ఇవి కన్నీళ్లు కాదు మాస్టారూ

ఏదో ఒక రోజుకి తైలం అయిపోవడం ఖాయమే
అయినా  వెలుగివ్వలేననిపించగానే
దీపం రెపరెపలాడుతుంది.
చీకటి సైతం విలవిలలాడుతుంది.
వెలుతురు  దోబూచులు ఆగిపోతాయనగానే


కానీ ఈ వత్తిమండుతుండగానే
మరెన్నో దీపాలను హత్తుకుని
వెలుగులంటించిన ఆయన
వెలుతురు ధారగా ప్రవహిస్తూనే వున్నారు.

తైలం లేకపోతేనేం మా కన్నీళ్లున్నంత కాలం
ఆ రూపం వెలుగిస్తూనే వుంటుంది.
కాయం లేనప్పుడైనా
ఆ సాయం పదిచేతలై ఫలిస్తుంటుంది.

తప్పని ప్రయాణంలోకి తేలికగా వెళతారు కొందరు,
బరువులన్నీ మిగిలిన వాళ్ళమీదకే వదిలేసి,

మీరెళ్ళిరండి
గుర్తొచ్చిప్పుడల్లా ఇక మేము
మనసులతో హత్తుకుంటాం,

మీరెళ్ళిరండి
గుర్తుంచుకుని మీ పాదాల దారివెతుక్కుంటూ
నడుస్తుంటాం.

మీరెళ్ళిరండి
.......
...........

ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, ప్రాచీన, ఆధునిక
సాహిత్యాన్ని విశ్లేషించగల భాషావ్యూహాలను అందించిన పరిశోధకులు. తెలుగు
వాక్యానికి, కొత్త వెలుగులు అందించిన పండితులు. చేరాతల తో తెలుగు సాహిత్య
నేల నలు చెరగులా సాహితీకారులకు వెలుగునిచ్చిన విమర్శనాఘనులు,
మార్క్సిస్టు తాత్వికతతో భాషా సాహిత్యాలను విశ్లేషించి భావితరానికి ఒక
కొత్త చూపు నిచ్చిన మేథావి.ఆచార్య చేకూరి రామారావు( ఖమ్మం -ఇల్లందులపాడు)
వీటన్నింటికంటే ముఖ్యంగా తనకంటే తన తరవాతి తరాలు పైకెదగాలని తన భుజాలనే నిచ్చెనచేసి, మరిన్ని సోఫానాలు తరాల అధిరోహణకు తయారవ్వాలని కలగన్న మనీషి.
(ఈ నవ్వుమోహం కంటే వేరే ఫోటో చూడాలంటే నిజంగానే మనసొప్పటం లేదు.)

కామెంట్‌లు