్యవాదాలతో
      మీ
      శ్రీనివాస్.కట్టా
      nivas.katta74@gmail.com

      తొలగించండి
  2. very detailed article. Hats off to your efforts.

    Suabhi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ
      ఇంకా చాలా డిటైల్స్ కోసం వెతుకుతున్నానండీ. నాకు అందుబాటులోకి వస్తే వాటిని ఎప్పటికప్పుడు బ్లాగులోకి ఇదే ఆర్టికల్ కి అనుసంధానం చేస్తుంటాను.
      నేను వదిలేసినవి వుంటే పెద్దలు తెలియజేయగలరు.

      తొలగించండి
  3. నందకిశోర్ కవిత || జర్నీ ఆఫ్ లైఫ్-4

    " రాతివీణై పలికె రాగాల మెడవంపు
    రామప్ప శిల్పాల సొగసునీది

    నలనల్లనీకురులు పొన్నచెట్టూపొదలు
    వేణువైనాచేయి పాడుతోంది

    ఓరచూపుల్లోని కంజీరగజ్జెల్లో
    ఘల్లుఘల్లని ఓరుగల్లు మోగ

    మసకలోకానికో
    శిలని విసిరి

    ప్రియసఖీ!
    సాధనలు సాగదీద్దాం. "

    మస్తుగుందిలె? హ హ..నేనే.
    నేనే రాశింది.వహ్వా అను.

    ***

    " రామప్ప" . షాయద్ మన రాజ్యంల గీ పేరు వినని మనిషుండడు. by chanceమనుషులున్నా కవులూ,వాళ్ళ దోస్తులూ ఉండరు.. ప్చ్..మ్యాటర్‌కొద్దాం.

    రామప్ప అనగానే వయ్యారి శిల్పమొకటి తలమీదికెక్కి వగలుబోతూ నిలుసుంటది.రాళ్ళగుండెల్లోంచి జాలువారేపాట గలగలమంటూ దుంకుతుంటది.నందికి ఉందో లేదో పాణం,నాదిమాత్రం లేశివస్తది.

    ఎంత బతుకు బతికినా ఒక్కొక్కసారి ఆ రాళ్ళలెక్కపుడితె బాగుండుననిపిస్తది. ఆ జమానాల బతికినట్టు కలగనబుద్దైతది..ఇగసాలు..

    ఇదంతెందుకులెగాని- ఇమానంగ జెప్తున్నా -ఎన్నిసార్లుబోయినా,ఎంతసేపు గాలించినా అందగలేని అణువంత జాగా ఆడేడా ఉండదు.

    ఇస్టరీల దీనిగురించి బాగానె సదివుంటరుగాబట్టి రేచర్లరుద్రుడు,క్రీ.శ.1213, రామప్ప శిల్పి,రామలింగేశ్వరస్వామి, రుద్రమదేవి, జాయపసేనాని నృత్యరత్నావళి,పేరిణి శివతాండవం,వేసర సాంప్రదాయం-హోయసలుల నిర్మాణశైలితో ఉండే సిమిలారిటీ ఏదీ ఇప్పుడప్పుడే చెప్పదల్చుకోలె.కీ వర్డ్స్‌లెక్క గుర్తుబెట్టుకొని మళ్ళెపుడన్నా అడుగుండ్రి.
    ***
    అకాడెమిక్ text ల నేంజెప్పలేనుగానీ-

    యీడ స్పెషల్‌స్పెషల్ ఏందంటే బతికే ఉన్నయనిపించె శిల్పాలు,రాళ్ళమీద చెక్కబడ్డ పురాణగాధలూ,

    రాతివీణ,పెరిగే నందీ,నీళ్ళల తేలే ఇటుకలూ, చీపురుపుల్లదూరేంత సన్నటిరంద్రాలుజేసి అచ్చెరువొందేల మలిచిన రాతిస్థంబాల ఇంటీరియర్ డిజైన్, రాళ్ళ కప్పు వంగిపోతె శనగలుబోసి ఎట్లా సరిజేసిండ్రనే జానపద కధలు etc

    అవ్ అబ్బ..ఓ రకంగా అన్నీ రాళ్ళ ముచ్చట్లె.గ్రానైటూ,డోలరైటూ..రాతిమీదరాత ముచ్చట్లె.ఇగ-

    గుడి,పెద్దచెరువూ,అందుల బోటింగూ,పాత జమాన కాటేజ్‌లు ఉన్నందున ఆర్టిస్టిక్ టేస్ట్ ఏదీలేకున్నా ఇది సూడదగ్గ ప్రదేశం.

