హైదరాబాద్ లోని మూసారాం బాగ్ : రేమండ్స్ టోంబ్ ల గురించి మీకేం తెలుసు ?

ప్రభుత్వం రక్షిత కట్టడంగా ప్రకటించినటువంటిది. 200 ఏళ్ళ కు పైబడి పురాతనమైన సమాధి స్థలం. మూసారాం బాగ్ లో వుంది. మీరెప్పుడన్నా చూసారా? ఎక్కడో ప్రాన్స్ లో పుట్టిన ప్రెంచి జాతీయుడిని మనసులో దాచుకున్న హైదరాబాద్ చరిత్రలో సంగతులు మీకెన్ని తెలుసు? కుదిరితే కొన్ని నిమిషాలు కేటాయించగలిగితే. వాళ్ళ జీవితకాలపు శ్రమలోని మంచివిషయాలు మనకి అడుగులకు చిన్న వెలుగు రేఖలు చూపుతాయేమో ప్రయత్నిద్దాం. కొంచెం మనసుతో ఆలోచిస్తే మనపనుల్లో నిండుదనాన్ని నింపేస్తాయేమో ఒకసారి తొంగిచూద్దాం.

1775 లో 20 ఏళ్ళ ప్రాన్స్ లోని గాస్కోనీ (Gascony) అనే చిన్న గ్రామానికి చెందిన యువకుడు తన తమ్ముడు విలియం జీన్ రేమండ్స్ తో కలిసి వాళ్ళ నాన్న చేస్తున్న వ్యాపారంలోని ఒక ఒప్పందం ప్రకారం కొంత సామానును ఇండియాలోని పాండిచ్చేరిలో అప్పగించటం కోసం వచ్చాడు. కుదిరితే అక్కడే ఒక దుకాణం తను కూడా ప్రారంభించి లాభాలను పొందాలనే తండ్రికోరిక ప్రకారం నడుచుకుందామనికూడా ప్రయత్నించాడు. కానీ అతని సాహసోపేతమైన మనసు, చురుకైన బుద్ధి వ్యాపారంకంటే మెరుగ్గా మరేదో చేయాలనుకునేలా ప్రోత్సహించింది.  అనూహ్యంగా పాండిచ్చేరిలోని   ప్రెంచి దళాలలో సైనికుడిగా పనిచేయాల్సి వచ్చింది. జనరల్ డి లస్సీ దళాల్లో మైసూరు కి చెందిన హైదర్ అలీ సారధ్యంలో మొదట పనిచేసాడు. తర్వాత సైన్య శిక్షణలో పేరెన్నిక గన్న బుస్సీ దొర దగ్గర పనిచేసాడు. బుస్సీ మరణం తర్వత రెండు సంవత్సరాలకు నిజాం సోదరుడు బసాలత్ జంగ్ సారధ్యంలోని ప్రెంచి దళాల్లో చేరాడు. బసాలత్ జంగ్  అప్పట్లో గుంటూరు జాగీరును పాలించేవాడు. ఆంగ్లేయులు బసాలత్ జంగ్ దళాలను ఉపసంహరించుకోవలసిందిగా వత్తిడి చేయడంతో రేమండ్స్ తో సహా ఈ దళాలు నిజాం సారధ్యంలోని హైదరాబాదుకు చేరుకున్నాయి. 1795 కాలానికి ఈ దళాలు పెరుగుతూ 15 వేల సంఖ్యకు చేరుకున్నాయి వీటిని 20 దళాలుగా చేసి వాటిపై 124 మంది యూరోపియన్ అధికారుల ఆధీనంలో నిర్వహించే వారు. రేమండ్స్ ఈ దళాల నిర్వహణకు గానూ మెదక్ జాగీరును అప్పగించారు. దీనిద్వరా ఈ సైన్యాలకు జీతాల చెల్లింపు చేసే అవకాశం కలిగించారు.


