సమాజమో, జ్ఞానమో మనకి తెలియకుండానే
మనతో సంప్రదించకుండానే లక్ష్మణరేఖలా
ఒక డబ్బా గీసేస్తుంది.
నత్తగుల్ల కర్పరంలా
తాబేటి డిప్పలా
అదే నీకు రక్షణ కవచమని నమ్మిస్తుంది.
కవాతు తిరిగే తరాల గ్రంధాల సైనికుల
చేతుల్లోని మాటల ఈటెలు సూటిగా తగలకుండా
తనే రక్షిస్తానంటుంది.
డబ్బాబ్రతుకులో డాబుపై
డబ్బారాయుళ్ళెందరో ఇప్పటికే
బాగా దంచేసిన ఊకని
పోగేసి బాగా నలుగెడుతుంటుంది.
అలవాటు పడ్డ శరీరానికి
ఉక్కపోతలోనే చాలాసార్లు వెచ్చదనపు
హాయి దొరుకుతుంటుంది.
కానీ
ఒక్కోసారి ఉక్కిబిక్కిరై ఊపిరాడనప్పుడు మాత్రం
దిక్కు తోచక ఏడ్చేబదులు
సాంత్వన మాటలకై వగచే బదులు
ఎదురు చూపులతో ఎండిపోయే బదులు
తప్పదు
ఆ డబ్బాలను సైతం బద్దలుకొట్టాలి.
పెట్టుడు పెట్టెలకు బయట (out of the box) ఆలోచించాలి.
కట్టడాలనో, కట్టుబాట్ల నయినా నెట్టుకు వచ్చేయాలి.
తప్పదు
ఊపిరాగి పెట్టె కాఫిన్ కాకముందే
మర్యాదపు ముద్రని మర్యాదగానైనా చెరిపేసుకోవాలి.
తప్పదు
నడవటం అవసరమైనప్పుడు
పాదం కదపటం.
పలుకే ఆధారమైనప్పుడు
నోరు విప్పటం
తప్పదు, తప్పదు
తప్పదంటే తప్పదు
కవిసంగమం
well said friend
రిప్లయితొలగించండి