వీరగల్లుల నుంచి మనకేం చరిత్ర తెలుస్తుంది? - సాయి పాపినేని

వీరగల్లు మధ్యయుగ చరిత్ర గ్రహించడానికి అతి ముఖ్యమైన శాసనాధారాలు. యుద్ధాల్లో మరణించిన వీరుల జ్ఞాపకార్థం గ్రామాల పొలిమేరల్లో ప్రతిష్టించిన ఈ రాళ్ళు రాష్ట్రమంతటా గ్రామ గ్రామంలో దొరికాయి. చచ్చిన తరువాత కూడా ఆ వీరులు భైరవ, వీరభద్ర రూపాల్లో గ్రామాలని రక్షిస్తారని నమ్మి వాళ్లకు ఊరిబయట గుళ్లు కట్టి పూజలూ బలులూ ఇచ్చే ఆచారం దక్షిణాంధ్రలో ఈనాటికీ ఉంది. ఆ రాళ్ళపై వాళ్ల వీర కృత్యాలు, యుద్ధంలో ఘట్టాలు బొమ్మలుగా చెక్కి, వాళ్ళు చేసిన సాహసాల గురించి రాసేవారు. గుర్రమెక్కి, కత్తిపట్టి నిలిచిన కావలిదేవుళ్ళ విగ్రహాలు రాయలసీమ, నెల్లూరు జిల్లా గ్రామాల బయట ఎన్నో కనిపిస్తాయి.

వీరగల్లు శాసనాలు ఆనాటి పరిస్థితులకి అద్దం పడతాయి. చిన్న చిన్న రాజ్యాలు, నలువైపులా శత్రువులు, అలివిమాలిన పన్నుల భారం, యుద్ధాలు, దోపిడీలు, పశువుల మందలపై దాడులు, సామాన్య ప్రజలకి రక్షణలేని కాలం. మధ్యయుగంలో ఇండియాలోనే గాక ప్రపంచమంతా భుక్తి కోసం యుద్ధం చేసే మెర్సినరీ యోధుల ప్రస్తావనలు కనిపిస్తాయి. వ్యవసాయం నమ్మకంలేని పరిస్థితిలో కత్తి పట్టడం వచ్చిన కాపు యువకులు ఎందరో ఆ దారిపట్టారు. స్వతంత్రంగా ఏ రాజుకూ లోబడక వీరభోజ్యంతో కడుపు నింపుకునే తెలుగు వీరులని ఒంటర్లు, ఎక్కట్లు అని పిలిచారు. ఈ పదాలే సాహిత్యంలో సంస్కృతీకరించబడి ఏకాంగ వీరులుగా మారాయి.

వీరిలో కుటుంబాన్ని పరిత్యదించి వీరసన్యాసులుగా మారి ఆస్తులన్నీ దానం చేసినవారు ఉన్నారు. యుద్ధంలో సంపాదించిన ధనాన్ని విచ్చలవిడిగా మద్యశాలల్లో, వేశ్యాగృహాల్లో ఖర్చు చేస్తూ చిన్న చిన్న వివాదాలకి ప్రజలతో కలబడుతూ ద్వంద్వయుద్ధాలకి దిగే ఏకాంగవీరుల ప్రసక్తి క్రీడాభిరామం, భీమేశ్వరపురాణం, పల్నాటి వీర చరిత్రలలో చూస్తాం. యుద్ధంలో ఓడి ఆత్మహత్యకి పాల్పడిన వీరులు చాలా మంది ఉన్నారు. వీరగల్లులపై గండకత్తెర వేసుకొని, కొండచరియ దూకి ప్రాణాలు విడిచిన వీరుల కథలు జపాన్ సమురాయ్ సంస్కృతిలోని సెప్పుక్కు, హరాకిరీ వంటి ఆచారాలు తలపిస్తాయి. అలాగే ‘పెండ్లాల తలచుక బిట్టేడ్చువారు’ అని యుద్ధంలో ఆయుధం పారవేసి గడ్డికరిచి మొత్తుకునే పిరికిపందల గురించి పల్నాటి వీర చరిత్రలో శ్రీనాథుడు చెప్పాడు. అంతే కాదు ఓడిన శత్రువుల తలలతో బంతులాటలు ఆడటం (శిరఃకందుక క్రీడావినోదం), వారి రక్తమాంసాలతో ఉడికించిన అన్నం కావలి దేవతలకి ఊరి చుట్టూ పొలిజల్లడం (రణంకుడుపు) వంటి రాక్షస సంస్కృతి వీరగల్లుల్లో సాహిత్యంలో కనిపిస్తుంది.

నలువైపులా యుద్ధాలతో దేశంలో అరాచకం నెలకొంది. కానీ గ్రామాల్లో స్వయంప్రతిపత్తి కలిగిన స్థానిక స్వపరిపాలనా విధానానికి పునాదులు ఈ కాలంలోనే గట్టిపడ్డాయి. పంచాయతీ వ్యవస్థ రాజుకి, రైతుకి మధ్య వారధిగా పని చేసింది. కామందు (గ్రామ రక్షక వ్యవస్థ అధికారి), కరణం, గుడిపూజారి, శెట్టి, భోగంసాని మొదలైన పెద్దలతో, వ్యావసాయక ఉత్పత్తిని గణించటం, పన్నులు వసూలు చేయటం, వృత్తి పనివాళ్లకి తగిన ఉపాధి కల్పించడం వంటివి పంచాయతీ నిర్వర్తించేది. రైతులపై పన్నుల భారం అధికంగానే ఉండేది. పంటలో మూడోవంతు కూడా గిట్టుబాటయ్యేది కాదు. రాజులకు ఇచ్చేదీ గుడికీ అధికారులకీ ఇచ్చేదీ కాక యుద్ధం వస్తే సైన్యంలో భర్తీ కావలసి వచ్చేది. యుద్ధాల్లో గ్రామాలని తగులబెట్టడం, గోదాములు కొల్లగొట్టడం, పశువుల మందలని తోలుకుపోవటం సర్వసామాన్యమై రైతులని మరింత దెబ్బతీసేవి.
పంచాయతీలు గ్రామ సంపద రక్షణకి ప్రైవేట్ సైన్యాలు సమీకరించి పోషించవలసి వచ్చింది. ఈ కాలంలోనే మొట్ట మొదటిగా బ్రాహ్మణేతరులకి, యుద్ధాలలో రాజుకి సహాయపడిన వీరులకి రాజ్యాల ఎల్లల్లో భూదానాలు చేయడం శాసనాలలో కనిపిస్తుంది. యుద్ధంలో సైన్యంలో చేరడం, లేని సమయంలో వ్యవసాయం పశుపోషణలు నిర్వహించే కాపుల భూస్వామ్య వ్యవస్థ ఆవిర్భవించింది. ఇటువంటి కాపులే స్వతంత్రులై తరువాతి యుగంలో కాయస్థ, రెడ్డి, వెలమ రాజులుగా రాజ్యాలు స్థాపించారు.

సౌజన్యం: సాక్షి

కామెంట్‌లు