ఆతర్వాత హైదరాబాదు నిజాం దగ్గర ఆదరణ పొందాడు. గన్ ఫౌండ్రీ పెట్టించాడు, మహిళలకు సైన్యంలో అవకాశం ఇచ్చాడు. మత భావాన్ని విస్త్రుతం చేసుకుని అందర్లో ఒకడిగా కలిసిపోయాడు. మస్లింలకు ముస్లింగా, హిందువులకు హిందువుగా, క్రిస్టియన్లకు క్రిస్టియన్ గా అచ్చంగా మనిషిగా మసలుకున్న ఇతనే రేమండ్స్, మూసారాం బాగ్  గుండెల్లో తన పేరుని నాటుకుని, తన జ్ఞాపకాలను కోటగా ఆస్మాన్ ఘడ్ ప్యాలెస్ ప్రాంతల్లో తలెత్తుకుని నిలిపిన వాడు.  Michel Joachim Marie Raymonds. ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. 

రేమండ్స్ ప్రతీకాత్మక చిత్రం

అక్కడినుంచి పదకొండు సంవత్సరాల తర్వత 1786 లో హైదరాబాద్ కి వచ్చి నిజాం పాలనలో ఒక సాధారణ సైనికుడిగా జీవితం ప్రారంభించి తన ప్రతిభా పాటవాలతోనూ, నమ్మకమైన వ్యక్తిగా తన నడవడికతోనూ పరాయిదేశం నుంచి వచ్చిన వాడైనప్పటికీ ఇక్కడి సైన్యంలో 300 మంది సైనికులకు అధిపతి అవగలిగాడు. 1796 నాటికి మరింత ఎదిగి అమర్ ఇ జిన్సీ లేదా కంట్రోలర్ ఆఫ్ ఆర్డినెన్స్ గా మరింత ఉన్నత స్థానానికి ఎదిగాడు. ఈ క్రమంలోనే సాధారణ సైన్యానికి మరింత ధైర్యం అందాలంటే సాంకేతిక సహాయం అవసరం అని భావించాడు తుపాకులు కూడా సరిగా లేని రోజుల్లో ఫిరంగులను, ఫిరంగి కర్మాగారాలనూ నెలకొల్పాడు. మందుగుండు సామగ్రిని సక్రమంగా వాడటంలో తన సైనికులకు అవసరమైన సాంకేతిక శిక్షణను అందించాడు. హైదరాబాద్ ఫతే మైదానం దగ్గరలోని గన్ ఫౌండ్రీగా పిలుచుకునే తోప్ కా సంచా నుకూడా ప్రారంభించాడు. దీనిలో
గన్ ఫౌండ్రీ 

తుపాకులనూ, తుపాకీ మందునూ, పిరంగి సామగ్రినీ తయారు చేసే వారు. గన్ ఫౌండ్రీ ఆనవాళ్ళు ఇప్పటికీ ఆ ప్రాంతంలో వున్నాయి.  నిజాం రేమండ్స్ పై అమితంగా ఆధారపడేలా చేసిన వాటిలో ఈ గన్ ఫౌండ్రీ కూడా ఒకటి మరాటాల గొడవలను తట్టుకునేందుకూ, వారిని సమర్ధవంతంగా నిలవరించి మరోసారి దాడిచేసేందుకు భయపడేలా చేయటంలోనూ ఈ గన్ ఫౌండ్రీ పాత్ర చాలా పెద్దది. 1795 లో మంజీర నది దగ్గర్లో పరెండా మరియు ఖాడ్లా మధ్య మరాటాలతో నిజాంకు యుధ్దం జరిగింది.  ఈ యుద్దంలో బ్రిటీష్ సైన్యాలు 1768 ఒప్పందం లోని అంశాల వల్ల తటస్థంగా వుండిపోయాయి. అప్పుడు బ్రిటీష్ సైన్యాలను నిర్వహిస్తున్న కిర్క్ పాట్రిక్ హైదరాబాద్ లోనే వున్నప్పటికీ ఈ అంశంలో నిజాంకు సహాయం చేసి మరాటా సైన్యాన్ని సులభంగా తిప్పికొట్టగల పరిస్థితి వున్నప్పటికీ కేవలం మౌనం వహించడంతో నిజాం యుధ్దాన్ని ఓడిపోయింది.
యుద్ధం ఓటిపోవడంతో ఆంగ్లేయుల సైన్యంపై నిజాంకి చాలా అసహనం కలిగింది. వారి దళాలను తమ ప్రాంతంనుంచి ఉపసంహరించుకోవలసిందా చెప్పాడు.  అలా ఆంగ్లేయుల సైన్యం వైదలగిన దగ్గరినుంచీ రేమండ్స్ పై నమ్మకంతో పాటు అతనిపై ఆధారపడవలసిన అవసరం కూడా నిజాంకు ఎక్కువయ్యింది. సైన్యం నిర్వహణలో రేమండ్స్ పాత్రను పెంచి అతని ఆధీనంలోని జాగీరుని కూడా విస్తృత పరిచాడు.
మహిళా సైన్యాన్ని ప్రారంభించింది రేమండ్సే

కుమాయున్ రెజిమెంట్ (Kumaon Regiment ) హైదరాబాద్ లో 1798 అక్టోబర్ 21 న ప్రారంభం అయ్యింది. జీతం తీసుకునే సాధారణ వ్యక్తిగా కాక ఈ పని నాదీ ఈ దేశం ఈ ప్రాంతం నాదీ అనుకునేంతగా కలిసిపోయాడు కాబట్టే 1798 మార్చి 25 న తను మరణించే నాటికి అప్పటికి వున్న 14,000 పైచిలుకు సైన్యానికి మిలటరీ కమాండర్ గా అవ్వగలిగాడు. రేమండ్స్ నిజాం కోసం తయారు చేసే తన సైనిక పటాలంలో బ్రిటిష్ యూరోపిన్ సైనికులను మాత్రమే పెట్టుకోవాలనే నిభందనను సడలించాడు. ప్రాంతీయంగా భారతీయ సైనికులను కూడా తీసుకుని శిక్షణ ఇవ్వడంతో పాటు అప్పట్లోనే తన సైన్యంలో మహిళా సైన్యాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చనే ఆలోచన చేసి విజయం సాధించాడు. మహిళలను శక్తి హీనులు కాదని వారు యుధ్దరంగంలోనైనా తమ సామర్ద్యాన్నీ తెలివి తేటల్నీ పటిష్టంగా వాడగలరని తను అవకాశం ఇవ్వడం ద్వారా నిరూపించగలిగాడు. 
నిజాం దళాల్లోని మహిళా సైనికులు
అంతే కాదు సైనికులతో తను కేవలం ఒక అధికారిగా కాకుండా వారిలో ఒకడుగా కలిసి పోతూ వారి అవసరాలను గమనిస్తూ వారి కుటుంబాలకు అండగా వుండేవాడు. 15,000 కుటుంబాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తనే ఆధారం అయ్యాడు. వారికి మంచి జీతాలను సకాలంలో చెల్లించడం ద్వారా వారి జీవనం సక్రమంగా గడిచేలా చేయగలిగాడు. మిలటరీ శిక్షణ అంటే కేవలం కఠిన నిభందనలు అనే అపోహ నుంచి మానవీయ సంభందాలతో వారితో మెలగటం వల్ల రేమండ్స్ కి సైన్యంలోనే కాక సాధరణ ప్రజల్లో కూడా మంచి పేరు వచ్చింది. ఔరంగా జేబు లాంటి వాడే తన ఆధీనంలో వున్న వారందరూ తన మతంలోకి మారేలా చేయటం కోసం జిజియాపన్ను (తలపై పెరిగే జుట్టు మీద పన్ను) వేసి మరీ మతాంతరీకరణ చేద్దామనుకుంటే. రేమండ్స్ మాత్రం తన సైనికుల మత విశ్వాసాలకు గౌరవం ఇచ్చేవాడు. ఆంగ్లేయులు చెల్లిస్తున్న జీతాలకంటే తన సైన్యానికి ఒక్కరూపాయి అయినా ఎక్కువ మొత్తం ఇవ్వాలనే పట్టుదలతో పనిచేసేవాడు. రేమండ్స్ తను పుట్టుకతో వున్న మతఛాయల్ని వదిలేసి అన్ని మతాల కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా వాటి మాలల్లోని సారాన్ని గ్రహించి అర్ధంచేసుకోవడంతో వారి వారి మనసుల్లో మంచి స్థానంలోకి వచ్చాడు.


