మత్తులో వున్న నాకు
నీ మొట్టికాయ క్షేమంగా చేరింది.
కళ్ళ కనబడవేరా?
అని తిట్టొద్దులే కానీ
తెరిచేందుకు కొంచెం టైమివ్వు చాలు.
పుస్తకమంటే నాకెందుకో
ఒక పిచ్చిమత్తు
కొత్తదయితే మరీనూ,
తేనెటీగ ముల్లులా
ప్రదర్శించాలనుకునే జ్ఞానంకూడా
అభిజాత్యమే కాదు అధికార పోరాటమని తెలుసు.
పంచితేనే ప్రేముంటుదనీ తెలుసు
కానీ
మొక్కలే నాటని లోకంలో
మకరందపు వేటగాడికైనా
నేనెప్పుడూ గులాం అవుతుంటాను.
పంగనామాలు పెట్టేందుకు
దొంగచాటుగా మాటువేసున్నలోకంలో
నామాలన్నీ ఒకచోటచేరినా నాకెందుకో
కలయికలే సౌష్టవమై బొమ్మకడుతుంటాయి
నీవు గిల్లిన చురుకు తెలుస్తోంది.
మళ్లీ కుదిపేయోద్దులే కానీ
తెప్పరిల్లేందుకు కూసింత సందివ్వు చాలు
ఎలావచ్చిందని తరచిచూసే లోతుల్లేక
హమ్మయ్యా వచ్చేస్తేనే చాలని
పొత్తాన్ని హత్తుకుని పలవరిస్తుంటాను.
అసలు ఆలోచన అచ్చొత్తుకుందంటేనే
అమరత్వాన్ని పొందినట్లే అనే కలల్లోనే తేలుతుంటాను.
ఒలకబోసిన వర్ణాలంటుకుంటాయని
ప్రేమతో పిలుస్తూనే వుంటావు నువ్వు.
మిణుగురు మెరుపైనా
రేపటి దివిటీ అవుతుందేమోనని
చీకటి లోకానికై పిచ్చిగా తలకంటే పైకెత్తేస్తుంటాను.
బరువులు పైకెక్కితే
వెన్నెముక వీకవుతుందంటూ వారిస్తుంటావు నీవు
తాలింఖానా తర్ఫీదులేనని తప్పుకోజూస్తాను నేను.
ఒకే దారిలో చెరోవైపూ నడుస్తుంటే
ప్రేమే కవచమై పహారా కాస్తున్నట్లు
చెరోదారిలో ఒకేచోటకి చేరినపుడు
కవచపు కడుపులో భద్రంగా చేరుకున్నట్లు
అండగా వున్నతనాన్ని ఆబగా శ్వాసిస్తుంటాను.
అయినా నా వ్యసనంలోనే మునకలూ వేస్తుంటాను.
అన్నయ్యా
నా చిటికెన వేలు అప్పుడే వదిలేయకు
నాకసలే నగరం కొత్త.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి