అప్పుడలా అన్నావు
అవును నాతోనే
నిజంగా అన్నావు.
1.
శీతలం శరీరాన్ని
ముట్టించిన రోజుల్లో
మాటిచ్చావ్
తొలకరిజల్లు పడగానే
తిరిగొస్తానని
వేసవితాపంతో
ఎదురుచూస్తున్నాను
నీ రాకకోసం.
2.
మొత్తంగా మూసిన పెంకుని
తనువుని దాపిన మట్టిసమాధిని
బద్దలుకొట్టుకొస్తూ,
అదంతా నేర్పిస్తానన్నావు
...
...
అన్నావు
నీవు తప్పకుండా వస్తానన్నావు.
3.
మూటకట్టి మూలన పడేసినా
మనసెప్పటికీ వట్టిపోదని గట్టిగా చెప్పేందుకు
పరాన్న జీవుల ప్రపంచానికి
స్వతంత్రతేమిటో చూపిస్తూ
అదంతా పాఠం రాసిస్తాననేశావు
...
...
ఇచ్చావు
నాకెప్పుడో మనస్పూర్తిగా మాటిచ్చావు.
4.
మృత్తికనుండి దేహంలా
పొత్తపు గవాక్షాల అక్షరంలా
మస్తకపు దారిగుండా ముచ్చటలా
బయటికొచ్చి
ఆచరణల ఆకులతో ఆకాశాన్నే కాదు,
ఆలోచనల పాదులతో భూమండలాన్నీ కూడా
పొ దు వు కుం టా న ని,
...
...
చెప్పావు
నాలోపల మాత్రమే వినిపించేటట్లు
ఘంటాపదంగా గుసగుసలాడుతూ చెప్పావు.
5.
అబ్బా
పగిలింది చెంప
వేసవి వేడిలో సైతం ఎదురు చూస్తున్న
నన్నెందుకు కొట్టావ్ ?
మొలకై నేనే తలెత్తకుండా
బులపాటంగా ఎదురు చూస్తున్నందుకేనా?
మీ మొలకపాఠం బాగుంది..చాలా పరిశీలించి రాసారనిపించింది .ఆ మొలకలు పడినప్పుడే కదా రైతన్న ఆశలు కొంతైనా చిగురిస్తాయి.
రిప్లయితొలగించండి