పాలకుల్లోనూ మంచి పేరు

ఒక అధికారిగా ఎదగటం మాత్రమే కాదు రేమండ్స్ నిజాం పాలకులలో ఒక మిత్రుడిగా కలిసిపోయాడు. రెండవ అసఫ్ ఝా నిజాం అలీ ఖాన్ కు రేమండ్స్ కూ మంచి స్నేహం వుండేది. పాలకుతో స్నేహం గా వుండే వారు ఆ గర్వంతో ప్రజలపై ఆధిపత్యం చలాయించే వారుగానే వుంటారుసాధారణంగా కానీ రేమండ్స్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రజల్లో నమ్మకాన్నీ ప్రేమనీ గెలుచుకోగలిగాడు. దీనికి ప్రధాన కారణం అతని ధైర్యసాహసాలతో పాటు, దయాప్రేమ కలిగి వుండటం, సైన్యానికి చేసినట్లుగానే ముందుచూపుతో వారి కుటుంబాలను కూడా ఆదుకునే పనులను చేయడం. హైదరాబాద్ ఎదుగుదలకు తన సర్వంస్వాన్నీ దారపోయి అందుకోసమే బ్రతుకుతూ నవీన మార్గాలను అన్వేషించి వాటిని విజయవంతంగా అమలు పరచగలగటం. తన మత పరమైన విశ్వాసాల విషయంలో కూడా పుట్టుకనుంచీ వున్న క్రైస్తవాన్ని వదిలేసాడు. ఆ తర్వాత తను ఏ మతం ప్రకారం నడుచుకున్నాడో ఇధిమిత్థంగా తెలియదు. కానీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంభందిక కార్యక్రమాలలో తను పాల్గొనే వాడట. అంతే కాక హిందూ, ముస్లిం మతాలకు సంభందించి అనేక తాత్త్విక భావాలను లోతుగా అర్ధంచేసుకుని వారితో చర్చించే వాడట, వాటిలోని మంచి మాటల ఆదారంగా సాధారణ ప్రజలు బ్రతకాలని కోరుకునేవాడు, అదేవిషయాలను తను ప్రభోదిస్తూ వుండేవాడట. అందుకే ముస్లింలు అతనిని మూసా రహీం అని హిందువులు మూసా రాముడనీ భావిస్తూ అలాగే పిలుచుకునేవారు. జార్జ్ బ్రూస్ మాల్లేసన్ మాటల్లో ‘‘ రేమండ్స్ కి ఆదరణ లభించడం వెనుక ఎటువంటి యూరోపియన్ ముద్రలూ లేవు. అతని విజయం వెనుకున్నది అతని ప్రేమ, గౌరవం ప్రాంతీయ మూలాల విషయంలో అతనికున్న నమ్మకం ఇష్టం, ఇవే అతనిని ఈ స్థానంలో నిలబెట్టాయి’’ అంటాడు. 


In memory of Joaquim Dossantos Knight of the Portuguese 
Order of Nossa Senhora da Con can ao d Villa Vicosa who quit- 
ted his country for political motives and entered in His 
Excellency the Nawab Ameer- oo-Khub tee's service through the 
intervention of the British Resident Mr. H. Russell ; born 1797; 
died 1866 — 41 years service.