    ***

    ఇది ఇంపార్టెంటు..

    బుల్‌బుల్ ఒక మహాశివరాత్రి అమావాస్యపూట రామప్పజాతరకుపోయొచ్చినంక పుట్టిండు.వానికి ఆ గాలితోటి పుట్టినకాంచి బాండింగ్ ఎక్వ.మా అయ్య రామప్ప జాతర్ల బుర్రకధజెప్పెటోడు.చిన్నప్పుడు కధ ఇనుకుంటనే నిద్రపోతె భుజమ్మీద ఏస్కొని ఊరిదాక మోస్కొచ్చెటోడు. పిల్లనగొయ్యా,చిలకలూ, బచ్చీసాలు ఏడ్సిమరీ కొనిపిచ్చుకునెటోన్ని.నా బచ్‌పన్‌ల నాకు బాగా గుర్తున్నవాటిలో అదొకటి.

    తర్వాత

    ఫేస్‌బుక్ పూర్వం 2000ప్రాంతంల సైకిల్‌కి అటుకులుకట్టుకొని ఆదివారమాదివారం దోస్తుల్తోటి పొయ్యొచ్చుడు అలవాటైంది.అక్కడికిబోతె ఏదో నాలెడ్జ్ వస్తదని మావోళ్ళు బాగా హుషార్‌జేసెటోళ్ళు. (నగ్నత్వాన్ని సూడటం అప్పుడొక నాలెడ్జ్-మే బి దట్స్ హౌ వి సీ ద వల్డ్.)అసల్ విషయం ఏందంటే ఆడికి అమెరికోళ్ళు వస్తరు.వాళ్ళ బట్టల్ మంచిగుంటయ్.అడక్కున్నా ఫోటోలుదీస్తరు.అప్పుడు గదే క్రేజు.

    ఫేస్బుక్ శకం 2013ల అందరూ అమెరికోళ్ళె.అడిగిమరీ ఫోటొలు దింపుమంటరు.ఉత్తగ నడ్శెటోన్ని నడ్వనియ్యరు.

    అసలక్కడ జనాలందరు సూడనీకి వచ్చిండ్రా ఫోటోలు దిగినంక ఫోటోలల్ల సూడనీకి వచ్చిండ్రా అర్ధంగాదు.సెల్‌ఫోన్‌శకం 2008ల మొదలైన గీ పిచ్చి టూరిస్టులనుండి మా వూరి సుట్టుపక్కల అందరికీ అంటుకుంది.


    సరెగని, గిప్పుడు మళ్ళా ఎందుకురా మొదలుబెట్టినవ్ పాత ముచ్చట మొదల్బెట్టినవ్ అని సోంచాయిస్తున్నవ్ లె?

    జాతర నడుస్తందని యాద్‌జెయ్యడానికి.గంతే.

    ఎవలన్నా పోగలిగితే పోండ్రి. మేం మొన్ననేపోయి ఫోటోలుదెచ్చ్చుకున్నం. రేపు నిప్పులగుండం పోస్తరు గుడి ఎనకాల. రాత్రి 3 గంటలప్పుడు. నిప్పులు తొక్కుతుంటె మనం పానం బోతుంటది. సూడగల్గితే సూడుండ్రి.

    శివరాత్రి జాతర్ల బుర్రకతగద్దెక్కి/బచ్చీస తినుకుంట జాగారముండేది.
    అన్నీదెల్సినట్టు తందానతానంటె/అర్ధరాతిరిముందె ఆవలింతొచ్చేది.
    బండెడ్లు ఉరకంగ శివుడా!-సలిగాలి సెవులల్లో సొచ్చేది శివుడా!
    శివా శివా అనుకుంట శివుడా!-ఒళ్ళంత యేడిబుట్టిచ్చేది శివుడా!

    అనుకుంట..మా శివుని యాదిలో పాడగలిగితే పాడుండ్రి.

    అశ్శరభశ్శరభ..

    రిప్లయితొలగించండి
  4. నిజమేనన్నా నా చిన్నప్పటి సంది జూస్తునే ఉన్న గాని,ఎప్పుడు జూసినా కొత్తగనే, షాందార్గ కనబడుతది. అందుకే మనం ప్రతిశివరాత్రికి బోయి, అగ్గిగుండాలు దొక్కి సంబురపడేది ...

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి