ప్లాస్టిక్ అల్లికల ప్రజాసేవ

ఊరించేవాడు చేతులెత్తేస్తే
ఊటలింకిపోతున్నాయి.
ఆశలెగిరిపోతున్నాయి.
ప్లాస్టిక్ ఎమోషన్లు ఎప్పటికీ ఇంకిపోక
ఎదకంతా కీడుచేస్తున్నాయి.

విలన్ లానే కనిపించే విలన్ కంటే
హీరో ముసుగుల వలకే ప్రమాదమెక్కువ.

జీవితంలో ఖాళీలనో
జేబుల్లో ఖాళీలనో
కుర్చిలో దర్భాల వెలితినో
నింపేందుకు ఒంపుకునే పేరేనా ప్రజాసేవంటే?

జాలంటే ఒక బలిసిన స్వార్ధం అయినపుడు
సమానత్వం కావలసింది నీ వాటా పంపకాలకేనా
కులాల గుర్తొచ్చేది కట్టగా నీ జేబులో మడిచి పెట్టుకునేందుకా?
సేవంటే ప్రచార ఆర్భాటానికో చక్కటి ఎర అయినపుడు
దేవుడా దేశపు దేహా్న్ని నువ్వైనా రక్షించ గలవా ?

నాకిప్పటికీ అర్ధంకాదు
కుర్చీలో కూర్చుంటేనే సేవకు చేతులొస్తాయా?
కిరీటం పెట్టుకుంటేనే
పరిష్కారాలు కనిపిస్తానంటాయా?

నోటూ, నాటు లాగానే
మాసు హిస్టీరియా ఘాటెక్కించినపుడు?
ఫేసు హిస్టరీలు పోటెత్తినపుడు
మేఘమా నీవైనా మడతల మత్తుదించగలవా?

నోటు ఊపినా  జనం నోటా బాట పడతారేమోనని
నీటుగా దిగిన పోటుగాళ్ళెందరో పుట్టగొడుగుల నీడలోకి పీలుస్తున్నారు.
నిభందనల రూళ్ళకర్ర నీడలో, కట్టలపాములు జరజరా పాకుతూ
విషాన్ని వదిలే మార్గాల్ని వెతుక్కుంటున్నాయి.
కాయ్ రాజా కాయ్
ఒకటికి ఐదు, ఐదుకి వంద
ఈ చక్రంలో నోట్లు పోస్తే నువు మోయగలిగినంతై తిరిగొస్తాయ్
ఓసినా సిరా రాసిన వేలా
చీకట్లు విస్తరించకుండా జరాసంథులని పురిట్లోనే నొక్కేయగలవా?


ఇవ్వాళ వలలో గాలాలో గాలిలో ఊపేవాళ్ళందరూ
చేపల సాగుదార్లు కాదు
ఐదేళ్ళకు సరిపడా
మసాలా నూరుకొచ్చారు.
కుదరితే కొడుకులకూ మనవళ్ళకూ
శీతలగిడ్డంగుల్లో దాచే మార్గం చూసుకునే దూకుతారు.
ఓ ఎరా,  పిచ్చిచేప నోట్లో నీళ్ళూరకుండా
నీవొక ఉపాయం గానీ చెప్తావా ఏంటి?

తర్వాతైనా చేపలు పట్టడం నేర్చుకునే తీరిక మాకేం లేదు కానీ
ఓ దొరా, కూసింత పులుసుంటే నా సట్టెలో పోసెళ్ళు పెబువా.


కవిసంగమంలో ప్రచురితం

కామెంట్‌లు