ఆస్మాన్ ఘడ్ ప్యాలస్ కు దగ్గర్లోని కొండ కొసన మూసారాం బాగ్ ప్రాంతం, మలక్ పేటలో రేమండ్స్ పేరుమీద  ఎడున్నర ఎకరాల స్థలంలో  నిర్మించిన స్మారక కట్టడం చాలా ప్రత్యేకమైనది. నిర్మాణ శైలి కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రతిసంవత్సరం రేమండ్స్ వర్ధంతి రోజున ప్రజలు నివాలులర్పిస్తారు. హిందువుల దూఫదీపాలతో హిందూ పద్దతిలోనూ, ముస్లింలు వారి మతాచారాలను అనుసరించి ప్రతి సంవత్సరం ఉర్సు ఉత్సవాల మాదిరి గానూ చేస్తుంటారు., సమాది మండపం ముందుభాగంలోనే వున్న శిలువ ఆధారంగా పుట్టకతో క్రిస్టియన్ అయిన ఇతనికి అందుకు సంభందించిన గౌరవం కూడా దక్కుతోంది. మూల వద్ద ఒక్కొక్క స్థంభం మధ్యలోవి జంట స్థంబాలతో మొత్తం 28 స్థంబాల బారాదరీ వంటి నిర్మాణం దాని ముందున్న శంఖ్వాకార నిర్మాణాల వెనకున్న ఉద్దేశాలను అర్ధంచేసుకోవలసి వుంది.  ఈ అపురూప కట్టడం నిర్మాణ శైలికూడా గ్రీకుల దేవాలయనిర్మాణాన్ని పోలివుంటుందని చెపుతారు. గాజాపిరమిడ్ ల లోని రూపంలాగా కూడా ఇది అనిపిస్తుంది. obelisk (ఒబెలిస్క్) అంటే కూడా నలుపలకలుగా వుండి పైకి పోతున్న కొద్ది సన్నబడుతూ పిరమిడ్ ఆకారాన్ని పొందే స్థంభం అని అర్ధం. ఆదిమానవుడి సమాధులపై పెద్ద బండరాయిని పాతటం (మోనో లిథ్) దగ్గరనుండి గ్రీకుల్లో పిరమిడ్ల నిర్మాణం వరకూ ఈ పద్దతి వుంది. ఇటువంటి ఒబెలిస్క్ స్థంభాలను సమాదుల వద్ద నిర్మించటం పాశ్చత్య సంస్కృతిలో విరివిగా వుంది.  నిజానికి శంకువులాగా ఇదే ఆకారంలో ఈ నిర్మాణాలను చేయడం వెనక ఏవైనా లోతైన కారణాలున్నాయోమో చరిత్రను పరిశీలించి తెలుసుకోవలసి వుంది. 

పక్కనున్న సమాధి ఎవరిది?


రేమండ్స్ టోంబ్ ప్రక్కనే దానికంటే దిగువలో ఇటువంటి నిర్మాణాన్ని పోలిన మరో చిన్న నిర్మాణం వుంది. దానిలో వున్న సమాధి రాతిపై ఆవిడ కాన్సు కష్టం అవ్వడం వల్ల మరణించిందని, పుట్టిన శిశువు కూడా కొంత సేపటికే మరణించినట్లు రాసివుంది. ఇది రేమండ్స్ తను ప్రేమగా వాడుకున్న ఆడగుర్రం అని అదే వేదికపై ముందున్న సమాధి అతని పెంపుడు కుక్కదనీ ఒక కథనం వుంది. మరి అతని పెట్స్ అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనక పోవడం వెనక కారణం ఏమిటి? నిజానికి అంతటి యోధుడు వాడిన గుర్రం పరిమాణం ఎంత వుండి వుండాలి. దాన్ని ఖననం చేసివుంటే అదికూడా దాని బిడ్డతో పాటు ఎంత పరిమాణం వచ్చివుండాలి. కేవలం ఐదారడుగుల పొడవున్న మనుషుల సమాధంత సమాధిలోనే గుర్రాన్ని దాని పిల్లను పెట్టారంటే నమ్మడం ఎలా? ఇలా చెప్పేవారు చూపిస్తున్న ఆధారాలేమిటి? అనే వాటిలో స్పష్టత లేదు. అదే విధంగా పెంపుడు జంతువుల పుట్టిన రోజు తాలూకు తేదీని అంత జాగ్రత్తగా గుర్తుంచుకుని ఫలకంపై రాస్తారా? అలాగే గుర్రంపేరు అంత పొడవుగా పెడతారా?  నిజానికి రేమండ్స్ ఫోటోనే సరిగా భద్రపరచినట్లు లేరు. ఇక గుర్ర ఆనవాళ్ళు ఉన్నయేమో అని ఎదురు చూడటం అత్యాసవుతుందనుకుంటా. కొందరి కథనాలలో అది రేమండ్స్ సోదరి సమాధి అని చెపుతున్నారు. బహుశా మరో టోంబ్ పక్కనే వుందని ఆంగ్లంలో రాసే సందర్భంలో సిస్టర్ టోంబ్ అంటే జత సమాధి అనికాక సోదరి సమాది అనికానీ అర్ధం చేసకోలేదు కదా?
అతని మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే

