అప్పుడు అమ్మమాటకోసం
అడవుల్లోకి వదిలినా
కన్నపేగుని వదలని మనసుతో ప్రాణాలొదిలింది తనే.
మరోసారి
మామ కత్తికి బలికాకుండా కాచేందుకు
అర్ధరాత్రి వానలో గంపకెత్తుకుని
నదినిసైతం లెక్కచేయకుండా దాటించి
కాచుకుందీ తానే.
బాధలన్నీ గాంభీర్యపు
కవళికల చాటున దాచేసి
వున్నదంతా ఇచ్చేసేదీ తనంటే తనే
నిజమే సుమా
దేవుడ్నయినా దయతో కాచుకునేది
నాన్నే
అమ్మతర్వాత అమ్మంతటిదీ తనే.
అశ్వద్ధామా హత:
అనగానే ఆయుధాల్నీ, ప్రాణాల్నీ వదిలేంత ప్రేమ
గురుధర్మం రూపంలో తూస్తే కనపడకపోవచ్చు.
వందతప్పుల్ని చూస్తూ
కళ్ళుమూసుకున్న శోకం
లోకానికి కనిపించకపోవచ్చు
అమ్మప్రేమలా అది ఊటబావి కాదు
నిరంతరం తడిగా కనిపించేందుకు
అమ్మతో సహా నీచుట్టూ
తన దేహాన్నే ఫణంగా పెట్టి నిలుచున్న రాతికోట.
అప్పగింతలప్పటి వరదగుడి
ఎదురుదెబ్బల్ని కాచే జీవితపు బడి
గుండెలపై జేబుని ఊయలచేసి ఊపే ఒడి
పుట్టగానే తల్లిపేగుని కత్తిరించినా
పోయేవరకూ అంటిపెట్టుకుంటుందేమో నాన్నపేగు.
బిడ్డలు తాకినప్పుడల్లా అదిమనల్ని సాకుతున్నట్లు కనబడుతుంది.
కవిసంగమంలో ప్రచురితం
పురాణేతిహాసాల సారంతో నాన్న ప్రేమను వర్ణించిన మీ కవితోదయానికి వందనం ..శిరసాభివందనం..
రిప్లయితొలగించండి