వృధా ప్రవాహం

మంటలు మంటలు
మంటలు మంటలు
దేశాన్నంతా కాల్చే మంటలు
దేహాన్నంతా చీల్చే మంటలు
నల్లని రంగువి, తెల్లని హంగువి
గాంధిబొమ్మల రంగుకాగితం
ఎర్రని నాల్కల నిండు జీవితపు
మంటలు మంటలు
నిండా మంటలు
పక్కన మూగిన నక్కల వోలే
నలగని చేతుల చలువ చొక్కాలు,
గొట్టాలతో తెగ ఎగదోస్తున్నాయి.


వరదలు వరదలు
వరదలు వరదలు
కురవని ప్రేమల
కుదరని ప్రేముల
లొడలొడలాడే కదలికలతో
రాత్రికి రాత్రే తెగిన ప్రవాహం
కుర్చివైపుగ పరిగెడుతూనే
పీకల్దాకా వాగ్ధానాలు
పిపీలికాలకు వాగ్భాణాలు
పిలుపుల పలుకుల పూనకాలతో
ప్రజలమీదుగా ప్రవహిస్తున్నాయ్
వరదలు వరదలు.
వరదలు వరదలు
కుర్చీ వైపే కదిలే వరదలు.


జండాకర్రలు, నిండా దిమ్మెలు
కార్లూ బీర్లూ భజంత్రీలు
ప్లాస్టీక్ రంగులు, వేస్టేజ్ జంకులు
కోడ్ళూ గీళ్ళూ జాన్తానై అని
కళ్ళూ చెవులను కూరేసేలా
కుళ్ళు కాగితం కూరేస్కుంటూ
తళతళ పెళపెళ విరుచుకు పడ్డాయ్
చెమటచుక్కనే పీల్చేసేందుకు
పంచవర్షాల గాలం చేసి
పిచ్చిచేపలకు వలవేసేందుకు


ఉరుములు మెరుపులు
ఊకదంపుడులు,
మైకుల నిండా చిందే సొల్లు
మాటల నిండా దొర్లే పొల్లు
ఒకరిపై ఒకరిది పేడ కళ్ళపీ
దేశం మొత్తం దుర్వాసనలే,
ఎవరికి వారే నీతివంతులు
నలుపే ఎరుగని గురుతుల గింజలు
పులుపే వుండని ద్రాక్షతీగకై
అలుపే ఎరుగని నక్కల గెంతులు
విసుగు నిండిన ఓట్లతుంపరకి
తెగ ఉరికొచ్చే పుట్టగొడుగులు


శకుని చేతిలో పాచికలాట
కుర్చిలాటలో తెగ కాట్లాట
జేబులు నిండే మార్గం మీదుగ
దర్భం పండే పొలాల గాటన
నేతలమేనని వస్తున్నారు.
మన తలరాతను గీస్తారంట.




కవిసంగమంలో ప్రచురితం

కామెంట్‌లు