ప్రత్యర్ధులు ఈర్ష్య పడే స్థాయిలో, చాలా వేగంగా ఎదుగుతూ వచ్చాడు రేమండ్స్. తన పేరు ప్రతిష్టల విషయంలో కానీ శౌర్య పరాక్రమాల విషయంలోకానీ, ప్రణాళికలలో అతను ప్రదర్శించే తెలివి తేటల విషయంలోకానీ అత్యున్నత స్థాయిలో వున్నడనుకున్న దశలలో రేమండ్స్ మరణించాడు. అదికూడా కేవలం తన 43 వ ఏట. ఈ మరణం వెనకున్న కారణాలు సరిగా తెలియవు. రేమండ్స్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరూ, లేదు విషప్రయోగం వల్ల మరణించాడని మరికొందరు చరిత్ర కారులు చెప్పే కథనాలు ఇప్పటికీ సరైన ఆధారాలు దొరకక ఒక వీడని మిస్టరీగానే వున్నాయి.

జన్మభూమి ప్రెంచి మూలాలు మరవని మాన్షియర్ ( Monsieur ) గా నిలిచాడు.



మాన్షియర్ అనే ప్రెంచి పదం గౌరవసూచకంగా వాడతారు. మాన్షియర్ అంటే రాజు గారి పెద్ద తమ్ముడు అని అర్ధం. అంటే రాజ్యాధికారానికి రాజుతర్వాత అంతటి అర్హతలు వున్న వ్యక్తి అనే సంభోదనార్ధంలో వాడతారు. నిజాం రేమండ్స్ ని సైన్యాధికారిగానో, స్నేహితుడి గానో మాత్రమే కాకుండా రాజ్యంపై అతని పాలనాదక్షతకు ముగ్ధులై, అతని శౌర్యం వల్ల పరువుని నిలుపుకుని రేమండ్స్ ని వారి తర్వాత అంతటి స్థానానికి అర్హునిగా భావించబట్టే ఆ జ్ఞాపకాలను కొండకొసన అంత పదిలంగా దాచిపెట్టగలిగారు.
అంతే కాదు నిజాం తన చివరి వరకూ ప్రతి మార్చి 25వ తేదీన రేమండ్స్ కు నివాళిగా ఒక చెరూట్ అనబడే సిగార్ల ప్యాకెట్, ఒక బీరు బాటిలూ పంపించేవాడట. ఇక్కడ చెరూట్ ల ఆధారంగా రేమండ్స్ ప్రెంచీ మూలాలను మర్చిపోలేదని అర్ధం చేసుకోవచ్చు. చెరూట్ అనే పేరు కూడా ప్రెంచి cheroute అనే పదంలోంచే వచ్చింది. మన దగ్గర బీడీలు చుట్టినట్లు రెండు వైపులా మూసివుండే స్తూపాకారపు సిగరెట్లను మనుషులే తయారు చేస్తారు. మనం పొగాగు వాడినట్లే వాళ్ళు చెరూట్ ఆకులను వాడి వాటిని జాగ్రత్తగా చేతులతో మలవాల్సిందే కానీ మెషిన్లతో చేసే బ్రాండు కాదు ఇది.

రక్షిత కట్టడాలుగా ప్రకటించామంటున్న ఇటువంటి కొన్ని కట్టడాల గురించైనా సందర్భకులకు అందుబాటులో దానికి సంభందించిన చరిత్రను ఉంచగలిగితే వాటిని రక్షించేందుకు వెచ్చిస్తున్నధన,కాల,శ్రమలకు ఒక అర్ధం వున్నట్లవుతుంది.

ఈ క్రిందున్నది నిజాంకాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టే నిజమైన విడియో

కామెంట్‌లు

  1. చాలా సంతోషం. బ్లాగుపై ప్రేమ కలిగే విధంగా రూపొందించినారు... ఒక్కపోస్ట్ కూడా వేస్ట్ లేదంటే , ఎంత మంచి బ్లాగో అర్థమైతుంది. ధన్యవాదాలు... కట్టా శ్రీనివాస్ గారూ

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి