పుస్తక ప్రచురణ : ప్రత్యామ్నాయ దృక్పదాలు

ఆలోచనలను అక్షరాలుగా మార్చి తరాల అవతలి వరకూ సైతం బావాలను చేరవేసే సాధనాలుగా పుస్తకాలను అచ్చొత్తుకుంటున్నాం. కథలో, కవితలో,వ్యాసాలో మరోకటో మరోకటో పుస్తకంగా రావాలంటే వేలాది రూపాయలు మళ్ళీ పుస్తకం అచ్చొత్తుకున్నంత ఆవిష్కరణలూ, కొరియర్లూ, బుక్ పోస్టులూ సమీక్షకులను సంతృప్తి పరచే విధానాలూ ఇలా నానా తంటాలూ పడినా పాఠకుడికి ఎంతవరకూ చేరుతున్నామో అర్ధంకాని స్థితి.
► నిన్ననే Baskar Kodreddy గారు తన కవితలను వాక్యం పేరుతో తనే పుస్తకంగా తయారు చేసి పాఠకుడి చిత్రాన్నే తన కవర్ పేజీగా ఇస్తూ నాకొక కాపీ పంపారు. తనే వాక్యం మొదటి సంపుటిని కలర్ క్రేయాన్స్ తో డెకరేట్ చేసింది తయారు చేసారు. కవిత్వం పాఠకుడిని చేరటమే ముఖ్యం అయినపుడు కోకడాబుకే మరింత ప్రాధన్యత అవసరమేం లేదు అనే తన ఆలోచన నన్ను మరోసార వెనక్కి తిరిగి చూసుకునేలా చేసింది.
► కరీంనగర్లో సాహితీ సోపతి మిత్రులంతా నెలకోమాటు నెలనెలా వెన్నెల పేరుతో ఒకరి ఇంటిదగ్గర మామూలుగా నేలపై దీపం చుట్టూతా కూర్చుని వారు వెంటతెచ్చుకున్న కవిత్వాన్ని మిత్రులకు చదివి వినిపిస్తారు. అవే కవితలని హంగూ ఆర్భాటాల జోలికి పోకుండా వారికి అవసరమైనంత మేరకే పుస్తకాలుగా కేవలం బ్లాక్ అండ్ వైట్ లో తయారు చేసేసుకుని ‘‘ఎన్నీల ముచ్చట్లు’’ పేరుతో విడుదల చేస్తున్నారు. తమ కవిత్వం ఇలా పుస్తకంలా పదిల పరచడం ఎందరినో ఉత్తేజితం చేస్తోంది.
► యశస్వీ సతీష్ గారు తన మొదటి పుస్తకం ‘తెల్లకాగితం’ కానీ తరువాత మిత్రుల కవితత్వాలను గురించి రాసిన ‘ఒక్కమాట’ పుస్తకం కానీ ఆన్ లైన్లో ప్రభుత్వం వారిచే ఉచితంగా విడుదల చేసిన యూనికోడ్ అక్షరాలను, కేవలం వర్డ్ ఫైల్ లో మెర్జింగ్ విధానం ద్వారా అందంగా అమర్చుకోవడం ద్వారా ప్రింటుకు తీసుకుని వచ్చారు.
► కినిగే లాంటి ఆన్ లైన్ వెబ్ లలో మన పుస్తకాలను కేవలం సాఫ్ట్ కాపీలుగా విడుదల చేసుకునే అవకాశం పుష్కలంగా వుండి, కాంటెంట్ వుంటే కొనుగోళ్ళ వల్ల రచయిత డబ్బు సంపాదించుకునేంత అవకాశం కూడా వుంది. లేదంటే అనేక వెబ్ మ్యాగజైన్స్ పుస్తకాలను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నాయి.
► మొత్తంగా మహా అయితే వెయ్యి కాపీలు వేసి అందులో సగమో ముప్పాతిక శాతమో పంచుకుంటే అందులో పదిశాతం మంది సరిగ్గా మనసుపెట్టి చదివితే ఎంతమందికి చేరుకుంటామో తెలియదు కానీ ఇప్పటికే వేలాది మంది కొని చదువుకునే పాఠకులున్న అచ్చులోని సాహితీ పత్రికలే కాకుండా ఉచితంగా అందుబాటులో వుండే ఆన్ లైన్ సాహిత్యా స్థావరాలలో నైనా అప్పుడొకటి అప్పుడొకటిగా వెళ్ళినా ఆలోచనల షేరింగ్ జరిగే అవకాశం వుంది.
పుస్తకం డిటీపీ, కవర్ డిజైనింగ్, రంగుల అచ్చులూ, బోలెడంత ఖాళీలను అనవసరంగా వదిలేసే డిజైన్లూ, కృత్రిమ బూమింగ్ కోసం డబ్బుల బోగిమంటలతో చేసే అనవసరపు హడావిడీ ఇవ్వన్నీ తగ్గించుకునేందుకు మనం ఇంకా చెయ్యాల్సింది చాలా మిగిలే వున్నట్లుంది. తీరా తయారైన పుస్తకం సరిగా మండల స్థాయివరకూ కూడా కావాలనుకునే పాఠకుడికి సరిగా అందజేసేందుకు అమ్మిపెట్టే, అద్దెకిచ్చే,లేదా ఉచితంగా పంచగల సరైన యంత్రాంగాల అవసరం కూడా వుంది.
అలాగని అత్యంత చీప్ ప్రింటింగ్ తో వచ్చేయాలనేది కూడా సమంజసం కాదేమో, ఒక ‘శివ ట్రయాలజీ’ లా పకడ్భందీ ప్రణాళికతో పాఠకుడికి మనమేం ఇవ్వబోతున్నామో తెలియజేయగలిగేంత నాణ్యత ప్రకటనలోనే కాదు. ముఖ చిత్రంలోనూ పుస్తకం ఆకారంలోనూ వుండాల్సిందే. చదువుకునేందుకు సౌకర్యంగా వుండేంత చక్కటి డిజైనింగ్, కాంటెంట్ కాలనుగుణ్యతను అనుసరించి అది వుండాల్సినంత కాలం వరకైనా పరిస్థితులను తట్టుకుని నిలబడేంత గట్టిదనం వుండాలేనేదీ నిజమే.
అతి పొదుపు - అతి ఖర్చులను జాగ్రత్తగా బ్యాలన్స్ చేయడానికి కూడా మళ్ళీ పుస్తకం కోసం తెలుసుకున్నంత నేర్చుకోవలసిన విషయంలానే వుంది.
ఆన్ లైన్ పుణ్యమా అని టైపింగ్ నుంచి డిజైనింగ్ దాటుకుని పబ్లిషింగ్ విషయంలోనూ రెక్కలు విప్పుకుంటున్న స్వతంత్రతకు వందనం.ఇది మరింతగా ప్రవర్ధమానమై నూరుపూలలా వికసించాలి, వేయి ఆలోచనలుగా వర్షించాలి, లక్షలాది బీజాలను మొలకెత్తించాలని కోరుకుందాం.
జయహో అక్షరం....

కామెంట్‌లు